ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

పలాజో అందం!

పలాజో అందం!

1960 చివర.. 1970 మొదట్లో.. బెల్ బాటమ్ ప్యాంట్‌లు రాజ్యమేలాయి.. వాటిని అనుకరిస్తూ ఇప్పుడు పలాజో ప్యాంట్‌లు వచ్చాయి.. దూరం నుంచి చూస్తే అచ్చు స్కర్ట్‌ల్లాగే దర్శనమిస్తాయి.. సెలెబ్రిటీలు నచ్చిన.. మెచ్చిన ఫ్యాషన్ ట్రెండ్స్‌ల్లో.. పలాజో ప్యాంట్‌లది మొదటి స్థానం అంటే అతిశయోక్తి కాదేమో! వార్డ్‌రోబ్‌లో సమ్మర్ స్పెషల్‌గా మొదలైన ఈ పలాజోల ప్రస్థానం.. ఇప్పుడు ైస్టెలిష్ లుక్ కోసంగా మారి అందరి మన్ననలూ పొందుతున్నది.. మరి ఆ పలాజోల జోరు ఎలా ఉన్నా.. అసలు పలాజోలల్లో కూడా చాలా రకాలున్నాయన్న విషయం తెలియదు చాలామందికి.. అందుకే ఆ స్పెషల్ పలాజోలతో మరింత ైస్టెలిష్‌గా తయారయ్యేందుకే ఈ జంట కమ్మ సిద్ధమైంది..

స్కర్ట్‌కు ప్రత్యామ్నాయం 

మామూలు పలాజోలు పైన కాస్త టైట్ ఉండి కింద వదులుగా ఉంటాయి. కానీ ఫ్లేర్డ్ పలాజోలు పై నుంచి కిందకు వదులుగానే ఉంటాయి. ఇంకా ఇది చూడడానికి చిన్న స్కర్ట్‌లాగే కనిపిస్తుంది. కాటన్, క్రేప్, జార్జెట్, డెనిమ్‌ల్లో కూడా ఇలాంటి పలాజోలు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కాకపోతే పొట్టిగా ఉన్నవాళ్లు ఇలాంటి పలాజోల జోలికి వెళ్లకపోవడం మంచిదంటున్నారు ఫ్యాషన్ పండితులు. సంప్రదాయంగా కనిపించాలనుకునే అమ్మాయిలు.. పొడవాటి కుర్తీలను వీటి మీదకి ధరించవచ్చు. ఇక్కత్ టాప్‌లతో ప్రయోగాలు కూడా చేయొచ్చు. చిన్న టాప్ వేసుకొని లాంగ్ జాకెట్‌లాంటిది ధరిస్తే అదిరిపోతుంది. మామూలు జుతీస్‌ని వీటి మీదకి ధరించొచ్చు. 


రెగ్యులర్ పలాజో 

ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా స్ట్రెయిట్ కట్‌తో ఉండే పలాజోలు ఇవి. వీటినే రెగ్యులర్ పలాజోలు అంటారు. పైగా నేచురల్ కలర్స్‌తో ఈ పలాజోలు బాగుంటాయి. పొట్టిగా ఉన్నవాళ్లు దాదాపు పలాజోలు వేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఈ కట్‌తో వచ్చే పలాజోలు మాత్రం అందరూ నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. లెనిన్, కాటన్, విస్కోస్ మెటీరియల్స్‌తో ఈ పలాజోలు కుట్టించుకుంటే బాగుంటుంది. స్ట్రెయిట్ కట్ కుర్తీ, కోల్హాపురీ చెప్పులు వీటికి జతచేస్తే మీకు రెట్టింపు అందం వస్తుంది. టీ-షర్ట్, పొట్టి షర్ట్‌లు వేసుకొని స్నీకర్ షూస్ పర్‌ఫెక్ట్ లుక్‌ని తీసుకొస్తాయి. అచ్చు ప్యాంట్‌లాగే

