శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Feb 02, 2020 , 16:08:21

శిక్షించినవాడే రక్షించినవాడు

శిక్షించినవాడే రక్షించినవాడు

సాధువు మెల్లగా కండ్లు తెరిచాడు. ఎప్పటిలా ఆయన ముఖంలో చిరునవ్వు వెలిగింది. హమ్మయ్య! ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనుకున్నారు.ఆయన స్పృహలోకి వచ్చాడో లేదో కనుక్కుందామని ఒకరు స్వామీ! మీకు పాలు ఇచ్చిన వారు ఎవరు? అన్నారు.

ఒక దొంగ బాగా చీకటిపడ్డాకా ఆ గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనానికి బయల్దేరాడు. మెల్లగా ఇంటికి కన్నం వేసి లోపలికి జొరబడ్డాడు. రెండు గదులు వెతికాడు. ఏమీ దొరకలేదు. ఇంకో గదిలో వెతుకుదామని వెళ్ళబోయెంతలో గోడకు ఆనించిన పళ్ళెం తగిలి కిందపడి పెద్ద శబ్దం చేసింది. దాంతో నిద్రపోతున్న వాళ్ళు లేచి దొంగపడ్డాడని తెలుసుకున్నారు. వెంటనే దొంగ.. దొంగ అని అరిచారు.ఆ అరుపులకు అప్రమత్తమైన దొంగ ఒక్క ఉదుటున బయటపడి పరిగెత్తడం ప్రారంభించాడు. ఇంట్లో వాళ్ళు కూడా దొంగ..దొంగ అంటూ అతని వెంటపడ్డారు. ఆ అరుపులకు మేలుకున్న ఇరుగుపొరుగు వాళ్ళు కూడా దొంగ వెంటపడ్డారు. దొంగ ప్రాణభయంతో లేని బలం తెచ్చుకుని పరుగులు తీశాడు. దొంగకు గడ్డముంది. ఆ విషయం అందరూ గమనించారు. చీకటిలో దొంగ ఊరు దాటాడు. ఊరి చివర ఒక సాధువు నివసించేవాడు. ఆయన సౌమ్యుడు. ఎప్పుడూ చిరునవ్వుతో అందర్నీ పలకరించేవాడు. ఆ రాత్రి నిద్రరాక ఆయన తన గుడిసెముందు నిల్చుని ఉన్నాడు. కాసేపు అటూ ఇటూ తిరుగుతూ గడిపాడు. దూరంగా ఏవో అరుపులు వినిపిస్తే ఏమిటా శబ్దాలు అనుకొని సాధువు రోడ్డు మీదకు వచ్చాడు.అంతలో పరిగెత్తుకుంటూ వచ్చిన దొంగ సాధువు పక్క నుంచి దూసుకెళ్ళాడు. అంతా చీకటిగా ఉంది. మసక మసగ్గా ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చిన జనంలో కొందరు ముందుకు దూసుకెళ్ళారు. మరికొందరు సాధువే దొంగ అనుకొని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. సాధువు మౌనంగా ఉన్నాడు.అంతలో ముందుకు దూసుకెళ్ళిన జనం దొంగను పట్టుకొని వచ్చారు. ఇక్కడ సాధువును చావబాదుతున్న వాళ్ళని వారించి.. అయ్యో! ఆయన సాధువు.. ఆయన ఇక్కడే ఉంటాడు. మేము దొంగను పట్టుకున్నాం. సాధువును ఆయన ఇంటికి చేర్చండి అన్నారు.అప్పటికే సాధువు స్పృహ తప్పి పడిపోయాడు. బాగా గాయాలయ్యాయి. జనం సాధువును మోసుకొని ఆయన గుడిసెకు చేర్చారు. ముఖం మీద నీళ్ళు చల్లారు. గాయాలకు మందు రాశారు. కొద్దిగా వెచ్చని పాలను తాపించండి. కోలుకుంటాడు అన్నారు. శిష్యులు గురువుగారి కోసం వెచ్చని పాలను తీసుకొచ్చి కొద్దిగా తాగించారు.సాధువు మెల్లగా కండ్లు తెరిచాడు. ఎప్పటిలా ఆయన ముఖంలో చిరునవ్వు వెలిగింది. హమ్మయ్య! ప్రమాదం నుంచి బయటపడ్డాడు అనుకున్నారు.ఆయన స్పృహలోకి వచ్చాడో లేదో కనుక్కుందామని ఒకరు స్వామీ! మీకు పాలు ఇచ్చిన వారు ఎవరు? అన్నారు.సాధువు అదే వ్యక్తి అన్నాడు.స్వామీ! అదే వ్యక్తి అంటే మీ ఉద్దేశ్యమేమిటి?ఎవరయితే నన్ను కొట్టాడో ఎవరయితే నన్ను రక్షించి ఇక్కడకు చేర్చాడో అతనే అన్నాడు.జరుగుతున్న వాటన్నింటి వెనుక ఒక కర్త ఉన్నాడని అన్నీ ఆయనే నిర్వహిస్తాడన్నది సాధువు ఉద్దేశం. 

-సౌభాగ్య