మంగళవారం 04 ఆగస్టు 2020
Sunday - Jul 11, 2020 , 22:57:21

మహేష్‌బాబు 12గంటలకు ఫోన్‌ చేశాడు!

మహేష్‌బాబు 12గంటలకు ఫోన్‌ చేశాడు!

ఘనమైన కుటుంబ నేపథ్యం, పరిశ్రమలో పుష్కలమైన అండదండలు ఉండి కూడా వినమ్రశీలిగా, నిగర్విగా పేరు తెచ్చుకోవడం అంత సులభం కాదు. హీరో సుధీర్‌బాబును చూస్తే అది నిజమనిపిస్తుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ అల్లుడు, మహేష్‌బాబు బావ అనే బలమైన ముద్ర ఉన్నప్పటికి హంగూఆర్భాటాలకు దూరంగా ఉంటారాయన. కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నారు. ‘ప్రేమకథా చిత్రమ్‌' ‘భలే మంచిరోజు’ ‘శమంతకమణి’ ‘సమ్మోహనం’ చిత్రాలు సుధీర్‌ బాబుకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆయన నానితో కలిసి ‘వి’ చిత్రంలో నటిస్తున్నారు. ‘బతుకమ్మ’ పలకరించినప్పుడు సుధీర్‌బాబు చెప్పిన సంగతులివి..

పదేళ్ల సినీ ప్రయాణంలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. నా ఆశలు, ఆకాంక్షల సాఫల్యానికి చిత్రసీమ గొప్ప వేదికగా నిలిచింది. వినూత్నమైన కథాంశాల్ని ఎంచుకొని ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. కొందరు దర్శకులకు వారి కెరీర్‌లోనే ఉత్తమ సినిమాల్ని అందించానన్న గొప్ప సంతృప్తి మిగిలింది. ఈ దశాబ్ద కాలంలో నేను సాధించిన విజయాల పట్ల సంతోషంగా ఉన్నా.

ప్రాథమ్యాలు మారలేదు

కథల ఎంపికలో నా ప్రాథమ్యాల్లో పెద్దగా మార్పు రాలేదు. జయాపజయాలకు అతీతంగా నా అభిరుచుల్ని ప్రతిబింబించే కథల్ని ఎంచుకుంటున్నా. అయితే మనకంటూ ఓ ఇమేజ్‌ వచ్చిన తర్వాత తదుపరి సినిమాకు ఇంకా ఉత్తమమైన స్క్రిప్ట్‌ను ఎంచుకోవాలనే అభిలాష మాత్రం పెరుగుతుంది. ‘సమ్మోహనం’ చిత్రం నన్ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చేరువచేసింది. దాంతో అలాంటి కథల్లో మరింత వైవిధ్యాన్ని ప్రదర్శించాలనే తపన పెరిగింది. నేను డిఫరెంట్‌ జోనర్స్‌లో సినిమాలు చేశాను. నటుడిగా నాలోని భిన్న పార్శాల్ని ఆవిష్కరించుకునేందుకు ఆ సినిమాలు దోహదపడ్డాయి. ఏదో ఒక ఇమేజ్‌ చట్రంలో ఇమిడిపోకుండా వినూత్న పాత్రలతో మెప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటే అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్నీ పొందవచ్చన్నది నా ఆలోచన.

ఆడియెన్స్‌ దృష్టికోణంలో ఆలోచిస్తా

‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ సినిమాకు ముందు నేను యాక్షన్‌ అంశాలున్న సినిమాలు చేశాను. ఒక్కసారిగా హృదయాన్ని స్పృశించే ప్రేమకథను చేయడంతో ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు. ‘సుధీర్‌బాబు తన బాడీలాంగ్వేజ్‌కు భిన్నంగా వినూత్నమైన సినిమాల్ని చేయగలడు’ అనే ఇమేజ్‌ ఏర్పడింది. మన వ్యక్తిగత అభిరుచులతో పాటు ప్రేక్షకుల ఆలోచనల్ని గౌరవిస్తూ మంచి సినిమాలు చేసినప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటాం. కథలు వింటున్నప్పుడు ‘ఈ సినిమాకు నేను మొదటిషోకు వెళితే నాకు నచ్చుతుందా? లేదా? అనే అంశాన్ని ప్రామాణికంగా తీసుకుంటా. ఆడియెన్స్‌ దృష్టికోణంలో కథను విశ్లేషిస్తా. ఫలానా సన్నివేశంలో వారి స్పందన ఎలా ఉంటుంది? వారేమైనా బోర్‌గా ఫీలవుతారా? అని ఆలోచిస్తాను. కథ నా కెరీర్‌కు ఏ విధంగా ఫ్లస్‌ అవుతుందో అన్నది రెండో ప్రయారిటీగా తీసుకుంటా. 

‘వి’లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా

ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ సినిమాలో నటిస్తున్నా. ఇందులో నేను పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నా. గతంలో ‘మోసగాళ్లకు మోసగాడు’ ‘వీరభోగ వసంతరాయలు’ చిత్రాల్లో పోలీస్‌గా చిన్న పాత్రల్లో నటించాను. కానీ ‘వి’ చిత్రంలో పోలీస్‌ పాత్ర ఫుల్‌లెంగ్త్‌లో ఉంటూ శక్తిమంతంగా సాగుతుంది. నానితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ‘నాని ఉన్నాడు అంటే మంచి కాంపిటీషన్‌ ఉంటుంది కదా..ఎలా చేస్తావ్‌?’ అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. నాని అద్భుతమైన ప్రతిభకలిగిన నటుడు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. డైరెక్టర్‌ అవుదామనుకొని వచ్చి నటుడయ్యాడు కాబట్టి నాని స్క్రిప్ట్‌ సెలక్షన్‌ చాలా బాగుంటుంది.

పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ డ్రీమ్‌ప్రాజెక్ట్‌

స్వీయ నిర్మాణ సంస్థలో ‘నన్ను దోచుకుందువటే’ సినిమా చేశాను. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్‌లు వింటున్నా. వాటిలో నేనే హీరోగా చేయాలనే ఆలోచన ఉంది. ఒకవేళ కథ డిమాండ్‌ చేస్తే ఇతర హీరోల్ని కూడా తీసుకునే ఛాన్స్‌ ఉంటుంది. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ జీవిత కథా చిత్రాన్ని చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్‌కు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి.  పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. తప్పకుండా ఆ సినిమాను పట్టాలెక్కిస్తా. ఎట్టిపరిస్థితుల్లో ఆ చిత్రాన్ని పక్కనపెట్టేది లేదు.

లార్జ్‌స్క్రీన్‌లోనే చక్కటి అనుభూతి

లాక్‌డౌన్‌తో ‘వి’ సినిమా విడుదల నిలిచిపోయింది. కరోనా ప్రభావం లేకుండా ఉంటే మే నెలలోనే ప్రేక్షకులముందుకొచ్చేది. ఆ విషయంలో కాస్త నిరుత్సాహపడ్డాను. అయితే ప్రతిరోజు ‘వి’ సినిమా వార్తల్లోనే ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. నిర్మాణం నుంచే ఆ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. కొందరు ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేస్తారేమో అనుకున్నారు. అలాంటిదేమి లేదు. థియేటర్‌లోనే ‘వి’ రిలీజ్‌ అవుతుంది. ప్రతి ఆర్టిస్టు, సాంకేతిక నిపుణుడు తన పనితనం ప్రజలకు  చేరాలనుకుంటాడు. థియేటర్‌లో సినిమా ప్రదర్శన ద్వారానే అది సాధ్యమవుతుంది. ‘వి’ సినిమా కథలో వైవిధ్యంతో పాటు సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. అలాంటి సినిమాల్ని లార్జ్‌స్క్రీన్‌లో చూస్తేనే చక్కటి అనుభూతి దక్కుతుంది.

స్క్రిప్ట్‌ కుదిరితే మహేష్‌తో నటిస్తా

సినిమాల ఎంపికలో నా సొంత నిర్ణయాలు తీసుకుంటాను. మావయ్య కృష్ణగారు, బావ మహేష్‌బాబు నా సినిమాల విషయంలో ఎలాంటి సూచనలు చేయరు. మా కుటుంబం వ్యక్తిగత అభిప్రాయాలకు ఎంతో విలువనిస్తుంది. మనసుకు నచ్చిన పనిని స్వేచ్ఛగా చేయాలన్నది మా ఫ్యామిలీ ఫిలాసఫీ. అయితే మావయ్య, మహేష్‌బాబు నటించిన సినిమాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తుంటా. సినిమాల విజయానికి కారణాలేంటో వారి అనుభవాల నుంచి తెలుసుకుంటా. మహేష్‌బాబుతో కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ ఆ ఆలోచనతో నన్నెవరూ సంప్రదించలేదు. ఇద్దరికి నచ్చిన మంచి స్క్రిప్ట్‌ దొరికితే మహేష్‌బాబుతో కలిసి నటించాలనుకుంటున్నా. ‘సమ్మోహనం’ సినిమా చూసిన తర్వాత  మహేష్‌బాబు అర్థరాత్రి 12గంటలకు ఫోన్‌ చేశారు. ‘అద్భుతంగా పర్‌ఫార్మ్‌ చేశావ్‌. సినిమాను బాగా ప్రమోట్‌ చేసుకో’ అని ప్రశంసించారు. ‘వి’ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఓ సందర్భంలో ‘నా ఫేవరేట్‌ సినిమాల్లో  ‘సమ్మోహనం ఒకటి’ అని నాని నాతో చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది.

నటనకు కూడా ప్రాక్టీస్‌ కావాలి

స్పోర్ట్స్‌ మాదిరిగానే యాక్టింగ్‌లో కూడా ప్రాక్టీస్‌ ద్వారా పర్‌ఫెక్షన్‌ సాధించవొచ్చు. లాక్‌డౌన్‌ విరామంలో నా నటనలోని స్కిల్స్‌ను మరింత మెరుగుపరచుకోవడానికి  ప్రయత్నించాను. నచ్చిన సినిమా చూసినప్పుడు అందులోనే సీన్స్‌ గురించి నోట్స్‌ రాసుకునేవాడిని. లాక్‌డౌన్‌ వల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడిపే అవకాశం దక్కింది. హీరోగా నా పేరుకంటే..నేను చేసిన సినిమాలు, పాత్రలు ప్రజలకు బాగా గుర్తుండిపోవాలన్నది నా కోరిక. అదే నా కెరీర్‌లో నిజమైన విజయంగా భావిస్తా.logo