శుక్రవారం 10 జూలై 2020
Sunday - Feb 09, 2020 , 01:57:17

పోరాటం

పోరాటం

‘ఎట్లెతదో ఏమో? అల్లుని బాధ ఎట్ల దీర్తదో! బిడ్డ కలకల నవ్వక రెండు నల్లైంది’ మనసులో అనుకోబోయి పైకే అనేసింది లచ్చవ్వ మొగుడు సాలయ్యకు అన్నం పెడుతూ.

‘ఏమయ్యా! ఏమన్న ఆలోచించినవ బిడ్డ గురించి! పొద్దున్నించి సాయంకాలం దాకా రాళ్లు పగుల గొడ్తావు కాని నీ మనసు మాత్రం రాయోల్గనే ఉన్నది’ మళ్లీ తనే అంది లచ్చమ్మ!

 శివరాత్రి సాలయ్యది జనగాంల పల్లెటూరు. వడ్డెర కుటుంబం పెద్ద. ఒకళ్లకు అపకారం తలపెట్టని మంచి మనిషి. ముగ్గురు బిడ్డలు. ఒక కొడుకు. ముగ్గురు బిడ్డలకూ పెండ్లి జేసిండు. వారందరూ పనులకోసం పట్నం వెళ్లి అక్కన్నే స్థిరపడ్డరు. అదృష్టం కొద్దీ అల్లుళ్లు మంచోళ్లే దొరికిర్రు. పెద్దబిడ్డ రజిత గురించే ఇప్పుడు వాళ్ల బాధ. 

రజిత ఆమె మొగుడు ఎంకటేశం ఇద్దరూ పది తరగతులు చదివినోళ్ళే. తమ పిల్లలను చదివించాలని కాయుషు. సోయంత పోరగాళ్ళ చదువుల మీదనే పెట్టి కష్టపడుతున్నరు. ఎంకటేశం కష్టపడి పనిచేసేటోడే. చిన్నకొడుకు అనారోగ్యం పాలై ఆస్పత్రిల జేరితె లక్ష రూపాయలు దాసుకున్న డబ్బులు, లక్ష రూపాయలు అప్పు తెచ్చిపెట్టిన డబ్బులు రెండు లక్షలు ఖర్చైతెగాని పోరడు నిమ్మళంగా లేడు. ఇప్పుడు పెద్దోనికి కాలేజీ ఫీజు కట్టాలి. ఆ డబ్బులే చిన్నోని రోగానికి పెట్టిండు. పరిస్థితులు చేతులు దాటినాక కుదురుకోవడం కష్టమే. 

ఇక్కడ సాలయ్య పరిస్థితీ బాగలేదు. దెబ్బ మీద దెబ్బ పడ్డట్టు రెండేళ్ల నుంచి సాలయ్య కుటుంబానికి దయ్యం పట్టినట్లు సమస్యల మీద సమస్యలు. మేడారం జాతరెల్లినంక రెండు నెలలకు చిన్న బిడ్డ పెండ్లి జేసిండు. దాదాపు పది లక్షలు ఖర్సైనయి. ఇప్పుడు మళ్లీ మేడారం సందడి మొదలైంది. ఆ తర్వాత రెండో బిడ్డ ప్రసూతికి ఇంటికొచ్చింది. రెండో కాన్పు. ఐనా లచ్చవ్వ తనింట్లనే జేసింది. నాల్గు నెలలు ఇంట్లో ఉంచుకుంది. వచ్చేటోల్లు, పొయ్యేటోల్లు తాగుడు, తినుడు లక్ష రూపాయల దాక ఖర్చైంది.

