ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Feb 02, 2020 , T01:40

స్వీట్ బాక్స్

స్వీట్ బాక్స్

నిజామాబాద్ రావడం ఇదే మొదటి సారి. ఇక్కడి వాతావరణం చాలా వైరుధ్యంగా ఉంటుంది. అన్ని సీజన్లూ తీవ్రతలో కాస్త ఎక్కువే. అంటే తీవ్ర గ్రీష్మ ఋతువు, తీవ్ర వర్ష ఋతువు, తీవ్ర శిశిర ఋతువు.. వేసవిలో తీవ్రమైన గాడ్పులు.. ఉదయం పది గంటలకే మధ్యాహ్నపు ఒంటిగంటకు ఉండేంత తీవ్రమైన ఎండ. అలాగే వర్షం, అలాగే చలీ.. వచ్చిన కొత్తలో వాతావరణంలోని మార్పులకు, బ్యాంకులోని విపరీతమైన రద్దీకి, ఎడతెగని పని వత్తిడికీ ఎంతో భయపడినా ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది.

బయట హోరున వాన! ఉరుముల సవ్వడి. అయితే ఆ శబ్దాన్ని మించిన రణగొణధ్వని మా బ్యాంకు లోపల. అరవై సంవత్సరాలు దాటిన వృద్ధురాళ్ళే అక్కడున్న ఖాతాదారులంతా. కౌంటర్లకి అటు పక్కన నేలమీద కూర్చున్నారు వాళ్ళ వంతుకై నిరీక్షిస్తూ. ఇంచుమించు యాభై మంది వరకూ ఉంటారు.వర్షం రావడం వల్ల గానీ, లేకపోతే వారి సంఖ్య మూడువందలకి పైగా ఉంటుంది. ప్రతీ నెలా ఒకటో తారీఖు నుంచి పదవ తారీఖు వరకూ వాళ్ళకి పెన్షన్ పేమెంట్లు ఉంటాయి. వీరంతా ఒకప్పుడు బీడీ కార్మికులు. ఈ నిజామాబాద్ జిల్లాలో ప్రతీ ఇంట్లోని స్త్రీలంతా చేసేది ఒకటే పని. కంపెనీ వారిచ్చిన తునికాకు, పొగాకు పొడి తీసుకుని బీడీలు చుట్టి ఆ కంపెనీకి ఇవ్వడం. ప్రతీ బాలికకూ చిన్నప్పటి నుంచే ఇలా బీడీలు చుట్టడంలో తల్లులు శిక్షణ ఇస్తారు. ఈ మహిళా కార్మికులకు కంపెనీల నుంచి దక్కేది మాత్రం చాలా తక్కువ. వెయ్యి బీడీలకు రెండు వందల రూపాయల లోపలే. ఇంట్లోని మగవాళ్ళు ఎన్నిపనులు చేసినా చాలా సంసారాలు నడిచేది మాత్రం మహిళల చేతి కష్టం మీదనే అంటే అతిశయోక్తి కాదేమో.వయసు మీరిన బీడీ కార్మికులకు పెన్షన్ జాతీయ బ్యాంకుల ద్వారా పొందే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పాపం ముదివగ్గులైపోయిన ఈ వృద్ధురాళ్ళంతా చుట్టుపక్కల ఊళ్ళనుంచి కూడా నెలనెలా పెన్షన్ కోసం వస్తూ ఉంటారు. ఉదయం ఎనిమిది, ఎనిమిదిన్నరకే బ్యాంకుకి వచ్చి బయట కూర్చుంటారు. తలుపులు తెరవగానే వాళ్ళు కూడా మాతో పాటే లోపలికి వచ్చి, కూర్చుంటారు టోకెన్లు తీసుకుని. అసలు నిశ్శబ్దంగా ఉండలేరు. ఇక్కడే నెలకోసారి కలుసుకుంటూ ఉంటారేమో ఏవేవో కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. మేనేజర్‌గారు ఆయన క్యాబిన్‌లో ఎవరో పెద్ద కస్టమర్లతో బిజీగా ఉన్నారు. కౌంటర్లలో ఆఫీసర్లు, క్యాషియర్లూ బిజీగా ఉన్నారు. ఉపశాఖాధికారిగా చెక్కులూ, విత్‌డ్రాయల్స్ పాస్ చేస్తూ నేనూ బిజీగానే ఉన్నాను. ఒక్కరి వేలిముద్రా స్పష్టంగా లేదు. పాస్‌బుక్కులలో ఫొటోలు లేవు. అలాంటి కేసెస్‌లో టోకెన్ నంబర్‌తో వాళ్ళను పిలిచి ముఖాలు చూసి, ఆధార్‌కార్డ్ ఉందో లేదో అడిగి, పాస్‌బుక్ మీద ఫొటో అతికించి, బ్యాంకు రబ్బర్‌స్టాంపు వేయించుకోవాలని చెప్పి, మళ్ళీ వేలిముద్ర వేయించుకోవలసి వస్తుంది. 

