గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jan 26, 2020 , 02:57:23

చక్కటి పథకం

చక్కటి పథకం

జీన్ తన సెడాన్‌లోని వెనుక సీట్లో తన వీకెండ్ బ్యాగ్‌ని పడేసింది. ఆ ఆదివారం చర్చ్‌కి వెళ్ళే కొద్దిమంది కార్లు తప్ప ఎప్పటిలా రద్దీ లేని రోడ్ ఖాళీగా ఉంది. వాతావరణం బాగా చల్లగా ఉంది. ఆమె ఓసారి ఆకాశంలోని మేఘాలని చూసి, కారు స్టార్ట్ చేసి దాన్ని టకోనిక్ పార్క్‌వే వైపు పోనిచ్చింది.కొద్దిసేపు రోడ్‌మీద ఒక్క ఆమె కారే ఉండటంతో వేగాన్ని పెంచి ఆ ప్రయోజనాన్ని ఉపయోగించుకుంది. ఆమె చేరాల్సిన వెర్మాంట్ గ్రామం ఐదు గంటల దూరంలో ఉంది. రోడ్‌మీద పరచుకున్న మంచువల్ల టైర్లు శబ్దం చేయడం లేదు. ఆమె కారు రేడియోని ఆన్ చేసింది. ఆ చలికాలంలోని అతి భయంకరమైన తుపాను వస్తున్నదని, అది రాత్రంతా కొనసాగవచ్చని న్యూస్ రీడర్ కంఠం చెప్పింది. ఆమె ఓ రెస్టారెంట్లో ఆగి, లంచ్ తిని, కొంత ప్యాక్ చేయించుకునేసరికి వెర్మాంట్‌కి బాగా దగ్గరకి చేరుకుంది. ఇప్పుడు ఆకాశం నిండా దట్టమైన నల్లటి మేఘాలు అలుముకొని వెలుగు బాగా తగ్గింది. కురిసే మంచు చినుకులు ఎగురుతూ కారు అద్దం మీద అలుముకోవడంతో విండ్‌షీల్డ్ వైపర్‌ని ఆన్ చేసింది. రెండు, మూడు సైన్ బోర్డ్‌లని చదివాక తను తప్పుదారిలో వచ్చానని గ్రహించి, కారుని వెనక్కి తిప్పుతూంటే కారు కదలకుండా ఇంజిన్ పెద్ద చప్పుడు చేయసాగింది. ఆమె సిగరెట్‌ని యాష్‌ట్రేలో ఆర్పేసి, ఇంజిన్‌ని న్యూట్రల్‌కి మార్చి కారు దిగి చూసింది. ఓ గోతిలో పడ్డ ముందు కుడిచక్రం కనిపించింది. ఆమె కారెక్కి దాన్ని రివర్స్‌లో వెనక్కి తీసే ప్రయత్నం చేసింది. కారు అంగుళం మాత్రమే కదిలి ఆగిపోయింది. చినుకులు ఆరంభమయ్యాయి. దిగి దాన్ని వెనక్కి తోసింది. కాని, గోతిలోంచి చక్రం బయటకి రాలేదు.ఆమె నిస్పృహగా చుట్టూ చూసింది. కొద్ది దూరంలో ఓ ఇంటి బయట ఆగి ఉన్న కారు కనిపించింది. దాని పక్కనే ఓ షెడ్. తల దాచుకోడానికి వెంటనే అటువైపు వేగంగా నడిచి తలుపు ముందాగి డోర్ బెల్ కొట్టింది. కొద్ది క్షణాల తర్వాత పొడుగ్గా ఉన్న నలభైల్లోని ఒకతను తలుపు తెరిచాడు. 


