శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

కృత్రిమ మేధోమథనం

కృత్రిమ మేధోమథనం

సెల్‌ఫోన్ల నుంచి సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల వరకూ పరిసరాల నుంచి ప్రపంచ దేశాల సరిహద్దుల్లో అటానమస్‌ ఆయుధాల వరకూ హోం థింగ్స్‌ నుంచి హ్యూమనాయిడ్‌ రోబోల వరకూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విస్తరిస్తున్నది. అచ్చం మనిషిలా ఆలోచించే మెషీన్లకు జీవం లభిస్తున్నది. ఇది రానున్న రోజుల్లో మరింత విస్తృతం అవనున్నది. ఈ అపూర్వమైన సాంకేతిక పరిజ్ఞాన కాలంలో ఏఐతో ఆవిష్కరణ కాలం కొనసాగనున్నది. ఫిక్షన్‌ సినిమాల్లో కనిపించే సన్నివేశాల్లాగా ఏఐ ఇప్పుడు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో కండ్ల ముందు కనబడనుంది. 2020 ఏడాదిలో ఈ టెక్నాలజీ మరింత విస్తరించనున్నది. ఈ సందర్భంగా కృత్రిమ మేధస్సు విశేషాలను తెలిపే ముఖచిత్ర కథనం.

మనిషి ఇప్పటివరకు కనిపెట్టిన వాటిలో గొప్ప సాంకేతిక పరిజ్ఞానం ఇది. 70 ఏండ్ల క్రితమే ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లేదా కృత్రిమ మేధస్సు) ఉనికి ఉంది. అలాన్‌ తురింగ్‌, మార్విన్‌ మిన్‌స్కీ, జాన్‌ మెక్‌కార్తీ వంటి కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సును ఉనికిలోకి తెచ్చారు. ప్రోగ్రామ్‌ డిజైనింగ్‌ తర్వాత దీన్ని పూర్తిగా రూపొందించింది జాన్‌మెక్‌కార్తీగా పరిగణలోకి వచ్చారు. దీంతో ఆయనే ‘కృత్రిమ మేధస్సు’  సృష్టికర్తగా గుర్తింపు పొందారు. 1940-1956 ఏండ్ల కాలంలో ఇది రూపొందింది. 1950లో అలాన్‌ ట్యూరింగ్‌  మొదటిసారి కంప్యూటర్‌కు ‘ట్యూరింగ్‌ టెస్ట్‌' (కంప్యూటర్‌ తెలివితేటలకు ఓ పరీక్ష. కంప్యూటర్‌కు, మనిషికి మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు నిర్వహించడం) చేశారు. 1956లో ఇంగ్లాండ్‌లోని డార్ట్‌మౌంట్‌ కళాశాలలో మొదటిసారి ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌' ఎజెండాతో కాన్ఫరెన్స్‌ జరిగింది. ఆ సమావేశానికి హాజరైన వారే కృత్రిమ మేధా పరిశోధకులయ్యారు. మానవుడిలా తెలివిగల కంప్యూటర్‌ ఒక జనరేషన్‌ కంటే ఎక్కువ ఉండదని వారు భావించారు. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి బ్రిటిష్‌ ప్రభుత్వం మిలియన్‌ డాలర్లు వెచ్చించింది. 1956 నుంచి  1974 వరకూ కృత్రిమ మేధస్సు మీద అనేక పరిశోధనలు జరిగాయి.  ఈ కాలాన్ని ‘ఏఐ గోల్డెన్‌ ఇయర్స్‌'గా పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యాన్ని చాలా తక్కువ అంచనా వేసిన ప్రభుత్వం విమర్శలకు స్పందనగా నిధులు కేటాయించడం తగ్గించింది. తర్వాత వచ్చిన 1974-1980 కాలాన్ని ‘ఐఏ వింటర్‌'గా పిలుస్తారు.  తర్వాత ఏడు సంవత్సరాల కాలంలో దేశాలు చేసిన ప్రయోగాలు, తీసుకున్న చొరవతో కృత్రిమ మేధో అభివృద్ధి మెరుగుపడింది. ఇలా 1980-1987 సంవత్సరాల మధ్య కాలం ‘ఏఐ భూమ్‌'గా గుర్తింపు పొందింది. ఇలా అనేక పరిశోధనలు, ప్రభుత్వాల చొరవ, దూరదృష్టితో కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందింది. ఈ రోజు అతిపెద్ద మార్పు ఏంటంటే.. నగరాలకు, మహానగరాలకే పరిమితం అవుతుందనుకున్న కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం సామాన్యులకు కూడా చేరువైంది.  చిన్న చిన్న రంగాల్లోనూ ఈ టెక్నాలజీ విస్తరించింది.హ్యూమనాయిడ్‌ రోబోలు..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీతో వచ్చిన రోబోలనే హ్యూమనాయిడ్‌ రోబోలంటారు. ఈ హ్యుమనాయిడ్‌ రోబోలు పారిశ్రామిక రంగాల్లోనే కాకుండా ఇప్పుడు అన్ని రంగాల్లో విస్తరిస్తున్నాయి. ప్రజారవాణ, వ్యవసాయం,  వైద్య రంగాల్లోనూ ఈ రోబోల ప్రభావం పెరుగుతున్నది. ఉత్పాదక రంగంలో రోబోల వాడకంతో అభివృద్ధి సాధించవచ్చని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పబ్లిక్‌ పాలసీ రీసెర్చ్‌' (ఐపీపీఆర్‌) చెపుతున్నది. ఐపీపీఆర్‌ అనే ఈ మేధో సంస్థ ఈ రీసెర్చ్‌ చేసింది. ఆటోమేషన్‌తో యూకేలో ఉత్పాదకత అభివృద్ధి ఏటా 0.8-1.4 శాతం, 2030 నాటికి జీడీపీ 10 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ వేతన ఉద్యోగాలతో పోలిస్తే, తక్కువ వేతన ఉద్యోగాలను ఆటోమేషన్‌ చేసే సాంకేతిక అవకాశం ఐదుసార్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆటోమేషన్‌ వల్ల కలిగే లాభాలు అందరికీ సమానంగా అందుబాటులోకి రాకపోవచ్చని అది పేర్కొంది. 

