గురువారం 04 జూన్ 2020
Sunday - Feb 02, 2020 , T01:50

లేడీ డిటెక్టివ్

లేడీ డిటెక్టివ్

పోర్టర్ ఆఫీస్ గదిలోంచి నాకామె మాటలు ఎంత గట్టిగా వినపడుతున్నాయంటే, ఆమె ఉద్రేక స్వభావురాలు అనిపించింది. బహుశా మా ఆఫీస్ ఉన్న బిల్డింగ్‌లోని వారంతా ఆ మాటలను వింటున్నారు.ఎప్పుడూ ఒకటే మాటలు. రిచర్డ్‌ని లేరీకి ఫోన్ చేయమని చెప్పండి అది చెప్పి రిసీవర్ పెట్టేస్తాడు. విసిగిపోయాను.పోర్టర్ ఆఫీస్ గది తలుపు తెరచుకుంది. గుమ్మంలో నిలబడ్డ ఆయన నా వంక చూసి చెప్పాడు.లీ! ఓసారి లోపలకి వస్తావా?నేను కంప్యూటర్ ముందునించి లేచి లోపలకి నడిచాను. ఆయన బల్ల వెనకాల గోడమీద పోర్టర్స్ ఇన్వెస్టిగేషన్స్ అనే ఆయన నడిపే డిటెక్టివ్ సంస్థ పేరుంది.లీ! ఈమె మిసెస్ రిచర్డ్... లీ నా దగ్గర పార్ట్‌టైమ్‌గా పని చేస్తున్నది. ఈమె క్రిమినల్ కోర్స్‌లో డిప్లొమా చేస్తున్నది. పరిచయం చేసాడు.హలో నేను చిరునవ్వుతో మర్యాదగా పలకరించాను.ఆవిడని చూడగానే నాకు ద్వేషం కలిగింది. కారణం ఆవిడ మొహంలోని కోపం, దౌర్జన్యం. పోర్టర్ నన్ను కూర్చోమన్నట్లుగా సౌంజ్ఞ చేసి, బల్లమీద ఉన్న నోట్ బుక్‌ని చూస్తూ చెప్పాడు.లీ. మిసెస్ రిచర్డ్‌ది చాలా ఆసక్తికరమైన కేసు. మేమ్! నాకు చెప్పింది ఆమెకి కూడా చెప్పండి.నెలనించి మావారి కోసం మా ఇంటికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. లేరీ అనే అతను ఫోన్ చేసి రిచర్డ్‌తో మాట్లాడాలి అంటాడు. అతను చేసిన ప్రతీసారి రిచర్డ్ ఇంట్లో ఉండటం లేదు. నా అనుమానం రిచర్డ్‌కి ఎవరితోనో అక్రమ సంబంధం ఉంది. లేరీ ఆ అమ్మాయి భర్తో, అన్నో లేదా బాయ్ ఫ్రెండో అయి ఉంటాడు. మా వారిని హెచ్చరించడానికి చేస్తున్నాడని నా అనుమానం. రిచర్డ్ లేకపోతే లైన్ కట్ చేసేస్తున్నాడు.లేరీ అనే అతను రిచర్డ్ ఇంటికి, అతను ఇంట్లో లేనప్పుడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడన్నది మనం కనుక్కోవాలి. అంతేనా మిసెస్ రిచర్డ్? పోర్టర్ అడిగాడు.అవును. మా వారికి అక్రమ సంబంధం ఉంటే నాకు ఋజువులు కూడా కావాలి పళ్ళు పటపట కొరికి చెప్పింది.ఇంకేదైనా కారణం కూడా కావచ్చు. ఇన్సూరెన్స్ ఏజెంటో, సేల్స్ మేనో... మీ పేరు? అడిగాను.టెర్రీ. ఊహాగానాలు వద్దు. అతనెవరో కనుక్కుని చెప్పాల్సిన బాధ్యత మీది ఆమె ఉగ్రంగా చెప్పింది.