హలో. నా కారు చక్రం గోతిలో పడింది. నేను వెర్మాంట్‌కి చేరుకోవాలి. ఇంకో అరగంట ప్రయాణమే...అతను మొహంలో ఎలాంటి భావాలు లేకుండా నిశ్శబ్దంగా ఆమె వంకే చూస్తూండిపోయాడు.ఓసారి మీ ఫోన్‌ని ఉపయోగించుకోవచ్చా? మెకానిక్‌కి ఫోన్ చేసి పిలుస్తాను. మా ఇంట్లో ఫోన్ పని చేయడం లేదు అతను నెమ్మదిగా చెప్పాడు.క్షణకాలం అతను తలుపు మూసేస్తాడని ఆమెకి అనిపించింది. కాని, అంతలోనే అతను ఓ అడుగు వెనక్కి వేసి ఆమెని లోపలకి ఆహ్వానించాడు. ఆమె బూట్లకి అంటిన మంచు తుంపర్లని దులుపుకుని లోపలకి వెళ్ళింది. సరాసరి ఫైర్ ప్లేస్ దగ్గరకి వెళ్ళి తన చేతులతో చలి కాచుకుంది. మీ ఇల్లు చూసి నేను ఎంత ఆనందపడ్డానో మీకు తెలీదు. మంచు కప్పిన కారులో గడ్డ కట్టిన నా శవాన్ని రేపు ఎవరైనా చూస్తారనుకున్నాను. ఇది చాలా పెద్ద మంచు తుపాను అని రేడియోలో చెప్పారు చెప్పింది.అవును. బుద్ధున్న వాళ్ళెవరూ ఇవాళ బయటకి రారు అతను నెమ్మదిగా చెప్పాడు.నేను వీకెండ్‌కి మా అమ్మానాన్నలని చూట్టానికి వెళ్ళి తిరిగి నేను ఉద్యోగం చేసే ఊరికి వెళ్తున్నాను. ఇంట్లోంచి బయలు దేరినప్పుడు వాతావరణం ఇంత అధ్వాన్నంగా లేదు. దారిలో ఏదైనా హోటల్‌లో ఆగి ఉండాల్సింది కాని వెర్మాంట్‌కి తుపాను ఆరంభమయ్యే లోగా చేరుకోగలననే పిచ్చి ధీమాతో ఆగలేదు. నేను అక్కడ టీచర్‌గా పని చేస్తున్నాను.మొదటిసారి అతని మొహంలో కొంత ప్రసన్నత కనిపించింది.

నేనూ టీచర్‌గా పని చేసేవాడిని చెప్పాడు.మీ ఇరుగు పొరుగు ఇళ్ళల్లో ఫోన్ ఉంటుందా? నేను అక్కడ నుంచి ఫోన్ చేయవచ్చా? అడిగింది.ఇరుగు పొరుగులు ఎవరూ లేరు.ఈ తుపానులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేకపోయినా మీ సాయాన్ని అర్థిస్తున్నాను. దయచేసి నాతో వచ్చి నా కారుని గోతిలోంచి నెట్టడానికి సహాయం చేయగలరా? చీకటి పడకుండానే నేను మా ఊరు చేరుకుంటే రేపు ఉదయం స్కూల్‌కి వెళ్ళవచ్చు. ఆమె దృష్టి తెరచి ఉన్న ఓ గది తలుపులోంచి కనపడే మంచం మీద పడుకుని ఉన్న ఓ మనిషిమీద పడింది. దుప్పటిలోంచి బయటకి వచ్చిన బూట్లని బట్టి పడుకున్నది ఓ స్త్రీ అని గ్రహించి అడిగింది.

ఓ! ఎవరో నిద్ర పోతున్నట్లున్నారు?అవును. నా భార్య నిద్రపోతున్నది.మీరు చెప్పాల్సింది. నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. నా మాటలకి ఆవిడ లేవకపోవడం ఆశ్చర్యమే.క్లారా నిద్ర లేవదు అతను నెమ్మదిగా చెప్పాడు.జీన్‌కి చిన్న అనుమానం కలిగినా అంతలోనే అది సమసిపోయింది. నేను ఒక్క దాన్నే కారుని కదపలేక పోయాను. మీరు సహాయం చేస్తే..క్లారా నేను మంచులో బయటకి వెళ్ళడానికి ఇష్టపడదు అతను అడ్డు పడుతూ చెప్పాడు.కాని మీరు మంచులో ఉండేది కొన్ని నిమిషాలే. తీయగానే వెంటనే తిరిగి వచ్చేస్తారు.సరే. నేను రెయిన్ కోట్ తొడుక్కుని వస్తాను చెప్పి అతను హాల్లోని ఓ తలుపులోంచి లోపలకి వెళ్ళాడు. అతని కోసం వేచి ఉన్న జీన్ దుప్పటి కింద ఉన్న ఆ ఆకారం వంక చూసింది. తర్వాత షెల్ఫ్‌లోని పుస్తకాలని గమనించింది. ఓ పుస్తకం ఆమెని ఆకర్షించడంతో దాన్ని బయటకి తీస్తూంటే దాని పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ ఊలు బంతులున్న ఓ ఇత్తడి పాత్ర కిందపడి చప్పుడు చేసింది. ఆమె భయంగా దాన్ని తీసి యథాస్థానంలో ఉంచుతూంటే అతను లివింగ్ రూంలోకి వచ్చాడు.సారీ! మీ ఆవిడని లేపినట్లున్నాను క్షమాపణగా చెప్పింది.క్లారా గాఢనిద్ర పోతున్నది.కాని ఎంత గాఢనిద్రలో ఉన్నా మెలకువ వచ్చే శబ్దం అది.ఇద్దరి మధ్యా కొన్ని క్షణాల నిశ్శబ్దం. అతను తన వంక చూసిన చూపులోని అపరాధ భావాన్ని జీన్ గుర్తించింది.మీ ఆవిడ నిద్ర పోవడం లేదు. ఆవిడ మరణించింది కదా? ఠక్కున అడిగింది.మౌనంతో కూడిన అతని మొహంలోని బాధవల్ల తన ప్రశ్నకి సగం జవాబు దొరికినట్లుగా ఫీలైంది.పోయింది కొద్ది క్షణాల తర్వాత అతను బలహీనంగా చెప్పాడు.సారీ! మీకు సహాయం అవసరమైన సమయంలోనే నేను మిమ్మల్ని సహాయం అడిగాను. వెరీ సారీ. ఆమెని వదిలి మీరు బయటకి వెళ్ళలేరు. మీరు నా కారుని గుంటలోంచి బయటకి తీస్తే నేను వెళ్ళి గంటన్నరలో మీకు సహాయం తీసుకువస్తాను.

