గురువారం 03 డిసెంబర్ 2020
Sunday - Nov 08, 2020 , 00:52:37

పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

అనుభవ సారం


ఆత్మనివేదనం

 (ఆదిపర్వం, ఉద్యోగపర్వం)

రచయిత: అమరేశం రాజేశ్వర శర్మ

పుటలు: ఒక్కొక్కటి 166, 174, 

వెల: ఒక్కొక్కటి 50/-

ప్రతులకు: 94407 84614

జీవితం ఎప్పుడూ లేనంత వేగంగా గడుస్తున్నది. సాంకేతికతే పరమావధిగా నిలుస్తున్నది. ఫలితంగా... ఓ నూరేళ్ల క్రితం సమాజం ఎలా ఉండేదో తెలియని పరిస్థితి. గతతరాలు నడిచి వచ్చిన దారులేవో గుర్తుపట్టలేని దుస్థితి. ఆ ఎరుక కలగాలంటే అప్పుడప్పుడూ మన పెద్దలు రాసిన అనుభవాలను చదవాల్సిందే! అలాంటి పుస్తకాలే ఇవి. ఉపాధ్యాయునిగా, సిద్ధాంతిగా, ఆధ్యాత్మికవేత్తగా, న్యాయవాదిగా అనేక భూమికలను నిభాయించిన ఓ అనుభవజ్ఞుడి కథ ఇది. ఆది పర్వం, ఉద్యోగ పర్వం పేరుతో వెలువడిన ఈ రెండు సంపుటాలూ... ఆయన బాల్య జీవితాన్నీ, ఉద్యోగానుభవాలనూ అక్షరబద్ధం చేశాయి. గాంధీ దర్శనం, రజాకార్లతో విభేదాలు, నాటి సంప్రదాయాలు, విద్యావిధానం, ఆహారపు అలవాట్లు... అన్నిటినీ దగ్గర ఉండి పరిచయం చేస్తాయి. పుస్తకాలను అధ్యయనాల కింద భాగిస్తే, పఠనీయత మరింతగా పెరిగేది. అలాగని వీటి చారిత్రక విలువకు వచ్చిన లోటేమీ లేదు. ఈ రెండు భాగాల తర్వాత మరో పుస్తకం రానున్నదని ప్రకటించారు రచయిత రాజేశ్వర శర్మ.జీవన చిత్రం

మిస్టర్‌ బాలు

రచయిత: అమ్జద్‌

పుటలు: 120, వెల: 100/-

ప్రతులకు: 040-2767 8430

ఓ మూడు దశాబ్దాల క్రితం మాట. సెల్‌ఫోన్లు, టీవీలు లేని ఆ రోజుల్లో... వినోదానికైనా, విజ్ఞానానికైనా పత్రికలే పెద్దదిక్కు. వాటిలో వచ్చే ధారావాహికల కోసం దారికాయడం ఓ నోస్టాల్జియా. అలాంటి సమయంలో ‘మిస్టర్‌ బాలు’ పేరుతో ఓ సీరియల్‌ మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అది నవలారూపంలో వెలువడింది. బాలు అనే మృదుస్వభావి ఈ కథానాయకుడు. తన భార్య క్షయవ్యాధితో శానిటోరియంకు చేరుకుంటుంది. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు. వారిలో కరుణ అనే బిడ్డ, అత్తవారింట కట్నాల వేధింపులను తట్టుకోలేక పుట్టింటికి చేరుకుంటుంది. ఇదీ స్థూలంగా బాలు కథ. బాలుకు ఖాన్‌సాబ్‌ అనే చిరకాల మిత్రుడు ఉంటాడు. ఆ ఖాన్‌సాబ్‌ సాయంతో తన కష్టాల నుంచి ఎలా గట్టెక్కాడన్నదే కథనం. హిందూముస్లింల అన్యోన్యత, సారా వ్యతిరేక పోరాటాలు, బాసిజం లాంటి సవాలక్ష విషయాల మీద చక్కటి పరిశీలన కనిపిస్తుందీ పుస్తకంలో. మూడు దశాబ్దాల నాటి జీవితాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఓ దిక్సూచి.