బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Feb 09, 2020 , 01:32:06

మాయమైన నాణెం

మాయమైన నాణెం

నిమిషం తర్వాత ఆ తలుపుమీద కొట్టి, అతను తలుపు తెరవగానే, లెఫ్టినెంట్‌ డి కోస్టా ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళాడు. అతన్ని చూసిన ఆ జంట మొహాలు పాలిపోయాయి. “కర్టిస్‌ని చంపింది మీరేనని నాకు తెలుసు. పథకం ఇద్దరిదీ. మిసెస్‌ కర్టిస్‌కి ఎలిబీ ఉంది కాబట్టి, దాన్ని అమలు చేసింది నువ్వే” చెప్పాడు. “ఎలా ఋజువు చేయగలరు?” అతను మేకపోతు గాంభీర్యంతో అడిగాడు.

వాళ్ళిద్దరూ ఖరీదైన హోటల్‌ వెర్‌సైల్స్‌ లిఫ్ట్‌ల్లోని ఓ దాంట్లో ఆ ఆగస్ట్‌ మధ్యాహ్నం ఒకర్నొకరు చూసుకున్నారు. అది రద్దీగా ఉండటంతో వాళ్ళిద్దరూ పక్కపక్కనే నిలబడ్డారు. వాళ్ళకి ఆ క్షణంలో ఒకరిమీద మరొకరికి వ్యామోహం కలగడమేకాక కలుసుకున్న వారి కళ్ళద్వారా అది ఇద్దరికీ తెలిసిపోయింది.

వాళ్ళిద్దరూ ఎంతో జాగ్రత్తగా కలుసుకోసాగారు. ఈస్ట్‌ 78వ స్ట్రీట్‌లో, అక్టోబర్‌ మధ్యలో అతను ఓ చిన్న ఫర్నిష్డ్‌ అపార్ట్‌మెంట్‌ని రాబిన్సన్‌ పేర అద్దెకి తీసుకున్నాడు. ఆమె అతనితో గడపడానికి వారానికి రెండు మధ్యాహ్నాలు అతని అపార్ట్‌మెంట్‌కి రాసాగింది.

అలాంటి విషయాల్లో వాళ్ళిద్దరూ నిపుణులు. ఆ బిల్డింగ్‌లో ఆటోమేటిక్‌ లిఫ్ట్‌లే ఉన్నాయి తప్ప లిఫ్ట్‌ మేన్‌లు నడిపేవి లేవు. కాబట్టి, వాళ్ళ రాకపోకల్ని గమనించే వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళిద్దరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోసాగారు. అపార్ట్‌మెంట్‌లోకి కలిసి వెళ్ళరు. కలిసి బయటకి రారు. ఎవరికీ వాళ్ళు తెలీదు. ఎవరూ వాళ్ళిద్దర్ని ప్రేమికులుగా అనుమానించలేదు. 


ఐతే, వాళ్ళు ఎదురు చూడనిది జరిగింది. కేవలం శారీరక వ్యామోహంగా ఆరంభమైన వారి కామకలాపం వారాలు గడిచే కొద్దీ ప్రేమగా పరిణమించింది. ఇద్దరి శరీరాలేకాక మనసులు కూడా కలుసుకున్నాయి. జనవరి వచ్చేసరికి వారి సంబంధం గట్టి పడింది. అప్పుడు వారి మధ్య ఓ వ్యక్తి అడ్డు రావడంతో ఆ వ్యక్తిని వారిద్దరూ ద్వేషించసాగారు. కారణం ఆ ఒక్క వ్యక్తి లేకపోతే వారికి చాలా డబ్బు ఉంటుంది. స్వేచ్ఛగా కలుసుకోగలరు. ఆ వ్యక్తి లేకపోతే వాళ్ళు ఆనందకరమైన జీవితాన్ని కలిసి గడపగలరు.