అప్పుడే పిడుగు పడ్డట్టు, బావిలో మట్టి తవ్వి పూడిక పనిజేస్తుంటె క్రేన్‌ తాడు తెగి మట్టిలాగే తొట్టి లోపలి మనిషి మీద పడ్డది. వాడు చావు బతుకులల్ల ఉన్నడు. తన దగ్గర పని చేసేటోడు కాబట్టి సాలయ్య వానికి రెండు లక్షలు ఖర్చు పెట్టిండు. బతికిండు పోరడు. బావి యజమాని పదివేల కంటె ఎక్కువ ఇయ్యనన్నడు. విషయం పంచాయితీల ఉన్నది. లచ్చవ్వ బంగారం కుదువ బెట్టి కొంత, నోటి మాటతోని కొంత అప్పు తెచ్చి మనిషిని బతికించుకున్నడు సాలయ్య. నా దగ్గర పని జేసెటోడు నా కొడుకు లాంటోడే. వాన్ని బతికించుకోవల్సిన బాధ్యత నాదే అంటూ ఖర్చు పెట్టిండు. 

ఈ సమస్యలు ఆ సమస్యలు పనులు లేక డబ్బులు రాక ఇప్పుడు పరిస్థితి చూస్తే చేతిల చిల్లి పైస లేదు. ఉన్న రెండెకరాల యవసాయం మూలకుబడ్డది. 

మళ్ళీ రెండు వారాలైతె మేడారం జాతర! ముగ్గురు బిడ్డలు, అల్లుళ్ళు, ఇద్దరు బామ్మర్దులు వాళ్ళ కుటుంబాలు, ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ కుటుంబాలు మొత్తం ముప్ఫైమందికి పైగా వారం రోజులు.. కనీసం యాభై వేలన్నా ఖర్చయితయి. 

 ఎన్నడూ లేంది పెద్దల్లుడు డబ్బులడిగిండు. చేతిలో చిల్లి గవ్వలేదు. 

‘లచ్చవ్వ! పరిస్థితి నీకు తెల్వందిగాదు. ఉన్న బంగారం మొన్ననే కుదువబెడ్తివి. ఎట్ల చెయ్యాలె? ఏం చెయ్యాలె అని ఆలోచిస్తున్న! మనాదికి కంటిమీద కునుకు రావట్లే. నువ్వు గింత తిని పండుకో! నమ్ముకున్న దేవుడే తొవ్వ జూపెడ్తడు’ తాత్తికంగా పల్కి చెయ్యి కడిగిండు సాలయ్య. 

తెల్లారింది. శుక్రవారం. లచ్చవ్వ ఇల్లలికింది. గడపలు పూచింది. ఎర్రమట్టితోని గోడలు అలికి ముగ్గులు పెట్టింది. నెత్తిమీద స్నానం చేసి దేవునికి దణ్ణం పెట్టింది. ‘తల్లీ ! నీ జాతరకు ఇంటి రాజులం వస్తం కని నా బిడ్డను కనికరించు’ అని సమ్మక్కకు మొక్కుకుంది. వంటజేసింది. మొగన్ని పిల్చి సద్ది సదిరి పనికి పోవడానికి తయారవుతుంటే.. మరొక్క వార్త.. 

చూడుచూడని ఉన్న పనులు కూడా బందై పది రోజుల నుండి ఇంట్లనే కూర్చున్న పెద్దల్లుడు. ఉండబట్టుకోలేక ఆగమేఘాల మీద పుట్టింటికొచ్చింది బిడ్డ రజిత. రావడంతోనే తల్లి మీదపడి ఏడుపు మొదలు పెట్టింది. 

‘ఏం జరిగిందే! సెప్పా పెట్టకుండ ఊడిపడ్డవ్‌!’ గాభరా పడుతూనే అడిగింది లచ్చవ్వ. 

‘రాగనే గట్లడుగుడేంది. జెర నిమ్మళంగాని! బిడ్డా ఎందుకా ఏడుపు. ముఖం కడుక్కుని రాపో. ఓ ముద్ద అన్నం తిని మాట్లాడుదువు గని’ అంటూ సాలయ్య బిడ్డను ఇంటెన్కకు తీసుకుపోయి ముఖం, కండ్లు కడిగిచ్చి తీసుకువచ్చిండు. 

లచ్చవ్వ అన్నం ప్లేట్లో పెట్టి కలిపి ఇచ్చింది. బిడ్డ కొంచెం నిమ్మళమైంది తల్లిని తండ్రిని చూడంగనె. 

