గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jan 26, 2020 , 00:27:38

సెలవే లేని శ్రామికుడు!

సెలవే లేని శ్రామికుడు!

ఏడాదిలో 365 రోజులుంటే.. పాఠశాల జరిగేది గరిష్టంగా 220 రోజులు. వీటిల్లో సెలవులు మినహా ఓ ఉపాధ్యాయుడు 185 రోజులే బడికి హాజరవుతున్నాడు. అంటే సంవత్సరానికి సగం రోజులు కూడా టీచర్లు పనిచేయడం లేదు అనే అపోహ కొంతమందిలో ఉంది. అలాంటప్పుడు విద్యార్థుల భవిష్యత్ ఏంటి? వారికి చదువు ఎలా అబ్బుతుంది? పరీక్షల్లో వాళ్లేం పాసవుతారు? అనే ప్రశ్నలకు ఈ ఉపాధ్యాయుడు సమాధానం చెప్పాడు.

నేను 8వ తరగతి నుంచి చూస్తున్నా. ఏ రోజూ గౌరీశంకర్ సార్ ఆలస్యంగా రాలేదు, సెలవు పెట్టలేదు. మాకు ప్రత్యేకంగా డిజిటల్ తరగతులు చెబుతున్నారు. మేము స్కూల్‌కు రెగ్యులర్‌గా వస్తే బహుమతులు కూడా ఇస్తున్నారు. సార్ బాటలోనే  నేనూ, వనజ రెండేండ్ల నుంచి ఒక్క సెలవు కూడా పెట్టలేదు. మమ్మల్ని చూసి నందిని, పూజిత ఈ ఏడాది ఒక్క సెలవూ తీసుకోలేదు. మాకు అన్ని సబ్జెక్టుల్లో మార్కులు పెరిగాయి. నేనూ కూడా టీచర్ అవుతా అని శ్రీరాంనగర్ పాఠశాలలోని పదోతరగతి విద్యార్థిని ధనలక్ష్మీ ఎంతో ధీమాగా, ఆత్మవిశ్వాసంతో చెబుతున్నది. కారణం గౌరీశంకర్ సార్. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్ది.. వారి బంగారు భవితకు బాటలు వేస్తున్న ఆయన కార్యచరణ ఎంతోమంది ఉపాధ్యాయులకు ఆదర్శం. అందుకే తెలంగాణ ప్రభుత్వం తరఫున విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి నుంచి సత్కారాన్ని పొందారు గౌరీశంకర్ టీచర్.


నాలుగేండ్ల నుంచి నిరంతరంగా

కేవీఎస్ గౌరీశంకర్.. ఖైరతాబాద్ మండలం యూసఫ్‌గూడలోని శ్రీరాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్(ఫిజిక్స్) టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆగస్టు 1998లో సెకండరీ టీచర్‌గా ఓల్డ్ సిటీలోని జీయూపీఎస్ చలాపురా పాఠశాలలో మొదటి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. యూసఫ్‌గూడలోని ప్రభుత్వ పాఠశాలలో 1998 నుంచి 2013 వరకు పనిచేశారు. ఆ తర్వాత ఎన్‌బీడీనగర్ పాఠశాలలో, బోరబండ పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు బోధించారు. ప్రస్తుతం శ్రీరాంనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ బోధిస్తున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు గౌరీశంకర్ స్వస్థలం. 20 యేండ్ల నుంచి హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. 2008లో యూసఫ్‌గూడ పాఠశాలలో పనిచేస్తుండగా మొదటిసారిగా ఏడాది మొత్తం సెలవులు లేకుండా పాఠశాలకు వచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో 2009లో సెలవులు పెట్టాల్సి వచ్చింది. మళ్లీ తాను అనుకున్నది సాధించేందుకు 2014-15లో సెలవులు పెట్టకుండా పాఠశాలకు వెళ్లారు. అలా.. 2016-17, 2017-18, 2018-19, 2019-2020 వరకూ సెలవు పెట్టకుండా స్కూల్‌కు హాజరవుతూనే ఉన్నారు గౌరీశంకర్ టీచర్. 

ఆరోగ్యం సహకరించకపోయినా..! 

ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పే టీచర్లు సరిగా బడికి వెళ్లరు. సంవత్సరంలో కనీసం సగం రోజులు కూడా వాళ్లు పనిచేయరు అని జనాలు అనుకునే మాటలు విన్నప్పుడల్లా ఆయన మనసు బాధ పడేది. ఇలాంటి మాటలకు తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. స్కూల్‌కు సెలవు ఎందుకు పెట్టాలి? సెలవులే లేకుండా పనిచేసి.. ఇలాంటి మాటలకు పుల్‌స్టాప్ పెట్టాలి? అని దృఢంగా నిశ్చయించుకున్నారు. అప్పటికే ఆయన దీర్ఘకాలిక డయాబెటిక్ పేషెంట్. అప్పుడప్పుడూ ఆరోగ్యం సహకరించదు. అయినా పట్టువదలలేదు. తనకున్న సెలవులన్నీ రద్దు చేసుకున్నారు. ఒకవైపు రోజూ ఇన్సూలిన్ తీసుకుంటూనే నాలుగేండ్ల నుంచి నిరంతరాయంగా, ఎలాంటి సెలవులు తీసుకోకుండా బడికి హాజరవుతూనే ఉన్నారు గౌరీశంకర్ మాస్టారు. 2018-19లో ధనలక్ష్మీ, వనజ, 2019-2020లో నందిని, పూజిత అనే నలుగురు విద్యార్థినులు సెలవు పెట్టకుండా బడిబాట పట్టారు. వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది వచ్చే ఏడాదికి సంసిద్ధులవుతున్నారు. గౌరీశంకర్ సార్ స్ఫూర్తితో ఇదే పాఠశాలలో లెక్కలు బోధిస్తున్న శ్రీనివాసరావు కూడా తన సీఎల్స్‌ను రద్దు చేసుకున్నారు.


సొంతంగా డిజిటల్ తరగతులు

విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేయడానికి కార్పొరేట్ స్కూళ్లతో పోటీపడి డిజిటల్ తరగతులు బోధిస్తున్నారు గౌరీశంకర్. వంద మాటలకంటే.. ఒక దృశ్యం మేలు అన్నట్లుగా గౌరీశంకర్ సార్ సొంతంగా రూ.20 వేలతో డిజిటల్ తరగతులు బోధించే యంత్ర సామగ్రి కొనుగోలు చేశారు. రాత్రిళ్లు రేపు పిల్లలకు ఏం బోధించాలి? అనే అంశంపై కసరత్తు చేసి, అందుకు సంబంధించిన ఈ-సిలబస్, నియమాలు, సిద్ధాంతాలు, ప్రయోగాలు, సూత్రాలను యానిమేషన్ రూపంలో భార్య సహకారంతో సిద్ధం చేసుకుంటారు. మర్నాడు ఉదయం విద్యార్థులకు అర్థవంతంగా డిజిటల్ తరగతులను పవర్‌పాయింట్ రూపంలో బోధిస్తుంటారు. దీంతో ఎంతో కష్టతరమని భావించే ఫిజిక్స్‌లో విద్యార్థులు 40 మార్కులకు గాను 35కు పైగా తెచ్చుకుంటున్నారు. కొందరు 40కి 38/39/40 తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌పొందక ముందునుంచే గౌరీశంకర్ రాష్ట్రస్థాయిలో విద్యారంగంలో రీసోర్స్‌పర్సన్‌గానూ పనిచేశారు. మన టీవీ ద్వారా విద్యార్థులకు డిజిటల్ తరగతులు బోధించారు. డిజిటల్ తరగతులకు సంబంధించి యాన్యువల్ షెడ్యూల్డ్ ప్రిపరేషన్‌లో ఫిజిక్స్ ఎక్స్‌పర్ట్‌గానూ సేవలందించారు. హైదరాబాద్ దూరదర్శన్, ఆలిండియా రేడియోల్లోనూ విద్యార్థులకు తరగతులు చెప్పారు. ఈక్రమంలో ఎంతోమంది నుంచి సత్కారాలూ పొందారు. 


మా భయం పోయింది

మొదట్లో మాకు ఫిజిక్స్ అంటే చాలా భయం వేసేది. ఎనిమిదో తరగతి నుంచి ఫిజిక్స్ అంటే భయం పోయింది. ఇప్పుడు పదిలో 40కి 35 మార్కులు తెచ్చుకుంటున్నాం. మా టార్గెట్ 40/40 సాధించడమే. సార్ చెప్పే డిజిటల్ తరగతులు బాగుంటాయి. ఎక్కువ మార్కులు వస్తే బహుమతులు కూడా ఇస్తున్నారు. ఇలాంటి సార్ దొరకడం నిజంగా మా అదృష్టం.

- నందిని, పదో తరగతి విద్యార్థిని

-డప్పు రవి


logo