ఓ మధ్యాహ్నం అతను ‘ఆ అడ్డున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితేనా’ అని జోక్‌గా చెప్పాడు. ఆమె దాన్ని జోక్‌గాకాక సీరియస్‌గానే తీసుకుంది. కానీ, అతనికి ప్రమాదం జరగడంలో పొరపాట్లు జరిగి వాళ్ళిద్దరికీ కూడా ప్రమాదంగా పరిణమించ వచ్చని అతను హెచ్చరించాడు. మరణించిన వ్యక్తికి సంబంధించిన భార్య లేదా భర్త; కొడుకు లేదా కూతురును, ఆఖరికి హోటల్‌ సిబ్బందిని కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తారు. ఆ వ్యక్తిని తొలగించడానికి మరెవరికైనా కారణం కాని, అవకాశం కాని ఉంటే పోలీసుల దృష్టి అప్పుడా వ్యక్తి మీదకి మళ్లుతుంది. కాని, అతను ఎవరు? ఓసారి దీన్ని పరిష్కరిస్తే ఇంక అనుమానం తమమీదకి రాదు. బలిపశువుగా ఎవర్ని ఎన్నుకోవాలి?

ఆ తర్వాత వాళ్ళు జోక్‌గాకాక ఆ విషయాన్ని సీరియస్‌గా చర్చించుకున్నారు. చివరికి వారు ఓ పథకాన్ని సంపూర్ణంగా రూపొందించారు.


న్యూయార్క్‌లోని వర్సైల్స్‌ ఖరీదైన, సౌకర్యవంతమైన హోటళ్ళల్లో ఒకటి. సాధారణ మనుషులు ఆ హోటల్లోని గార్డెన్‌ రూంకి కాని, అరడజను బార్లు, రెస్ట్‌రెంట్లకి కాని వెళ్ళలేరు. ఇరవై అంతస్థుల ఆ హోటల్‌కి ఉత్తరం వైపు వాళ్ళకి సెంట్రల్‌ పార్క్‌ కనిపిస్తుంది. ప్రతీ ఫ్లోర్‌లో ఓ బల్ల, దాని ముందు ఓ అటెండర్‌ సదా అందుబాటులో ఉంటారు. పదిహేడో అంతస్థులోని పదిహేడేండ్ల అటెండర్‌ పేరు రేమన్‌. ప్యూర్టోరికో నించి వలసవచ్చిన అతను ఉదయం ఏడునించి మధ్యాహ్నం పన్నెండు దాకా, మళ్ళీ సాయంత్రం ఆరునించి రాత్రి తొమ్మిదిదాకా, మర్నాడు మధ్యాహ్నం పన్నెండు నించి ఆరుదాకా ఆ బల్ల ముందు కుర్చీలో కూర్చుని ఉంటాడు. దాని ఎదురుగా ఉన్న ఎలక్ట్రిక్‌ బోర్డ్‌లో ఏ గదిలోంచి బెల్‌ నొక్కితే ఆ గది నంబర్‌ ముందు లైట్‌ వెలుగుతుంది. ఆ గదికి వెళ్ళి వాళ్ళ అవసరాలు చూస్తాడు.

ఓ రోజు హోటల్‌ సెక్యూరిటీ గార్డ్‌లు ఇద్దరు అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్ళి గోడకి నొక్కి పెట్టి అతని జేబులు వెదికారు. తాము వెదికేది కనపడక పోవడంతో కఠినంగా అడిగారు.

“ఇవాళ సాయంత్రం ఆరున్నరకి నువ్వు 1727 గదికి ఓ ప్యాకెట్‌ తీసుకెళ్ళి ఇచ్చావా?”

రేమన్‌కి భయం వేసింది. 


“1727లోని మిస్టర్‌ కర్టిస్‌కి గంట క్రితం ఓ ప్యాకెట్‌ ఇచ్చాను” ఒప్పుకున్నాడు.