టీ కుర్రాడు వచ్చి టేబుల్ మీద టీకప్పు పెట్టడంతో చేస్తున్న పనికి విరామం ఇచ్చి, టీ తాగి ఆ డిస్పోజబుల్ కప్‌ను చెత్తబుట్టలో వేసి ఇటు తిరిగేసరికి ఎదురుగా ఓ ముసలవ్వ, అరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుందేమో ఆమెకు. దీనంగా నావైపే చూస్తూ నిలబడి ఉంది. వంగిపోయిన నడుము, కొద్దిగా మాసిన తెల్లచీర, జాకెట్టు, పాతబడిన కళ్ళజోడు, ముడుతలు పడుతున్న ముఖం, వేలిముడి వేసిన నాలుగు పోచల జుట్టు..చటుక్కున గుర్తు వచ్చేసింది.. ఈమె పేరు గంగవ్వ. రెండు నెలల నుంచీ ప్రతీ నెలా వచ్చి తనకు పెన్షన్ వచ్చిందో లేదోనని పాస్‌బుక్ చూపించి అడుగుతున్నది. జర సూడవ్వ, నా పైసలు వడినయో, లేవో.. పాసుబుక్‌ని నా చేతికిచ్చి నిలబడింది.సిస్టమ్‌లో ఆమె ఖాతాను చెక్‌చేసి, లేదవ్వా, ఈ నెల కూడా పడలేదు అన్నాను పుస్తకం అందిస్తూ.రాలేవ బిడ్డ? ఎట్ల మల్ల? దీనంగా అడిగింది.మరోసారి అకౌంట్ చూడగానే ఆశ్చర్యం కలిగింది. చాన్నాళ్ల నుంచి పడట్లేదు కదవ్వా? బ్యాంకులో అడగలేదా? అన్నాను.అర్సుకున్న బిడ్డ. ఊర్కిబోయిన ఆర్నెల్లు. మూణ్ణెల్లసంది తిర్గబడ్తిని, పైసల్ వడలేదని చెప్పుడే గాని ఎంద్కు వడలేదో చెప్పెటొళ్ళు లేరు..సరే అవ్వ, చూస్తున్నావు కదా, ఎంత రద్దీగా ఉన్నదో, నువ్వు పదో తారీఖు తర్వాత వస్తే వివరంగా మాట్లాడతాను.. అనునయంగా చెబుతూనే పేమెంట్లు పాస్ చేయసాగాను. మా ఊర్కిబోనికి కూడ పైసల్లేవవ్వ.. అంది కన్నీరు పెట్టుకుంటూ. నాకేం చేయాలో తోచక బ్యాగ్‌లోంచి వందరూపాయల నోటు తీసి అందించాను.ఒద్దు బిడ్డ, నా పైసల్ నాకొచ్చే తొవ్వ సూడు మల్ల.. అంది.చూస్తానులేమ్మా, పదకొండో తారీఖున సాయంత్రం నాలుగు తర్వాత రా.. ఉండనీ నీ పైసలు వచ్చాక ఇద్దువులే.. అన్నాను. నీ కాల్మొక్కుత బిడ్డ.. అనుకుంటూ వెనుతిరిగింది గంగవ్వ.ఆ వేళ పనంతా పూర్తయి ఇంటికి వెళ్ళాక కూడా ఆమె దీనవదనమే గుర్తుకువచ్చింది.

