గురువారం 03 డిసెంబర్ 2020
Sunday - Nov 08, 2020 , 00:38:46

అబలా జీవితము

అబలా జీవితము

(హరినారాయణ్‌ ఆప్టే రాసిన ‘పన్‌ లక్షత్‌ కోన్‌ ఘెతో’ మరాఠీ నవలకు తెలుగు అనువాదం)

యమున తన అన్న స్నేహితురాళ్లతో బొమ్మలపెండ్లి ఆడుకుంటూ ఉండగా... నాన్నగారు ధుమధుమలాడుతూ వచ్చారు. పిల్లలిద్దరూ వణికిపోయారు. ఇంతలో అమ్మమ్మ ఊరికి వెళ్తున్నామని తెలిసింది. రైలు బండి ప్రయాణం హుషారుగా సాగింది. రైలు దిగాక అమ్మమ్మ వాళ్లింటికి బాడుగ బండీలో బయల్దేరారు. ఆ తరువాత కథ.. - పి.వి. నరసింహారావు(గతవారం తరువాయి..)

అన్నయ్య, కృష్ణాజీపంతు, ఆమె నోదార్చి బండి వద్దకు తీసుకొచ్చారు. ముల్లెమూటల్లో నుంచి ఏ వస్తువూ పోలేదు. అందుకందరూ ఆశ్చర్యపడ్డారు. ఐతే నన్ను పిలిచిన సందడిలో అమ్మ వాళ్ళు వచ్చింది కనిపెట్టి ఆ రెండో బండివాడు ఆదరాబాదరా కాలికి బుద్ధిచెప్పి ఉంటాడని కృష్ణాజీపంతు వ్యాఖ్యానించాడు... మొత్తానికంత హడావుడి జరిగింది. ఇంతలో బండివాడు తిరిగివచ్చాడు. ప్రయాణం సాగించాము. నా మనసు కొంత కుదుటపడ్డాక “అన్నయ్యా! మరి నీ వెక్కడ మాయమయ్యావురా?” అని అత్యంత కుతూహలంతో అడిగాను. అన్నయ్య అదేపనిగా నవ్వు ప్రారంభించాడు. గద్దించితే కాని ఊరుకోలేదు.

చివరకు అన్నయ్య చెప్పిన ఉదంతంలో విశేషమేమీ లేదు. జరిగిందేమంటే కొందరు బాటసారులతో సహా అన్నయ్య కూడా నడుస్తూ పోయాడు. కృష్ణాజీపంత్‌ కొంత వెనుకబడిపోయాడు. ఇంతలో ఒక బాటసారి “అదుగో పాలపిట్ట” అని ఒక పక్షి వైపు చూపించాడు. పాలపిట్టకు ఎడమవైపుగా తిరిగితే శుభప్రదమని అన్నయ్య ఎన్నడో ఏదో కథలో విన్నాడట. ఇంకేముంది? మా సరదాకోరు అన్నయ్య ఆ పాలపిట్ట సరదాలో తగులుకున్నాడు. తక్కిన బాటసారులు వెళ్లిపోయారు. ఈ చెట్టు మీది నుండి ఆ చెట్టు మీదికి ఇలాగే ఎగురుతూ ఆ పాలపిట్ట దారితప్పి చాలాదూరం పోయింది. అన్నయ్య దాని వెంటనే పరుగు తీశాడు. చివరకా పిట్ట అటూ ఇటూ ఎగిరి కనబడకుండా పోయింది.  ఎంతో సేపు దాని అన్వేషణ సాగించి విసిగాక కాని రాజశ్రీ గారికి స్పృహ రాలేదు. వెంటనే అసలు దారి వెదక సాగాడు. కానీ ఇంకెక్కడ దొరుకుతుంది దారి? ఎంత ప్రయత్నించినా దారికి మరింత దూరమే పోసాగాడు. కుర్రవాడు ముందు పోయాడనీ, బండి వెనుక వస్తూ ఉందని ఊహించుకొని చాలాసేపు కృష్ణాజీపంతు

