ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

ఈ వీరుని మరణం.. చరిత్రే సాక్ష్యం

ఈ వీరుని మరణం.. చరిత్రే సాక్ష్యం

అతను! ఎవరతను? అతను.. నిరంకుశత్వంపై ఎత్తిన పిడికిలి ..బ్రిటిష్ సైన్యంపై గర్జించిన మానవ ఫిరంగి వీరత్వానికి పర్యాయ పదం ఉరికొయ్యలకు ఉయ్యాలలూగిన దేశభక్తుడు ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు స్వాతంత్య్ర సమరంలో షహీద్ అయిన హైదరాబాద్ అగ్గి బావుట.అతను ఎవరో కాదు..అతను తు్రర్రెబాజ్ ఖాన్.. మన నోర్లలో నానుతూ మనకు తెలియని తురుంఖాన్ అతనే..

శుక్రవారం, రంజాన్ మాసం జూలై 17, 1857హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. బ్రిటిష్ సేనల్ని తరిమి కొట్టడానికి హైదరాబాద్ స్వాతంత్య్రోదమకారులు అగ్గిపిడుగుల్లా వీధుల్లోకి వచ్చారు. కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీ భవనం మీద దాడి చేసి సేనల్ని తరిమి కొట్టాలన్నది పథకం. దీనికి మక్కా మసీద్ బోధకుడు మౌల్వి అల్లావుద్దీన్ నడుం బిగించాడు. అతని సన్నిహితుడు తుర్రెబాజ్‌ఖాన్ వెన్నుదన్నుగా నిలిచాడు. హిందువులు తోడుగా నిలిచారు. ధనిక వర్తకులైన సేఠ్‌లు ఆర్థికంగా ఆదుకున్నారు. ముస్లింలు, హిందువులూ కలిసి బ్రిటీష్ ఫిరంగులపై ఎదురు తిరిగారు. ఈ తిరుగుబాటు దేశంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లో హిందూ, ముస్లింల ఐక్యతకు, గంగా జమునా తహెజీబ్‌కు ఉదాహరణ...

ఆధునిక ఆయుధాలను, అపారమైన సైనిక పటాలాలను కలిగిన బ్రిటీష్ పాలకులను ఎదిరించడం అంటే మృత్యువును వాటేసుకున్నట్టే. అదే వారిపై తిరుగుబాటు చేయడం అంటే?.. ఇవ్వన్నీ స్వదేశీ యోధులకు స్పష్టంగా తెలిసినా, ప్రాణాలను లెక్క చేయకుండా బ్రిటీష్ ఫిరంగులకు దురెళ్లిన యోధులెందరో ఉన్నారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన వీరులెందరో, మృత్యువును ముద్దాడిన అమరులెందరో ఉన్నారు. భారతదేశాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి చారిత్రక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైంది 1857 సిపాయిల తిరుగుబాటు.


1857 సిపాయిల తిరుగుబాటు...

జూన్ మాసం నాటికి హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటు ప్రభావం ప్రారంభమైంది. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమంలో పాల్గొన్న హైదరాబాద్ వాసి జమీందార్ చీదాఖాన్‌ను ఔరంగాబాద్‌లో అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సీలో నిర్భంధించారు. ఆయనతో ఉన్న మరికొంత మంది సైనికులు తప్పించుకొని హైదరాబాద్ నిజాం దగ్గరకు వస్తారు. రక్షణ కల్పించాలని కోరుతారు. కానీ అప్పటికే బ్రిటీష్ వారికి హితుడైన నిజాం ఈ సైనికులను బ్రిటిష్ వారికి అప్పగిస్తాడు. తిరుగుబాటుదారుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్టట్టు అవుతుంది. వీళ్లంతా కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీ భవనంలో బంధీలవుతారు. వీళ్లను విడిపించి, బ్రిటిష్ పాలకులను ఈ గడ్డమీదనుంచి తరిమి కొట్టడానికి మక్కా మసీదు బోధకుడు మౌల్వి అల్లావుద్దీన్ సిద్ధమవుతాడు. ఆయనతో పాటు తుర్రేబాజ్‌ఖాన్. ఇద్దరూ కలిసి రొహిల్లా సైన్యాన్ని సిద్ధం చేస్తారు.


