శనివారం 29 ఫిబ్రవరి 2020
అందాల నటి జీవితం అంతా విషాదం..

అందాల నటి జీవితం అంతా విషాదం..

Feb 09, 2020 , T00:10
PRINT
అందాల నటి జీవితం అంతా విషాదం..

ఓ ఇంట్లో ఫోన్‌ మోగింది. పెద్ద భవనం.. మనుషులు లేనట్టే కనిపిస్తుంది. విశాలమైన హాలు.. చాలా సేపటి వరకూ ఫోను మోగుతూనే ఉంది. ఇంతలో ఓ మహిళ ఫోన్‌ లిఫ్ట్‌ చేసింది. ‘హలో’.. అవతలి నుంచి ‘హలో’.. ఇటు నుంచి ‘లియుడ్మిలా?’ అవతలి నుంచి ఓ సందేహాత్మక ప్రశ్న.. ఇవతలి నుంచి చాలా సేపు నిశ్శబ్దం. అవతలి వ్యక్తి సందేహాన్ని ఎలా స్పష్టం చేయాలో అంత త్వరగా ఆమెకు అర్థం కాలేదు.. ఇంతలో ‘లియుడ్మిలా’.. మళ్లీ ఓ సారి వినిపించింది.. ‘లియుడ్మిలా లేదు.. నేను ఆమె అత్తమ్మను మాట్లాడుతున్న’ ‘ఆమె ఎక్కడ?’ అవతలి నుంచి ప్రశ్న ‘చనిపోయింది’ ఇవతలి నుంచి ఆమె సూటిగా చెప్పింది.. ఇప్పుడు అవతలి నుంచి నిశ్శబ్దం. కొద్ది నిశ్శబ్దం తర్వాత వాళ్లు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. లియుడ్మిలా చనిపోయి రెండునెలలు అవుతున్నది. ఆ విషయం తెలియని ఓ ఆర్మీ ఆఫీసర్‌ నుంచి వచ్చిన ఫోన్‌ అది.

1997, జనవరి
రష్యా, మాస్కో నగరం..

ఓ పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఒక్కతే కూర్చుని ఉంది. ముఖం అంతా విషాదం. జీవితంలో ఏదో కోల్పోయిన భావన స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెనే వెలితి తుంచి వేస్తుంది. చూస్తుంటే ఆమె మద్యం సేవించినట్టు కనిపిస్తున్నది. అక్కడ ఆమె తప్ప ఎవరూ లేరు. ఒంటిరిగా ఆమె ఆలోచించుకుంటూ కూర్చుంది. దేనికోసమో ప్రశాంతంగా వేచి చూస్తున్నది.. మనుషుల కోసమా? మరణం కోసం అయుండొచ్చేమో!.... అమె లియుడ్మిలా మార్చెంకో.. రష్యన్‌ సినీ ప్రపంచంలో వెలుగు వెలిగిన నటి. ఆమె రష్యన్‌ అందాల తార.. 


1959, రష్యా ...

ఇవాన్‌ అలెగ్జాండ్రోవిచ్‌ పైరేవ్‌..  రష్యా  ప్రఖ్యాత దర్శకుడు.   సినిమా ప్రపంచంలో   ప్రభావవంతమైన వ్యక్తి. ట్రాక్టర్‌ డ్రైవర్స్‌, క్యూబన్‌ కొసాక్స్‌, పిగ్‌ అండ్‌ షెపార్డ్‌ వంటి ప్రసిద్ధ చిత్రాలు అతని జాబితాలో ఉన్నాయి. అప్పుడే   లియుడ్మిలా గురించి తెలుసుకున్నాడు. మొదటిసారి ఆమెను చూడగానే సినిమా తీయాలనుకున్నాడు. దాని ఫలితమే ‘వైట్‌ నైట్స్‌' (1959). లియుడ్మిలాకు గొప్ప విజయాన్ని ఇచ్చిందా చిత్రం. అప్పటి వరకూ ఆ దిగ్గజ దర్శకునికి ఎంతో పేరున్నా ప్రేక్షకుల్లో గౌరవం తెచ్చింది మాత్రం ‘వైట్‌ నైట్స్‌' మాత్రమే. 19 ఏండ్లు కూడా సరిగా నిండని ఆ యువనటి రష్యన్‌ ప్రేక్షకులను తీవ్రంగా ఆకర్షించింది. మరోవైపు దర్శకుని మనస్సును కూడా. 

