మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jan 19, 2020 , 03:55:55

ఏకశిలాక్షేత్రం నాపాక సర్వతోభద్ర దేవాలయం

ఏకశిలాక్షేత్రం నాపాక సర్వతోభద్ర దేవాలయం

జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం నైన్‌పాకలోని  అపురూప కట్టడం అందరినీ అలరిస్తున్నది. మన ఆలయాల్లో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది... ఒకటి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తే.. మరొకటి ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతుంది..కానీ నాపాక ఏకశిల సర్వతోభద్ర కోవెల మాత్రం కలకాలం గుర్తుండిపోయే మధురానుభూతిని ఇస్తుంది.. ఒకే శిలపై నాలుగు వైపులా దేవతా విగ్రహాలు ఉన్నాయిక్కడ. సుందరమైన శిల్పకళా వైభవంతో పాటు మహిమానిత్వ గుడిగా భక్తులతో పూజలందుకుంటున్న నాపాక సర్వతోభద్ర దేవాలయాన్ని మనమూ దర్శించుకుందాం రండి.  ఇది పురాతన ఆలయం. దక్షిణ భారతంలోనే ఇలాంటి శైలి ఎక్కడా కనిపించదు. ఏకశిలపై నాలుగు దిక్కులా విగ్రహాలుండడం దీని ప్రత్యేకత. గ్రామ శివారులోని ఈ పురాతన కోవెల చాలా ఏండ్ల నుంచి ఆదరణకు నోచుకోవడం లేదు.ఈ మధ్యనే గ్రామస్థులు వెలుగులోకి తీసుకొచ్చి పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. నాపాక ఆలయం 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించినట్లు చెబుతారు. విగ్రహాలన్నీ ఏకశిలపై చెక్కినవే. గుడి చుట్టూ అడుగుభాగం అంతా శిలతోనే ఉంటుంది.పూర్వం మునులు ఇక్కడ తపస్సు చేశారని, అందుకే మునికుంట పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈ నాపాక ప్రాంతాన్ని కాకతీయరాజులు పరిపాలించినందున ఈ ఆలయానికి ‘నాపాకగుడి’అని పేరు వచ్చినట్లు, కాలక్రమేణా నైన్‌పాకగా పిలుస్తున్నట్లుగా తెలుస్తున్నది. 

ఏకశిలా విగ్రహలు: గతంలో కోవెలను సందర్శించిన కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆలయానికి నాలుగు ముఖద్వారాలున్నాయి. నాలుగు వైపులా దేవతా విగ్రహాలుంటాయి. తూర్పున శ్రీలక్ష్మినరసింహస్వామి, పశ్చిమాన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఉత్తరాన రాముడు, సీత, లక్ష్మణుడు, దక్షిణాన శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామతోపాటు గరుడాల్వర్‌, ఆంజనేయస్వామి ఈ ఏకశిలపైనే కొలువుదీరి ఉన్నారు. ఏకశిలపై   ఈ ఆలయాన్ని నిర్మించినందున ఈ క్షేత్రాన్ని ఆది ఏకశిలాక్షేత్రం అని అంటారు.గుడిని రాతితో నిర్మించారు. పైభాగంలో గాలి గోపురం సుమారు 50 అడుగుల ఎత్తు ఉంటుంది. కోనేరు, చెరువు, రచ్చబండ, వరుణకొండ, స్వామివారి పాదుకలు, లజ్జగౌరి, 11 పాదులు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి.

నాటి నాపాకే నేటి నైన్‌పాక: ఈ ఆలయం ఎక్కడా లేని విధంగా గర్భగుడి ఎంతో ఎత్తులో అతిపెద్ద గాలి గోపురం వలె ఉంటుంది. ఆలయం పక్కనే స్వామివారి కోనేరు, ఆలయం వెనుక భాగంలో పెద్ద సరస్సు, వరుణదేవుడి పర్వతం, రాజుల కాలంనాటి రాజ కచ్చీరు సువిశాలమైన స్థలంలో ఉంటాయి. ఈ ప్రాంతాన్ని పూర్వం నాపాక, మునికుంట అని పిలిచేవారు. పూర్వం మునులు ఇక్కడ తపస్సు చేశారని, అందుకే మునికుంట పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఈ నాపాక ప్రాంతాన్ని కాకతీయరాజులు పరిపాలించినందున ఈ ఆలయానికి ‘నాపాకగుడి’అని పేరు వచ్చినట్లు, కాలక్రమేణా నైన్‌పాకగా పిలుస్తున్నట్లుగా తెలుస్తున్నది. మీసాల దేవుళ్లు: దక్షిణ భారతదేశంలో ఇలాంటి దేవాలయం ఎక్కడా లేదు. ఇక్కడ కొలువైన స్వామి వారు సుమారు ఐదున్నర ఫీట్ల ఎత్తులో ఉంటారు. విగ్రహమూర్తులు మీసాలను కలిగి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం.మూల విరాట్టు ఎంతో గాంభీర్యాన్ని సంతరించుకుని ఉంటుంది. 
 
అభివృద్ధి కమిటీ: ఈ మహిమానిత్వ గుడికి తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి స్థానికులు, మాజీస్పీకర్‌ మధుసూదనాచారి కృషి చేస్తున్నారు.ఆయన సుమారు రూ. 5కోట్లను మంజూరు చేయించారు. అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఆలయ విశిష్ఠతను గుర్తించిన గ్రామస్థులు దాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం 30 మందితో కమిటీ ఏర్పాటు చేసుకుని విరాళాలు సేకరించారు. చేయీచేయీ కలిపి శుభ్రం చేశారు. హద్దులు ఏర్పాటు చేయించారు. అర్చకులను నియమించారు.కనుమరుగవుతున్న ఈ ప్రాచీన ఆలయ చరిత్రను స్థానికుడైన పెండల రమేష్‌ ‘మా ఊరి మహారాజు’ అనే పుస్తక రూపంలో ప్రపంచానికి పరిచయం చేశారు. 


-మధుకర్‌ వైద్యుల


logo