జూలై 17, 1857 సైదాబాద్ మైదానం, హైదరాబాద్

అల్లాహ్ అక్బర్ నినాదాలతో ఆంగ్లేయులపై తిరుబాటు చేయడానికి మౌల్వీ అల్లాఉద్దీన్ నాయకత్వంలో వీరుల సైన్యం బయల్దేరింది. ఆశ్వంపై అగ్రభాగాన అల్లా ఉద్దీన్ చేతిలో ఆకుపచ్చ పతాకం. అందులో చాంద్ సితార నెలవంక గుర్తులు. వీరుల సైన్యం జయజయ ధ్వానాలు చేస్తూ.. యుద్ద వీరగీతాలను ఆలపిస్తున్నది. అందిరి చేతుల్లో తుపాకులు, బరిసెలున్నాయి. ఈ సైన్యం చంపా దర్వాజా, డబీర్‌పురా, ఢిల్లీ దర్వాజాలను దాటి బేగం బజారు చౌరస్తాకు చేరుకుంది. దారిలో అనేక మంది స్వాగతం పలుకుతున్నారు. ఇంకొంత మంది ఆ సైన్యంతో అడుగులేస్తున్నారు.


మక్కా మసీదు, హైదరాబాద్

నమాజ్ కోసం మసీదు ప్రాగణంలో అందరూ సమావేశం అవుతున్నారు. అక్కడ వినిపిస్తున్న శాంతి ప్రవచనాలను యువత అడ్డుకుంది. బ్రిటీష్ వాళ్లతో పోరాడడం చాతకాకపోతే ఇంట్లో కూర్చోండి అనే మాటలు ఈటలై వస్తున్నాయి. కొద్ది సేపటికే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మినార్ల నుంచి జారిపడుతున్న ఆకుపచ్చ జెండాలను ప్రజలంతా చేతుల్లోకి తీసుకుంటున్నారు. అప్పుడే తుర్రేబాజ్ ఖాన్ మరో ఆకుపచ్చ జెండా చేత పట్టుకొని గుర్రం మీద దౌడు తీశాడు.

అల్లా ఉద్దీన్ సైన్యం బేగంబజారు చేరుకుంది. తుర్రేబాజ్‌ఖాన్ మూడు వందల మందితో అల్లా ఉద్దీన్ సైన్యాన్ని బేగంబజారులో కలిశాడు. ఈ రెండు సైనిక పటాలాలు ఏకప్రవాహంగా మారిపోయాయి. గౌలిగుడా, పుత్తీబౌలీల మీదుగా కోఠీ చేరుకున్నాయి. వీరిద్దరూ రెసిడెన్సీ భవనం దగ్గర్లోని షావుకార్లు జయగోపాల్ దాస్, అబ్బాన్ సాహెబ్ ఇంటి ముందుకు చేరారు. మక్కా మసీద్ వద్ద జనసమూహం మాయమవుతున్నది. వాళ్లంతా ఒక్కరొక్కరుగా రెసెడెన్సీ భవనం వైపు వస్తున్నారు. సాయంత్రం వరకల్లా రెసిడెన్సీ గేటు వద్ద 5000 మంది ప్రజలు పోగయ్యారు. తుర్రెబాజ్‌ఖాన్, అల్లా ఉద్దీన్ మౌల్వీ తుపాకులతో జయగోపాల్ దాస్, అబ్బాన్ సాహెబ్ బంగ్లాల మీదకు ఎక్కారు. ఆలస్యం చేయకుండా రెసిడెంట్ భవనంపైకి తుపాకీ గుండ్లను పేల్చారు. సమరం మొదలైంది. ముందే ఊహించిన బ్రిటీష్ రెసిడెన్సీ కమాండర్ సైన్యాన్ని సిద్దం చేసుకొన్నాడు. గేట్ల వద్ద ఫిరంగులను ఏర్పాటు చేశారు. గేటు దాటి ఎవరు లోపలికి వచ్చినా ఫిరంగీ గుండ్లకు పిట్టల్లా రాలిపోవాల్సిందే..