దర్శకుడు పైరేవ్‌తో భారీ విజయాన్ని  అందుకున్నది లియుడ్మిలా.  అదొక అసాధారణ విజయం. కానీ ఆమెపై దర్శకుని ఉద్దేశ్యాలను గ్రహించలేకపోయింది. అదే ఆమె పొరపాటు అయుండొచ్చు. అతనికి ఆమె మీద ఉండే ఆలోచనలను ఊహించుకోవడానికి కూడా ఆమెకు అవకాశం లేదు!


‘వైట్‌ నైట్స్‌' రష్యా సినిమా ప్రపంచంలో  మాస్టర్‌ పీస్‌గా మారింది. రెండోసారి ఆలోచించకుండా ఆ హీరోయిన్‌తోనే మరో సినిమా మొదలు పెట్టాడు పైరేవ్‌.  దాని తర్వాత లియుడ్మిలా ఎనలేని గుర్తింపు పొందింది. రష్యా వీధుల్లో ప్రజలు గుర్తుపడుతున్నారు. అభిమానుల సంఖ్య పెరిగింది. లేఖలు అందుతున్నాయి. సోవియట్‌ యూనియన్‌ అంతా ఆ  యువనటి ప్రసిద్ధి చెందింది.  మరోవైపు దర్శకుడు లియుడ్మిలాకు ఆకర్షితుడవుతున్నాడు. అతని ఉద్దేశ్యాలు తీవ్రంగా మారుతున్నాయి. అది గ్రహించని ఆమె విజయానందంతో గడుపుతున్నది.

లియుడ్మిలా మార్చెంకో.. రష్యా సినిమా ప్రపంచంలో కొత్త స్టార్‌.  ఆమె కీర్తిప్రతిష్టలు పెరిగాయి. ఆమె కల నెరవేరింది.  చిన్న వయస్సులోనే ఆ దర్శకుడు ఆమెకు విజయాన్ని ఇచ్చాడు. దీంతో అతను ఏది అడిగినా లియుడ్మిలా కాదని అనుకున్నాడు. మొదట ఓ ఇల్లును బహుమతిగా ఇచ్చాడు.   కొద్ది రోజుల తర్వాత అతని ఉద్వేగాలు భయపడటం లియుడ్మిలా గమనించింది. అదే సమయంలో   పైరేవ్‌ తన ప్రేమను లియుడ్మిలాకు వ్యక్తపరిచాడు. ఆమె నమ్మలేదు. ప్రసిద్ధ దర్శకుడు ఆమెను ప్రేమిస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యానికి గురైంది. ఆనందంతో కాదు బాధతో. లియుడ్మిలా ఆ ప్రేమను అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఆ దర్శకుని వయసు 59 సంవత్సరాలు.  

లియుడ్మిలా  పైరేవ్‌ను  అడ్డుకోదని భావించాడు. అనైతిక ప్రవర్తన, తీవమైన దురాలోచనతో  లియుడ్మిలాను   ఇబ్బందులకు గురిచేశాడు పైరేవ్‌. ఈ    అడ్డు తొలగించుకొనేందుకు రష్యా ఫిలిమ్‌ కమిటీని ఆశ్రయించింది లియుడ్మిలా. విచారణ కోసం వచ్చిన పైరేవ్‌ తన భావాలను మార్చుకోలేదు. లియుడ్మిలా కూడా తన అభిప్రాయాలను మార్చుకోలేదు. కమిటీ అతన్ని నియంత్రించ లేకపోయింది. పరిస్థితులు వేడెక్కాయి. ఆ అమ్మాయే తన చివరి ప్రేమ అని తేల్చిచెప్పాడు.  లియుడ్మిలా తిరస్కరణ అతనిలో కోపాన్ని పెంచింది. అతనిలోని భావోద్వేగాల పేలుడుకు కారణం అయింది. అతను లియుడ్మిలా జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు.  