ప్రత్యేకతలు: 

కంప్యూటర్లు కేవలం కోడ్‌ భాషలను మాతమే అర్థంచేసుకుంటాయి. ప్రస్తుతం వాటిని కృత్రిమ మేధస్సు సహాయంతో వివిధ భాషలను అర్థం చేసుకుని.. సంభాషించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆధునిక యంత్రాలకు దృష్టి జ్ఞానం అందుతున్నది. ఇందులో భాగంగానే రోబోల ద్వారా నేరస్తులను గుర్తించే వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నది. 

-కృత్రిమ మేధస్సుతో చేతిరాతను గుర్తించొచ్చు. అక్షరాల ఆకృతిని అర్థంచేసుకొని.. ఎలా రాసినా చదవగలిగే సామర్థ్యం దీనికి ఉంది. శాస్త్రవేత్తలు కృత్రిమ మేధస్సును మేధోపరమైన క్రీడల్లో విజయవంతంగా వినియోగించారు. చెస్‌, పోకర్‌ వంటి కీడల్లో ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని ఓడించగలిగే సామర్థ్యం దీనికి ఉందని నిరూపితమైంది. ఒకసారి ఏదైనా తప్పిదం జరిగితే మళ్లీ వాటంతటవే సరిదిద్దుకుంటాయి. పరిసరాలకు అనుగుణంగా ప్రవర్తన, పని విధానాలను మార్చుకుంటాయి.ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే..