సాయంత్రం 6.30గంటలు

గేటు లోపల ఫిరంగులున్న సంగతి తుర్రెబాజ్ ఖాన్‌కు తెలిసింది. అయినా వాటిని పగుల గొట్టి లోపలికి వెళ్లి బ్రిటీష్ సేనల్ని హతం చేయాలన్నది తుర్రెభాజ్‌ఖాన్, అల్లాద్దీన్ పథకం. సాయంత్రం 6.30 గంటల సమయానికి తుర్రెభాజ్‌కాన్ రెసిడెన్సీ గేటును కూలగొట్టాడు.. మరో గేటును అల్లాద్దీన్ ధ్వంసం చేశాడు. ఆ క్షణంలోనే రెసిడెన్సీ కమాండర్ బ్రీవెట్ కాల్పులు ప్రారంభించాడు. రొహిల్లా సైన్యం ఎదురు కాల్పులు ప్రారంభించింది. రెండు వైపుల నుంచి కాల్పుల వర్షం. రెసిడెన్సీ నుంచి దూసుకొస్తున్న ఫిరంగుల తూటాలు. వాటికి వ్యతిరేకంగా అరుపులు, నినాదాలు. పిడుగులు పడుతున్నట్టు వాతావరణం. గుమిగూడిన ప్రజలు చెదిరిపోయారు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. అయినా కాల్పులు ఆగడం లేదు. మరోవైపు రొహిల్లాలు రెసిడెన్సీ గేట్లను బద్దలు కొడుతున్నారు. కానీ లాభం లేకుండా పోయింది. బ్రిటీష్ మిలటరీ ఫిరంగులు గర్జిస్తున్నాయి. రొహిల్లాల చేతుల్లో నాటు తుపాకులు, బరిసెలు, తల్వార్లు.. రొహిల్లా వీరులు టపటపా నేల రాలిపోయారు. రాత్రి 8.30వరకూ తిరుగుబాటు దారులంతా చెదిరిపోయారు. ఓటమిని అంగీకరించని తుర్రేబాజ్‌ఖాన్ ఇంకా కాల్పులు విరమించలేదు.

జూలై 17 తెల్లవారు జామున, ఉదయం 5 గంటలకు

సూర్యోదయానికి యుద్ధవాతావరణం పూర్తిగా మారింపోయింది. కొద్ది మంది సైన్యంతో తుర్రేబాజ్‌ఖాన్, అల్లావుద్దీన్ మాత్రమే ఉన్నారు. ఇద్దరూ ఒకరి కండ్లలోకి ఒకరు చూసుకున్నారు..కూలుతున్న కలలు, పెదాల మీద ఓడిపోని చిరునవ్వులు.. ఇద్దరూ పడమటి వైపు తిరిగారు. మోకాళ్ల పైకి వంగి కూర్చొన్నారు. అంతా మర్చిపోయి అల్లాను ప్రార్థించుకున్నారు. అరచేతులతో ముఖాన్ని అద్దుకున్నారు. కండ్లు తెరిచి మళ్లీ ఒకరినొకరు చూసుకొని చిరువ్వులతో నవ్వుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. కొద్ది సేపటికే ఇద్దరూ విడివిడిగా కాలినడకన గల్లీల్లో నడుచుకుంటూ బేగం బజారులోని సేఠ్ పూరణ్‌మల్ బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ గుర్రాలను, కొంత నగదను సిద్ధం చేసి పెట్టాడు సేఠ్. వాళ్లిద్దరూ అక్కడ వేషాలు మార్చుకొని సేఠ్‌కు కృతజ్ఞతలు చెప్పి బెంగళూర్ వైపు వెళ్లిపోయారు. రెసిడెన్సీ మీద దాడి విషయంపై పశ్చాత్తాపానికి నిజాం నవాబు, సాలార్‌జంగులు రెసిడెంట్‌కు ఉత్తరాలు రాశారు. నిజాం ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్నారని జయగోపాల్ దాస్‌ను, ఆయన కుమారులను, అబ్బాస్ సాహెబ్ కుటుంబాన్ని అరెస్టు చేశారు. ఆస్తులను జప్తు చేశారు. రెసిడెన్సీపై దాడి చేసిన తుర్రెబాజ్‌ఖాన్‌ను, అల్లా ఉద్దీన్‌ను పట్టించినా, ఆచూకీ తెలిపిన వారికి ఐదు వేల రూపాయలు ఇస్తాం అని వారి తలలకు వెలలు కట్టారు.

