గురువారం 03 డిసెంబర్ 2020
Sunday - Nov 08, 2020 , 00:45:51

ఈ కొమ్మ కుందనపు బొమ్మ

ఈ కొమ్మ కుందనపు బొమ్మ

నట వారసత్వం లేదు. అయితేనేం, వచ్చిన ప్రతి అవకాశంలోనూ తళుక్కున మెరుస్తూ ‘కుందనపు బొమ్మ’లా ఉందనిపించుకుంది. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఈ అమ్మాయి  కారు చుట్టూ  తిరిగే ‘శమంతకమణి’ చిత్రంలో మరకతమణిలా మెరిసింది. తాజాగా ‘కలర్‌ఫొటో’ చిత్రంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యక్షమైంది చాందినీ చౌదరి. ఈ ముద్దుగుమ్మ కథాకమామీషూ తెలుసుకుందాం!

షార్ట్‌ ఫిల్మ్స్‌  షూటింగ్‌లో షాట్‌ తీస్తున్నప్పుడు తన చుట్టూ ఎవరూ ఉండకూడదని షరతులు పెట్టేదట చాందిని. కెమెరా ముందు ఏ బెరుకూ లేకుండా నటించే ఆమె.. ఇతరులు తనను గమనిస్తున్నారని తెలిస్తే చాలు, సిగ్గుల మొగ్గ అయిపోయేదట. నటించడం ఆపేసి కంగారుపడేదట. రానురాను ఈ అలవాటు మార్చుకుందనుకోండి. ఇప్పుడు ఎంత మంది ఉన్నా.. డైరెక్టర్‌ యాక్షన్‌ చెప్పడంతో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తుంది.

చాందినీ చౌదరి పక్కా తెలుగింటి అమ్మాయి. పుట్టింది సాగర నగరం విశాఖపట్టణంలో. పెరిగిందీ అక్కడే. చదువు మాత్రం బెంగళూరులో సాగింది. అక్కడే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసింది. ప్రతి క్లాసులో డిస్టింక్షన్‌ మార్కులు సాధించేది. పట్టుదల ఎక్కువ. ఎంత కష్టమైనా చేయాలనుకున్న పని చేసేస్తుంది.

ఇంజినీరింగ్‌లో క్లాస్‌లో చాందిని ఒక్కతే అమ్మాయి. సీనియర్స్‌లోనూ, జూనియర్స్‌లోనూ అమ్మాయిలే లేరట. అయినా, ఈ గ్రూప్‌ తీసుకున్నానేంటని ఎప్పుడూ అనుకోలేదు. కష్టపడి చదివేది. స్నేహితుడితో కలిసి ఓ ప్రాజెక్ట్‌ కూడా చేసింది. విండ్‌ ఎనర్జీకి సంబంధించిన ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో చేయలేకపోయారట. ఎప్పటికైనా దాన్ని 

పూర్తి చేస్తానని అంటున్నది.

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాతో తెరంగేట్రం చేసిన చాందిని ‘కుందనపుబొమ్మ’ సినిమాతో గుర్తింపు పొందింది. ‘మను’ చిత్రంతో నటిగా తన సత్తా చాటింది. ‘శమంతకమణి’తో మంచి మార్కులు కొట్టేసింది. లై, బ్రహ్మోత్సవం సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించింది. ‘హౌరాబ్రిడ్జ్‌' పుణ్యమాని ప్రేక్షకులకు మరింత చేరువైంది. తాజాగా కలర్‌ఫొటోలో విభిన్నమైన పాత్రను  పోషించి మన్ననలు అందుకుంది.

ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించింది చాందిని.  మొదటగా ‘ద వీక్‌' అనే చిట్టి చిత్రంలో కనిపించింది. తర్వాత సుభాష్‌ చంద్ర దర్శకత్వంలో రాజ్‌తరుణ్‌తో కలిసి నటించిన ‘ద బ్లయిండ్‌ డేట్‌' షార్ట్‌ ఫిల్మ్‌ వైరల్‌ కావడంతో చాందినీని సినిమా ఆఫర్లూ 

పలకరించాయి.

స్టేజ్‌పై మాట్లాడాలంటే  కాళ్లు వణికిపోతాయి. ఈ సంగతి ఎవరూ కనిపెట్టకుండా లాంగ్‌ గౌన్‌ వేసుకుంటుంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే వల్లమాలిన అభిమానం. జీవితంలో ఒక్కసారైనా ఆయనను నేరుగా కలవాలనేది ఆమె కల. గుంపులో గోవిందమ్మలా కాకుండా... రజనీ తనను గుర్తించే స్థాయికి చేరుకున్నాక కలుస్తానంటున్నది.