మానవుని అతి గొప్ప శక్తి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం. తార్కికంగా ఆలోచించడం. స్పందించడం. ప్రశ్నించడం. ఇవి నాగరికత అభివృద్ధికి మూలాలు. ఇలా ఆలోచించడానికి ముఖ్యమైంది మెదడు. మానవ మెదడు ఒక సూపర్‌ కంప్యూటర్‌ లాంటిదని విశ్లేషించవచ్చు. అందుకే మన ఆలోచనలకు, ఊహాశక్తికి సృజనాత్మకతకు హద్దులేమీ ఉండవు. ఇలాంటి ‘మెదడు’ ఒక యంత్రానికి ఉంటే ఏం జరుగుతుంది. మనం ఎలా అయితే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామో, యంత్రం కూడా సొంతంగా ఆలోచించి  చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలగడాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిలా ఓ మెషీన్‌ ఆలోచించడం. అందుకోసం దానికి కృత్రిమంగా మేధస్సును ఇవ్వడం. ఇది కంప్యూటర్‌ సైన్సులో ఒక భాగం. ఇది తెలివితేటలు కలిగిన యంత్రాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. విస్తరిస్తున్న ఈ టెక్నాలజీతో యంత్రాలతో పాటు చిన్న చిన్న డివైజ్‌లలో కూడా ఇది ఉపయోగపడుతుంది.  అవి మనుషుల్లానే పనులు చేయడంతో పాటు స్పందిస్తాయి.  ఇందులో ముఖ్యంగా ఉండేవి లెర్నింగ్‌ అండ్‌ అప్లయింగ్‌ (నేర్చుకోవడం, అనుసరించడం), అంటే చట్టూ ఉన్న వాటి నుంచి నేర్చుకుని, విశ్లేషించి పరిస్థితులకు అనుగుణంగా పని చేయడం. ఇప్పటికే ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మానవ మనుగడలో భాగమైపోయింది. మనం వాడే మొబైల్‌ ఫోన్‌లలో మాటలను రిసీవ్‌ చేసుకుని వాటికి స్పందిస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని తిరిగి అందివ్వడమే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. ఆండ్రాయిడ్‌లో గూగుల్‌ అసిస్టెంట్‌, ఐఫోన్‌లో సిరి, అమెజాన్‌ అలేక్సా ఇవ్వన్నీ ఆ కోవలోకి వస్తాయి.

రకాలు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌  వివిధ మార్గాల్లో రకరకాలుగా ఉన్నది. వాటిలో ముఖ్యంగా ...
వీక్‌ ఏఐ : వీక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే బలహీన ఏఐ అంటారు.  ఇది కేవలం ‘సిమ్యులేటెడ్‌ థింకింగ్‌' (అనుకరించడం) కోసమే ఉపయోగపడుతుంది. ఇది తెలివిగా  ఉన్నప్పటికీ దీనికి ఎలాంటి స్పృహ ఉండదు. మనిషి ఇచ్చిన కమాండ్‌ను గ్రహించి దానికి తగ్గట్టుగానే స్పందిస్తుంది. దీని వల్ల ఎలాంటి ప్రమాదకరమైన పర్యవసనాలుండవు. ఉదాహరణకు  యాపిల్‌ సిరి, మైకోసాఫ్ట్‌లో ‘కోర్టానా’, అమెజాన్‌కు చెందిన ’అలెక్సా’ వంటివి, గూగుల్‌ అసిస్టెంట్‌ వంటి అప్లికేషన్లు ఈ వీక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తాయి.  ఇవి కేవలం వాటికి అర్థమైన ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇవ్వగలవు.ఆల్గరిధమ్‌ :  ఇది మెషిన్‌ లర్నింగ్‌ టెక్నాలజీ. కంప్యూటర్లు తమకు తెలిసిన ఆల్గరిథమ్‌ను బహిర్గతం చేస్తాయి. ఆల్గరిథమ్‌తో మనం ఏం చేయాలో కచ్చితంగా దానికి చెప్పవచ్చు. డేటా ప్రాసెసింగ్‌, క్యాల్కులేషన్స్‌, ఆటోమేటెడ్‌ రీజనింగ్‌ వంటి వాటి కోసం వాడవచ్చు.. కొన్ని ఆల్గరిథమ్‌లు కంప్యూటర్లు వాటంతట అవే ఎలా నేర్చుకోవాలో చెప్తాయి. దీనిని మెషీన్‌ లెర్నింగ్‌ అని అంటారు. మెషీన్‌ లెర్నింగ్‌ అంటే కంప్యూటర్‌ తనంతట తాను నేర్చుకునేందుకు సహాయపడుతుంది. ఆల్గరిథమ్‌ ఉపయోగించి డేటాను వెలికితీస్తుంది.

నారో లేదా జనరల్‌ ఏఐ :  దీనిని ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ లేదా దృఢమైన ఏఐగా పేర్కొనవచ్చు. ఒకే రకమైన పని కోసం ఈ పరిజ్ఞానం వాడతారు. విస్తృతంగా ఉన్న పనులను విరివిగా పూర్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మానవ మేధస్సుకు ఇది దగ్గరగా ఉంటుంది. దీని వల్ల కంప్యూటర్‌ తనంతట తాను మెరుగు పడుతుంది. చివరికి అత్యంత తెలివైనదిగా మారి మానవాతీత యంత్రంగా రూపాంతరం చెందే పరిస్థితులు ఏర్పడవచ్చు. మానవ తెలివితేటలను దాటేలా ఈ తరహా యంత్రాలు తయారవవచ్చు.

బీఓటీ (బోట్‌) : సులువుగా ఉన్న పనులను చేస్తుంది. ఉదాహరణకు రిజర్వేషన్లు, క్యాలెండర్‌లో ఆపాయింట్‌మెంట్లను గుర్తుచేయడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.

తెలంగాణ @  ఏఐ  2020

సాంకేతిక పరిజ్ఞానంతో నాగరికత మునుపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చెందుతుంది. నాగరికత అభివృద్ధి అంటే మనిషి మేధస్సు నుంచి వచ్చే ఉత్పత్తి. దానికి కృత్రిమ మేధస్సు కలిస్తే మరింత పురోగతి లభిస్తుంది. సాంకేతికతను ప్రయోజనకరంగా ఉంచినంత కాలం ఇది సాధ్యమవుతుంది.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన  రోబోలు ఎన్నో రంగాల్లో విస్తరిస్తున్నాయి. హోటళ్లలో, రెస్టారెంట్లలో, ట్రాఫిక్‌ నియంత్రణలో,  నిఘా పర్యవేక్షణలో వీటి ఉనికి పెరుగుతున్నది. శాస్త్ర, సాంకేతికతల సహాయంతో ప్రపంచాన్నే గుప్పిట్లోకి తెచ్చిన శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మానవ మేధస్సుకే సవాల్‌ విసురుతున్నారు. సృష్టికి ప్రతిసృష్టిని సృష్టిస్తూనే కృత్రిమ మేధస్సును రూపొందిస్తున్నారు.  ఇందులో భాగంగానే అన్ని రంగాల్లో స్వయం నియంత్రిత -రోబోలు,  యంత్రాలు పెరుగుతున్నాయి. కృత్రిమ మేధస్సు లక్ష్యం: 

నిపుణతను తయారు చేయడం దీని ప్రధాన లక్ష్యం. తెలివి, నేర్చుకునే లక్షణం, నిరూపించడం, వివరించడం, సలహాలు అందివ్వగలిగేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం. మానవుల లక్షణాలను అర్థం చేసుకోవడం. ఆయా రంగాల్లో ఏఐ వాడకం. 

సైబర్‌ టెక్నాలజీ :

ఆర్టిఫిషియల్‌ టెక్నాలజీని ఉపయోగించి రోబోటిక్‌ లింబ్స్‌ ఏర్పాటు చేసిన వ్యక్తుల మెదడుతో అనుసంధానం చేస్తారు. దీని వల్ల వారికి అవయవాలు తొలగించారన్న భావన ఉండదు. అందువల్ల వారు సాధారణ వ్యక్తుల లానే ఉండగలరు. అందుకే వారు ఎలాంటి సమస్యా లేనట్టు సౌకర్యంగా ఉండగలుగుతారు.

ప్రమాదకమైన ఉద్యోగాల స్థానంలో భర్తీ :

చాలా రంగాల్లో ప్రమాదకరమైన ఉద్యోగ స్థానాలుంటాయి. ఇలాంటి స్థానాల్లో మనుషులు తమ ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇలా ప్రమాదకరమైన ప్రదేశాల్లో  రోబోలను ఉపయోగించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా కాపాడవచ్చ.
 
కేర్‌ టేకింగ్‌ :
 పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం కోసం కెన్యాలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రోబోలను ఉపయోగించారు. వారికి ఏ అవసరం వచ్చినా రోబోలు స్పందిస్తాయి. వారికి ఏదైనా అనారోగ్యం, అత్యవసరం సంభవించినా రోబోలు స్పందించి కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తాయి.

స్వయం రవాణా :
ఇప్పటికే సెల్ఫ్‌ డైవింగ్‌ కార్లు అందుబాటులోకి వచ్చాయి.  డైవర్లు లేకుండా నడిచే వాహనాలను ఉపయోగించుకోవాలని 2012లో గూగుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్‌ను ప్రారంభించింది.  అమెరికాకు చెందిన ట్రాన్స్‌పోర్ట్‌ ఈ రకమైన కార్లను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది.