ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Feb 09, 2020 , 01:15:39

అందమైన మనసు!

అందమైన మనసు!

మనం పొందిన వస్తువైనా, డబ్బులైనా ‘తిరిగి ఇవ్వండి’ అంటే కొంచెం ఆలోచిస్తాం. సంపాదించిన మొత్తంలో కొంత ‘తిరిగి ఇవ్వడం’ అంటే ‘ససేమీరా’ అంటాం. కారణం.. అవి మన స్వార్జితం. కానీ ఈ మోడల్‌ మాత్రం ప్రతీనెల తన సంపాదనలో 20శాతం పేదల కోసం ఖర్చు చేస్తున్నది. అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ‘మిసెస్‌ భారత్‌ యూఎస్‌ఏ’ పోటీల్లో 2019కి రెండో రన్నరప్‌గా నిలిచిన మన హైదరాబాదీ చైతన్య పొలోజు.. అన్నార్థులకు సాయమందించడంలో ఎల్లలు దాటి ప్రయాణిస్తున్నది.

పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాలు  

త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చేసి.. పూర్తిస్థాయిలో ఇక్కడే సేవా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నా. దాతలు అందించే విరాళాలు.. నేరుగా బాధితులకే అందజేసేందుకు నేను ముందుంటాను. ఒకరికి ఇవ్వగలిగే స్థానంలోనే ఉండాలి కానీ.. చేయి చాచే స్థితిలో ఉండకూడగదని నాన్న చిన్నప్పుడే దిశానిర్దేశం చేశారు. ఆయన బాటలోనే సమాజసేవ చేస్తున్నా. మోడలింగ్‌లో రాణించాలంటే రంగు, డబ్బు గురించి ఆలోచించకూడదు. ఆత్మవిశ్వాసం ఉంటేచాలు. 

మీ కలను నెరవేర్చుకోవచ్చు. 
- చైతన్య పొలోజు, మోడల్‌, సమాజ సేవకురాలు

‘సంప్రదాయం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు’ అంటూ ఆడపిల్లలను ఇంట్లోనే ఉంచే నేపథ్యం. ఆలాంటి కట్టుబాట్లను తండ్రి సహకారంతో తుత్తునియలు చేసిందీ యువతి. మధ్యతరగతి కుటుంబం నుంచి అడుగుబయటపెట్టి.. ఉన్నత విద్యను అభ్యసించింది. అమెరికాలో ఉద్యోగాన్ని సంపాదించి.. తన చిన్ననాటి లక్ష్యమైన మోడలింగ్‌ రంగంలో రాణించింది. చివరికి ‘మిసెస్‌ భారత్‌ న్యూయార్క్‌ 2019’గా గెలిచి.. ‘మిసెస్‌ భారత్‌ యూఎస్‌ఏ 2019’ రెండో రన్నరప్‌గా నిలిచి.. తాను అనుకున్నది సాధించింది. ఆమె.. పక్కా హైదరాబాదీ చైతన్య పొలోజు. తల్లిదండ్రులు ఆంజనేయులు, కృష్ణవేణి. వీరి ఐదుగురు సంతానంలో చైతన్య నంబరు 3. ఈమె ప్రాథమిక విద్య రాంనగర్‌లో కొనసాగింది. ఎంజీఐటీలో బీటెక్‌ చేసింది. చిన్నప్పటి నుంచి మోడలింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అంటే ఇష్టం. ఎప్పటికైనా మోడల్‌ అవ్వాలని చైతన్య కలగన్నా.. పరిస్థితులు అందుకు అనుకూలించలేదు. చదువు, ఉద్యోగం, వెంటనే పెండ్లి.. ఆ తర్వాత కూతురు, కుటుంబ బాధ్యతలు. అవన్నీ సమర్థవంతంగా నిర్వహించిన చైతన్య.. ‘నెవర్‌ గివ్‌అప్‌' అనుకుంటూ మోడలింగ్‌లో నిలదొక్కుకున్నది. ఫ్యాషన్‌ ప్రపంచంలో రాణించాలని కలలుగనే తనలాంటి ఎంతోమంది యువతులకు ఆదర్శమైంది. 

రెండో రన్నరప్‌గా..

అమెరికాలో ప్రతియేటా ‘మిసెస్‌ భారత్‌ యూఎస్‌ఏ’ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఈ కిరీటం కోసం అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో ఉన్న భారతీయ మహిళలు పోటీపడుతుంటారు. ఈ క్రమంలో న్యూయార్క్‌లో ఉంటున్న చైతన్య పొలోజు.. భర్త సాయిరాం పల్లె సహకారం, ‘మై డ్రీం ఎంటర్‌టైన్మెంట్‌' అధినేత రష్మి ప్రోత్సాహంతో ‘మిసెస్‌ భారత్‌ న్యూయార్క్‌ 2019’ పోటీలో పాల్గొన్నది. పలు విభాగాల్లో జరిగిన ఆ పోటీలో విజేతగా నిలిచి.. ‘మిసెస్‌ భారత్‌ యూఎస్‌ఏ’కు న్యూయార్క్‌ నుంచి ఎంపికైంది. ఇలా 50 సంయుక్త రాష్ర్టాల నుంచి 21 మంది పోటీదారులు మిసెస్‌ భారత్‌ యూఎస్‌ఏ పోటీలో తలపడ్డారు. ఆ పోటీల్లో మూడోస్థానంలో నిలిచింది చైతన్య పొలోజు.

20 శాతం దానాలకే ఖర్చు..

‘ఓ రోజు మా అమ్మమ్మ నాకు రూ.100 ఇచ్చారు. ఆ రోజుకు ఏ చాక్లెట్‌ కొనుక్కోవాలో అంటూ వెళ్తుండగా.. బస్టాప్‌ దగ్గర ఓ వృద్ధురాలు యాచించడం చూసి చలించిపోయా. ఆ క్షణమే నా దగ్గరున్న రూ.100 ఆమెకు ఇచ్చా. నన్ను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. ఆ క్షణమే నేను వృథాగా ఖర్చుపెట్టే డబ్బులతో కొందరి ఆకలి తీర్చవచ్చని తెలిసింది. నాటి నుంచి డబ్బులు వృథాగా ఖర్చు పెట్టలేదు’ అని చిన్ననాటి మధుర జ్ఞాపకాన్ని తలచుకున్నది చైతన్య. అప్పటి నుంచి తనకు చేతనైనంత.. తోచినంత సాయం చేస్తూనే ఉంది. ఇప్పటికీ ప్రతినెలా వచ్చే ఆదాయంలో 20శాతం దానాలకే ఖర్చు చేస్తున్నది చైతన్య కుటుంబం. ఇలా ఎంతోమంది అన్నార్థులకు ఆపన్నహస్తం అందిస్తున్నది ఈ అందమైన మోడల్‌. మిసెస్‌ భారత్‌ న్యూయార్క్‌ టైటిల్‌ గెలిచాక.. తన పూర్తి సమయాన్ని సేవకే అంకితం చేసింది చైతన్య. ఈ క్రమంలోనే చాలా హెల్త్‌ క్యాంపులకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. ‘స్టేట్‌ బంజారా హోమ్‌' అనే ఎన్జీఓ ద్వారా విస్తృతంగా సేవాకార్యక్రమాలు చేస్తున్నది. హబ్సిగూడలోని ‘ప్రత్యేకావసరాలు కలిగిన బాలికల వసతి గృహానికి కూడా తనవంతు సాయం చేస్తున్నది. ప్రముఖ వైద్యులు, ఫిల్మ్‌మేకర్‌ ఆనంద్‌ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నది చైతన్య.

వారికోసమే ప్రాంచైజీ..

మోడలింగ్‌ రంగంలో రాణించాలనుకునే యువతులకు వేదిక కల్పించడానికి ‘మిసెస్‌ భారత్‌ టీఎన్వీ’ ప్రాంచైజీ తీసుకున్నది చైతన్య. దానికి తెలంగాణ స్టేట్‌ డైరెక్టర్‌గా ఉంటూ యువతులను ప్రోత్సాహిస్తున్నది. ‘బిజినెస్‌ మింట్‌ ఇన్‌స్పైరింగ్‌ ఉమెన్‌ 2019’ అవార్డు, ‘విశ్వ సాంస్కృతి నంది అవార్డు’ 2019లో అందుకున్నది చైతన్య. తన భర్త దర్శకత్వంలో ‘కాక్‌టైల్‌ డైరీస్‌' అనే వెబ్‌సిరీస్‌లో చైతన్య నటించారు. తెలిసినవాళ్లు ఈమెను ‘సంతూర్‌ మమ్మీ’ అంటారు.

డప్పు రవి


logo