అలాగే. మీ వారి ఫొటో తెచ్చారా? ఆ. డిటెక్టివ్ కథలు చదువుతూంటా కాబట్టి, ఇది అడుగుతారని తెలుసు. అతని వయసు నలభై ఒకటి. ఎత్తు ఐదడుగుల ఆరున్నర అంగుళాలు. ముందు భాగంలో బట్టతల మొదలైంది. అరవై రెండు కిలోల బరువు. నీలం రంగు కండ్లు. బంగారు రంగు జుట్టు హేండ్ బ్యాగ్‌లోంచి రిచర్డ్ ఫొటో ఉన్న కవరును తీసిస్తూ చెప్పింది.రిచర్డ్ ఎక్కడ పని చేస్తారు? అడిగాను.గుడ్‌మేన్ ఆఫీస్ సప్లయిస్‌లో సేల్స్‌మన్. కాబట్టి, ఆఫీస్‌లోనే కూర్చోకుండా బయట తిరిగే ఉద్యోగం. నన్ను మోసం చేసి ఎవరూ ఇంతదాకా తప్పించుకోలేదు. నా జీవితంలో కొన్ని నెలలు నేను కోర్ట్ హాల్స్‌లోనే గడిపాను. చాలామంది కోర్ట్ ద్వారానే పాఠాలు నేర్చుకున్నారు ఆ మాటలు చెప్పే ఆమె పెదవులు కోపంతో వణికాయి.లేరీ ఫోన్ కాల్స్ గురించి రిచర్డ్ ఏమన్నారు? అడిగాను.తనకే లేరీ తెలీదని బుకాయిస్తున్నారు. లేరీ ఎవరో తెలిస్తే మా వారి ప్రియురాలి వివరాలు కూడా బయటకి వస్తాయి.అతనికి నిజంగా ప్రియురాలున్న పక్షంలో.. చెప్పాను.అందులో ఎంతమాత్రం సందేహం లేదు. మా పొరుగింటామె మిసెస్ మార్టిన్ మా వారిని ఓ రెస్టారెంట్లో మరో అమ్మాయితో కలిసి లంచ్ చేస్తుండటం చూసిందిట నా వంక చిరాగ్గా చూస్తూ చెప్పింది.బిజినెస్ లంచ్ అయి ఉండచ్చు సూచించాను.మా వారు సేల్స్‌మన్. ఎగ్జిక్యూటివ్ కాదు, ఎవరితోనో బిజినెస్ లంచ్ చేయడానికి.సరే. అది మన పరిశోధనలో అంతా బయట పడుతుంది. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా లీ? పోర్టర్ తను రాసుకున్న కాగితాన్ని చింపి నాకిచ్చి అడిగాడు.లేవు సర్. నేను బయటకి వస్తుంటే ఆమె హేండ్‌బ్యాగ్ తెరచి చెక్ బుక్ బయటకి తీసింది.నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన నాకో ప్రత్యేక టెలీ లెన్స్‌గల కెమేరాని కూడా ఇచ్చాడు.

టెర్రీ ఊహ తప్పయి, లేరీ, రిచర్డ్ ఏవో చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే భాగస్వాములని, అతన్ని రిచర్డ్ మోసం చేసి ఉండవచ్చని అనుమానించాను. రిచర్డ్‌కి నిజంగా ప్రియురాలు ఉండి ఉంటే ఆమెని కనిపెట్టడానికి కనీసం వారం పట్టవచ్చని అనుకున్నాను.మర్నాడు ఉదయం మిల్ స్ట్రీట్‌లోని తన ఇంట్లోంచి ఓ చేతిలో కారు తాళం చెవితో, మరో చేతిలో బ్రీఫ్‌కేస్‌తో బయటకి వచ్చిన రిచర్డ్‌ని గుర్తు పట్టాను. నా కారులో అతని బ్యూక్ కారుని అనుసరించాను. అతను ఆ రోజు మెయిన్ స్ట్రీట్‌లోని ఆఫీస్‌లోనే గడిపాడు. మధ్యాహ్నం ఒంటరిగానే లంచ్ చేసాడు.డిటెక్టివ్ ఉద్యోగంలోని విసుగు వేసే భాగం వేచి ఉండటం. సాయంత్రం మళ్ళీ సరాసరి ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం మళ్ళీ అతని కారుని అనుసరించాను. ఐతే, అతను సరాసరి ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంకో రోడ్డులోకి మళ్ళాడు. సేల్స్‌కోసం కస్టమర్ దగ్గరకి వెళ్తున్నాడని నాకు అనిపించింది. అతని కారు ఓ ఇంటి డ్రైవ్‌వేలో ఆగింది. అతను కారు దిగి వెళ్ళి ఆ ఇంటి డోర్ బెల్ కొడుతుండగా నా కార్లోంచి ఫొటో తీసాను. ఓ ముప్పయి ఐదేళ్ళామె తలుపు తెరిచింది. వాళ్ళిద్దరూ లోపలకి వెళ్ళారు.పది నిమిషాలైనా అతను బయటకి రాకపోవడంతో నాకు టెర్రీ అనుమానం నిజమా అనిపించింది. సరిగ్గా నలభై ఐదు నిమిషాలకి తలుపు తెరచుకుంది. ఎర్రరంగు షార్ట్స్, కేవలం బ్రా మాత్రం ధరించిన బంగారు రంగు జుట్టుగల ఆమె, అతను చుంబించుకుంటుండగా అప్రమత్తంగా ఉన్న నేను చకచక ఫొటోలు తీసాను. నాకు పోర్టర్ నగదు బహుమతి ఇస్తాడని అనుకున్నాను.