లియుడ్మిలా  అందం చుట్టూ ఎందరి కోరికలో చెలరేగుతున్నా. ఆమెను ప్రతికారాలు వెంటాడుతున్నా.. నటిగా  ఆమె పని మాత్రం మానలేదు. అడ్డంకులను ఎదుర్కొని అయినా ఆమె చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి తెరమీద కనిపిస్తూనే ఉన్నాయి. ‘అన్‌టిల్‌ నెక్స్‌ స్ప్రింగ్‌' వంటి సినిమాలతో ఆమె కొంత ఆనందాన్నైతే పొందుతున్నది. ఆమెది పూర్తిగా స్థిరపడని జీవితం అయినప్పటికీ వ్యక్తిగత జీవితం సంతోషంగా గడుపుతున్నది. కానీ ఆ సంతోషం కొద్దికాలంలోనే కూలిపోయింది.  పైరేవ్‌ వాదనను ఆమె తిరస్కరించడంతో ఆమెకు అవకాశాలు ఇవ్వొద్దని ఆదేశించాడు. అమె అత్యుత్తమ నటే కానీ పైరేవ్‌ చిత్ర పరిశ్రమలను ప్రభావితం చేయగల వ్యక్తి.  అతని ఆదేశాలతో లియుడ్మిలాకు అవకాశాలు తగ్గిపోయాయి. పైరేవ్‌ అనుమతి లేకుండా సినిమాలు ఇవ్వడానికి ఎవరూ సాహసం చేయలేరు. దీంతో లియుడ్మిలాకు పనిలేకుండా పోయింది.  ఈ సమస్యలో చిక్కుకున్న ఆమె రహస్యంగా అతని దగ్గరికి వచ్చి సాయం అడుగుతుందని భావించాడు. అదే సమయంలో ఒలెగ్‌ అనే 31 ఏండ్ల నటునితో లియుడ్మిలా వివాహం అయింది. కానీ పెద్ద దర్శకునితో లియుడ్మిలా మధ్య సంబంధాలని రూమర్లతో  ఒలెగ్‌, లియుడ్మిలాకు విడాకులిచ్చాడు. 


దర్శకుడు పైరేవ్‌ తన ప్రతీకార చర్యలను కొనసాగిస్తున్నాడు. ఒలెగ్‌, లియుడ్మిలా బంధం వీడిపోయినట్టు తెలుసుకున్న మొదటి వ్యక్తి పైరేవ్‌. అతను అనుకున్నట్టుగా ఆమె సహాయం కోరడానికి రాలేదు.. దీంతో పైరేవ్‌ తన వాదనను మళ్లీ లియుడ్మిలా ముందు ఉంచాడు. కానీ అమె మొండిగా ఉంది. పైరేవ్‌ను నిరాకరించింది. 

 నటిని పూర్తిగా సొంతం చేసుకునేందు పైరేవ్‌  ప్రయత్నాలు చేస్తున్నాడు. లియుడ్మిలా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు. తన ఆస్తి మొత్తం పాదాల దగ్గర పెడతానన్నాడు. తన భార్యకు విడాకులిచ్చి, ఆస్తి కాగితాలు లియుడ్మిలాకు అందచేస్తానన్నాడు. ఆమెను సంతోషంగా చూసుకుంటానని ప్రమాణం చేశాడు. ఆమె సంతోషానికి తన జీవితంలో కొత్త తలుపులు తెరుస్తానని వాదించాడు. కేవలం  అందం కోసం ఆరాట పడుతున్న పైరేవ్‌ వాదనను లియుడ్మిలా తల్లి ఆమెదించలేదు. అతన్ని బయటకు తోసేసి తలుపులు పెట్టేసింది. పైరేవ్‌ వెళ్లిపోయాడు. కానీ అతనికి జీవితం మొత్తం గుర్తుండిపోయే ఆ అందాల నటిని మాత్రం ప్రేమించడం మానలేదు. ఈ క్రమంలోనే అనుకోకుండా వ్లాదిమిర్‌ వెర్చెంకో అనే యువకున్ని పెండ్లి చేసుకుంది.  కానీ   అతను   ఆసూయ పడ్డాడు.