“అతను దాన్ని తీసుకుని తన పడక గదిలోకి వెళ్ళాకకూడా నువ్వు అక్కడ నిలబడ్డావు. అతనికి నాణాల సేకరణ పిచ్చి. అక్కడ నువ్వు దొంగిలించిన ఆ బంగారు నాణెం ఎక్కడ దాచావు? చెప్పు. లేదా నిన్ను పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్తాం” అని బెదిరించారు.

“నాకు తెలీదు. నేను తీయలేదు.”

చెంపమీద కొట్టడంతో రేమన్‌ ఏడుస్తుంటే వాళ్ళు ఆ గదిలోకి అతన్ని తీసుకెళ్ళారు. కర్టిస్‌, అతని కూతురు, అల్లుడు ఆ గదిలో ఉన్నారు.

“మిస్టర్‌ కర్టిస్‌. వీడే మీ నాణాన్ని దొంగతనం చేసింది. ఇంకెవరూ దాన్ని తీసుకునే అవకాశం లేదు” వాళ్ళు చెప్పారు.

ఆయన తన కాయిన్‌ కలెక్షన్‌ పెట్టెలోని ఖాళీగా ఉన్న ఓ చోటుని చూపించి బాధగా చెప్పాడు.

“క్రితం ఏడాది దాన్ని లండన్‌లో పదిహేనువేల డాలర్లకి కొన్నాను. మీరసలు ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇచ్చారు?”

ఒకప్పుడు మోడలింగ్‌ చేసి అతని దృష్టిని ఆకర్షించి, అతన్ని పెళ్ళి చేసుకున్న భార్య లోపలకి వచ్చింది. 

“ఇదేనా మీరు పోయిందని చెప్పేది?” కర్టిస్‌ కన్నా ఇరవై ఏళ్ళు చిన్నదైన ఆమె తన చేతిలోని బంగారు నాణాన్ని చూపించి అడిగింది.

“అవును. ఎక్కడుంది?” కర్టిస్‌ తెల్లబోయాడు.

“దాన్ని మీరు ఎక్కడో పెట్టి ఉంటారంటే వినలేదు. వెతుకుతుంటే బల్లమీది ఉత్తరాల మధ్య కనపడింది. దీన్ని నిన్న రాత్రి మీరు మీ ఫ్రెండ్‌ టెడ్‌కి, అతని భార్యకి చూపించాక తిరిగి యథాస్థానంలో ఉంచలేదు.”

“కానీ, దాన్ని తిరిగి కలెక్షన్‌ పెట్టెలో ఉంచానే?” కర్టిస్‌ చెప్పాడు.

“మీకీ మధ్య మతిమరుపు వచ్చింది. మీ అమ్మాయితో నిన్న డిన్నర్‌ అపాయింట్‌మెంట్‌ని మర్చిపోయారు. వాల్‌డ్రోఫ్‌ హోటల్లోని ఛారిటీ డ్యాన్స్‌ని కూడా.”

“నేను తారీఖుల్లో పొరబడ్డాను కాని మర్చిపోలేదు” కర్టిస్‌ బలహీనంగా చెప్పాడు.

తర్వాత సెక్యూరిటీ వాళ్ళతో చెప్పాడు.

“సారీ! కానీ, నేను దీన్ని ఆ పెట్టెలోనే ఉంచానని ఒట్టుపెట్టి చెప్పగలను.”

వాళ్ళు వెళ్ళిపోయారు. రేమన్‌ ఒక్కడే కారిడార్లో మిగిలాడు. ఎవరూ అతనికి క్షమాపణ చెప్పలేదు. టిప్‌గా సెంట్‌కూడా ఇవ్వలేదు. అతని కళ్ళల్లోని నీటినికూడా ఎవరూ చూడలేదు.


