సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

ఆవుపేడతో కాగితం!

ఆవుపేడతో కాగితం!

 ఆవుపేడ పొలాల్లో క్రిమిసంహారిణిగా ఉపయోగపడుతున్నది. దీనితో ఇల్లు అలికితే క్రిమి, కీటకాలు రావు. ఆవు మూత్రం పోషకాల ద్రవం, ఆరోగ్యానికీ ఎంతో శ్రేష్ఠమనే ప్రచారం పురాణ కాలం  నుంచీ  ఉన్నది. ఆవు పేడ సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. పంటలకు ఎరువుగానే కాకుండా.. బయోగ్యాస్‌, విద్యుత్‌ కూడా ఉత్పత్తి అవుతున్నది. ఇప్పుడు ఆవు పేడతో మరో అద్భుతాన్ని అందిస్తున్నారు.  ఆవుపేడ నుంచి కాగితం తయారు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ పరిధిలో పనిచేసే కుమరప్ప నేషనల్‌ హ్యాండ్‌మేడ్‌ పేపర్‌ ఇనిస్టిట్యూట్‌ (కేఎన్‌హెచ్‌పీఐ) ఆవుపేడనుంచి పేపరు తయారు చేసింది. ఈ విధానంలో తయారైన పేపర్‌కు, సాధారణ పద్ధతిలో తయారైన పేపర్‌కు పెద్దగా తేడా లేదు. రెండూ ఒకేలా ఉన్నాయి. ఈ విధానం ద్వారా అక్కడి సర్కారు రైతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. రాజస్థాన్‌లోని జాలోర్‌లోని ఓ గోశాల వారు ఇప్పటికే ఆవుపేడతో పేపర్‌ను తయారు చేయడం మొదలు పెట్టారు. కేఎన్‌హెచ్‌పీఐ అభివృద్ధి చేసిన ఈ విధానాన్నే వారు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా కాగితాన్ని రూపొందించడం మొదలు పెడితే ఎక్కువ మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది. ఇటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా మరింతమందికి ప్రయోజనం చేకూరనున్నది. అందుకే ‘ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రామ్‌' కిందకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఎవరైనా ఈ పేపర్‌ తయారీ ప్లాంట్‌ పెట్టుకోవచ్చని కేఎన్‌హెచ్‌పీఐ డైరెక్టర్‌ ఏకే గార్గ్‌ చెబుతున్నారు. ప్లాంట్‌ కావల్సిన వారు ఆర్డర్‌ చేసిన 20 రోజుల్లోగా అందిస్తామని ఆయన అన్నారు.

ఎలా తయారు చేస్తారు?

ఆవుపేడతో కాగితాన్ని రూపొందించే ప్రక్రియలో  దానిని వేడి చేస్తారు. కేవలం పేడ ద్వారా పటుత్వం రాదు కాబట్టి. అందుకోసం పత్తిని ఉపయోగిస్తారు. పత్తిని ఉపయోగించడం ద్వారా పేపర్‌ మరింత నాణ్యంగా ఉంటుంది.

బ్యాగుల తయారీ

ఆవుపేడతో పేపర్‌  తయారు చేసే ప్లాంట్‌ను నెలకొల్పేందుకు రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్లాంట్‌ సైజ్‌ను బట్టి 10 నుంచి 15 మందికి ఉపాధి లభిస్తుంది. కాగా మార్కెట్‌లో కేజీ ఆవు పేడ ఖరీదు రూ.4 నుంచి రూ.5 పలుకుతున్నది. ఈ క్రమంలో ఆవు పేడ ద్వారా పేపర్‌ను తయారు చేసి పట్టణాలు, నగరాల్లో అమ్మితే మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ పేపర్‌ను నోటు పుస్తకాల రూపంలోనే కాకుండా, కాగితపు బ్యాగుల తయారీకి కూడా ఉపయోగించవచ్చు. ఇది ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించడానికి ఆవుపేడ కాగితం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

ఆవుపేడతో దుస్తులు కూడా

ఆవుపేడతో దుస్తులు తయారు చేసిన ఓ డిజైనర్‌  ఔరా అనిపించింది. నెదర్లాండ్‌కు చెందిన డిజైనర్‌ జలీలా ఎసాయిది సరికొత్తగా ఆవుపేడతో దుస్తులు రూపొందించింది. ఐండ్‌హోవెన్‌ నగరానికి చెందిన ఆమె సరికొత్త దుస్తులను మార్కెట్‌లోకి ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తున్నది. అందుకోసం  ఆమె పరిశోధనల ద్వారా ఆవుపేడలో ఉండే సెల్యూలోజ్‌ను వేరు చేసి దానితో ఫ్యాషనేబుల్‌ డ్రెస్‌లు రూపొందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇటువంటి దుస్తులు తయారు చేసేందుకు ‘బయోఆర్ట్‌ ల్యాబొరేటరీస్‌ ఫౌండేషన్‌' పేరుతో కంపెనీ ఏర్పాటు చేసింది. మొదట ఆవుపేడతో దుస్తులు రూపొందించేందుకు మాత్రమే ఈ సంస్థ పరిశోధనలు జరిపింది. ఈ నూతన ఆవిష్కరణను ప్రవేశ పెట్టినందుకు ఆమెకు హెచ్‌ఎం అండ్‌ గ్లోబల్‌ చేంజ్‌ అవార్డు, చివాస్‌ వెంచర్‌ పురస్కారం అందించారు. ఆవు పేడ భవిష్యత్‌లో మరింత ప్రియం అయ్యే అవకాశం ఉన్నదని జలిలా చెబుతున్నది.కబేళాలకు తరలించే పనిలేదు

కొందరు రైతులు గతంలో పాలివ్వని ఆవులను కబేళాలకు తరలించేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. రాజస్థాన్‌లోని గోపాలన్‌ శాఖ గోశాలల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. ఎన్ని గోవులను పెంచితే అంత పేపర్‌ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని గోశాలలు గోమూత్రం నుంచి ఔషధాలు తయారు చేసే పనిలో నిమగ్నమవుతుండగా, మరికొన్ని స్టార్టప్‌ సంస్థలు ఆవుపేడతో పేపర్‌ తయారు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అందుకోసం సరికొత్త సాంకేతికతను వినియోగంలోకి తెచ్చేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం గోశాలలకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నది. రాజస్థాన్‌లో 1,160 గోశాలల్లో 5 లక్షల గోవులు ఉన్నాయి. ఆవుపేడ, గోమూత్రం నుంచి సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ఆవుపేడతో బయోగ్యాస్‌ ఉత్పత్తి అవుతున్నది. బయోగ్యాస్‌కు వినియోగించిన వ్యర్థాల్లో నైట్రోజన్‌ లభిస్తున్నది. పశ్చిమ బెంగాల్‌లో ఆవుపేడతో కరంటు ఉత్పత్తి చేశారు. పంజాబ్‌లోనైతే ఆవుపేడతో ఇంటింటికీ బయోగ్యాస్‌ను అందిస్తున్నారు.


logo