అతను బదులు మాట్లాడలేదు.మీ ఆవిడ చాలాకాలంగా జబ్బు మనిషా?అవును. చాలా కాలంగా... ఆవిడ గుండె బలహీనపడింది.అతను కిటికీలోంచి బయటకి, వేగంగా పడే మంచువర్షం వంక చూసాడు. ఎంత సేపైంది పోయి?ఆమె బయటకి షెడ్ దగ్గరకి వెళ్ళి ఎంత సేపటికి రాకపోతే నేను వెళ్ళి చూసాను...నేలమీద పడుంది. అవునా? జీన్ అడిగింది.అవును.వెరీ సారీ. ఇది జరిగి ఎంతసేపైంది?మీరు తలుపు కొట్టడానికి ముందే. అప్పుడే క్లారాని షెడ్లోంచి మోసుకువచ్చాను.కాని, నేను మీ ఇంట్లోకి వస్తూ మీ ఇద్దర్నీ చూడలేదు. షెడ్ తలుపు మూసి ఉంది.అతని చూపు ఆమెని గుచ్చింది. మరి కాసేపు నిశ్శబ్దం. ఆమె తీసిన పుస్తకాన్ని పట్టుకున్న అతని చేతి వేళ్ళు వణకడం గమనించింది.తనా మాట మాట్లాడకుండా ఉండాల్సింది అనిపించింది.సరే. మీరు రావద్దు. నేను వెళ్ళి ఎలాగో నా కారుని బయటకి తీస్తాను. నేను వెళ్ళి వెర్మాంట్‌నించి ఎవర్నయినా పంపిస్తాను. పోలీసులకి చెప్తే మీకు వాళ్ళు సహాయం చేస్తారు.పోలీసులా? అతను ఆమె దారికి అడ్డు నిల్చొని కఠినంగా అడిగాడు.తనా మాటలు కూడా మాట్లాడకుండా ఉండాల్సిందని అనిపించింది. తనని క్షేమంగా వెళ్ళనిస్తాడా అనే భయం జీన్‌కి కలిగింది.ఆమె సహజంగా చావలేదు. మీరు చంపారు కదా? సూటిగా అడిగింది.అవును. నేనే క్లారాని చంపాను అతని కంఠంలో తనొకటి సాధించానన్న గర్వం తొంగిచూసింది.దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. నేనీ సంగతి ఎవరికీ చెప్పను భయంగా, గట్టిగా అర్థించింది.అరవకు. గొంతు తగ్గించు. నీ కంఠం మృదువుగానే బావుంటుంది.అతను ఆమె వంక మొదటిసారి చూస్తున్నట్లుగా చూసాడు. ఐతే, అతను ఆమెని ఏం చేయలేదు. ఓ నిమిషం పాటు ఇద్దరూ నిశ్శబ్దంగా ఒకరి వంక మరొకరు చూసుకుంటూ నిలబడిపోయారు. మీరు నాకు హంతకుల్లా కనిపించడం లేదు. మీరు జోక్ చేస్తున్నారా? చివరకి నవ్వు పులుముకుని అడిగింది.

