శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Feb 09, 2020 , 00:58:16

పాండవుల ఏకైక ఆలయం- ధర్మరాయస్వామి దేవాలయం

పాండవుల ఏకైక ఆలయం- ధర్మరాయస్వామి దేవాలయం

భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో,ప్రతీ వీధిలో వేలాది ఆలయాలు కన్పిస్తాయి. కొన్ని విష్ణుమూర్తికి చెందినవైతే, ఇంకొన్ని పరమశివుడికి, మరికొన్ని ఇతర దేవుళ్లకుచెందినవి. కానీ కొన్ని చోట్ల మాత్రమే పాండవులను దేవుళ్లుగా పూజిస్తారు . అటువంటి దేవాలయమే బెంగళూరులోని ధర్మరాయ స్వామి ఆలయం. ప్రతీ ఏడాది ఇక్కడకు వేలాదిమంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ జరిగే కరగ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యముంది.

బెంగళూరు నగరంలోని నడిబొడ్డున ఈ ధర్మరాయ దేవాలయం ఉంది. దేశంలో ధర్మరాయ స్వామి ఆలయం ఇది ఒక్కటి మాత్రమే. ప్రతీ ఏడాది వేలాదిమంది హిందూ భక్తులు దర్శనానికి వెలుతుంటారు. ముఖ్యంగా బెంగళూరు కరగ పండగప్పుడు ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ పండగను రాష్ట్రంలోని పురాతన పండగల్లో ఒకటిగా నమ్ముతారు. ఈ గుడిలో పాండవులు కొలువుదీరి ఉంటారు. పాండవులను, వారి పట్టపురాణి ద్రౌపదిని పూజిస్తారు. 

ఆలయ చరిత్ర  

కెంపేగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించడానికి ముందే తిగల వంశానికి చెందిన వారు ఈ ధర్మరాయ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు. బెంగళూరు నగరం 16వ శతాబ్దంలో నిర్మితమైతే ఈ దేవాలయం11వ శతాబ్దంలో నిర్మితమైంది. అసలు ఈ దేవాలయం చుట్టూనే నగరం నిర్మించారని కూడా చెబుతారు. అప్పటినుంచి ధర్మరాయ స్వామి ఆలయం రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రంగా మారింది.

కరగ పెద్ద పండుగ 

ఇక్కడ జరిగే పెద్ద పండుగ బెంగళూరు కరగ. నగరంలోని ఈ పండగను కూడా తిగలాస్‌ యే మొదలుపెట్టారని నమ్ముతారు. దీన్ని పాండవుల పట్టపురాణి ద్రౌపదికి గౌరవ సూచకంగా, స్త్రీ శక్తికి ప్రతీకగా జరుపుకుంటారు. ధర్మరాయ స్వామి ఆలయానికి ఏడాది పొడవునా ఎప్పుడైనా వెళ్ళవచ్చు. అయితే కరగ పండగకు దగ్గరలో ఉండే మార్చి, ఏప్రిల్‌ ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ దేవాలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. పాత బెంగళూరులోని ఈ ఆలయంలో ఏటా నిర్వహించే కరగ ఉత్సవాన్ని విదేశీయులు సైతం వచ్చి ఆసక్తిగా తిలకిస్తారు. ఆ వేడుకల్లో ఆలయ పూజారి మహిళలాగా అలంకరించుకుని కరగను ఊరేగించడం విశేషం.


పాత బెంగళూరులోని ఈ ఆలయంలో ఏటా నిర్వహించే కరగ ఉత్సవాన్ని విదేశీయులు సైతం వచ్చి ఆసక్తిగా తిలకిస్తారు. ఆ వేడుకల్లో ఆలయ పూజారి మహిళలాగా అలంకరించుకుని కరగను ఊరేగించడం మరో విశేషం.


ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు.. విగ్రహాలను ఎవరు ప్రతిష్ఠించారనే దానికి చారిత్రక ఆధారాలు లేవు. పురాతత్వ శాస్త్రజ్ఞుల ప్రకారం.. ఈ గుడిని 800 ఏండ్లక్రితం నిర్మించారు.

కరగ పండుగకు ఒక చరిత్ర ఉంది. అదేంటంటే.. మహాభారత యుద్ధం ముగిశాక తిమిరాసురుడనే రాక్షసుడిని అంతమొందించడానికి ద్రౌపది ‘వీరకుమారులు’ పేరుతో ఒక సైన్యాన్ని తయారు చేసింది. ఆ సైనికులు అసురుడిని సంహరించారు. అనంతరం పాండవులు స్వర్గానికి వెళ్లడానికి సిద్ధం కాగా.. కనీసం ద్రౌపది అయినా అక్కడ ఉండాలని వీరకుమారులు వేడుకున్నారట. అందుకు తిరస్కరించిన ద్రౌపది.. ఏడాదికొకసారి వారి కోసం భూమికి వస్తానని మాట ఇచ్చిందట. దాన్ని పురస్కరించుకునే ఏటా పది రోజులపాటు కరగ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

మతసామరస్యానికి వేదిక

ఏటా ఘనంగా జరిగే కరగ ఉత్సవం హిందూ ముస్లిం మతసామరస్యానికి  ప్రతీకగా నిలుస్తున్నది. కరగను ఊరేగించే సమయంలో తవక్కల్‌ మస్తాన్‌ దర్గా ప్రాంగణంలోకి తీసుకెళ్తారు. దీని వెనుక కథ ఏంటంటే.. మస్తాన్‌సాబ్‌ అనే సాధువు ఒకసారి కరగ ఉత్సవం సమయంలో గాయాలపాలయ్యాడట. అప్పుడు, ధర్మరాయస్వామి ఆలయ పూజారులు పసుపు, కుంకుమలను ఆయన గాయాలకు అద్దడంతో వెంటనే నయమయిందని చెబుతారు. అప్పుడా సాధువు.. తాను మరణించాక కరగ ఉత్సవం తన సమాధిస్థలి వద్ద కొద్దిసేపు ఆగాలని కోరుకున్నాడట.

ఎలా చేరుకోవచ్చు  ?

విమానం ద్వారా - బెంగళూరుకు అన్ని పెద్ద నగరాల నుండి రవాణా సౌకర్యం ఉంది.  ఎయిర్‌ పోర్ట్‌ నుండి   ధర్మరాయ స్వామి ఆలయానికి నేరుగా కాబ్‌లో వెళ్లవచ్చు. గుడినుంచి ఎయిర్‌ పోర్ట్‌కి మధ్య దూరం 36 కిలోమీటర్లు. 

రైలు ద్వారా -అన్ని పెద్ద నగరాలు, పట్టణాల నుంచి బెంగళూరుకి రైళ్ళు కూడా ఉన్నాయి. రైల్వే స్టేషన్‌ నుండి తిగలార్‌ పేట్‌ లో ఉన్న గుడికి టాక్సీలో వెళ్లవచ్చు. 

రోడ్డుద్వారా - ధర్మరాయ స్వామి గుడికి నేరుగా బస్సులో లేదా  ప్రత్యేక వాహనంలో వెళ్ళవచ్చు.  

మధుకర్‌ వైద్యుల