నడిచాడు. కానీ అన్నయ్య ఎక్కడాకనబనందున ఎంతో దూరం వెళ్లి ఉండడని వాడిని బిగ్గరగా  పిలిచాడు. ఎవ్వరూ మారుపలుక లేదు. అంతటితో కృష్ణాజీపంతు మరింత గగ్గోలు పడి ఎందుకైనా మంచిదని సరాసరి అమ్మ వద్దకు వచ్చి జరిగిన ఉదంతం వివరించాడు. అన్నయ్య తప్పిపోయాడని విన్న తక్షణం అమ్మ బండి దిగి తానే స్వయంగా వాడిని వెదకడానికి బయలు దేరింది. ఆ తొందరలో చిన్న పిల్లలమైన మమ్మల్ని వదలి పోతున్నానన్న స్మరణ కూడా ఆమెకు లేదు. ఆమె వెను వెంటనే బండివాడు కూడా వెళ్లాడు. ఎంతోసేపు  నలువైపులా వెదకి వెదకి వేసారారు. చుట్టు పక్కల చేలల్లో గాలించి కనపడిన రైతునల్లా అడిగిచూచారు. కుర్రాడి చెవుల పోగుల కొరకు ఎవడైనా అఘాయిత్యం చేసి ఉంటాడని అమ్మ చివరకు నిర్ణయించింది. పొంగిపొరలే దుఃఖం చెలియకట్టను దాటే స్థితికి వచ్చింది. ఇంతలో వాడెలాగో చేరవచ్చాడు. రైతులకు తమ చుట్టుమట్టు గ్రామాల ముఖ్యుల పరిచయం కొంతవరకు  పరోక్షంగానైనా ఉండి తీరుతుంది. దారితప్పిన అన్నయ్య ఎదురు వచ్చిన రైతులనల్లా ఫలానా ఊరి దారి ఏదని అడగనారంభించాడట. చివరకు ఒక చేను కళ్లంలో కూర్చున్న కొందరు రైతు పెద్దలు ‘నీ దేవూరు? ఎవరబ్బాయివి?’ అని ప్రశ్నించగా, అన్నయ్య తడుముకోకుండా మా తాత పేరు, నాన్న పేరు చెప్పి సహాయం  కోరాడట. ఆ రైతు పెద్దలకు మా కుటుంబంతో పూర్వ పరిచయం ఉండి ఉన్నందున వారిలో ఒకడు దారి చూపడానికని అన్నయ్య వెంట వచ్చాడు. ఎలాగో మళ్లీ అందరం కలుసుకున్నాం. జరిగిన ఉదంతమంతా ఒకరి కొకరు చెప్పుకుంటూ ఆ పరిసరంలోనే  వున్న బావి వద్దకు చేరుకున్నాం. అక్కడ అమ్మ మా అందరికి పాల రొట్టెలు వడ్డించింది. కృష్ణాజీ పంతును కూడాతినుమని బలవంత పెట్టింది.  

అన్న తప్పిపోయినప్పుడు బండిలో ఒంటరిగా కూర్చుండి నేను ఎందరెందరు దేవుండ్లకు ఎన్నెన్ని మొక్కులుమొక్కానో అమ్మతో వివరించి చెప్పాను. అదంతా  విని అన్నయ్య అదే పనిగా నవ్వసాగాడు. నాకు భలే కోపం వచ్చింది. 

‘ఎందుకలా నవ్వుతావు? ఇంక నేను నీకేమీ చెప్పనుపో’ అని కసిరాను. కానీ అన్నయ్య మరింత అపహాస్యం చేస్తూ నాతో ఇలా అన్నాడు.. ‘ఒసేయ్‌! యమీ ఎంతైనా అమ్మాయి కులం నీది. ఏడవడం,  దేవుండ్లకు మొక్కడం ఇంతేగా నీ పని? నేనైతే  సుతారం ఏడవ లేదు. అంతేకాక నాయీ ఉత్తరీయాన్ని చెవిపోగు కనపడకుండా తలకుచుట్టుకొని ఎంతో ఠీవీతో  వచ్చి పోయేవాళ్లను దారి అడుగుతూ ముందుకు నడిచాను’.

 ‘చాల్లే నీ ఠీవి! నాకు కలిశాడే బండివాడు, అలాంటి గూండా నీ కెవడైనా కలిసి ఉంటే అప్పడు తెలిసేది నీ ఠీవీ గీవీ!’

 ‘అదంతా వట్టిమాట! నీ  బండివాడే కాదు, వాడి తలలో జేజమ్మ వచ్చినా నేను మాత్రం నీలా ఏడుస్తూ కూర్చుండే వాణ్ణి కాదు. వాడునన్ను పై కెత్తితే వాడి చేతిన కటుక్కున  కొరికేసే వాణ్ణి!’         ‘మహా కొరికేవాడివి! ఊరికే కోతలు కోస్తున్నావు. హెచ్చులు మాత్రమే వినాలి నీ నోట.అంతే!”

‘అవునులే! తనేమో పిరికిపంద, పైగా ఇతరుల్ని కోతలరాయుడంటుంది!’ అన్నయ్య మాటలు విని నాకెంతో కోపం వచ్చింది. 

‘చూడమ్మా! అన్నయ్య నన్నేమంటున్నాడో’ అని అమ్మ వద్ద ఫిర్యాదు చేశాను. అమ్మ మా ఇద్దరి నోళ్లూ మూయించింది. ఆ పిదప అన్నయ్య నన్నెగతాళి చేయడం మానాడు. సమయానికందరం ఇల్లు చేరుకున్నాం. 

పిన్ననాటి సంఘటన లెన్నింటినో కాలక్రమేణా మేము మరచివుండేవాళ్లమేమో. కానీ పెద్దయి పెరిగాక అన్నయ్యా, నేనూ కలుసుకున్నప్పుడు చిన్ననాటి అనుభవాలు స్మరించుకున్నప్పుడల్లా ఈ ప్రయాణ వృత్తాంతం తప్పక చర్చకు వస్తూ ఉండేది. 

నా వివాహమయ్యాక ఒకనాడు మాటల సందర్భంలో పై వివరాలన్నీ మా వారికి చెప్పాను. అందుకు వారు ‘ఓహో! దొంగ చేతి నుంచి తప్పి వచ్చిన ఈ రత్నం నా మెడలో పడిందన్నమాట’ అని వ్యాఖ్యానిస్తూ ఆనాటి నుంచి ‘దొంగ చేతి రత్నం’ అని నాకు నామకరణం చేశారు. 

అన్నయ్య వచ్చినప్పుడల్లా ఈ ప్రస్తావన తప్పక వస్తుండేది. అన్నయ్యతో నా భర్తగారు ‘ఏమయ్యా గణపతి రావూ! దొంగ కూడా ఎత్తుకుపోలేని ఈ రత్నాన్ని నా మెడకు తగిలించారు కదూ’ అని  అంటూ ఉండేవారు. 

(మిగతా వచ్చేవారం..)


ఓ సాహస దృశ్యం.. గొల్ల రామవ్వ

బతుకమ్మలో వారంవారం ప్రచురితం అవుతున్న ‘అబలా జీవితము’ ఓ అనువాదం మాత్రమే కాదు. అనన్యసామాన్యమైన పీవీ రచనా శైలికి ప్రతిబింబం. ఇది చదువుతున్న ప్రతిసారీ ఆయన ‘గొల్లరామవ్వ’ కథ కూడా కండ్ల ముందు మెదులుతూనే ఉంది. సందర్భం వేరైనా... మానవజీవితాన్ని అక్షరీకరించిన ఆయన ప్రతిభ ప్రస్ఫుటమవుతుంది. అందుకే ఆ కథని కూడా ఓసారి తలుచుకునే ప్రయత్నం ఇది.

నిజాం దుష్పరిపాలన, రజాకార్ల  ఘోర ఘాతుకాల పర్వంలో... మనుషుల ప్రాణాలు, మగువల మానాలే కాదు, ఊళ్ళకు ఊళ్ళే దగ్ధమవుతున్న తరుణమది. అలాంటి సమయంలో శౌర్యం రూపుదాల్చిన ఒక యువవీరుడు అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న నలుగురు పోలీసులలో ఇద్దర్ని చంపి, పారిపోతూ ఒక మట్టి ఇంట్లోకి జొరబడతాడు. సమాజపు అట్టడుగు పొరలో భారంగా బతుకుతున్న పేద, ముదుసలి స్త్రీ గొల్ల రామవ్వ అతనిని చూసిన వెంటనే... తన ఒడిలో పెరిగి, ఇటీవలే పెళ్ళయిన పదిహేనేళ్ళ పిల్ల, తన మనవరాలు మల్లి మానాన్ని, తామిద్దరి ప్రాణాల్ని  హరించే రాక్షసుడేమోనని భయపడుతుంది. నిజం తెలిశాక తన మనవరాలితో కలిసి అతనికి సేవ చేసేందుకు, సేద దీర్చేందుకు ప్రయత్నించింది. తమ ప్రాణాలొడ్డి మరీ అతడిని కాపాడేందుకు తాపత్రయపడింది. తను ఇద్దరు పోలీసుల్ని చంపానని తెలిశాక అవ్వ భయపడి బయటికి పొమ్మంటుందేమోనని సంశయిస్తున్న యువకుడు, నిబ్బరంగా ‘ఇంకా ఇద్దరున్నారు’  అంటున్న అవ్వ వైపు చకితుడై చూస్తాడు.

ఒంటినిండా ముళ్ళు, గాయాలతో సోలిపోతున్న  ఆ యువకుడి గాయాల్ని శుభ్రం చేసి, కాపడం పెట్టి, జావ తాగించి అతని ప్రాణాల్ని నిలపడం ఒక ఎత్తయితే అతని కోసం గాలిస్తూ వచ్చిన మూకలనుంచి రక్షించడానికి అతని వేషం మార్చి  మనవరాలి పెనిమిటిగా చెప్తూ, వాస్తవంగా కనపడేందుకు ఇసుమంత జంకు, తడబాటు లేకుండా మల్లిని ఆ యువకుడి పక్క మీద పడుకోబెట్టడం... ఒక సామాన్య  వృద్ధ స్త్రీ చూపిన ఈ అసామాన్య నైపుణ్యం మరొక ఎత్తు. కాయకష్టంతో గట్టిపడిన తనువు, కఠోర జీవితానుభవాలతో పటిష్టమైన మనసుతో... దాడికి దిగేందుకు సిద్ధంగా ఉన్న దుండగుల్ని భ్రమింపజెయ్యడానికి, యువకుడిని గుర్తించకుండానే వారు వెనుదిరగడానికి సాహసికురాలైన రామవ్వ చూపిన కౌశలం ఆ యువకుడినే కాక చదువరులను కూడా అప్రతిభుల్ని చేస్తుంది. 

- ఆలూరి విజయలక్ష్మి, రచయిత్రి