ఫార్మల్ ప్యాంట్ మాదిరిగానే ఈ పలాజోలు ఉంటాయి. కాకపోతే కాస్త వదులుగా, చిన్న కుచ్చులు వస్తాయి కింద వైపు. మామూలుగా ఇలాంటి పలాజోలకి నడుము దగ్గర ఎలాస్టిక్ వస్తుంది. దీనివల్ల బెటర్ ఫిట్ అనిపిస్తుంది. ైస్టెలిష్‌గా, ప్రొఫెషనల్‌గా రెడీ కావాలనుకున్న వాళ్లు ఈ పలాజోలను ఎంచుకోవచ్చు. కాటన్, మిలాంగ్ ఫ్యాబ్రిక్‌లు ఈ పలాజోలకి బెస్ట్. ఈ పలాజోలకి కరెక్ట్ షర్ట్, ట్యునిక్‌లను ఎంచుకుంటే సరిపోతుంది. ఆఫీస్‌లకు వెళ్లే వాళ్లు ఈ పలాజోలను ఎంచుకుంటే చాలా కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. జార్జెట్, షిఫాన్ టాప్‌లయితే మరింత బాగుంటాయి. మరి ఎక్కువ హీల్స్ లేకుండా, నార్మల్ చెప్పులను వేసుకున్న కూడా వీటి మీదకు బాగుంటాయి. కుచ్చుల పలాజో

ఈ పలాజో చూడడానికి స్కర్ట్‌లాగే కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ వదులుగా.. పైగా కుచ్చులు ఎక్కువ ఉండడంతో ఆ లుక్ వస్తుంది. దీనికి మ్యాచింగ్ అయ్యే టాప్, నగలు వేసుకుంటే మీ లుక్ అదిరిపోతుంది. జార్జెట్, క్రేప్ మెటీరియల్‌తో చేసిన పలాజోలు ఈ రకమైన పలాజోలకి బాగా సూటవుతాయి. ఎ-లైన్ కుర్తీ, షర్ట్ కుర్తీలకు మ్యాచింగ్ చెవి కమ్మలు ఉండేలా చూసుకోండి. హాల్టర్ నెక్, బాడీకాన్ టాప్ కూడా చాలా బాగుంటాయి. హాఫ్ షోల్డర్, వన్ షోల్డర్ టాప్‌లు కూడా నప్పుతాయి. ఇలాంటి పలాజోలు వేసుకున్నప్పుడు హీల్స్ వేసుకోవడం మరువద్దు. సెలెబ్రిటీలు, ఫ్యాషన్ బ్లాగర్‌లు ప్రత్యేకంగా ఈ పలాజోలు వేసుకున్నప్పుడు బెల్ట్‌లు ధరించి మరింత ఆకర్షణీయంగా వెలిగిపోతుంటారు. సూపర్ పలాజో

రెగ్యులర్‌గా వేసుకునేలా మ్యాచింగ్ పలాజో, కుర్తీలు ఉంటాయి. ఈ పలాజో ప్యాంట్ కూడా కింద ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. రోజువారీ బట్టల్లో ఈ సెట్‌ని చేర్చుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు, ఆఫీసుల్లో కంఫర్ట్‌గా తిరిగేందుకు ఇవి బాగుంటాయి. ముఖ్యంగా కాటన్‌లో వచ్చేవి వేసవికాలానికి మరింత బెటర్. ఎంబ్రాయిడరీ వచ్చిన డ్రెస్‌లు అన్ని అకేషన్లలోకి వేసుకోవచ్చు. మ్యాచింగ్ స్కార్ఫ్‌లు, వీటికి వచ్చే దుపట్టాలు వేసుకోండి. జుతీస్, కోల్హాపురి చెప్పులు ఇలాంటి డ్రెస్‌లకు బాగుంటాయి. ఎక్కువ ప్రింట్‌ల జోలికి వెళ్లకుండా నార్మల్ డ్రెస్‌లను ఎంచుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. చిరిగినా అందమే..

ఎటో ఒకవైపు స్లిట్‌లాగా రావడం ఈ పలాజోలో ప్రధానాకర్షణ. రెగ్యులర్‌గా వ చ్చే పలాజోలకి ఇవి కాస్త భిన్నంగా ఉంటాయి. పక్కకు కానీ, ముందుకు కానీ మోకాలు వరకు స్లిట్ వస్తుంది. సాఫ్ట్ విస్కోస్, షిఫాన్, జార్జెట్‌లో ఈ చిరుగు పలాజోలు అందంగా మెరుస్తాయి. ఫ్లోయింగ్ క్రీపీ మెటీరియల్ కూడా బాగుంటుంది. చిన్న కుర్తీలు అది కూడా స్లిట్స్ వచ్చినవి చాలా బాగుంటాయి. ఏ రంగు పలాజోల మీదకైనా నలుపు, తెలుపు రంగు టీ షర్ట్‌లు సరిగ్గా సూటవుతాయి. కాస్త ఫంకీ యాక్ససెరీస్‌లను ధరించాలి. స్నీకర్, గ్లాడియేటర్ షూస్‌లను ధరిస్తే హాట్ లుక్ మీ సొంతం. పొట్టి స్కర్ట్‌ల్లాగే.. 