వారం తర్వాత రాత్రి తొమ్మిదికి రేమన్‌ డ్యూటీ దిగబోతుంటే 1727లోని కాయిన్‌ కలెక్షన్‌ పెట్టె ముందు కర్టిస్‌ శవాన్ని అతని భార్య చూసింది. మళ్ళీ ఆ నాణెమే మాయమైంది! రేమన్‌ని సెక్యూరిటీ వాళ్ళు మళ్ళీ 1727 గదిలోకి తీసుకెళ్ళారు. నేలమీద రక్తపు మడుగులో పడున్న కర్టిస్‌ని చూసి అతనికి కళ్ళు తిరిగాయి. కొందరు టేప్‌తో కొలుస్తున్నారు. కొందరు పౌడర్‌ చల్లి వేలిముద్రలు తీసుకుంటున్నారు. కొందరు కర్టిస్‌ భార్యతో మాట్లాడుతున్నారు. ఆమె ఏడుస్తున్నది. అదంతా చూసిన రేమన్‌కి మునుపటి కన్నా ఎక్కువ భయం వేసింది. పోలీస్‌ ఆఫీసర్లలోని సన్నగా ఉన్న ఒకతను రేమన్‌ వైపు తీక్షణంగా చూడసాగాడు. అతని పేరు లెఫ్టినెంట్‌ డి కోస్టా. అతను రేమన్‌ ప్యూర్టోరికో నించి వచ్చాడని తెలిసి స్పానిష్‌ భాషలో ప్రశ్నించాడు.

ముందు చాలా తేలికైన ప్రశ్నలు అడిగాడు, ‘నీ పేరు? ఎక్కడ నించి వచ్చావు? నీ వయసు? చర్చ్‌కి వెళ్తుంటావా? వెర్‌సైల్స్‌ హోటల్లో ఎంతకాలం నించి పని చేస్తున్నావు?’ లాంటివి.

తర్వాత కర్టిస్‌ని చంపిన రక్తసిక్తమైన పిడిగల కత్తిని చూపించాడు. దాన్ని చూడలేక రేమన్‌ కళ్ళు మూసుకున్నాడు.


“దీన్ని ఎప్పుడైనా చూసావా?”

“లేదు.”

“నీ పూర్తి పేరు?”

“రేమన్‌ రోడ్రిక్వెజ్‌.”

“ఈ పిడిమీద ఆర్‌.ఆర్‌ అనే ఇనీషియల్స్‌, ఇది నీది కాకపోతే ఎలా వచ్చాయి?”

“నాకు తెలీదు. అది నాది కాదు.”

“కర్టిస్‌ ఎక్కడో పెట్టి మర్చిపోయిన బంగారు నాణెం విషయంలో నిన్ను అనుమానించాడు. నీకు కలిగిన అవమానానికి అతన్ని చంపావు కదా?”

“లేదు. లేదు.”

“ఇంకొకరైతే ఆ నాణాన్ని మాత్రమే ఎందుకు దొంగిలిస్తారు?”

“నాకు తెలీదు. ఆ కత్తి నాది కాదు. అసలు నా దగ్గర కత్తే లేదు” రేమన్‌ భయంతో వణికే కంఠంతో చెప్పాడు.

“ఇతను ఆ నాణాన్ని దొంగిలించాడన్న సాక్ష్యం దొరికితే ఇక కేసు ముగిసినట్లే” సార్జెంట్‌తో డి కోస్టా చెప్పాడు.

కర్టిస్‌ భార్యని అడిగాడు.

“హత్యా సమయంలో మీరు గదిలో ఎందుకు లేరు?”

“గార్డెన్‌ రూంలో మా వారు రేపు రాత్రి తన పుట్టిన రోజుకి ఇచ్చే పార్టీకి ఏర్పాట్లు చూడమని పంపిస్తే వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే.. పావు గంట మించి నేను బయట లేను.”