పోర్టర్ ఆఫీస్‌కి రాగానే తన బల్లమీద ఉన్న ఫొటోలని చూసి చెప్పాడు.ఎక్స్‌లెంట్. టెర్రీకి ఫోన్ చేసి ఆమెని వచ్చి రిపోర్ట్‌ని తీసుకెళ్ళమని చెప్పు ఆదేశించాడు.మిస్టర్ పోర్టర్. నాకు ఇది సబబని అనిపించడం లేదు చెప్పాను.నా వంక ప్రశ్నార్థకంగా చూసాడు.టెర్రీ ఎలాంటి మనిషో మీకు తెలుసు. మదర్ థెరిసా ప్రేమమూర్తి అయితే ఈవిడ ద్వేషమూర్తి. ఈ సాక్ష్యాలు చూస్తే టెర్రీ అతన్ని హత్య చేసినా ఆశ్చర్యం లేదు. వాళ్ళని తమ అక్రమ సంబంధంతో ఆనందంగా ఉండనిద్దాం సార్ చెప్పాను.మిస్టర్ రిచర్డ్‌తో కాని, అతని ప్రియురాలితో కాని నీకు వ్యక్తిగత పరిచయం ఉందా? ఆయన నవ్వి అడిగాడు.లేదు సార్.మరి వారు ఆనందంగా ఉన్నారని ఎలా చెప్పగలుగుతున్నావు? ఈ క్షణంలో వాళ్ళు టెర్రీని హత్య చేసే పథకం వేయడం లేదని ఎలా చెప్పగలవు?హత్య మాట వినగానే నాకు కొద్దిగా భయం వేసింది.టెర్రీ చంపడానికి అర్హతగల వ్యక్తి మెల్లిగా చెప్పాను.తీర్పు చెప్పడానికి మనం ఎవరం? న్యాయదేవత ప్రతినిధులమా? మనకో పని అప్పగించబడింది. దాన్ని పూర్తి చేసి కేస్‌ని క్లోజ్ చేయడం వరకే మన బాధ్యత. తర్వాత వారి ప్రవర్తన మీద మనకి బాధ్యత లేదు.నా దగ్గర ఆయనకి నచ్చచెప్పడానికి ఇంకో పాయింట్ లేదు.వెంటనే టెర్రీకి ఫోన్ చేసి వచ్చి ఫొటోలని, రిపోర్ట్‌లని తీసుకెళ్ళమని చెప్పు.నేను సరే అనే దాకా పోర్టర్ నా వంక కన్నార్పకుండా ముఖం చిట్లించి చూస్తూనే ఉన్నాడు.

