గురువారం 04 జూన్ 2020
Sunday - Feb 09, 2020 , 00:12:29

వాస్తు

వాస్తు

మనీ ప్లాంట్‌ ఇంట్లో పెడితే డబ్బులు వస్తాయా? దానిని ఎక్కడ పెట్టాలి?- ముళ్లపూడి అవినాష్‌, గచ్చిబౌలి

ఈ మధ్యకాలంలో అనేకమంది షాపుల్లో, గృహాలలో మనీప్లాంట్స్‌ పెడుతున్నారు. వాటిని తీగలుగా కూడా కిటికీలకు పారిస్తూ ఎంతో ఇష్టాన్ని చూపుతున్నారు. పచ్చదనం కలిగి ఉన్న మొక్క మనిషికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది అనడంలో ఏరకమైన సందేహం లేదు. పైగా గ్రీనరీ మెదడులో ఆల్పతరంగాలను సృష్టించి ఒక కూల్‌ ఫీలింగ్‌ ఇస్తాయని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. కానీ మనీప్లాంట్‌ ఒక్కటే పెట్టాలి.మిగతావి అక్కరకు రావు అనేది మంచి ఉద్దేశం కాదు. అట్లాగే మనీప్లాంట్‌తో సంపదలు కలుగుతాయి అనేది వాస్తవం కాదు. అలా అయితే దానిని అందరూ పెట్టుకొని ధనవంతులు కావచ్చు కదా. డబ్బులు, మన ఆలోచనలు ఇస్తాయి దానికి మన పరిసరాలు దోహదపడాలి. ఇంట్లో మనం ఎలాంటి వాతావరణాన్నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా దాని ప్రభావం మన హృదయం మీద తెలియకుండా పనిచేస్తుంది. ప్రకృతిలోకి చూస్తే మనకు ఎక్కడైనా కనిపించేది పచ్చదనమే. మనం హాస్పిటల్‌కు వెళితే అక్కడ గ్రీన్‌కలర్‌ వైట్‌కలర్‌ పరదాలు వస్తువులు వాడుతుంటారు. కారణం అవి మనసును ఉత్సాహపరుస్తాయి. నిధి మన హృదిలో ఉంది. దానికి పంపువేయాలి గృహంలో. పచ్చని చెట్లు, నీడలో పెరిగే మొక్కలు ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టవచ్చు.


ఇంట్లో నేలమీద పడుకోవచ్చా? మంచాలను (కాట్స్‌) తప్పకవాడాలా?- అనంతమూర్తి, సికింద్రాబాద్‌

భూశయనం ఎంతో ఉన్నతమైంది. తల్లిఒడిలో పిల్లాడు ఎంతో హాయిగా నిదురించడం మనం చూస్తాము. అలా మట్టినేలమీద అలికిన జగిలి మీద ఈత చాప వేసుకొని మన పెద్దలు (తాతలు) నిదురించేవారు. సమస్త సంపద భూమిలోనే ఉన్నదని మనకు తెలుసు. ఎన్నో అనుభూతులను, రుచులను, ఖనిజాలను అందించే నేలతల్లి ఒడిలో నిదురించడం మంచి ఆరోగ్య జీవన విధానం. అదో వరం. అంతేకాదు పెద్ద వాళ్లు కింద పడుకొని లేవడం కష్టం కాబట్టి ఇంటి దక్షిణ, పశ్చిమ ప్రధాననడక గదులలో మంచం పొడవు వెడల్పు అనుకూలంగా ఆరుఫీట్లు వెడల్పు, ఏడుఫీట్ల పొడవు కలిగిన మట్టిదిమ్మెను ఒకటిన్నర ఎత్తు కట్టించి దానిని మంచంగా వాడుకోవడం ఉన్నతం. ఆ దిమ్మెపైన టైల్స్‌ మాత్రం (బండలు) వేయవద్దు. ఎర్రమట్టితో నింపి ఆవుపేడతో అలకాలి. అలా మట్టి మంచాలు కూడా వాడుకోవచ్చు. నేలమీద కానీ, ఎత్తుమీదకాని పడుకోవడం మంచిదే. ప్రధానంగా పల్లెటూళ్లలో నులుక మంచాలు వాడతారు. అవి పురుగు పూచి పిల్లి ఎలుకలకు అడ్డం కాకుండా రక్షణగా ఉంటాయని పడక ఏదైనా నిదురించే శాస్త్ర గృహం తప్పక కట్టితీరాలి.