హంతకులు ఎలా కనిపిస్తారు? అతను ప్రశ్నించాడు.ఏమో? కాని, మీలా ఉండరు. ఆమెని... ఆమె గొంతు పిసికి చంపారా?లేదు. లేదు. గొంతు పిసికి చంపలేదు. దిండుతో అదిమి చంపాను. ఆమె దిండుతోనే.అతను జీన్ చుట్టూతా తిరిగి వెళ్ళి ఫైర్ ప్లేస్‌లోని ఇనుప పోకర్ని అందుకున్నాడు. ఐతే, జీన్ భయంతో ఎదురు చూసినట్లుగా దాంతో ఆమె తలమీద మోదలేదు. నిప్పుని సరి చేసి అడిగాడు.మీకు చలిగా ఉంది కదా? షెర్రీ కావాలా? కూర్చోండి.అతను మేంటెల్ మీది షెర్రీ సీసాని అందుకుని గ్లాస్‌లోకి వంచి ఆమెకి ఇస్తూ చెప్పాడు.

బావుంటుంది. తాగండి. క్లారాది. ఈ చలికి అది బావుంటుంది.రేపు ఉదయం నేను స్కూల్‌కి వెళ్ళకపోతే అంతా నా కోసం వెదుకుతారు నెమ్మదిగా చెప్పింది.షెర్రీ తాగుతూ ఇప్పుడు అతను తన విషయంలో ఏం చేయదలచుకున్నాడా అని జీన్ ఆలోచించింది. ఇద్దరినీ ఒకేచోట పాతుతాడా? తమ మధ్య మౌనం లేకపోతే అతను ఆ పథకాన్ని ఆలోచించలేడని అనుకుని అడిగింది.మీరు కూడా టీచర్ అన్నారు. ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు?ఇంకో ఊళ్ళోని స్కూల్లో. ఫిజిక్స్. క్లారాకి నా ఉద్యోగం నచ్చలేదు. ఆమెకి గుండెజబ్బు కూడా రావడంతో ఈ ఊరికి మారాం. నేను పొలం పని చేస్తున్నాను యథాలాపంగా చెప్పాడు.అతనికి తను మాట్లాడే టాపిక్‌మీద ఆసక్తి లేదని గుర్తించాక అతన్ని వేరే విషయాలు ఆలోచించనివ్వని ప్రశ్న వేసింది.ఆమెని ఎందుకు చంపారు?చాలా సంవత్సరాలుగా ఆ పని చేయాలని అనుకుంటున్నాను. అది నా కల. ఎన్నో పథకాలు వేశాను. కాని, ధైర్యం చాలక ఇంతదాకా చంపలేదు. అతని మాటల్లో కోపం కాని, పశ్చాత్తాపం కాని లేవు. కొద్దిగా విజయగర్వం తొంగిచూసింది.కాని, మీరు ఒకర్ని చంపి తప్పించుకోలేరు. నేను ఇప్పుడు రాకపోయినా అది బయట పడుతుంది. లేదా మీరామె మరణాన్ని... ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా... అలా అనుకున్నారా? ప్రమాదవశాత్తు జరిగిన మరణమా? అతను కొద్దిగా ఆసక్తిగా ముందుకి వంగి అడిగాడు.అవును. కాని అదీ పని చేయకపోవచ్చు... ఏమిటా వాసన? జీన్ అడిగింది.

