శనివారం 23 జనవరి 2021
Sunday - Nov 07, 2020 , 23:46:42

గడ్డిపూవు గొంతు విప్పితే!

గడ్డిపూవు గొంతు విప్పితే!

ప్రజాకవిగా, గాయకుడిగా పల్లెపదాల పరవళ్ళలో ఎగిసొచ్చిన కెరటం గోరేటి వెంకన్న. ‘పలె ్లకన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ అంటూ ఆయన కలం ఎంత వాడిగా ప్రసరించిందో అందరికీ తెలుసు. పల్లెయాసల సింగారాన్ని ఎంతో అందంగా పొదుగుకున్న కలం తనది. సినీకవిగా ఆయన పాటల ప్రయాణంలో కూడా ఎన్ని  పైరుల పచ్చదనాలో.. తెలంగాణ నేల స్వచ్ఛదనాలో.. గాలి వెచ్చదనాలో..


గోరేటి వెంకన్న నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని గౌరారం(బిజినపల్లి)లో జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహ, ఈరమ్మ. చిన్నతనంలో  సినిమా పాటలంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ఎప్పుడైనా పాడాల్సి వస్తే... భక్తి గీతాలకే మొగ్గుచూపేవారు. వెంకటరెడ్డి మాస్టారి సాయంతో పాటల పుస్తకాలను చదువుతూ... అలవోకగా పాడటం నేర్చుకున్నారు. క్రమంగా వామపక్ష భావజాలంతో విప్లవగీతాలు రాయడం మొదలుపెట్టారు. అలా రైతులసమస్యలపై 1984లో రాసిన ‘నీ పాట ఏమాయెరో’ అనే గీతం పేరు తెచ్చి  పెట్టింది. ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమాల్లో, జననాట్యమండలిలో పాలుపంచుకున్నారు. ‘ఏకనాదం’, ‘రేలపూతలు’, ‘అల చంద్రవంక’ మొదలైన పుస్తకాలు ప్రచురించారు. 2016లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రజాకవి కాళోజి పురస్కారాన్ని అందుకున్నారు.

వెండి వెలుగులు

గోరేటి వెంకన్న రాసిన ‘జై బోలో జై బోలో అమరవీరులకు’  పాటను విన్న దర్శకులు ఎన్‌.శంకర్‌, దాన్ని 1997లో తన ‘ఎన్‌కౌంటర్‌' సినిమాలో వాడుకున్నారు. అలా వెంకన్న సినీప్రస్థానం మొదలైంది. 1998లో ‘శ్రీరాములయ్య’లో రాసిన ‘ననుగన్న నాతల్లి రాయలసీమా’ పాట వెంకన్న సినీ జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించింది. అదే సినిమాలో ‘రాజ్యహింస పెరుగుతున్నాదో’ కూడా ఆయన రాసిందే.  ‘చీకటి సూర్యులు’(1998)లో రాసిన ‘అక్కోమీరంటారా’ కూడా అందరి ప్రశంసలందుకుంది. ‘కూలన్న’(1999)లోని ‘మముగన్న మాయమ్మ మాతల్లి లచ్చమ్మ’ పాట తల్లి ప్రేమ విలువను తెలుపుతుంది. ఎన్ని జన్మలెత్తినా  అమ్మ రుణాన్ని తీర్చలేమంటుంది. ‘కుబుసం’(2002) చిత్రంలోని ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ గేయం పల్లెల్లోని చేతివృత్తుల పనివారి జీవితాలకు నష్టం కలిగించే పరిశ్రమలను, కంపెనీలను ఎలుగెత్తి ప్రశ్నిస్తుంది. అదే సినిమాలోని ‘దోస్తరదిన్‌ అందమా’ పాట ఆశయం కోసం పోరాడుతున్న యువనాయకులకు ఊపిరినిచ్చింది. 

విప్లవమే కాదు... వైవిధ్యం కూడా!