కిటికీలు ఎంత వెడల్పువైనా ఏ గదిలోనైనా పెట్టొచ్చా?-వడ్డేపల్లి అరవింద్‌, కొత్తకోట

ఇల్లంతా కిటికీలు ఎక్కువ ద్వారాలు పెడితే అది గొప్ప ఇల్లు అవుతది అని అనుకోవద్దు. ఇంటిలోపల ఆవరణాన్ని దాని ఆరోగ్య వాతావరణాన్ని కూడా లెక్కకడుతుంది శాస్త్రం. ఇంటి వాస్తు అంటే అదే మరి. మొత్తం ఓపెన్‌ పెట్టికడితే దానిని గృహం అనరు. ఓపెన్‌ హాలు కొట్టం అంటారు. ఇల్లును స్త్రీమూర్తి రూపంగా నిర్మించాలి. మగవాడి శరీరానికి స్త్రీ శరీరానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అందుకే గృహలక్ష్మి అంటారు. గృహం అనే పదం గృహిణి ద్వారానే ఉత్పన్నమైంది. అలా చూసినప్పుడు ఇల్లు ఎంతో మదుగు (చాటు) కలిగి ఉండాలి. ఎక్కడపడితే అక్కడ ఓపెనింగ్స్‌ ఉండకూడదు. అధికంగా కిటికీలు, అత్యధిక ద్వారాలు సినిమా హాళ్లకూ, మ్యారేజ్‌ హాళ్లకూ అవసరమవుతాయి. మఠాలకు, మందిరాలకు అవి సరిపడతాయి గృహాలకు కాదు. ఇంటి వైశాల్యాన్ని బట్టి దాని లోపలి వాతావరణం వేడెక్కకుండా అధికంగా చల్లబడకుండా అవసరమైన కొలతలతో అవసరం మేరకే కిటికీలు వాటి వెడల్పు ఉండాలి. గోడంతా కిటికీ పెడతా అంటే కుదరదు.


ఉత్తరం గోడ, దక్షిణం గోడ దేనినైనా గ్లాస్‌తో పెట్టొచ్చా?- పంజాల శ్రావణి

ఇంట్లో ఒక జీవితం నిర్మాణం చెందుతుంది అనే విషయం మనం మరిచిపోవద్దు. ఎందుకంటే మన పిల్లలు, మనవలు కూడా గృహంలోనే కదా మొగ్గతొడిగేది. వారివారి మనోభావాలు మాటలు రాని వయస్సు నుండే వారి చుట్టూ ఉండే ప్రకృతి సరిదిద్దుతుంది. ఇంటి పెద్దగా, మనం నేర్పే విధానం కన్నా నేచర్‌ నేర్పే పద్ధతి చాలా అబ్బురంగా లోతుగా.. ఘాడతగా ఉంటుంది. అందుకే పరిసరాలను పసిపిల్లలకోసం అయినా సరిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. మన గృహంలో ప్రదక్షిణ గోడలు ప్రధానంగా ఉంటాయి. నైరుతి భాగాన ఎంత మందం కొలతతోనైతే కట్టడం నిర్ణయిస్తామో..మిగతా అన్ని గదుల చుట్టు వచ్చే ఆ గోడ తప్పనిసరి అంతే మందంతో నడుస్తూ పోవాలి. కొందరు తూర్పు తక్కువ మందం, ఉత్తరం తక్కువ మందం అని ఆలోచిస్తారు అది సరైంది కాదు. కావాల్సిన కొలతను ముందు నిర్ణయించి ఆ గోడ చుట్టూ సాగాలి. దానికి బదులు అద్దాల గోడలు పెడతాననడం సరికాదు. కిటికీలు కావలిస్తే పెద్దవి పెట్టుకోవచ్చు. అంతేగాని గోడలకు బదులుగా గ్లాస్‌గోడ పెట్టవద్దు. ఎలా కట్టాలో అలా కడితేనే ఇల్లు ప్రకృతితో మమేకం అవుతుంది. తద్వారా సృష్టితో ఇంటికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. అప్పుడు మన గెలుపు దారి నిర్ధారణ అవుతుంది.


మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక, 
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం 
రోడ్‌ నం: 10, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ - 500034.


logo