శుక్రవారం 05 జూన్ 2020
Sunday - Jan 26, 2020 , 02:20:51

మారిన తలరాత

మారిన తలరాత

ఒక రాజుకు పెళ్ళయి పన్నెండేళ్ళయింది. సంతానం లేదు. రాణి ఎన్నో వ్రతాలు, నోములు నోచింది. చివరికి దేవుడు కరుణించి వాళ్ళకు కొడుకు పుట్టాడు. రాజు నగరంలో వైభవంగా విందులు వినోదాలతో ఉత్సవం జరిపాడు.ఒకరోజు రాణి బిడ్డను తన పక్కన పడుకోబెట్టుకొని ప్రేమగా చూస్తూ ఉంది. చాలా రాత్రి గడిచినా ఆమెకు ఆనందంతో నిద్రపట్టలేదు. అంతలో ఒక కాంతివంతమైన ఆకారం ఆ గదిలో ప్రత్యక్షమైంది. అది మెల్లగా కదిలి పసివాడి దగ్గరికి వచ్చి పసివాడి తల నిమిరి వెళ్ళబోయింది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాణి ఆగు! ఎవరు నువ్వు అంది. ఆ ఆకారం నేను అదృష్టదేవతను. నీ బిడ్డ భవిష్యత్తును నిర్ణయించేవాణ్ణి. ప్రతి బిడ్డా ప్రపంచంలో పుడుతూనే నేను వస్తాను. కానీ అందరూ నన్ను గుర్తు పట్టలేరు. నువ్వు ప్రత్యేక చైతన్య వ్యక్తివి గనుక నన్ను గుర్తు పట్టావు అన్నాడు.

రాణి మరి నా కొడుకు నొసట ఏమి రాశావు? అతని భవిష్యత్తు ఏమని నిర్ణయించావు? అంది.అదృష్ట దేవత అది నేను చెప్పకూడదు. నువ్వు వినకూడదు. అది బ్రహ్మ రహస్యం. భవిష్యత్తు గురించి మనుషులకు తెలియడం అంత మంచిది కాదు. దానివల్ల ప్రమాదం అన్నాడు.రాణి నా కళ్ళ ముందు వచ్చి నా బిడ్డ తల రాతను రాసి అది నాకు తెలియకుండా వెళ్ళడం నేను భరించలేను. దయచేసి నా బిడ్డ తలరాతను గురించి నాకు చెప్పు అంది.అది వీలుపడదని ముందుగానే చెప్పాను కదా! అన్నాడు.

అయితే నా మీద ఒట్టు. నువ్వు నా బిడ్డ తలరాత గురించి చెప్పకుండా వెళితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అంది రాణి పట్టుదలగా.అదృష్టదేవతకు పెద్ద చిక్కువచ్చి పడింది. చెప్పక తప్పేట్లు లేదు అనుకున్నాడు.నీ బిడ్డ అడవిలో జీవించబోతున్నాడు. ఐనా నువ్వు దిగులు పడకు. మీకు రోజుకు ఒక జింక దొరుకుతుంది. నిశ్చింతగా ఉండు అన్నాడు.ఆ మాటలకు రాణి దిగ్భ్రాంతి చెందింది. అదృష్ట దేవత అదృశ్యమయ్యాడు.సంవత్సరం గడిచింది. రాణి ప్రతిరోజూ బిడ్డను కంటికి రెప్పలా కాచుకుంది. అంతలో రాజుగారికి తీవ్ర అనారోగ్యం సంప్రాప్తమయింది. రాచవైద్యులు ఎంత శ్రమించినా ఆ రోగం కుదరలేదు. ఒకరోజు రాజు కన్నుమూశాడు.అప్పటిదాకా దురాలోచనని బయట పెట్టని మంత్రి కుట్రపన్ని రాజ్యాన్ని హస్తగతం చేసుకొని సింహాసనం ఎక్కాడు. రాణిని పసివాడిని చంపడానికి మనుషుల్ని పంపాడు. ఆ సంగతి తెలుసుకొని రాణి రహస్యంగా కోట దాటి అరణ్యంలోకి పారిపోయింది.సుకుమారంగా పెరిగిన ఆమెకు అరణ్యజీవనం మొదట దుర్భరంగా తోచింది. క్రమంగా అలవాటు చేసుకుంది. గుడిసె కట్టుకొని అడవిలో కందమూలాలు సేకరించి తిన్నది. మెల్లగా వలను అల్లి పొదలపై వేసేది. ఉదయానికే ఒక జింక దాంట్లో పడేది.రోజూ అడవిలో జంతువుల కోసం వచ్చే ఒకతనికి ఆ జింకను ఇచ్చేది. అతను ఊళ్ళోకి వెళ్ళి జింకను అమ్మి ఆమెకు డబ్బు ఇచ్చేవాడు. ఇట్లా కొన్నేండ్లు గడిచాయి.