బెంగళూర్ వైపు వెళ్తున్న తుర్రెబాజ్ ఖాన్‌ను షాద్‌నగర్ దగ్గరల్లోని మొగిలిగిద్ద వద్ద పోలీసులు గుర్తించారు. అనంతరం కాల్పులూ జరిపారు. ఒక తూటా తొడలో, మరొక తూటా మోకాలు పై భాగాన తగిలింది.తుర్రేబాజ్ ఖాన్‌ను విచారణ కోసం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణ జరిపారు. ఎంత హింసించినా మౌల్వీ అల్లా ఉద్దీన్ ఎవరో తెలియదనే చెప్పాడు. బ్రిటీష్ వారిపై విజయం సాధించకపోయినా ధిక్కారాన్ని తెలియజేశాం అని ప్రకటించాడు. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరన్న సంగతి మాత్రం నోరు విప్పలేదు. విచారణ అనంతరం అండమాన్‌లో యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని నిర్ణయమైంది.

1858, జనవరి 18 కస్టడీలో ఉన్న తుర్రెబాజ్ ఖాన్‌ను అండమాన్‌కు తరలిస్తున్న రోజు. అప్పుడే తుర్రేబాజ్ ఖాన్ పోలీసుల నుంచి మెరుపు తీగలా తప్పించుకున్నాడు. పోలీసులకు చిక్కకుండా అతను హైదరాబాద్ శివారు గ్రామంలో తలదాచుకున్నాడు. కానీ రెండు రోజుల తర్వాత పోలీసులకు సమాచారం దొరికింది. మెదక్ జిల్లా తూడన్‌లో తుర్రెబాజ్ ఖాన్ ఉన్నట్టు స్పష్టమైన సమాచారం అందింది. వెంటనే పోలీసులు తూప్రాన్‌లో తుర్రెబాజ్ ఖాన్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. చీమల గుంపులా చేరి అతన్ని పట్టుకున్నారు. తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. పోలీసుల కాల్పులు. తూటాలన్నీ అతని శరీరంలోకి దూసుకెళ్లాయి. ఆ వీరుడు అక్కడే వీర మరణం పొందాడు. భారతదేశ విముక్తి కోసం ఆంగ్లేయులపై ఫిరంగిలా గర్జించిన తుర్రెబాజ్ ఖాన్ పోలీసు ఘర్షణలో అమరుడయ్యాడు. తుర్రెబాజ్ ఖాన్ మృతి తిరుగుబాటుదారులకు గుణపాఠం కావాలని అతని మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మొండాన్నీ, తలను వేరు చేసి కోఠి చౌరస్తాలో బీభత్సం సృష్టించారు. గొలుసులతో వేలాడదీశారు. కొన్ని రోజుల పాటు ప్రదర్శనకు పెట్టారు. ఆ వీరుడి శవాన్ని చూసి నగర ప్రజలంతా కన్నీరు పెట్టారు. ఈ వీరుని మరణం చరిత్రలో నిశ్శబ్దంగానే మిగిలిపోయింది.

ఓ వీరుని యాదిలో..

స్వాతంత్య్ర సమరం ఉత్తర భారతదేశం నుంచే మొదలైందని చాలా మంది అనుకుంటున్నా.. మన హైదరాబాద్‌లో సిపాయిల తిరుగుబాటుకు పుస్తకాల్లో సరైనా చోటు దక్కకపోయినా.. హైదరాబాద్‌లోని నేటి కోఠి ఆంధ్రా బ్యాంకు రోడ్డు తుర్రెబాజ్ ఖాన్ రోడ్డు అనే పేరు మనకు కనబడకపోయినా..నువ్వు తురుంఖాన్ వా? అని ఓ సామెత తుర్రేభాజ్‌ఖాన్ అనే వీరుని నేపథ్యం అని మనకు తెలియక పోయినా.. ఇవ్వన్నీ ప్రజలకు చేరని చరిత్ర చెప్పే పచ్చి నిజాలు..మీరెప్పుడైనా కోఠికి వెళ్తే చౌరస్తాలోని తుర్రేబాజ్ ఖాన్ స్మృతి స్థూపానికి , వీరులకు ఒక్కసారైనా జోహార్లు అర్పిస్తారు కదూ!

-వినోద్ మామిడాల, సెల్: 7660066469


logo