అన్నం తినుకుంటూ పొద్దున ఇంట్లో ఏం జరిగిందో చెప్పసాగింది రజిత.


‘ఏందయ్యా ఇది! పొద్దున్నే తాగుడు మొదలుబెట్టినవ్‌! ఎన్నడూ లేంది ఈ కొత్త అలవాటేంది?’ కాస్త గట్టిగానే మొగుడు ఎంకటేశాన్ని నిలదీసింది రజిత.

‘నోర్మూసుకోయెహే! చిన్నోడు మంచంలనే ఉన్నడు. ఇంక కోలుకోలేదు. పెద్దోనికి కాలేజీ ఫీజు కట్టకుంటె ఇప్పుడు పరీక్ష రాయనియ్యరు. ఉన్న పైసలన్ని ఐపోయినయ్‌! పది రోజుల నుండి పనిలేదు. చావమంటవ! మందు తాగనులే గని గింత ఇసం తెచ్చియి! తాగి పుటుక్కుమంటే నీ కళ్లు చల్లబడుతాయ్‌' గట్టిగనే బదులిచ్చిండు ఎంకటేశం. 

కొయ్యబారిపోయింది రజిత. 

పెనిమిటి కొత్తగ మాట్లాడుతుంటే మాటలు రాక మూగవోయింది.

కాసేపటికి తేరుకుని చెప్పసాగింది. 

‘గదేంది మావ! పైసలు ఎక్కడ పోయినయ్‌ మావ! కడుపున పుట్టిన పోరనికి బాగలేకుంటెనే గద ఖర్చు పెట్టినవ్‌! చేసుకున్న కట్టం పోయింది గని రెక్కలు పోయినయ! మల్ల సంపాదించుకుంటం! నీతోపాటు నేనుగూడ పనికొస్తా. కట్టజీవి రెక్కాడితే కట్టలు అటకెక్కాల. పని ఈ ఊర్లో దొరకకుంటె ఇంకో చోటికి పోతం. మనది చిన్న సమస్య మావా! గిటువంటి చిన్న చిన్న విషయాలకే పేణం తీసుకోవాలంటే భూమ్మీద మడిసే మిగిలేటోడు కాదు’ ధైర్యం చెప్పింది రజిత. 

స్వతహాగా మృదుస్వభావం కల్గిన వెంకటేశం మాటలు రాక మౌనంగా ఉంటే మళ్ళీ తనే చెప్ప సాగింది రజిత. 

‘కట్టాలు మనిషికి కాకుంటే మానుకు వస్తయా! ధైర్యంగ ఎదుర్కొనేటోడే బట్ట కట్టగల్గుతడు. సమస్యలిచ్చిన దేవుడు సమాధానాలు కూడా వాటి పక్కనే ఉంచుతడంట. నువ్వు దిగులు పడకు మావా! నేను జూసుకుంట కదా! ’ అంటూ అన్నం పెట్టి ఓదార్చ సాగింది రజిత. 

మొగనికి ధైర్యం సెప్పింది కానీ ఆమె మనసులో కూడా భయం లేకపోలేదు. ఇద్దరూ భయపడ్తూ కూర్చుంటే పిల్లలు, సంసారం ఆగమైతయని ఆమెకు తెలుసు. అందుకనే ధైర్యం చూపసాగింది. 

కానీ, తనను తాను ఎంతసేపు ఊరడించుకోలేకపోయింది. బస్కెక్కి బుర్రున తల్లి దగ్గరికొచ్చింది. 

జరిగిందంతా విని తల్లి లచ్చవ్వ మాట్లాడబోతుంటే పోలోమని గూడెం పెద్దలు కట్టకట్టుకొని వచ్చింరు సాలయ్య కోసం. 

‘ఏందిరా! అందరూ ఒక్కపాలే కట్టకట్టుకొని వచ్చింరు. ఏం సంగతి’ సాలయ్య వచ్చిన వాళ్ళను ప్రశ్నించిండు.