యువరాజుకు పదిహేను సంవత్సరాలు వచ్చాయి. వలలు అల్లి పొదల దగ్గర వేసేవాడు. ఉదయానికి ఒక జింక వలలో కనిపించేది. ఆ రకంగా తల్లికి సాయపడేవాడు.యువరాజు ఐదారు వలలు వేసినా కేవలం వాటిల్లో ఒకదాంట్లోనే ఒక జంక మాత్రమే పడేది. ఇది అతనికి ఎంతో ఆశ్చర్యమేసి ఒకరోజు తల్లిని అడిగాడు. రాణి నాయనా! అది విధిరాత అంది. యువరాజు పదేపదే అడిగితే ఆమె గతమంతా వివరించింది.యువరాజు అమ్మా! నేను తలరాతను మారుస్తాను. నేను చైతన్యాన్ని, శ్రమను నమ్ముతాను అన్నాడు. తల్లి ఆశీర్వదించింది. ఒకరోజు ఒకే వల వేశాడు. దానికీ జింక పడింది. ఒకరోజు వలను చెట్టుకు వేలాడదీశాడు. ఐనా దాంట్లో జింక పడింది. ఇంకోరోజు చెట్టుపైనా వలను వేలాడదీసి కింద మంట పెట్టాడు. దూరంగా ఉండి ఏం జరుగుతుందో అని చూశాడు.

అంతలో అదృష్టదేవత ప్రత్యక్షమై కింద మంట పెడితే జింక చెట్టు ఎలా ఎక్కుతుంది అన్నాడు.యువరాజు మీరు నా భవిష్యత్తును బహిరంగపరిచారు. దాన్ని విధిరాత అని తలరాత అని అన్నారు. కానీ అదే సమయంలో నాకు చలనాన్ని, చైతన్యాన్ని, కార్యశీలతను, ఆలోచనను ఇచ్చారు. ఇప్పుడు నా తలరాతను మార్చే అవకాశం నాకు వచ్చింది. దానికి మిమ్మల్ని సాక్షాత్కరించుకోవడం తప్ప మరో మార్గం లేకపోయింది. నన్ను మన్నించండి అని అదృష్ట దేవతకు పాదాభివందనం చేశాడు. అదృష్ట దేవత ఆనందంతో అతన్ని ఆశీర్వదించింది. అదృశ్యమైంది.అంతలో దుష్టపాలకుడైన మంత్రిని తుదముట్టించినట్లు జంతువ్యాపారి వార్త తెచ్చాడు. రాణి కొడుకుతో కలిసి తన నగరానికి వెళ్ళింది. ప్రజలు రాణిని గుర్తించి జయజయధ్వానాలు చేశారు. యువరాజుకు పట్టాభిషేకం చేసి సింహాసనం అధిరోహింపజేశారు.అట్లా యువరాజు తన తలరాతను తనే మార్చుకున్నాడు.

సౌభాగ్య


logo