సాధారణంగా ఎంత పనివత్తిడిలోవున్నా నేను కస్టమర్లను కసురుకోను. సాధ్యమైనంత వివరంగా మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నిస్తాను. ఎప్పుడైనా నా గొంతు పరుషంగా వినిపించిందంటే అవతలి వ్యక్తి నన్ను చాలా విసిగించి ఉంటారని మా బీయమ్‌గారు అంటూ ఉంటారు. నా సర్వీస్‌లో చాలా భాగం భాగ్యనగరంలోనే గడిచింది. మధ్యమధ్యలో బయటికి వెళ్ళినా మహబూబ్‌నగర్ జిల్లాకో, వరంగల్ జిల్లాకో వేసేవారు. నిజామాబాద్ రావడం ఇదే మొదటి సారి. ఇక్కడి వాతావరణం చాలా వైరుధ్యంగా ఉంటుంది. అన్ని సీజన్లూ తీవ్రతలో కాస్త ఎక్కువే. అంటే తీవ్ర గ్రీష్మ ఋతువు, తీవ్ర వర్ష ఋతువు, తీవ్ర శిశిర ఋతువు.. వేసవిలో తీవ్రమైన గాడ్పులు.. ఉదయం పది గంటలకే మధ్యాహ్నపు ఒంటిగంటకు ఉండేంత తీవ్రమైన ఎండ. అలాగే వర్షం, అలాగే చలీ.. వచ్చిన కొత్తలో వాతావరణంలోని మార్పులకు, బ్యాంకులోని విపరీతమైన రద్దీకి, ఎడతెగని పని వత్తిడికీ ఎంతో భయపడినా ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఇంకో ఆరు నెలల్లో ఇక్కడ నాకు చేయవలసిన మూడేళ్ళ సర్వీసు పూర్తి అయి హైదరాబాద్‌కి పోస్టింగ్ వచ్చేస్తుంది.

పదకొండో తారీఖు వచ్చినా ఈ సారి రద్దీ తగ్గలేదు. పెన్షన్లు ఇస్తూనే ఉన్నాము. లంచవర్ ముగియగానే ఉన్నట్టుండి మా బీయమ్ సర్ లోపలికి పిలిచి, మాధురీ, పెన్షనాఫీస్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా. ఈరోజేదో మీటింగ్ ఉందట. మన బ్యాంకు తరఫున నిన్ను పంపిద్దామని అనుకుంటున్నాను. సాయంత్రం నాలుగింటికే మీటింగ్. నాకు జోనలాఫీస్‌లో పనుంది. నేను కౌంటర్ క్లోజ్ చేసి, అక్కడికి వెళతాను. నువ్వు మీటింగ్‌కి వెళ్ళిరా.. అని చెప్పారు.నేను గబగబా పని ముగించుకుని మీటింగ్‌కి వెళ్ళిపోయాను. అక్కడ పీయఫ్ ఆఫీసులో (మా బీడీ కార్మికుల పెన్షన్ ఆఫీసు) నగరంలోని బ్యాంకర్లకు, అక్కడి అధికారులకు మీటింగ్ జరిగింది. నిజానికి ప్రతీనెలా జరిగే మీటింగ్‌కి మా మేనేజర్‌గారే వస్తారు. మీటింగ్ ఫార్మలే. మినిట్స్ బుక్‌లో సంతకాలు అయ్యాక అందరికీ చాయ్‌లు తెప్పించారు. కొంతమంది కో-బ్యాంకర్లు పరిచయమయ్యారు. అక్కడి సిబ్బంది కొంతమంది కూడా దగ్గరకు వచ్చి పలకరించారు. మాధురీ మేడమ్ మీరేనా? ప్రతీ నెలా మీతో ఫోన్‌లో మాట్లాడే మహేష్ నేనే.. బాగున్నారా? అని నవ్వుతూ పలకరించాడతను. నేనూ నవ్వి, అతని పర్సనల్ నంబర్ తీసుకున్నాను, నా నంబర్ అతనికిచ్చి. అప్పటికే ఆరున్నర దాటింది. అందరి దగ్గరా సెలవు తీసుకుని ఇంటిముఖం పట్టాను.