‘ఎర్రసముద్రం’(2008) కోసం ‘వారెవ్వ వయ్యారి గుమ్మా.. ఇది మాయలుజేసే మాటలబొమ్మా’ అంటూ సెల్‌ఫోన్‌ గురించి  వెంకన్న రాసిన పాట ఎంతోఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ‘బతుకమ్మ’(2008)లోని ‘బతుకమ్మా బతుకమ్మా మా తలి ్లబతుకమ్మా’ ఇప్పటికీ బతుకమ్మ సంబరాల్లో వినిపిస్తూనే ఉంటుంది. ‘నింగి నెలవంకవోలే కడిగిన ముత్యమోలే’ వంటి వాక్యాలు ఎన్నిసార్లయినా గొంతెత్తి, గుండెత్తి పాడాలనిపిస్తాయి. ‘జైబోలో  తెలంగాణ’ (2011)లో ‘ఈ గాయం ఈ గాయం మానేదెపుడే ప్రేమా’ అనే విషాదభరిత ప్రేమగీతం కూడా వెంకన్న కలం నుంచి జాలువారిందే. ‘శాంతి సందేశం’(2004)లో కరుణామయుడైన ఏసుక్రీస్తుపై ‘కరుణాసాగర ప్రేమస్వరూపా రక్షకుడా’ అనేపాటను రాశారు. ‘దేవరకొండ వీరయ్య’(2009) లోని ’గల్లీచిన్నది గరీబోల్ల కథ పెద్దది’ పాట బీదల వెతల్ని, విషాద కథల్ని హృదయ విదారకంగా తెలుపుతుంది, కన్నీళ్ళు పెట్టిస్తుంది. ‘నగరం నిద్రపోతున్నవేళ’(2011)లో ‘సమరసింహారెడ్డిబాబు సల్లంగుండాలే’ పాటను వ్యంగ్యాస్త్రంగా సమాజం మీద ఎక్కుపెట్టారు.  ఇలా  విప్లవ గీతాలే కాకుండా... భక్తి నుంచి ప్రేమ వరకు ఎలాంటి రసాన్నయినా తన పాటలో పలికించగల సత్తా తన కలానికి ఉందని నిరూపించారు వెంకన్న.

‘బందూక్‌'(2015)లో తెలంగాణ ఔన్నత్యాన్ని, పూర్వపు పదిజిల్లాల గొప్పతనాన్ని చాటిచెప్పిన బ్రీత్‌లెస్‌ సాంగ్‌ అందరి మనసుల్నీ గెలుచుకుంది. ‘వేగుచుక్కలు’(2004)లో ‘చెట్టుమీద’, ‘కొడుకు’(2004)లోని ‘కోసింది కోయకురా’, ‘మల్లేశం’(2019)లోని ‘ధనధనధన’, ‘దొరసాని’(2019)లోని ‘నింగిలోన పాలపుంత’.. జానపద సౌందర్యాన్ని, అందమైన అక్షరాల సోయగాల్ని నింపుకున్న పాటలు. ఇవేకాకుండా పీపుల్స్‌వార్‌, రాజ్యాధికారం, అన్నదాతా సుఖీభవ, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య, పెరియార్‌ రామస్వామి నాయకర్‌, మహాయజ్ఞం, గంగమ్మ జాతర, అమ్మమీద ఒట్టు ...మొదలైన సినిమాలకు విలువైన సాహిత్యాన్ని అందించారు వెంకన్న. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడారు, నటించారు కూడా. దాదాపు 100కి పైగా సినిమా పాటలు రాసిన గోరేటి వెంకన్న పల్లెపాటల పచ్చదనానికి స్వచ్ఛమైన ప్రతీక. వాటిని వింటున్నప్పుడు ప్రేక్షకుడు ఓ రకమైన ఉద్వేగానికి గురవుతాడు. తన గురించే పాడుతున్నట్టు ఫీలవుతాడు. - తిరునగరి శరత్‌ చంద్ర, 6309873682


logo