‘మావా మర్చిపోయినవ! పది రోజులైతే మేడారం జాతర! మన గూడెం పక్కనే లింగంపల్లి చిన్న జాతర! మేడారం కంటే ముందే లింగంపల్లి పోవాల. అక్కడ దర్శించుకొని సాయంకాలం నిద్ర చేసి తెల్లారి మేడారం పోవాల. లింగంపల్లి జాతరకు పొయ్యే ముందు గూడెంల గొఱ్ణెపోతును కొయ్యాల! ఆ పోతును ఎప్పుడూ నువ్వే ఇస్తవుగద! అందుకని వచ్చినం’

సాలయ్యకు నోట మాట రాలేదు. సమస్యలల్ల పడి జాతర సంగతే మర్చిపోయిండు. 

లోపలికిపోయిండు. అమ్మోరికి దణ్ణం పెట్టుకున్నడు. ‘నువ్వే కాపాడుతావ్‌ నాకు తెలుసు తల్లీ’ అన్నడు. రెండు నిమిషాలు కండ్లు మూసుకుని కూర్చుండు. తర్వాత బయటికి వచ్చిండు. ముఖంల కొత్త కాంతి. 

‘సర్లెండి! నేనిచ్చేది నేనిస్త! అందరు కలసి ఏర్పాట్లు చేయండి. ఏదైనా కొట్లాటలు లేకుండ కల్సి చేసుకోండి’ దృఢంగా పల్కిండు సాలయ్య! ఆ మాటలు విని గూడెం వాసులు వెళ్ళిపోయిర్రు. 

వెంటనే బిడ్డకు సెప్పిండు. 

‘బిడ్డా! నువ్వు ఉన్న పళంగ ఇంటికి పో. రంది మీద ఉన్న పెనివిటిని ఇడిచి పెట్టి గిట్ల రావడం మంచిది కాదు. రెండు, మూడు రోజులల్ల అమ్మ నీ దగ్గరకొస్తది. నిన్ను, అల్లున్ని పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తది. ఎట్లాగూ జాతరకు రావల్సిందే కదా! కాకపోతే ఓ మూడు నాల్గు రోజుల ముందే ఇక్కడకు రండి. బాబాయ్‌లను, మామయ్యలను, చెల్లెళ్ళను అందర్నీ పిలుస్త. ఒకరోజు లింగంపల్లి పోవాల. మూడు రోజులు మేడారం పోవాల. అన్నీ మర్చిపోయి ఓ వారం పదిరోజులు హాయిగ ఉండండి. జాతర ఐనంక నీ బాధ సమ్మక్కనే తీరుస్తుంది’ దృఢంగా పలికిండు సాలయ్య. 

లచ్చవ్వ వెంటనే లోపటికెళ్ళి డబ్బు గురిగిలో తాను దాచిన డబ్బులు నాలుగొందలుంటే అవి బిడ్డకిచ్చి బస్సెక్కిచ్చి వచ్చింది. అల్లున్ని, పిల్లలను జాగ్రత్తగ సూసుకోమని సెప్పింది. చిన్న చిన్న కష్టాలకు భయపడొద్దని సెప్పింది. 

 

లింగంపల్లి ఊరు ఊరంత పండుగ వాతావరణం. యే ఇల్లు చూసినా మావిడాకుల తోరణాలు, ముగ్గులు, ఇంటినిండా చుట్టాల కోలాహలం. ఆడబిడ్డలతోటి వదినా మరదళ్ళ సరసాలు. బావాబామ్మర్దుల సంబరాలు. జనమంతా ఇళ్ళలోనే ఉండడం లేదా జాతరలో ఉండడం జరిగింది. ఊర్లో రోడ్లు నిర్మానుష్యంగైనయి. అందుకే పండుగ అంటే నల్గురిలో ఉండటం, నవ్వుతూ ఉండటం.. 

వడ్డెరగూడెం నుండి ఐదారు ట్రాక్టర్లు బయల్దేరినయి. ఒకదాంట్లో సాలయ్య కుటుంబం ఉంది. అందరూ వచ్చింరు. లింగంపల్లి జాతరల స్థలం చూసుకుని టెంట్‌ వేసుకున్నరు. మొక్కులు తీర్చుకున్నరు. ఆ రాత్రి అక్కన్నే నిదుర చేసింరు. తెల్లారి మేడారం బయల్దేరింరు. 

రోడ్డంతా వేలాది వాహనాల సందడి. 100 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు ఇరవై నాల్గు గంటలు పడుతుంది. 

మేడారం అంటే కోటిమంది ఒక్కటయ్యే జాతర! అమ్మను నమ్ముకుంటే బాధలు, రందులు ఉండవన్న విశ్వాసానికి ప్రతీక!! 

 ఆ విశ్వాసమే కోట్లాదిమందిని అలసట యెరుగకుండా మూడు నాలుగు రోజులు పరమానందంతో అక్కడికి అడుగులు వేయిస్తుంది. 

 అక్కడికి చేరుకునే సరికి తెల్లారింది. అక్కడొక ఆవాసంలో వసతి సౌకర్యాలు చూసుకొని జంపన్న వాగుకు స్నానాల కోసం చేరుకుంది సాలయ్య కుటుంబం. 

జంపన్న వాగులో మునుగుతున్న అల్లుడు ఎంకటేశం ముఖంలో ఏదో కొత్త వెలుగు. చావుకళ, బాధ, రందితో నీరసించిన ఆ ముఖం ఇన్నాళ్లకు మళ్ళీ జీవం తెచ్చుకుంది.

సాలయ్యకు ఆనందమన్పించింది. చుట్టూ చూశాడు. లక్షలాదిమంది అమితమైన విశ్వాసంతో మునిగి తేలుతున్నారు. అమ్మఒడిలో సేదతీరుతున్న పసిపిల్లల్లా ఉన్నారు జనం. ఆనందం, కేకలు, కేరింతలు.. 

అందరి మనసులోనూ అమ్మే.. ఆమెపై అచంచలమైన విశ్వాసమే. 

రజిత ఇద్దరు కొడుకులను మొగన్ని కలిసి నలుగురూ చేతులు పట్టుకుని మునిగి తేలినాక చెప్పసాగింది. చదువుకున్న అమ్మాయి. నాల్గు రోజుల నుంచి సమ్మక్క సారలమ్మ పుస్తకంలోని విశేషాలు చదివింది. ‘మావా! కాకతీయరాజులపైనే ఒంటి చేత్తో పోరాటం మొదలు పెట్టింది. ఏ దశలోనూ వెన్నుజూపకుండామొక్కవోని ధైర్యంతో పోరాడింది. ఇక్కడ మనం తెల్సుకోవాల్సింది గదే మావా! పిరికి పందల్లా పారిపోకుండా సమస్యలకు ఎదురీది పోరాటం సెయ్యాల! పెద్దోడా! చదువుకునే పిలగానివి నువ్వు. నీ చదువుల నువ్వు సాధించాల! మా పనులల్ల మేం సాధించాల! మనసు గట్టి చేసుకొని పట్టుదల పెంచుకోండి. భీరువులుగా వచ్చి ధీరులుగా పోవాలె జంపన్న వాగుల మునిగితే. తాగుడుకు తినుడుకు కాదు ఇక్కడికి వచ్చేది. అమ్మల పోరాటపటిమ తెల్సుకొని జీవితంల పోరాటం చెయ్యాల. గెలవాల’ ఒకదేవత వలికినట్లుగా గంభీరంగా వినబడుతున్న మాటలు వెంకటేశంను, పిల్లలను ఏదో అలౌకిక ఆనందానికి అనుభూతికిలోను చేయసాగినయ్‌. పక్కనే ఉన్న మైకుల పాటలు వినబడుతున్నాయి. ‘కాకతీయుల మీద కదం తొక్కిన తల్లి మా అమ్మ సమ్మక్క మా అమ్మ సారమ్మ దయిజూపవే’ అంటూ వస్తున్న ఆ పాటలు వారిని పునరుజ్జీవితులను చేశాయి. 


జాతర ముగిసింది. ఎవరిండ్లల్లకు వారు చేరుకున్నరు. సాలయ్య శెట్టి దగ్గర భూమి కాయతాలు పెట్టి రెండు లక్షలు తెచ్చిండు. శెట్టి గల్ల పెట్టిల కాగితాలు గర్వపడుతున్నయి సాలయ్య కొచ్చిన కష్టం తీర్చినమని. కాకపోతే తల్లి చేతుల్నించి వెలయాలు చేతుల పడ్డట్టు బాధపడుతున్నయి కూడా. 

ఆ డబ్బులల్ల ఒక లక్ష రూపాయలు తీసి పెద్ద అల్లునికిచ్చిండు. బిడ్డను అల్లుడిని కూర్చోబెట్టి సంబరంగ పైసలు ఇయ్యబోయిండు. అల్లుడు తీసుకోలేదు. సాలయ్య ఆశ్చర్యపోయిండు. గత నాలుగైదు నెలల నుంచి డబ్బుల కోసం వెంపర్లాడుతున్న అల్లుడు హఠాత్తుగ డబ్బులు వద్దని చెప్పేసరికి లచ్చవ్వ, సాలయ్య కొయ్యబారిపోయింరు. 

‘గిదేందే! రజిత! మీ అయ్య మీరు ఆనందంగా ఉండాలని డబ్బులు తెచ్చిండు. ఇప్పుడొద్దంటున్నరేంది’ తేరుకున్న తల్లి రజితను ప్రశ్నించింది. 

రజితకు కూడా అర్థం కావడం లేదు. ఆశ్చర్యంగా భర్త ముఖంలోకి చూసింది. ‘కట్టం వస్తే పోరాటం సెయ్యమని సెప్పింది. ఈసారి మీరు నా కష్టం తీరుస్తరు. మల్లింకోపాలు నాకీ కట్టం వత్తే ఎవరు తీర్చాల? ఎవరి కట్టం వారే తీర్చుకోవాల. ఆ ధైర్నం కవాల. మీ డబ్బులు వద్దు మీ ప్రేమ చాలు మాకు’ ఆలోచిస్తూనే చెప్పిండు వెంకటేశం. 

‘నాయనా! అవసరమైతే నా డబ్బులు నేనే సంపాదించుకుంటా. ఒక్కరోజు ట్రాక్టర్‌ లోడ్‌ దింపితే వెయ్యి రూపాయలొస్తయి నాకు. నువ్వేం భయపడొద్దు. మనకు అమ్మమ్మ పైసలే వద్దు’ పెద్ద కొడుకు నరేష్‌ చెప్పిండు. 

‘సరే! ఇంకోసారి తీసుకోకండి! ఈ ఒక్కసారికి తీసుకోండి. చేబదులుగా తీసుకోండి. మళ్ళీ ఇయ్యండి’ అని అత్త లచ్చవ్వ చెప్పినా ససేమీరా వినలేదు వెంకటేశం. 

ఔను! పోరాట పటిమ ఒక కుటుంబాన్ని గెలిపించింది. 

వీరి గెలుపుతో ఓటమిని అంగీకరించిన సూర్యుడు మెల్లగా పడమటి కొండల చాటుకు జారుకున్నాడు.

చేవూరి శ్రీరాం , సెల్‌: 97055 91497


రచయిత పరిచయం

చేవూరి శ్రీరాం గణిత ఉపాధ్యాయులు. జనగాం జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. హన్మకొండలో నివాసం. సాహిత్య పఠనం, పద్య, వచన, కథా రచనలో ప్రావీణ్యం పొందారు. వీరు రాసిన.. వృత్తి, అర్థాంగి, లక్క ఇల్లు, కాలుష్యం.. కథలు బహుమతులు గెలుచుకున్నాయి. వచన కవిత్వంలో రంజని కుందుర్తి అవార్డుతో సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందారు. అమ్మకు ప్రేమతో (స్మృతి పద్యకావ్యం) ప్రచురణకు సిద్ధంగా ఉంది. logo