మర్నాడు నేను బ్యాంకుకి వెళ్ళేసరికే వరండాలో ఎదురుచూస్తున్న గంగవ్వ నా వెనుకే లోపలికి వచ్చింది.ఎప్పుడు వచ్చావు అవ్వా, బాగున్నావా? ఆదరంగా పలకరించాను.నిన్న రమ్మంటివిగ బిడ్డ, అచ్చిన. నువ్వు లేకుంటివి.. అంది.అయ్యో, అవును కదా, మీటింగ్‌కి పోవలసి వచ్చింది అవ్వా.. మరి మీ ఊరికి వెళ్ళి వచ్చావా?పోలె బిడ్డ పైసల్లేవు నా తాన. నీకుగిట్ల సౌ రూపయ ఇవ్వబడితిని. గీడనె మా యారాలుంటే ఆమింట్ల పండిన. ఇగ నీతోని మాట్లాడినంక బోదమని ఊకున్న. జర చూస్తవావ్వ నా పైసల్కత?సరే అవ్వా చూస్తా.. కొంచెం సేపు కూర్చో.. నందూ ఒక చాయ్ తెప్పించి ఈమెకిప్పించు అని పురమాయించి, నేను క్యాషియర్‌తో కలిసివెళ్ళి సేఫ్ తెరిచి, ఆయన క్యాష్ తీసుకుని తన కౌంటరుకి వచ్చిన తరువాత సిస్టమ్ తెరిచి, తన అకౌంట్ చూశాను. సరిగ్గా కిందటి జనవరి నుంచి పెన్షన్ ఆగిపోయిందామెకు. అంటే సరిగ్గా ఇప్పటికి ఇరవై నెలలు.నాకు లీలా మాత్రంగా ఒక అనుమానం తోచింది. కౌంటర్ చూస్తూనే గంగవ్వను పిలిచి నా టేబుల్ ఎదురుగానున్న కుర్చీలో కూర్చోమన్నాను. బిడియపడుతూనే ఒదిగి కూచుంది. తిన్నావా అవ్వా ఏమైనా? అనుమానంగా అడిగాను.రాగిజావ తాగిన బిడ్డ నువ్వు తిన్నవా? అమాయకంగా అడిగింది.తిన్నానవ్వా మరి నువ్వు బతికున్నట్టు సర్టిఫికేటిచ్చావా? ఇచ్చిన్నవ్వఎప్పుడు, మొన్నటి దీపావళికాక, అంతకు ముందు దీపావళికి ఇచ్చి ఉండాలి కదాఇచ్చిన్నవ్వ. ఇచ్చినంకే మా సెల్లె సచ్చిపొయ్యిందని నిర్మలెల్లిపోయిన. గాడనే ఉన్న. గిప్పుడు ఊరికచ్చిన. నా కొడ్కు పైసల్ తీస్కరమ్మంటే బేంకికి మస్తు సార్లొచ్చి అడిగిన అవునా? అంటూనే పీయఫ్ ఆఫీసు మహేష్ మొబైల్‌కి కాల్ చేశాను.గంగవ్వ పీపీవో నంబర్ చెప్పి, పెన్షన్ ఆగిపోయిందని కాస్త చూడమని రిక్వెస్ట్ చేసాను.

