గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jan 27, 2020 , 18:48:02

పోరాటాలకు ప్రాణం పోసి.. పోరాడి ప్రాణం విడిచి..

 పోరాటాలకు ప్రాణం పోసి.. పోరాడి ప్రాణం విడిచి..

చీకటి నుంచి వెలుగులోకి రావడానికి మానవజాతి అనేక ఘట్టాలను ఎదుర్కొన్నది..అవాంతరాలను అడ్డు తొలగించుకొని, వివక్షను ఎదుర్కోవడానికి పోరాటాలు జరుగుతున్నాయి.ఇలా స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం సాగిన ప్రస్థానాలకు అహింసా మార్గాలను ఎంచుకొని సారథులుగా నిలిచిన వారిలో ప్రముఖంగా నిలిచింది గాంధీ, నెల్సన్ మండేలా..

భారతదేశంలో స్వాతంత్య్రం కోసం అహింసాయుత పథంలో నడిచింది గాంధీ అయితే..  ఆ పంథానే ఆదర్శంగా తీసుకొని దక్షిణాఫ్రికాలో వర్ణ సంకెళ్లు తెంపిన తిరుగులేని పోరాటం చేసిన ఆ చీకటి ఖండపు వెలుగు శిఖరమే  నెల్సన్ మండేలా...1948, దక్షిణాఫ్రికా..అప్పుడే దక్షిణాఫ్రికా నేషనలిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. పూర్తి వర్ణ వివక్ష విధానాలతో ఆ పార్టీ అధికారం చలాయించేది. అక్కడి తెల్ల, నల్ల జాతీయులను వేర్వేరుగా చూడడం ప్రధానంగా జరిగేది. అప్పటికే జాతి వివక్ష మీద పోరాటం చేస్తున్న నెల్సన్ మండేలా స్వాతంత్య్రోద్యమకారులతో పరిచయాన్ని పెంచుకున్నారు. వారితో పాటు ఆఫ్రికన్ కాంగ్రెస్, దక్షిణాఫ్రికా కమ్యూనిస్టు పార్టీ నేతలతో పరిచయాలను బలపరుచుకున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న జాతివివక్ష వ్యతిరేక ఉద్యమం మండేలాను ఆకర్షించింది.  

నేషనలిస్టు పార్టీ అధికారం తర్వాత పరిస్థితులు దారుణంగా మారాయి. ఆ ప్రభుత్వం జాతివివక్షను పతాక స్థాయికి తీసుకెళ్లింది. ఆ రాజ్యంలో జాతి వివక్షను ఏకంగా చట్టబద్ధం చేసింది. ఇంతటి దుర్మార్గ పరిస్థితులను  కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.  అప్పటికే నేషనల్ కాంగ్రెస్‌లో మండేలా కీలక నాయకునిగా మారారు. ఈ పరిస్థితులపై తిరుగుబాటు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు మండేలా.  ఇందులో భాగంగానే సమ్మెలు, పౌర సహాయ నిరాకరణ ఉద్యమాలు వచ్చాయి. మండేలా సారథ్యంలో నేషనల్ కాంగ్రెస్ పోరాటం, బహుళ జాతి కూటములు, కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రభుత్వంపై తీవ్ర తరమయ్యాయి. వీటిని సమూలంగా తుడిచిపెట్టడానికి నేషనలిస్టు ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించుకుంది. కమ్యూనిస్టులను అణచివేయడానికి ప్రత్యేక చట్టాన్ని 1950లో తీసుకొచ్చింది. ఆ తర్వాత 1953లో ప్రజాభద్రత చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ రెండు చట్టాలను ఉపయోగించి కమ్యూనిస్టులను, కాంగ్రెస్ సభ్యులను అరెస్టులు చేయడం ప్రారంభించింది. వివక్షాపూరితమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నెల్సన్ మండేలాతో పాటు 150 మందిని అరెస్టు చేసిందా ప్రభుత్వం. సుదీర్ఘ విచారణ తర్వాత షరతులతో విడుదల చేసింది. 

నేషనల్ కాంగ్రెస్ సభ్యునితో కలిసి రాజకీయ సలహా సంస్థను స్థాపించారు మండేలా. మరోవైపు ప్రభుత్వం  జాతి వివక్షా విధానాలు కొనసాగిస్తూనే ఉంది. దేశంలో ఎవరిని అడిగినా వెంటనే గుర్తింపు నిరూపించుకోవాలనీ, దానికి ఆఫ్రికన్లు అందరూ ప్రభుత్వ గుర్తింపు కార్డులు పొందాలనే చట్టాన్ని రూపొందించింది. దీనికి వ్యతిరేకంగా అక్కడ  పెద్ద ఎత్తున్న ఉద్యమం చెలరేగింది. ఈ ఉద్యమంలో భాగంగా 1960లో నిర్వహించిన ప్రదర్శనలో పోలీసు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 69 మంది నిరాయుధ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. జాతి దురహంకార వ్యతిరేక పోరాట సంస్థగా మండేలా కమ్యూనిస్టు పార్టీతో చేతులు కలిపారు. ఉమ్ ఖోంటో వి సిజ్వె (ఎంకే) పేరుతో సాయుధ పోరాట బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం తమ లక్ష్యాలను ఛేదించి తమ పోరాటానికి ప్రజా మద్దతును కూడగట్టుకుంది. దీనికి మరింత మద్దతు కోసం మండేలా ఆఫ్రికా మొత్తం పర్యటించారు. ఈ పర్యటన కొనసాగుతున్న 1962లో మండేలాను ప్రభుత్వం మరోసారి అరెస్టు చేసింది. తర్వాత మండేలాను విడుదల చేయాలన్న  పోరాటాలు బయట ఊపందుకున్నాయి. ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది. దిగివచ్చిన ప్రభుత్వం కొన్ని షరుతులను పెట్టింది. ఆయన తన హింసను, కమ్యూనిస్టులతో మిత్రుత్వాన్ని వదుల్కోవాలన్నది. దీన్ని మండేలా తిరస్కరించాడు. 1989లో జైలులో మండేలాకు క్షయా వ్యాధి సోకుతుంది. 

జాతి వివక్ష పోరాటాలతో అట్టుడుకుతున్న క్రమంలోనే దేశాధ్యక్ష పదవి మార్పు జరిగింది. నూతనంగా నియమితుడైన ఎఫ్‌డబ్ల్యూడి క్లార్క్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జాతివివక్షను కొనసాగించలేమని అన్నారు. 1990లో జైలులో ఉన్న మండేలాను విడుదల చేశారు. ఆయనతో పాటు ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ సభ్యులను, ఇతర కూటముల సభ్యులను విడుదల చేశారు. ఆ పార్టీలపై నిషేధాన్నీ ఎత్తివేశారు.  ఈ కారణంగా మరోవైపు జాతివివక్ష వ్యతిరేక ఉద్యమానికి కృషి చేసిన నెల్సన్ మండేలా ప్రజల నుంచి అపూర్వ స్పందన అందుకున్నారు. 1991లోనే నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తర్వాత ప్రభుత్వానికి, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు జరిగిన సుదీర్ఘ చర్చలు దేశంలో హింసకు తెరదించాయి. 1991లో మండేలాకు, క్లార్క్‌కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 1994లో దక్షిణాఫ్రికాలో మొదటిసారి ప్రజాస్వామ్య యుతమైన ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.  దేశంలో జాతి వివక్ష, జాతి అహంకార కార్యక్రమాలను రూపుమాపడానికి ఆయన కృషి చేశారు. 1999 నాటికి ఆయన తొలిపదవీ కాలం ముగిసింది. తర్వాత ఆయన వారసుడు బాధ్యతలు స్వీకరించాడు. మండేలా భార్యకు పదమూడేండ్లకే విడాకులిచ్చారు. దానికి ప్రధాన కారణం ఆయన నిరంతరం ఉద్యమంలో పాల్గొనడమే.. ఆ తర్వాత మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. తన 80వ పుట్టిన రోజున 1998గ్రీసా మాషెల్‌ను వివాహమాడారు. పెండ్లికి ముందు ఎన్నో దఫాలుగా చర్చలు సాగాయి. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని నిర్ణయించుకున్న మండేలా రాజకీయాలనుంచి విశ్రాంతి ప్రకటించారు. అప్పటినుంచి రకరకాల సాంఘిక, మానవ హక్కుల సంస్థలకు సలహాదారుడిగా పనిచేయడం ప్రారంభించారు. 

