బుధవారం 20 జనవరి 2021
Sunday - Nov 07, 2020 , 22:46:32

వెండితెర మీద ఓదెల!

వెండితెర మీద ఓదెల!

లైట్స్‌.. కెమెరా.. యాక్షన్‌! మేకప్‌, ప్యాకప్‌!  అప్పటి వరకూ తెలియని పదాలు పరిచయం అయ్యాయి. నిన్నటిదాకా చూడని మొహాలు ఎదురుపడ్డాయి. ‘అబ్బా.. హెబ్బా పటేల్‌' .. పోరగాళ్లకు పండగే! ‘ఆ చీర చూడూ! ఆ బార్డర్‌ చూడూ’ .. ఆడవాళ్ల కబుర్లకు అంతే లేదు. నాలుగు రోజుల తర్వాత వీడ్కోలు తీసుకుని వెళ్లిపోతుంటే, జాతరకొచ్చిన చుట్టాలు బయల్దేరుతున్న భావన. ‘ఓదెల రైల్వే స్టేషన్‌' సినిమా షూటింగ్‌ ఓదెల గ్రామస్థుల జీవితాల మీద చెరగని ముద్ర వేసింది.  

ఓదెల రైల్వే స్టేషన్‌

తమ ఊరి పేరు మీదే సినిమా! కథ మొత్తం ఊరిచుట్టే! దర్శకుడు కూడా తమ బిడ్డే, అతడిది ఈ గడ్డే! సినిమా షూటింగులంటే.. హైదరాబాద్‌లోనో అరకులోనో  జరుగుతాయని ఆ పల్లె జనం భావించేవారు. అది నిజం కూడా. కానీ ఓరోజు తెల్లవారేసరికి.. బిలబిలమంటూ వాహనాల సమూహం ప్రవేశించింది. నటీనటులు, టెక్నీషియన్లు, లైట్‌బాయ్స్‌.. ఒక్కొక్కరే బండిలోంచి దిగుతుంటే కళ్లు అప్పగించి చూశారు. అంతలోనే మరో అశ్చర్యం! దీని వెనుక ఎవరున్నారో అర్థమైంది. ‘కథ’ నడిపిస్తున్నవాడు సాక్షాత్తు తమ ఊరివాడే.. సంపత్‌ నంది. ఈ సినిమాకు కె.కె. రాధామోహన్‌ నూతనంగా దర్శకత్వం వహిస్తున్నారు.  - అంకరి ప్రకాష్‌ 

నాలుగు రోజులిక్కడే 

సినిమాకు సంబంధించి పలు సన్నివేశాల కోసం ఇటీవల చిత్ర బృందం నాలుగు రోజుల పాటు ఓదెలలోనే మకాం వేసింది. వశిష్ట ఎన్‌ సిమ్హా, హెబ్బాపటేల్‌, పూజిత పొన్నాడు.. ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌లో చాలా భాగం పరిసరాల్లోనే పూర్తి చేశారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం, ఓదెల రైల్వేస్టేషన్‌, పోలీసు స్టేషన్‌, గ్రామ పంచాయతీ ఆఫీసు, మండల కార్యాయలం, బస్టాండ్‌, అంబేద్కర్‌ చౌరస్తా, హైస్కూల్‌ రోడ్‌, ఎస్సీ కాలనీ రోడ్‌లతో పాటు పొత్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ల్లో షూటింగ్‌ తీశారు. చాలా పాత్రల్లో స్థానికులే నటించారు. ‘నేను కూడా ఎంపీటీసీ పాత్రలో నటించాను. కొత్త అనుభవం. చాలా ఆనందంగా ఉంది’ అంటారు గ్రామస్థుడు అల్లెంకి శేషుమూర్తి.  


మరిచిపోలేని అనుభూతి

కేరాఫ్‌ కంచరపాలెం, పలాస ఎట్‌ 1978 .. ఇలా స్థానిక జీవితాలతో, ఆ గ్రామ నామమే సినిమా పేరుగా చాలా సినిమాలు వచ్చాయి. తెలంగాణ సినిమా తనకంటూ ఓ అస్తిత్వాన్ని సొంతం చేసుకుంటున్న దశలో.. ఓదెల రైల్వేస్టేషన్‌ పేరుతో సంపత్‌ నంది చిత్ర నిర్మాణానికి పూనుకోవడం మంచి పరిణామమే.  సినిమాల్లో స్థిరపడినా, సంపత్‌ నందికి ఓదెలతో అనుబంధం తెగిపోలేదు. అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చి పోతుంటాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు నెలల పాటు ఇక్కడే ఉన్నాడు. అప్పుడే ఈ కథ ప్రాణంపోసుకుని ఉండవచ్చు. ‘మా స్వగ్రామం ఓదెలలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఓదెల రైల్వే స్టేషన్‌ పేరుతో క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో మూవీని తెరకెక్కిస్తున్న. ఒకనాడు తెలంగాణ అంటే ఎండిన చేనులు, నోళ్లు తెరిచిన భూములే. కానీ నేడు పరిస్థితులు మారాయి. తెలంగాణలో ఎటూ చూసిన పచ్చని పొలాలే. ఆ అద్భుతమైన దృశ్యాలను తెరకెక్కిస్తున్నాం.‘ఓదెల రైల్వే స్టేషన్‌' సినిమా ఒక డిఫరెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది’ అంటారు సంపత్‌ నంది. నిజమే, ప్రతి దర్శకుడూ ఏడాదికి ఒకసారైనా సొంతూరికి వెళ్లాలి. సొంత మనుషుల మధ్య బతకాలి. ఆ జీవితాల నుంచీ కథలు అల్లుకోవాలి. అప్పుడిక హాలీవుడ్‌ మీద ఆధారపడాల్సిన పని ఉండదు. శుభం! 


logo