మోకాళ్ల వరకే ఉండే ఈ పలాజోలు కాలేజీ అమ్మాయిలకు బాగా నచ్చుతాయి. పొట్టి స్కర్ట్ అటు, ఇటు పోతుందనే బాధ లేకుండా ఈ పలాజో అచ్చు పొట్టి స్కర్ట్ వేసుకున్న లుక్కే ఇస్తుంది. గుచో ట్రౌజర్ మాదిరిగానే ఈ కల్టోస్ పలాజోలు అదరగొడుతాయి. కాటన్, క్రేప్, లెనిన్, డెనిమ్‌లనే కాదు చివరకు ఖాదీలతో కూడా ఈ పలాజోలను డిజైన్ చేస్తున్నారు. చాలా వదులుగా ఉంటూనే క్రేజీ లుక్‌ని తీసుకొస్తాయి ఈ పలాజోలు. దీనికి సూపర్‌గా మ్యాచ్ అయ్యే షర్ట్‌లు, టీ షర్ట్‌లు, క్రాప్ టాప్‌లు ఇలా అన్ని రకాల టాప్‌లను వీటి మీద ప్రయోగం చేయవచ్చు. ఒక్క లాంగ్ లెంత్ ఉన్న టాప్‌లు, కుర్తీలు తప్ప. బూట్లు, స్లింగ్ క్లచ్‌ల్లాంటివి వీటికి పర్‌ఫెక్ట్ లుక్‌ని తెచ్చిపెడుతాయి. ధోతీలా వేసేయొచ్చు

మామూలుగా ధోతీల్లా వచ్చే ప్యాంట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. కాకపోతే పలాజోల్లా కనిపించే ఈ ధోతీలు మరింత అందంగా కనిపిస్తాయి. పైన వదులుగా ఉండి.. కింద మాత్రం కాళ్లను పట్టేసినట్లుగా ఈ పలాజోలు వస్తాయి. అంచు ఉన్న పలాజోలు మీకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. ఎలాంటి అకేషన్లకైనా ఇవి బాగా నప్పుతాయి. కాటన్, సాటిన్, సిల్క్, ఖాదీలతో ఈ ధోతీ పలాజోలను డిజైన్ చేస్తున్నారు. వీటి మీదకి ఎ-లైన్ కుర్తీ, షర్ట్, చిన్న కుర్తీలు చాలా బాగా సూటవుతాయి. పెప్లమ్ టాప్‌లు కూడా ఈ పలాజోల మీదకి అదిరిపోయే లుక్‌ని తీసుకొస్తాయి. బెల్ట్ పెడితే దీనికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. పొరలు పొరలుగా..

విచ్చుకున్న గులాబీ మాదిరిగా ఈ పలాజో కనిపిస్తుంది. అంటే.. లేయర్లుగా ఈ పలాజో డిజైన్ ఉంటుంది. సూపర్ ైస్టెలిష్‌గా కనిపించేందుకు, పార్టీల్లో ఈ పలాజో చూడచక్కగా మెరుస్తుంది. ఎక్కువ లేయర్లు కాకుండా రెండు, మూడు లేయర్లుగా ఈ పలాజో డిజైన్ చేయడం వల్ల మరింత అందంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. జార్జెట్, క్రేప్‌లు ఇలాంటి పలాజోలకి బాగుంటాయి. దీని మీదకి నెహ్రూ కాలర్ షర్ట్, బాడీకాన్ హాల్టర్ నెక్, క్రాప్‌టాప్‌లు పర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. ఫార్మల్‌గా ఉండాలనుకుంటే మాత్రం వీటి జోలికి వెళ్లొద్దు. సింపుల్ మేకప్ చేసుకోవాలి. ఈ పలాజో వేసుకున్నప్పుడు హై హీల్స్ వేసుకోవడం మరచిపోవద్దు. 


-సౌమ్య నాగపురి


logo