“సార్జెంట్‌! రేమన్‌ ఆ నాణాన్ని ఏ టాయ్‌లెట్లోనో వేసి ఫ్లష్‌ చేసి ఉంటే ఏం చేయలేం. వాడిని పూర్తిగా వెదుకు. నా అనుమానం, కింద పోస్ట్‌బాక్స్‌లో తన ఇంటికి పోస్ట్‌ చేసి ఉంటాడు. రేపు ఉదయం పోస్ట్‌మేన్‌ వచ్చే సమయంలో అతను వాటిని బాక్స్‌లోంచి తీసాక అన్ని ఉత్తరాలని తణిఖీ చెయ్యి. బహుశ ఈ హోటల్‌ కవర్నే ఉపయోగించి ఉంటాడు. రేమన్‌ని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కి తీసుకెళ్ళు” డి కోస్టా ఆజ్ఞాపించాడు.


మర్నాడు ఉదయం ఆ నాణెం ఉన్న కవర్‌ పోస్ట్‌బాక్స్‌లో దొరికిందని తెలిసిన ఆ ప్రేమజంట తమ అపార్ట్‌మెంట్‌లో కలుసుకోవడానికి ఎప్పడూ తీసుకునే జాగ్రత్తలనే తీసుకున్నారు. ముందు అతను అందులోకి వెళ్ళాడు. పావుగంట తర్వాత ఆమె ఆ అపార్ట్‌మెంట్‌ తలుపుని తాళంచెవితో తెరచుకుని వెళ్ళింది. నిమిషం తర్వాత ఆ తలుపుమీద కొట్టి, అతను తలుపు తెరవగానే, లెఫ్టినెంట్‌ డి కోస్టా ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళాడు. అతన్ని చూసిన ఆ జంట మొహాలు పాలిపోయాయి.

“కర్టిస్‌ని చంపింది మీరేనని నాకు తెలుసు. పథకం ఇద్దరిదీ. మిసెస్‌ కర్టిస్‌కి ఎలిబీ ఉంది కాబట్టి, దాన్ని అమలు చేసింది నువ్వే” చెప్పాడు.

“ఎలా ఋజువు చేయగలరు?” అతను మేకపోతు గాంభీర్యంతో అడిగాడు.

“మిసెస్‌ కర్టిస్‌ వినేలా నేను రేమన్‌ ఆ నాణాన్ని తన ఎడ్రస్‌కి పోస్ట్‌ చేసి ఉంటాడని చెప్పడంతో నేరం అతని మీదకి వెళ్ళడానికి మీ ఇద్దరిలో ఒకరు ఆ పని చేసారు. కాని, అప్పటికే పోస్ట్‌మేన్‌ని పిలిపించి అన్ని ఉత్తరాలు వెదికాం. నా ఊహ ఫలించి మిసెస్‌ కర్టిస్‌ ఆ పొరపాటు చేసి ఉచ్చులో చిక్కుకుంది. రేమన్‌ మా కస్టడీలో ఉండగా ఆ కవర్‌ని పోస్ట్‌ చేయలేడు.”

“ఈ అపార్ట్‌మెంట్‌ గురించి ఎలా తెలుసుకున్నారు?” మిసెస్‌ కర్టిస్‌ భయంగా అడిగింది.

“మిమ్మల్ని రహస్యంగా వెంబడించి. హోటల్‌ ఉద్యోగస్థులని, ఆ కేసుకి సంబంధం ఉన్న ప్రతీ వారిని రహస్యంగా అనుసరించాం. మీ ఆయన హత్యకి కారణం నేను ఇక్కడికి వచ్చేదాకా నాకూ తెలీదు.”

“అసలు రేమన్‌ అమాయకుడని ఎలా అనుకున్నారు?” అతను అడిగాడు.

“అతని కళ్ళని చూసి అవి హంతకుడి కళ్ళు కావని, అమాయకుడి కళ్ళని వృత్తిరీత్యా నాకున్న అనుభవంతో గ్రహించాను. అతని వయసులో ప్యూర్టోరికో నించి నేనూ అమెరికాకి వలస వచ్చిన వాడినే” లెఫ్టినెంట్‌ డి కోస్టా ఇద్దరికీ బేడీలు వేస్తూ చెప్పాడు.

 (థామస్‌ వాల్ష్‌ కథకి స్వేచ్ఛానువాదం)  

మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo