బుధవారం 03 జూన్ 2020
Sunday - Feb 09, 2020 , 00:27:14

మార్మిక కథ-41.. తగిన వస్ర్తాలు

మార్మిక కథ-41..  తగిన వస్ర్తాలు

‘కత్తులు పట్టిన వాళ్ళను కత్తులతో జయించవచ్చు. చీమకు అపకారం తలపెట్టని సాధువుల్ని మనం జయించలేం’ అని సైన్యాధిపతిని పంపేశాడు. రాజులో అహంకారం ఆవిరైపోయింది. ముఖమంతా దిగులుతో నిండింది. సత్యాన్ని తెలిసిన ఆ సాధువుని తను సందర్శించే మార్గం లేదా’ అని తపించాడు.

ఆ రాజు మహాబలవంతుడు. చైతన్యశీలి. ప్రతిభావంతుడు. చురుకైన వాడు. తన చుట్టు పక్కల రాజ్యాల్ని జయించాలన్న కోరికతో సైన్య సమేతంగా దండయాత్రకు బయల్దేరాడు. చిన్నిచిన్ని రాజులందరూ యుద్ధం అవసరం లేకనే ఆయనకు లొంగిపోయారు. లొంగిపోవడానికి ఇష్టం లేని రాజులు ఎదిరించారు. తన యుద్ధ నైపుణ్యంతో ఆ రాజుల్ని ఓడించి రాజ్యాల్ని ఆక్రమించాడు. విజేతగా నిలిచాడు. ఇక ఎదిరించేవాళ్ళు ఎవరూ లేక విజయయాత్ర ముగించాలనుకున్నాడు.

ఆ రాజు గెలిచిన రాజ్యాలలో తన ప్రతినిధుల్ని కొంత సైన్నాన్ని పెట్టి తన నగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

మధ్యలో ఒక లోయలో గుడారాలు వేయించి విడిది చేశాడు. అదీ ఒక నదీతీరంలో విడిది చేశాడు. ఎదురుగా ఒక మహా పర్వతముంది.

భోజనానంతరం అందరూ సెలవు తీసుకుని విశ్రమించారు. రాజుకు నిద్రరాలేదు. విశాల నక్షత్రాల ఆకాశ అందాన్ని పరిశీలించి పరవశించాడు. చల్లని గాలిలో ఉల్లాసంగా ఊపిరిపీల్చాడు.

కాసేపటికి కునుకు తీద్దామనుకునేంతలో ఎదురుగా ఉన్న కొండమీద ఏదో వింత కాంతి మెరిసింది. రాజు దిగ్బ్రమతో ఆ కాంతికేసి చూస్తూ ఉండిపోయాడు. అట్లా ఆశ్చర్యపోతూనే నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయాన్నే సేనాపతిని పిలిచి ఆ కొండమీద ఎవరన్నా వున్నారా?’ అని అడిగాడు.

సేనాపతి ‘రాజా! ఇక్కడ గ్రామస్తుల్తో మాటల సందర్భంలో ఆ పర్వతం మీద ఒక సాధువు ఆశ్రమం ఉందని తెలిసింది’ అన్నాడు.

‘మరి నువ్వు ఆ కొండపైన కాంతిని చూశావా?’ అన్నాడు రాజు.

‘చూశాను రాజా! రాత్రి కొండపైన కాంతిని చూశాను’.

‘ఆ కాంతి ఎలా ఉంది?’

‘మామూలుగా కట్టెల మంటలాగే ఉంది’.

రాజు తను చూసిన, కాంతి అదికాదని నిశ్చయానికి వచ్చాడు. 

‘సేనాధిపతీ! నువ్వు ఆ పర్వతంపైకి వెళ్ళి నేను ఆ సాధువును సందర్శించాలనుకుంటున్నానని చెప్పిరా’ అన్నాడు.

సేనాధిపతి ‘సరే మహారాజా!’ అని పర్వతంపైకి వెళ్ళాడు. గంట తరువాత వచ్చి ‘ఆ సాధువు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు మహారాజా!’ అన్నాడు.

రాజు తన ఆడంబరమైన గంభీరమైన వేషంతో పర్వతాన్ని అధిరోహించడం ఆరంభించాడు. మధ్యలో ఆ సాధువు శిష్యుడు ఎదురై ‘మహారాజా! మిమ్మల్ని సరైన వస్ర్తాలు ధరించి మా గురువుగారు రమ్మన్నారు’ అని చెప్పాడు.

రాజు మళ్ళీ కిందకు దిగి తన గుడారానికి వచ్చి తన ఒంటిమీద ఉన్న నగలు, ఖరీదైన బట్టలు వదిలి సాధారణ మానవుడి వస్ర్తాలు వేసుకొని పర్వతం ఎక్కడం మొదలుపెట్టాడు.

అంతలో సాధువు మరో శిష్యుడు ఎదురై ‘రాజా! మిమ్మల్ని సరైన వస్ర్తాలు ధరించి రమ్మని మా గురువుగారు చెప్పారు’ అన్నాడు. 

రాజు బహుశా సన్యాసి ఏ వస్త్రాలు వేసుకుంటాడో అలాంటివే ధరించాలని సాధువు అభిప్రాయమై ఉంటుందని గుడారానికి వచ్చి మొలకు ఒక కషాయ వస్త్రం, పైకి ఒక కాషాయ కండువా కప్పుకొని పర్వతం ఎక్కడం మొదలుపెట్టాడు. సగం కొండ ఎక్కాడు. అప్పుడు సాధువు ఇంకో శిష్యుడు ఎదురై’ రాజా! ఇవి కాదు. మీరు సామాన్య వస్ర్తాలు ధరించి రావాలని మా గురువుగారు కోరుతున్నారు’ అన్నాడు.

రాజు అలసిపోయాడు, కానీ కోపం రాలేదు. రాజు వివేకవంతుడు. దిగులుగా పర్వతం దిగి తన గుడారం చేరాడు.

సైన్యాధిపతి ‘రాజా! ఒక్కమాట చెప్పండి. నేను ఆ సన్యాసిని మీ పాదాల మీద పడేస్తాను’ అన్నాడు ఆగ్రహంగా.

‘కత్తులు పట్టిన వాళ్ళను కత్తులతో జయించవచ్చు. చీమకు అపకారం తలపెట్టని సాధువుల్ని మనం జయించలేం’ అని సైన్యాధిపతిని పంపేశాడు.

రాజులో అహంకారం ఆవిరైపోయింది. ముఖమంతా దిగులుతో నిండింది. సత్యాన్ని తెలిసిన ఆ సాధువుని తను సందర్శించే మార్గం లేదా’ అని తపించాడు.

అంతలో గుడారం తలుపుతీసి ఒక సాధువు లోపలికి వచ్చాడు.

తను ఆ రాత్రి చూసిన అద్భుతమైన కాంతి ఆకారం దాల్చినట్లు ఉన్నాడు సాధువు’ అనుకున్నాడు రాజు.

‘రాజా! ఇప్పుడు నువ్వు సరైన వస్ర్తాలు ధరించావు. అన్ని వస్ర్తాల కన్నా వివేక వస్ర్తాలు విలువైనవి. నువ్వు సత్యం రూపొందిన సత్యశాలివి. అందుకే నీ దర్శనానికి నేను వచ్చాను’ అన్నాడు సాధువు.

పరమ సంతోషంతో రాజు సాధువు పాదాలపై పడ్డాడు.

సౌభాగ్య


logo