ఆమె కళ్ళల్లోంచి నిప్పులు రాలాయి.ఆహా! ఓ మోసగాడైన భర్త బండారాన్ని నువ్వు రంగుల్లో బయట పెట్టావు టెర్రీ ఆ ఫొటోల వంక తీక్షణంగా చూసి చెప్పింది.నేనేం మాట్లాడలేదు.అతన్ని, ఆ రసికప్రియని కలిసి నేను చూసేదాకా ఆగు. ఇది నమ్మమంటావా? కంప్యూటర్లో కొత్త కోర్స్‌కి శిక్షణ కోసం ఇవాళ ఆఫీస్‌లో మూడు గంటలు అదనంగా ఉండాలని ఫోన్ చేసి చెప్పాడు. అతని శిక్షణ ఎక్కడో అక్కడ... గొంతుకి అరచేతిని అడ్డంగా ఉంచి కత్తిలా రాసింది.నేనో గుటక వేసి అడిగాను.లేరీ ఫోన్ కాల్స్ మాటేమిటి?అదీ బయటకి వస్తుంది. అతనికి నా థాంక్స్ చెప్తాను. ఇంతకీ ఈమె ఎవరు?మిస్ మేలరీ. వాళ్ళకి ఎలా పరిచయమైందో నాకు తెలీదు. ఆమె ఓ డాక్టర్ దగ్గర రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్నది.ఆమె వెళ్ళాక, ఆమె చేయబోయే అఘాయిత్యం గురించి పోలీసులకి ఫిర్యాదు చేయాలని నేను పోర్టర్‌కి నచ్చచెప్పే ప్రయత్నం చేసాను. తన భర్తమీద తను చేయబోయే దాడిని వర్ణించిందని అభినయించి చెప్పాను.అది మన పని కాదు. చెప్పాగా. ఆమె చేసే దాంట్లో చట్టరీత్యాకూడా మన బాధ్యత లేదు. ఇంక ఈ కేస్ గురించి మర్చిపో. ఆ ఆరిజోనా జోన్స్ భార్య ఏమైందో, ఆమె తన క్రెడిట్ కార్డ్‌ని ఎక్కడైనా ఉపయోగించిందేమో కాస్త బ్రౌజ్ చెయ్యి ఆయన విసుగ్గా చెప్పాడు.చట్టాన్ని పక్కన పెడితే నైతికత మాటేమిటి సార్?ఆమె తన కోపాన్ని, ఆవేశాన్ని నీ ముందు వెళ్ళగక్కింది. అది దాచుకోలేని మొదటి షాక్ ప్రకంపనలు తప్ప నిజంగా ఆమె బెదిరించింది చేస్తుందని కాదు. తనా పని చేస్తే జరిగే పర్యవసానం ఆమెకి తెలీదనుకుంటున్నావా?రిచర్డ్, మిస్ మేలరీల మీద నాకు జాలి వేసింది.

రెండు రోజుల తర్వాత దినపత్రికలో భార్య పగతీర్చుకుంది అనే శీర్షికని, ఆ వార్తలో టెర్రీ ఫొటోని చూసాను. ఓ చేతిలో ఫ్రైయింగ్ పేన్, మరో చేతిలో బేస్‌బాల్ బ్యాట్‌తో వారి వెంట వీధిలో పరిగెత్తే ఆమె ఫొటో అది. నేపథ్యంలో మేలరీ ఇల్లు కనపడుతున్నది. ఆ ప్రేమికులు ఇద్దరూ దాదాపుగా నగ్నంగా ఉన్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు ఆమె చేసింది సబబే అనే సమర్థింపుని పత్రికా విలేకరులు సేకరించి ప్రచురించారు. ఆ పరిస్థితిలో వాళ్ళెంత అవమాన పడ్డారో తలచుకుంటే బాధగా అనిపించినా, ఆ అక్రమ ప్రేమజంట జీవించే ఉన్నందుకు నేను సంతోషించాను.ఆర్నెల్ల తర్వాత నాకు టెర్రీ ఓ రెస్టారెంట్‌లో మరో మగాడితో తారసపడింది. నేనామెని పలకరించలేదు కాని, ఆమె నన్ను చూసి తన దగ్గరకి పిలిచింది.ఈమే లీ ఆమె తన పక్కన కూర్చున్న మగాడికి నన్ను పరిచయం చేసింది.హలో. థాంక్స్ లీ. లేదా నేను టెర్రీలాంటి మంచి భార్యని కలుసుకునేవాడిని కాను అతను చెప్పాడు.రిచర్డ్‌కి, నాకు నెల క్రితం విడాకులు మంజూరయ్యాయి. టోనీకి, నాకు వారం క్రితం పెళ్ళయింది టెర్రీ నవ్వుతూ చెప్పింది.లేరీ మాటేమిటి? అడిగాను.ఓ! అతను తర్వాత ఫోన్ చేసి తను ఇంకో రిచర్డ్‌కి ఫోన్ చేయబోయి మా ఇంటికి చేసానని, ఆ రిచర్డ్ మా వారు కాదని, తను పడవలని అమ్మే కంపెనీలో సేల్స్‌మన్ అని చెప్పాడు ఆమె వివరించింది.నాకా ఉద్యోగం నచ్చక పోర్టర్ దగ్గర మానేసి ఓ క్రిమినల్ లాయర్ దగ్గర చేరాను.

(లిండా ఇవాన్స్ కథకి స్వేచ్ఛానువాదం)  

మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo