బుధవారం 20 జనవరి 2021
Sunday - Oct 25, 2020 , 01:23:48

సింగరేణికి.. పచ్చల హారం!

సింగరేణికి.. పచ్చల హారం!

నల్ల బంగారాన్ని వెలికితీసే సంస్థలో పచ్చనోట్లతో ముడిపడిన వృత్తి, ప్రకృతి పట్ల ప్రేమతో పచ్చదనాన్ని పెంపొందించాలనే ప్రవృత్తి.. రెండు బాధ్యతలకూ సమన్యాయం చేస్తున్నారు సింగరేణి కాలరీస్‌ పబ్లిక్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌(ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్‌. ఆ ప్రయత్నంలో తనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం మరింత స్ఫూర్తినిచ్చిందని అంటున్నారు. 

ఆ విద్యార్థికి.. మొక్కల్ని చూడగానే ముద్దాడాలని అనిపించేది. గాలికి అటూ ఇటూ ఊగుతున్న వృక్షాలు కనిపించిన ప్రతిసారీ, కండ్లప్పగించి చూడాలనిపించేది. చిన్న విత్తులో ఓ మహారణ్యం దర్శనమిచ్చేది. అలా, బలరాముడు మంచిబాలుడని అనిపించుకున్నాడు. బలరామ్‌ స్వగ్రామం.. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని తిరుమలగిరి. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే.. పచ్చదనంతో ప్రేమలో పడ్డారు. మొక్కలతో దోస్తానా మొదలైంది. మౌనంగానే మనషి కోసం అటు ప్రాణవాయువునూ, ఇటు ప్రాణం నిలిపే ఆహారాన్నీ సమకూర్చే ఆ వృక్షదేవతలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అన్న అంతర్మథనం మొదలైంది. వన సంతతిని రక్షించుకోవడమే మనం చేయదగిన మహోపకారమని అర్థమైంది. అప్పటి నుంచి మొక్కలను నాటడం, నాటిని వాటిని రక్షించుకోవడం.. తన జీవితంలో ఓ భాగమైపోయింది. అలా అని, చదువును నిర్లక్ష్యం చేయలేదు. ప్రతి తరగతిలోనూ ఉత్తమ ప్రతిభను కనబరిచారు. సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసి.. ఐఆర్‌ఎస్‌కు ఎంపిక అయ్యారు. పనిచేసిన ప్రతిచోటా హరిత నినాదం వినిపించారు. సింగరేణి కాలరీస్‌ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా బాధ్యతలు స్వీకరించాక కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే స్వయంగా ఎనిమిది వేల మొక్కలు నాటారు. అందులో 90శాతానికిపైగా బతికేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. మానుగా ఎదిగే వరకూ అన్నీతానై నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘హరితహారం’ కార్యక్రమం, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌ తనకు మరింత స్ఫూర్తిని ఇచ్చాయని అంటారు.  

పచ్చని ప్రపంచం

నాటిన మొక్కల్ని జియో ట్యాగింగ్‌ ద్వారా నిత్యం గమనిస్తూ.. అవసరమైన పోషకాలను అందిస్తారు. అల్లనేరేడు, మర్రి, రావి, జామ, వెదురు, సీమ చింతకాయ, ఉసిరి, మామిడి... తదితర మొక్కలను నాటుతున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాలో 1257మొక్కలు నాటి ఏకంగా ఓ పచ్చని ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ప్రాంతం ఇప్పుడు నెమళ్లకూ, రకరకాల పక్షులకూ చిరునామాగా మారింది. సింగరేణి సంస్థకు సంబంధించిన ప్రతీచోటా  ఒక హరితవనాన్ని సృష్టించాడు. గరిమెళ్ళపాడు, సత్తుపల్లి, లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లెందు గెస్ట్‌హౌస్‌ ప్రాంతం, భూపాలపల్లి ఏరియా.. ప్రతిచోటా పచ్చదనాన్ని పెంచిపోషిస్తున్నారు. గ్రామోదయ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (జీ కాట్‌), గ్రామోదయ బంధుమిత్ర పురస్కారాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ‘అవర్‌ నైబర్‌హుడ్‌ హీరో’ అవార్డుతో ఘనంగా సన్మానించింది. ఈ అవార్డులను అందుకున్నవారిలో ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, సినీనటుడు సోనూసూద్‌, నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజు, వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్‌ ప్రవీణ్‌రావులు ఉన్నారు. ‘మొక్కల మీదే మానవజాతి మనుగడ ఆధారపడి ఉంది. ప్రతి ఒక్కరూ  మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించాలి. ప్రతి మనిషీ కనీసం మూడు మొక్కలు నాటి పెంచాలి. అప్పుడే ఆక్సిజన్‌ పుష్కలంగా లభ్యం అవుతుంది’ అంటారు బలరామ్‌.  ఏడాదిలో పదివేల మొక్కలు 

సింగరేణి సంస్థలో ఉన్నతోద్యోగం అంటే మాటలు కాదు. క్షణం తీరికలేని బాధ్యత. అందులోనూ, ఖజానాలోని ప్రతిపైసా సద్వినియోగం అయ్యేలా చూడాల్సిన ఫైనాన్స్‌ డైరెక్టరు పీఠం. అంత ఊపిరిసలపని పనిలో కూడా.. కొంత సమయాన్ని మొక్కల పెంపకానికి కేటాయిస్తారు బలరామ్‌. సెలవు రోజుల్ని, వారాంతాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. ఏటా పదివేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఏఏ మొక్కలు ఎక్కడ  మనుగడ సాగిస్తాయన్నది పర్యావరణ పరిరక్షణ శాఖ (ఎన్విరాన్‌మెంటల్‌ డిపార్టుమెంట్‌) సాయంతో అధ్యయనం చేస్తున్నారు. సహోద్యోగుల్లో కూడా మొక్కలు నాటడంపై అవగాహన కల్పిస్తున్నారు.

-కలవకొలను హరీశ్‌రాజు      


logo