మళ్ళీ చెబుతానని కాల్ కట్ చేశాడతను.గంగవ్వ తన కష్టాలు చెప్పుకోసాగింది. చెల్లెలి కూతురు దగ్గర ఉండి వచ్చిందట. నిజామాబాద్‌కి గంట దూరంలో ఉండే కొడుకు దగ్గరకి వచ్చేస్తే కోడలికి అత్త ఉండడం ఇష్టం లేదుట. ముసలిదానికి తిండి పెట్టడం దండగని విసుక్కుంటుందట. పెన్షన్ పైసలు పట్టుకురమ్మని ఆర్డర్ వేసిందట. ఇంతాచేసి నెలకు పెన్షన్ కేవలం మూడువందలు. ఇవన్నీ వింటుంటే చాలా బాధ కలిగింది నాకు. ముసల్ది కన్న కొడుకు కావాలి, అతని తల్లి వద్దు! అయ్యో కోడళ్ళంతా ఒక్కలాగే ఆలోచిస్తారెందుకో? ఎన్నాళ్ళో బతకని ముసలి ప్రాణాన్ని కాస్తంత ఆదరంగా చూస్తే ఏమైపోతుంది. తన బిడ్డల్లో బిడ్డలాంటిదే కదా.మొబైల్ మోగటంతో చటుక్కున ఆన్సర్ చేశాను. మహేష్ చెప్పాడు, లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్లే పెన్షన్ ఆగిపోయిందని.ఇప్పుడు లేటెస్ట్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకుని, పంపిస్తే రెగ్యులరైజ్ అవుతుందా మహేష్? ఆరాటంగా అడిగాను.అవుతుంది మేడమ్. ఆమె దగ్గర ఒక లెటర్ కూడా తీసుకోండి, ఎప్పటి నుండి పెన్షన్ రావడం లేదో ఆ నెల నుంచీ పెన్షన్ ఇప్పించమని రాయించి, మీ నుంచి రికమెండ్ చేస్తూ పంపించండి. నేను పని అయ్యేలా చూస్తానుథాంక్స్ మహేష్ నింపిన లైఫ్ సర్టిఫికేట్ మీద ఆమె వేలిముద్ర వేయించి, సర్టిఫై చేసి, మరొక అర్జీ రాసి దాని మీద కూడా వేలిముద్ర వేయించాను. ఇకవెళ్ళి, వచ్చే నెలలో రా నేను ఆఫీసు వాళ్ళతో మాట్లాడి పైసలు వచ్చేలా చూస్తాను అన్నాను. పొమ్మంటవ బిడ్డ లేచింది గంగవ్వ. ఆమె కళ్ళలో నిస్సహాయత. నాకు అర్థమైంది. ఆమె పరిస్థితికి చాలా బాధ కూడా కలిగింది. మళ్ళీ మరొక వంద నోటు తీసి ఆమె గుప్పిట్లో పెట్టాను. కళ్ళనీరు నింపుకొని వెనుతిరిగింది. అప్రయత్నంగా నా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి.మరుసటి నెల పెన్షన్ స్క్రోల్స్ రాగానే గబగబా గంగవ్వ పీపీవో నంబర్‌తో వెదికాను. నా ముఖం పత్తిపువ్వులా విప్పారటం నాకే తెలిసింది.మేడమ్, మీ అవ్వకి పెన్షన్ వచ్చిందా? మా కొలీగ్ సందీప్ అడిగాడు. నవ్వుతూ అవునన్నట్టు తల ఊపాను. ఏరియర్స్‌తో కలిపి, ఆరువేల ఆరు వందలు. ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు. నాకు ప్రమోషన్ వచ్చినా ఇంత సంతోషం, సంబరం కలిగి ఉండేది కాదు! వెంటనే మహేష్‌కి ఫోన్ చేసి, థాంక్స్ చెప్పాను అతను చేసిన సహాయానికి. 

నేనెంతగానో ఎదురు చూస్తుంటే నాలుగో తారీఖున వచ్చింది గంగవ్వ.ఆమె రాగానే అంత రద్దీలోనూ, పని ఆపేసి, నేనే ఆమెకు ఎదురు వెళ్ళాను. రావ్వా, నీకు పైసలొచ్చినయ్ సంతోషంగా చెప్పాను. గంగవ్వ గాజు కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపు. అవ్వా (ఔనా) బిడ్డ? అచ్చినయ్య నా కాతల వడ్డయా? అవునవ్వా నీకు ఆరువేల ఆరువందలు వచ్చినయ్. పైసలెన్ని రాయించుకుంటవో రాయించుకో.. నందూ, ఈమెకి కాస్త హెల్ప్ చెయ్యి. విత్‌డ్రాయల్ రాసిపెట్టు వేలిముద్ర వేయించు పురమాయించి, పని కొనసాగించాను.ఈలోగా గంగవ్వ విత్‌డ్రాయల్ నా దగ్గరకు వచ్చింది. ఐదువేల ఐదు వందలకి రాయించుకున్నట్టుంది. వెంటనే పాస్ చేసి, క్యాష్ కౌంటర్‌కి పంపించాను.మరో పది నిమిషాలకి నా దగ్గరకి వచ్చింది గంగవ్వ.సంతోషమేనా అవ్వా? అడిగానామెను.సల్లగుండాలవ్వ నువ్వు. మస్తు కుష్ అయ్యుండె నాకు. ఈ పైసల్ తీస్కెల్లి నా కోడలికిస్త. ఎవరికో బాకున్నదంట (బాకీ ఉన్నదట) సరేనవ్వ, పోయిరా అన్నాను. ఇద్గొ బిడ్డ నీ దో సౌ రెండు వంద కాగితాలు అందించబోయింది. వద్దవ్వా.. ఉంచు.. ఫరవాలేదు.. నీ బిడ్డలాంటి దాన్ని. ఇలా అప్పు తీర్చెయ్యనక్కరలేదు. పండ్లు కొనుక్కుని తిను మృదువుగా చెప్పాను. తీస్కొవ్వా గింత సాయంజేసినవ్ గంతె సాలు. మల్ల నాకు పైసల్ గావలంటె ఇచ్చెడిది నువ్వేగా అంటూ బలవంతంగా నా చేతిలో డబ్బుంచి సంతోషంగా బయలుదేరింది.

అది మొదలు ప్రతీ నెలా పెన్షన్ పైసలకు వచ్చినప్పుడు నన్ను కలవకుండా వెళ్ళేది కాదు గంగవ్వ. కోడలు ఆమెకు కొత్త బట్టలు కొనిచ్చిందేమో, తెల్లనివే అయినా మంచివే కట్టుకుని వచ్చేది. రోజులు వేగంగా గడుస్తున్నాయి. చూస్తూండగానే ట్రాన్స్‌ఫర్ సీజన్ వచ్చేసింది. నాకు హైదరాబాద్‌కి బదిలీ అయింది. నెలాఖరుకు రిలీవ్ అవ్వమంటే ఒక్క ఐదు రోజుల తరువాత రిలీవ్ అవుతానని మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేశాను. నా స్థానంలో పోస్ట్ చేసిన ఆఫీసర్ కూడా ఇంకా రాలేదు. పెన్షన్ రద్దీని తట్టుకోలేమని తెలుసు కనుక మేనేజర్‌గారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. మూడవ తారీఖున వచ్చిన గంగవ్వకు గేటు దగ్గరే నా బదిలీ వార్త తెలిసిందేమో, వచ్చీ రాగానే, ఏందవ్వ మాదురీ, ఐద్రబాదు పోతున్నవంటలే? అంది ఏడుపు గొంతుతో.అవునవ్వా ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా. మా సారూ, పిల్లలూ అక్కడ, నేనిక్కడ మా ఇంటికి పోవాలి కదా గంగవ్వా. అరె, ఏడవకు అయ్యో ఏడవకు అవ్వా అప్పటికే నా చేతులు పట్టుకుని ఏడుస్తున్న ఆమెను ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు.గింత మంచి మేనేజరవ్వవు నువ్వు ఎంత సాయం జేసినవ్ నాకు అందరు నీ యసుంటోల్లుంటె మా గరీబోళ్ళకి తక్లీఫులుండవ్ తియ్ అంది కళ్ళు తుడుచుకుంటూ.కాసేపు కూచో, పని తగ్గినాక మాట్లాడతాను  అన్నాను ఆమె భుజం తట్టి. మరో ఐదు నిమిషాల తర్వాత నా ముందు ప్రత్యక్షమైంది గంగవ్వ. ఆమె చేతిలో ఒక పేకెట్టు. తీస్కొ బిడ్డ అని నా చేతిలో పెట్టింది. తెరిచి చూస్తే అర్థకిలో స్వీట్స్ ప్యాకెట్. నాకు మతిపోయింది. ఇంచుమించు నూటేభై పెట్టి అంటే తన పెన్షన్‌లో సగం డబ్బు.. ఏమిటీ అభిమానం? ఎందుకీ వాత్సల్యం? తింటవ్ కదవ్వా? అనుమానంగా అడిగింది. తింటానవ్వా. తినకుండానే నా మనసు తియ్యగా అయిపోయింది బుగ్గలమీద కన్నీరు తుడుచుకోకుండానే ఆమెతో చెప్పి, నేనొక స్వీట్ నోట్లో పెట్టుకుని, మరొక స్వీట్ తీసి తినమని ఆమె చేతికిచ్చాను.నన్ను విడువలేక విడువలేక విడిచిపెట్టి వెళ్ళింది గంగవ్వ. మనసు భారమౌతూ ఉంటే సీటులో కూలబడి తిరిగి పనిలో నిమగ్నమయ్యాను. 

రచయిత పరిచయం

నండూరి సుందరీ నాగమణిది హైదరాబాద్. మహబూబ్‌నగర్ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రచన ఆమె అభిరుచి. 2010 నుంచి ఇప్పటి వరకు 160 కథలు, మూడు నవలలు రాశారు. వివిధ వార, మాసపత్రికల్లో ఇవి ప్రచురితం అయ్యాయి. వచన, పద్యకవిత్వంలో కూడా నాగమణికి ప్రవేశం ఉంది. సమాజంలో జరిగే సంఘటనల నుంచి ఉద్భవించేదే అసలైన సాహిత్యం అని, సాహిత్యం అనేది ప్రజాభివృద్ధికి చక్కని బాట వేయాలని కాంక్షిస్తున్నారు. 

-నండూరి సుందరీ నాగమణి , సెల్: 98499 89201


logo