ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jan 26, 2020 ,

వాస్తు

వాస్తు

మాది డూప్లెక్స్ ఇల్లు. అందులో కింది ఫ్లోర్‌లో దోషాలు ఉన్నాయి. మేము పైన పడుకుంటాము. అయినా మార్చుకోవాలా? -దాసం లక్ష్మి, చిలుకూరు

డూప్లెక్స్ అంటేనే అది ఒకే ఇల్లు కిందికి వస్తుంది. దానిలో దోషాలు ఎక్కడ ఉన్నా అవి మీ ఇంట్లో ఉన్నట్లే, తప్పక మార్చుకోండి. మన గృహం అనేది ఒక శరీరం లాంటిది దానికి ఏచోట ఏ చిన్న గాయమైనా మొత్తం ప్రాణానికి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు వాడుకునే ఫ్లోర్ మారినంత మాత్రాన దాని దోష ప్రభావం మారదు. తప్పక మీ గృహంలోని దోషాలు సరిచేసుకోండి. ఇంటిని కేవలం ఇసుక, సిమెంటు అనే భావనతో చూసినంత కాలం దానిలోని లోతు మనకు అర్థం కాదు. ఒక రూపం దాల్చుకున్న ఏ ఆకారానికైనా ఒక వ్యవహార యోగ్యత దానికో ప్రయోజనం ఆపాదించబడుతాయి. తద్వారా దాని ప్రభావ ఫలితాలు మనిషి జీవితంపైన తప్పక ఉంటాయి.


మాకు నాలుగు గృహాలు ఉన్నాయి. వాటిలో దేని ప్రభావం మాపై ఉంటుంది? -విద్యాసాగర్, లోతుకుంట

ఇంట్లో ఎన్నికూరలు వండుకున్నా దేనితో తింటామో దాని ప్రభావం తప్పక వంటిమీద ఉంటుంది. మిగతావి తినకపోయినా వాటి వాసనలు మసాల ఘాటు మనకు వస్తూ ఉంటుంది. అలా ఇండ్లు మనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉంటాయి. మీరు దేనిలో ఉంటున్నారో దానిలో ఉన్న లోపాలు ముందుగా సవరించుకోండి. అలాగే మిగతా గృహాలు కూడా బాగు చేసుకోండి. ఏ గృహాలు అయినా మనవే. వాటిల్లో ఎవరు ఉన్నా వాళ్ళకూ కుటుంబాల ఎదుగుదల అవసరమే కదా. అవి మనం ఉండే ఇండ్లే అయినా రెంటు ఇండ్లే అయినా అన్నీ శాస్త్ర పరంగా బాగుండాలి. దేని ప్రభావం ఎప్పుడు ఎలా మన మీద పడుతుందో తెలియదు. మన ఆధీనంలో మన యాజమాన్యంతో ఉండే నిర్మాణాలు అవి ఎవరు వాడినా అన్నీ బాగుండాల్సిందే.


మాకు మనవడు పుట్టాడు. అయినా ఇంట్లో దీపం పెట్టవద్దా? జననం శుభమే కదా? - వి.రాధ, ఆలేరు

కొన్ని మలిన సమయాలు మానవ జీవితంలో ఉంటాయి. అవి చావు పుట్టుకలు పురిటి సమయం వచ్చినా ఒక మలిన కార్యంగానే భావించడం మన సంప్రదాయంలో ఉంది. అవి ఎంతో సదీర్ఘ కర్మ ప్రయాణంతో జరుగుతాయి. పుట్టింది కొడుకైనా, కూతురైనా అది రక్త స్రావంతో ఉంటుంది. కొంత విరుద్ధమైన బ్యాక్టీరియా పురిటి సమయంలో పుడుతుంది. ఆ సమయంలో శుభకార్యాలు పెట్టుకోరు. అలాగే దీపధూప నైవేద్యాలు కూడా ఇండ్లలో చేయరు. మన విధానంలో ఏ సంప్రదాయమైనా ఆరోగ్య విలువలతోనే ఎక్కువగా ముడిపడి ఉంటుంది. కాబట్టి వాటిని పాటించడంలో ఇబ్బంది ఎందుకు పడాలి.


మా ఊరిలో శ్మశానం కట్టించాలని అనుకుంటున్నాం. ఏ దిక్కు మంచిది? - మారేడు హన్మంతు, మోత్కూర్

ప్రతి ఊరికి ఒక గుడిలాగే ఒక శ్మశానం కూడా ఉండడం మంచిది. ఎన్ని ఉన్నా ఎన్ని సాధించినా మనిషి పుట్టిన క్షణం నుండి అతని అడుగు మరణం వైపునకే పడుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు ప్రతి పల్లెలలో అన్ని విధాలుగా వసతులు కల్పించేవారు. ఆ దిశలో శ్మశానం ఒకటి. శ్మశానం ఊరికి దక్షిణం దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. దానికి కూడా అన్ని వైపులా రోడ్లు ఏర్పాటు చేసి చుట్టూ కాంపౌండు కట్టాలి. ఆ శ్మశానానికి దక్షిణం గేటు ఉండాలి అలాగే దాని ప్రహరీని ఆనుకొని ఎత్తయిన అశోక వృక్షాలు పెరిగేలా ఏర్పాటు చేయాలి. దగ్గరలో అన్ని వసతులూ సమకూర్చాలి.


మేము అన్నీ చూపించుకొనే ఇల్లు కట్టాం. కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు? - ఎస్.రమాదేవి, జీడిమెట్ల

మనిషి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అవసరం. అయినా కొన్నింటిని ఎవరూ ఆపలేరు. కానీ వాటి తీవ్రతను ఆపగలిగే శక్తి మనిషికి ఉంది. అందుకే శాస్ర్తాలు వెలిశాయి. ఏళ్లుగా ఆచరించబడుతున్నాయి మన దేశంలో. జన్మగతంగా వచ్చిన కర్మ (పని) ఫలితాలు మన జీవితంలో తప్పక అనుభవించవలసిందే.. కానీ మన వ్యక్తిగత ధర్మం, నియమ నిష్ఠలు శాస్త్ర గృహాలు ఆ మనిషికి ఎదురయ్యే ప్రమాదాలను ఆపకపోయినా వాటి తీవ్రమైన ఫలితాలను దూరం చేసి తక్కువ కష్టాన్ని కల్పించి బయటపడవేస్తాయి. తల పగిలేదుంటే తలకు గాయంతో పోతుంది. కాలు విరిగేది ఉంటే మోకాలు బెనికి ఇబ్బంది కలుగుతుంది. అలా వ్యక్తిగత నీతి నియమాలు మనల్ని కాపాడతాయి. వాస్తు ఇల్లు కూడా అంతే. వచ్చే సంఘటనల నుండి గెలుపు మార్గం చూపిస్తుంది.


logo