గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Feb 01, 2020 , 22:18:33

పట్టుకు సరిపోయేట్టు!

పట్టుకు సరిపోయేట్టు!

పట్టుచీరలు మగువలు దాచుకునే నిధులు.. ఒక్కరోజు కోసం ఆ చీరలను దాచిపెట్టరు.. ఆరుగజాల ఆ చీరల అందం చెక్కు చెదరకుండా అట్టిపెడుతారు.. అంత భద్రంగా దాచుకున్న చీరలనే కాదు.. ఆ చీరను కట్టినప్పుడు మన అలంకరణ కూడా ముఖ్యమే.. మోడర్న్ అవుట్‌ఫిట్స్‌తో వివిధ ప్రయోగాలు చేయొచ్చు.. కానీ, పట్టుచీరకు తగ్గట్టుగా తయారైతేనే మ్యాజిక్ మొదలవుతుంది.. అదిరేలా మీ లుక్ ఉండేలాంటి ఇవి తప్పక పాటించండి..

మెడలో మెరిసెను.. 

మొదట చూడగానే చీరమీదకు చూపు వెళుతుంది. కానీ ఆ తర్వాత వెళ్లేది మాత్రం మెడ మీదకే! ధగధగలాడే నెక్లెస్, లాంగ్ చెయిన్‌లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. డార్క్ కలర్ చీరలు ఎంచుకున్నప్పుడు డైమండ్, స్టోన్ నెక్లెస్‌లను ఎంచుకోవాలి. ఒకవేళ చీర లైట్ షేడ్‌లో ఉంటే.. గోల్డ్ జువెలరీ బాగా నప్పుతుంది. యాంటిక్ జువెలరీని మాత్రం పండుగల సమయంలో ధరిస్తే బాగుంటారు. 


పువ్వుల్లో దాగున్న.. సంప్రదాయంగా కనిపించేందుకు పట్టు చీర ముఖ్యమే. కానీ దానికి పువ్వులు కలిస్తే ఆ అందమే వేరు. సింపుల్‌గా రెడీ అయి కూడా తలనిండా పువ్వులు తురుముకుంటే ఎంత ఖరీదైన నగ వేసినా కూడా దండుగే అన్నట్టు ఉంటుంది. ముందు నుంచే కాదు.. వెనుక నుంచి కూడా మీ చీరకు రెట్టింపు అందాన్నిస్తాయి. భుజాలను, మెడను కవర్ చేస్తూ పువ్వలు తురుముకొని ఒక్కసారి అద్దంలో ఓ లుక్కేయండి. 

మువ్వల సవ్వడి.. 

గాజుల గలగలతోపాటు మువ్వల సవ్వడి కూడా తప్పక ఉండాలంటున్నారు ఫ్యాషనిస్టులు. పండుగ.. ఫంక్షన్ ఏదైనా అందులో మీదే రాజ్యమనుకుంటే వీటిని తప్పక ధరించాల్సిందేనట. పట్టుచీరలో ప్రధాన ఆకర్షణగా నిలిచే వాటిలో పట్టీలు ప్రథమ స్థానం కాకపోయినా వీటిని మాత్రం వదలకూడదంటున్నారు. వెండి, బంగారు రంగులో ఉండే పట్టీలు మీ కాళ్లకి మరింత అందాన్ని తీసుకొస్తాయి. 

గలగల గాజులు.. 

గాజుల గలగల వినిపిస్తుంటే ఆ అందమే వేరు. ఏమైంది ఈ వేళ అంటూ కూనిరాగాలు తీయొచ్చు. అయితే.. ఈ పట్టుచీరల మీదకి గాజులు ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. మెడలో వేసుకునే నగలు, జుంకాలకు మ్యాచింగ్ ఉండేలా చూసుకోవాలి. లేకపోతే చీరకు తగ్గట్టుగా థ్రెడ్ బ్యాంగిల్స్ ఎంచుకోవడం కూడా మంచిదే. 

ఝుమ్మన్నాయి  జుంకాలు..


జుంకాలు సిల్క్ చీర మీదకు చాలా బాగుంటాయి. రకరకాల జుంకాలను పట్టుచీరల మీదకి ట్రై చేయొచ్చు. మెడలో వేసుకోకున్నా కూడా.. పెద్ద పెద్ద బుట్ట జుంకాలను ధరించొచ్చు. వీటికి ఇంకా ముత్యాలు, డైమండ్స్ జత కూడితే మరింత సూపర్‌గా మెరిసిపోతారు. 

చేతిలో ఇమిడేలా.. 

ఎంత మ్యాచింగ్ బ్లౌజ్.. నగలు ధరించినా చేతిలో పట్టుకునే పర్సు మీద పెద్దగా దృష్టి పెట్టరు. చీరకి మ్యాచ్ అయ్యే క్లచ్, పోట్లీ బ్యాగ్‌లు మీ పూర్తి లుక్‌నే మార్చేస్తాయి. ఇప్పుడు వచ్చే జరీ పర్సులు కూడా అన్ని రకాల చీరల మీదకి తగ్గట్టుగా మ్యాచ్ అవుతాయి. పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేందుకు ఇందులో పనికొచ్చే మేకప్ సామాన్లు జతచేసి.. అప్పుడుప్పుడూ టచప్స్ ఇస్తుంటే అందరి కళ్లు మీ మీదే ఉంటాయి. 

నుదుటన బొట్టు.. 

చిన్న చిన్న బిందీస్ పెడితే పట్టు చీర మీదకు అంత ఆనవు. అదే.. కనీసం పావలా సైజు కంటే కూడా ఎక్కువ సైజులో ఉంటే బాగుంటుంది. దాంట్లో కూడా స్టోన్, డిజైనర్ బిందెలు మరింత బాగుంటాయి. కాస్త డార్క్ కలర్ బొట్టు బిళ్లలు మీ ముఖ వర్చస్సును పెంచుతాయి. రకరకాల రంగుల కలయికతో బొట్లలో ప్రయోగాలు చేయొచ్చు. 

-సౌమ్య నాగపురి


logo