వాసనా?గ్యాస్ వాసన. స్టవ్ ఆన్‌లో ఉన్నట్లుంది జీన్ భయంగా చెప్పింది.మా స్టవ్ లీకౌతున్నది. నేను గ్యాస్ కంపెనీకి మాకో కొత్త స్టవ్‌ని పంపమని చాలాసార్లు కోరాను.ఆ వాసన అతన్ని ఇబ్బంది పెట్టడం లేదని గ్రహించి అడిగింది.ఆ గ్యాస్‌వల్ల మీ ఆవిడ మరణం ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చూపించచ్చు. అప్పుడు ఎవరూ మిమ్మల్ని హంతకుడు అనుకోరు.ఎలా?నన్ను వెళ్ళనిస్తే చెప్తాను.ముందు చెప్పు గదమాయించాడు.సరే. మీ ఆవిడ ఇక్కడ నిప్పు పక్కన నేను కూర్చున్న రాకింగ్ ఛెయిర్లో కూర్చుని అల్లుతున్నది. షెర్రీ తాగడంతో కొద్దిగా మత్తెక్కింది. మీరామె తలమీద పోకర్‌తో స్పృహ తప్పేలా కొట్టాలి. ఆమె ముందుకి జారి పడటంతో నేల తగిలి ఆ గాయమైందని అనుకుంటారు. ఆ దెబ్బకి స్పృహ తప్పి స్టవ్‌నుంచి లీకైన గ్యాస్‌తో...తర్వాత?ఆవులకి గడ్డి వేయడానికి మీరు షెడ్‌కి వెళ్ళారు. మీరు తిరిగి వచ్చి చూస్తే గది నిండా అలుముకున్న గ్యాస్, నేలమీద పడున్న మీ ఆవిడ. ఆమెకి ప్రథమ చికిత్స చేసారు. కాని, అప్పటికే ఆలస్యమైపోయింది. మీరు గ్యాస్ లైన్‌ని ఆఫ్ చేసి డాక్టర్‌కి ఫోన్ చేసారు. గ్యాస్ కంపెనీకి మీరు చేసిన ఫిర్యాదులు రికార్డ్‌లో ఉంటాయి కాబట్టి, మిమ్మల్ని ఎవరూ అనుమానించరు. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. నేనూ చెప్పను. మీరు నన్ను నమ్మవచ్చు.ఇది మంచి పథకం. చాలా మంచి పథకం ఆలోచనగా చెప్పాడు.అకస్మాత్తుగా ఇద్దరికీ పడక గదిలోంచి ఎవరో ఒళ్ళు విరుచుకున్న శబ్దం, ఆవలింత, తర్వాత ఓ కంఠం వినిపించాయి.జార్జ్! ఆ స్టవ్ మళ్ళీ లీకైంది. ఆ అమ్మాయి ఎవరు?వెంటనే అతని మొహంలో బాధ కనిపించింది. జీన్ పేరు, ఎందుకు వచ్చిందో చెప్పాడు.ఆమె హియరింగ్ ఎయిడ్‌ని చెవికి అమర్చుకుంటూ బయటకి వచ్చింది. తెల్లజుట్టు, క్రూరమైన మొహం గల ఆ లావుపాటి మధ్యవయస్కురాలు ఆ గదిలోంచి షాక్‌కి గురైన జీన్ దగ్గరకి వచ్చింది. జార్జ్ లేచి బయటకి కారు దగ్గరకి నడిచాడు. అతను తన మీద వేసిన ప్రాక్టికల్ జోక్ ఆమెకి చెప్పాలో, లేదో జీన్‌కి తెలీలేదు.గ్యాస్ వాసన చెప్పింది.అవును. గ్యాస్ కంపెనీ వాళ్ళు మాకో కొత్త స్టవ్‌ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడప్పుడు గ్యాస్ లీకౌతుంటుంది.మీ వారు మిమ్మల్ని చంపే ప్రయత్నం చేసారు.ఆమె చెప్పింది నమ్మని క్లారా నవ్వి వంటగదిలోకి వెళ్ళింది. జార్జ్ వచ్చి చెప్పాడు.మీ కారు గోతిలోంచి బయటకి వచ్చింది. ఇంక మీరు బయలుదేరవచ్చు.

జీన్ వెళ్ళిన కొన్ని గంటల తర్వాత రాకింగ్ చెయిర్లో కూర్చున్న క్లారా మధ్యమధ్యలో గ్లాస్‌లోని షెర్రీ తాగుతూ అల్లసాగింది.ఆమెకి అసలు వెంటనే ఎందుకు సహాయం చేయలేదు జార్జ్? నా షెర్రీని ఇచ్చి మర్యాద ఎందుకు చేసావు? అకస్మాత్తుగా అడిగింది.ఆమె నాకో మంచి పథకాన్ని చెప్పింది జార్జ్ నవ్వుతూ చెప్పాడు.ఏమిటది?అది నీకు చెప్పేది కాదు క్లారా.సర్లే. షెడ్లోకి వెళ్ళి కొన్ని కట్టెలు తే. రాత్రంతా మంచు కురిస్తే కట్టెలు సరిపోవు ఆజ్ఞాపించింది.జార్జ్ విధేయతగా లేచి బయటకి వెళ్ళాడు. ఆమె లేచి ఖాళీ గ్లాస్‌లోకి షెర్రీని వంచుకుని మళ్ళీ కుర్చీలో కూర్చుంది. ఆమె నుదుటిమీద అకస్మాత్తుగా పోకర్ దెబ్బ పడింది. క్లారా నేలమీదకి జారిపడింది. కొద్దిసేపటికి ఆ గదినిండా గ్యాస్ అలుముకోసాగింది.జార్జ్ ఆవుల షెడ్లోకి నడిచాడు.

(గ్రిట్చెన్ ట్రావిస్ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo