గురువారం 03 డిసెంబర్ 2020
Sunday - Nov 08, 2020 , 00:43:31

అనుబంధ వాచకం

అనుబంధ వాచకం

నిశ్చితార్థానికి అటు నలుగురు, ఇటు నలుగురు అయినా ఉండాలి. పెండ్లి ఘనంగా జరగాలంటే.. వందమందో రెండొందలమందో అతిథులు హాజరు కావాలి (కొవిడ్‌కు పూర్వం సంగతి). కానీ, ఒక కాపురం నిలబడటానికి వీళ్లెవరూ అవసరం లేదు. ఇద్దరు ఉంటే చాలు. ఆ ఇద్దరిలో చిత్తశుద్ధి ఉంటే చాలు. ఆలూమగల అనుబంధాన్ని బలోపేతం చేసే అనేక సూత్రాలు ‘ఫిఫ్టీ-50; మ్యారేజ్‌ రిటర్న్‌ టు ఇంటిమసీ’ పుస్తకంలో ఉన్నాయి. విజయ్‌ నాగస్వామి రచన ఇది. 

సారాంశం

ఐ స్పేస్‌ (నా వ్యక్తిగతం), యు స్పేస్‌ (నీ వ్యక్తిగతం), అవర్‌ స్పేస్‌ (మన వ్యక్తిగతం).. ఆలూమగలు మూడు

రకాల ప్రపంచాలనూ గౌరవించాలి. భాగస్వామి ‘స్పేస్‌'లోకి చొచ్చుకుని వెళ్లకూడదు. ఆ చొరబాటు వల్లే చాలా కాపురాలు కూలిపోతాయి. 

నేను చెప్పకపోయినా తెలుసుకోవాలి, నోరు విప్పకపోయినా గ్రహించాలి.. అనుకోవడం మూర్ఖత్వం. అది కోపం కావచ్చు, అసంతృప్తి కావచ్చు! స్పష్టంగా చెప్పాల్సిందే. కనీసం, తనకు మాత్రమే అర్థమయ్యే సంకేత భాషలో అయినా సందేశం పంపాలి.

గొడవలు పడే ఆలూమగలను ఉత్తమ దంపతుల జాబితాలో చేర్చలేం  ఇదో అపోహ మాత్రమే. గొడవ ఓ స్ట్రెస్‌ బస్టర్‌. ఆఫీసులో బాసుతో గొడవపడితే ఉద్యోగం పోతుంది. పొరుగింటి వాడితోనో పక్కింటివాడితోనో గొడవ పడితే వ్యవహారం పోలీస్‌ స్టేషన్‌కు చేరుతుంది. అదే జీవిత భాగస్వామి అయితే? పడకగదికే పరిమితం. తెల్లారేసరికి ఖేల్‌ ఖతం! కాబట్టి, చికాకుగా అనిపించినప్పుడు ఇద్దరి మధ్యా చిరు కలహాలు మంచిదేనంటారు మానసిక నిపుణులు. 

డబ్బును ఏ రియల్‌ ఎస్టేట్‌లోనో పెట్టుబడిగా పెడితే రెట్టింపు అవుతుంది. అలాగే, సమయాన్ని కూడా మనకు తెలియకుండానే.. స్నేహం మీదా, కెరీర్‌ మీదా, అభిరుచుల మీదా ఇన్వెస్ట్‌ చేస్తుంటాం. పెండ్లి కాగానే.. పెట్టుబడుల తీరును మార్చుకోవాలి. స్నేహితుల సమయంలో నుంచి కొంత, కెరీర్‌ సమయంలో నుంచి కొంత, అభిరుచుల సమయంలో నుంచి కొంత జీవిత భాగస్వామికి కేటాయించాలి. ఆ పెట్టుబడి పెరిగినకొద్దీ బంధం బలపడుతుంది. 

ఆలూమగల గొడవలకు విడాకులు అనేది చిట్టచివరి ఎంపిక మాత్రమే. విడాకులతో కూడా సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. ఒకానొక సమస్య నుంచి బయటపడతాం అంతే! కాబట్టి, మిగతా తొంభైతొమ్మిది సమస్యల్ని ఎదుర్కోవడం కంటే, మొదటి సమస్యను సమర్థంగా అధిగమించడమే మేలేమో ఆలోచించాలి. 

భార్యాభర్తల అనుబంధంలో లైంగికత కూడా ఓ భాగమే. అలా అని, చక్కని లైంగిక జీవితాన్ని విజయవంతమైన వైవాహిక జీవితానికి కొలమానంగా తీసుకోలేం. ఆ లైంగికతలో ప్రేమ ఓ భాగం అయినప్పుడే.. బంధం మరింత చిక్కబడుతుంది. ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి, కోరికతో దగ్గరికి తీసుకోవడానికి చాలా తేడా ఉంది. 

కాపురంలో చిన్నాచితకా సమస్యలు మొదలు కాగానే, వాటి మూలాలను అన్వేషించాలి. ఆ దశలో నిర్లక్ష్యం చేస్తే, నిర్లిప్తంగా వదిలేస్తే.. అవే సంక్షోభాలుగా మారుతాయి. ఇద్దరు మనుషులు విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ ఇద్దరు కలిసి ఉండటానికి ఒక్క కారణం సరిపోతుంది. 

అదే, ప్రేమ!