లుడ్మిలా, పైరేవ్‌ సంబంధాల పుకార్లు ఆయన చెవినా పడ్డాయి. అంత పెద్ద దర్శకునితో సంబంధాలను  ఈ అమ్మాయి నిరాకరించిందని ప్రజలు నమ్మలేరనే వాదనతో ఆమెను విడిచిపెట్టాడు. తర్వాత  వాలెంటైన్‌ అనే భూవిజ్ఞాన శాస్త్రవేత్తను వివాహం చేసుకుంది.   మూడేండ్ల తర్వాత అతను భార్య గురించి అనేక గుసగుసలు విన్నాడు.  దీంతో లియుడ్మిలా ప్రేమను, విశ్వాసాన్ని నమ్మలేకపోయాడు. దర్శకునితో సంబంధాల పుకార్లను చాలా సులభంగానే వాలెంటైన్‌ కూడా నమ్మేశాడు. ఆయన లియుడ్మిలాను తీవ్రంగా కొట్టాడు. కనికరం లేకుండా విరుచుకు పడ్డాడు. అందంగా ఉన్న ఆమె ముఖం మీద రక్తం కనిపించింది. తెల్లరంగు శరీరంపై అన్నీ రక్తపు చారికలే. మృదువైన పెదాలకు తీవ్రమైన గాయాలయ్యాయి. కోలుకోలేని స్థితిలో, రక్తం మడుగుల్లో ఉన్న భార్య లియుడ్మిలాను చూసి వాలెంటైన్‌ భయపడ్డాడు. తనపై ఎలాంటి రిపోర్టు ఇవ్వొద్దని బతిమాలాడు. దీంతో ఈ గాయాలు ప్రమాదం వల్ల జరిగాయని లియుడ్మిలా అందరికీ చెప్పింది. వైద్యులు ఆమె ప్రాణాలను రక్షించగలిగారు. కానీ ఆమె ముఖాన్ని మాత్రం రక్షించలేకపోయారు. 

ఆమె వయస్సు అప్పుడు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. ఆమె ముఖం నిండా మచ్చలు, చిరిగిన పెదాలు, వికృతమైన దవడలతో ఆమె జీవించాల్సి వచ్చింది. అయినా ఆమె భయపడకుండా సినిమాలు చేసింది. ‘ది స్కౌట్‌', ‘జిప్సీ’, ‘ద మ్యాన్‌ ఆంకర్స్‌' చిత్రాల్లో నటించింది.  ఇంతటి విషాదం జరిగినా భర్తమీద తను కోపం తెచ్చుకోలేదు. విడిచివెళ్లిపోవాలని అనుకోలేదు. కానీ  భర్త వాలెంటైన్‌కు రహస్య కుటుంబం ఉందని తెలుసుకుంది. వేరే స్త్రీతో ఓ కుమారుడు కూడా ఉన్నాడన్న సంగతి ఆలస్యంగా గుర్తించింది.  ప్రేమించే భర్త కొట్టినా పట్టించుకోని ఈ సున్నితమైన నటి భర్త ద్రోహాన్ని క్షమించాలనుకోలేదు. భర్తను ఇంటినుంచి బయటకు వెళ్లగొట్టొంది. 

కొన్ని రోజులకు లియుడ్మిలా, సెర్గీ సొకోలోవ్‌ను పెండ్లి చేసుకుంది. పూర్తి హింసాత్మకంగా మారిన లియుడ్మిలా గతాన్ని సెర్గీ అర్థం చేసుకున్నాడు. ఆమె రక్షణకు మద్దతునిచ్చాడు. సెర్గీ ఆమెకు వెన్నుగా నిలిచాడు. దీంతో లియుడ్మిలా గృహిణిగా మనఃశ్శాంతి పొందింది. 


 లియుడ్మిలా సినిమాల్లో నటించడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. దీంతో 1982లో ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించాడు. కొత్త హోదాలో ఆ నటి రెండేండ్లు మాత్రమే పని చేశారు.  తరువాత ఆమె సినిమా రంగం నుంచి  పూర్తిగా విరామం తీసుకుంది. సెర్గీ, లియుడ్మిలాను   ఉత్తమంగా చూసుకుంటున్నాడు. ఇలా 21 ఏండ్లు సెర్గీ, లియుడ్మిలా వివాహ జీవితం కొనసాగింది. కానీ అప్పుడే 1996లో సెర్గీ గుండెపోటుతో  మరణించాడు. భర్త దూరం అవడం లియుడ్మిలాకు భయంకరమైన దెబ్బ. 

భర్త మరణం తర్వాత లియుడ్మిలా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆమె దిగాలును అధిగమించడానికి అనేక అలవాట్లను పెంచుకుంది. అపార్ట్‌మెంట్లో కొత్త వ్యక్తులతో మద్యం సేవించడం ప్రారంభించింది. గతం తాలూకు బాధను, ఒత్తిడిని మర్చిపోవడానికి లియుడ్మిలా పూర్తిగా మద్యం తీసుకోవడం మామూలైంది.  మద్యం కొనడానికి ఇంటి వస్తువులను అమ్మేసింది.   ఇప్పుడు ఒంటరిగా ఆమె గడపాల్సి వచ్చింది. తీవ్రమైన మద్యపానం, ఒంటరితనం, ఒత్తిడి కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. అయినా ఆమె బయటకు మాత్రం రాలేదు. బంధువులకు తను ఆరోగ్యంగా ఉన్నట్టే చెప్పింది. వైద్యుల సహాయం అవసరం లేదని చెప్పింది. ఎందుకంటే ఆమె ఇకపై జీవించడానికి  ఇష్టపడలేదు. మరణించే రోజు కోసం ప్రశాంతంగా వేచి చూస్తున్నది. ఆ రోజు రానే వచ్చింది.. 23 జనవరి 1997..

 ఒకప్పటి ప్రసిద్ధ నటి అంతిమ యాత్రకు చాలా తక్కువ మందే వచ్చారు. కొద్దిమందే ఆమెకు చివరి వీడ్కోలు చెప్పారు. రెండు నెలల ఓ ఆర్మీ ఆఫీసర్‌, లియుడ్మిలా మిత్రుడు ఆమెకు ఫోన్‌ చేశాడు. ఆమె చనిపోయిన విషయం తెలుసుకొని మాస్కోకు వచ్చాడు.  మాస్కో శ్మశాన వాటికలో అందంగా చెక్కిన ఆమె సమాధిని గుర్తించి లియుడ్మిలాకు ఘనమైన నివాళులర్పించాడు. 


మానని గాయాలు.. వెంటాడే పుకార్లు..

ఇవ్వన్నీ ఒక మనిషి చుట్టూ తిరిగితే 

అది దురదృష్టమా? కాలం పట్టిన పగా? 

లేక విధి వెక్కిరింతనా? మనుషులు పన్నిన విషవలయమా? ఏమో.. అందాల నటి లియుడ్మిలా మార్చెంకో జీవితం ఎన్నో ప్రశ్నలకు దొరకని సమాధానంగానే.. అందరూ ఉన్నా ఒంటరిగానే ముగిసిపోయింది. 


వినోద్‌ మామిడాల,  సెల్‌: 7660066469


logo