2001 నాటికి మండేలా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వున్నట్లు నిర్ధారణ అయింది. రేడియేషన్ చికిత్స అందించారు. జూన్ 2004లో 85వ ఏట, ప్రజా జీవనం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు ప్రకటించారు మండేలా.  2003లో ఆయన మరణవార్తను ప్రముఖ ఇంగ్లిష్ చానెల్ ప్రసారం చేసింది.  కానీ అది తప్పు అని సరిదిద్దుకుంది. 2007లోనూ అలాంటి పొరపాటే మరో విధంగా జరిగింది. వాస్తవానికి మండేలా ఆ సమయంలో కుటుంబంతో కులాసాగా గడుపుతున్నారు. డిసెంబర్ 2012, మార్చి 2013,  అదే ఏడాదిలో తీవ్రమైన ఉపిరితిత్తుల వ్యాధికి గురయ్యారు. దీని సంబంధించిన తదుపరి పరీక్ష వైద్యపరీక్షలు, చికిత్స కోసం ఆస్పత్రి చుట్టూ తిరిగారు. వైద్య చికిత్సల తర్వాత ఆయన ఆరోగ్యంపై ఆందోళన తగ్గింది. జోహన్స్‌బర్గ్‌లోని ఆయన స్వగృహంలో, మధ్యలో ఆరోగ్యం కుదుటబడి, కోలుకున్నారు.  ఎప్పటికప్పుడు, ఆయన ఆరోగ్య పరిస్థితిని దక్షిణాఫ్రికా మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం, ఆందోళనతో గమనిస్తూ వచ్చింది. జాత్యహంకార శ్వేత జాతి పాలకుల గుండెల్లో నిద్రపోయి, నల్లజాతివారిపాలిట మహాత్ముడయ్యాడు నెల్సన్ మండేలా.  పండు ముదుసలి వయసులో సహితం, ఆయన కర్ర సహాయంతో నడుచుకుంటూ,  నిత్యం తాను అధ్యయనం చేసే గదిలోకి వెళుతుండేవాడు. అతికష్టం మీద మండేలా ఒక కుర్చీలో కూర్చుని, వెనుకకు వాలి, ఒక్కో కాలుని ఇబ్బందికరంగా పైకి లేపి, ఎదురుగా వుంచిన చిన్న బల్లపై పెట్టుకుని దీర్ఘాలోచనలో మునిగిపోయేవారు. ఆయన కుర్చీ పక్కనే, మండేలాను జైలులో నిర్బంధానికి గురిచేసిన జాత్యహంకారుల ఆంగ్ల, ఆఫ్రికన్ భాషల వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ఒక బల్లపై ఉండేవి. 2013 మార్చి నాటికి ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. మండేలా ఆరోగ్యంపై ప్రజల్లో కలుగుతున్న భయాందోళనలను ఆ దేశాధ్యక్షుడు ప్రకటనలతో నిలువరించాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మండేలా ఆస్ప్రతిలో చేరారు. మనం దేశంలో ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, సమాజం గురించి ఆయన దృష్టిని పునరుద్ఘాటిద్దాం.. ఇందులో ఎవరూ మరొకరిని దోపిడీ చేయొద్దు, అణచివేయొద్దు మండేలా నుంచి వచ్చిన చివరి సందేశం. సుదీర్ఘ కాలంగా శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతున్న మండేలా చివరికి 2013, డిసెంబర్ 5న జోహెన్స్ బర్గ్‌లో మరణించారు.  అప్పడు ఆయన వయసు 95 సంవత్సరాలు..

వినోద్ మామిడాల, సెల్: 7660066469


logo