శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sunday - Oct 18, 2020 , 01:59:46

మౌనంగానే ఎదుగుతూ

మౌనంగానే ఎదుగుతూ

అతను నాలుగు మాటలు రాసి పాటగా మార్చేయగలడు. అప్పుడా పాట గురించి చెప్పడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. అలా అని తన పాటలు మామూలు మాటల్లా ఉండవు. తూటాల్లా ఉంటాయి. తేనె ఊటల్లా ఉంటాయి. అతనెవరో కాదు 1995లో తాజ్‌మహల్‌ సినిమాలోని ‘మంచుకొండల్లోని చంద్రమా చందనాలు చల్లిపో’ అనే పాటతో సినీగేయ రచయితగా ప్రవేశించి, ఇప్పటి వరకు దాదాపు 2,500 పైచిలుకు పాటలు రాసి, మనందరి మనసుల్నీ దోచుకున్న చంద్రబోస్‌.

చంద్రబోస్‌ వరంగల్‌ జిల్లా చిట్యాల మండలం చల్లిగరిగె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు నర్సయ్య, మదనమ్మ. ఆ ఊర్లో ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు లాంటి ప్రదర్శనలు జరిగేవి. తల్లితో కలిసి వాటిని చూసేవాడు చంద్రబోస్‌. ఆ ప్రభావంతో పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇంటిపక్కనే ఉన్న గుడిలో జరిగే భజనల్లో పాటలు పాడేవారు. అలా సినిమా పాటలపై మక్కువను ఏర్పరుచుకున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన తర్వాత పాటలపై ప్రేమతో గేయ రచయితగా స్థిరపడ్డారు. గాయకుడు కావాలని సినిమాల్లోకి వచ్చిన ఆయన పాటల రచయితగా సుప్రసిద్ధులు కావడం విశేషం.

ఆ పాటలు మంచుకొండలే

1995లో తాజ్‌మహల్‌ సినిమాలోని మంచుకొండల్లోని చంద్రమా పాటతో గీతరచయితగా ప్రవేశించారు. ఆ పాట ప్రజాదరణ పొందడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఎలాంటి సందర్భానికైనా ఒదిగేంత వినమ్రంగా పాటను రాయగలరు చంద్రబోస్‌. అద్భుతమైన పదసౌందర్యం, భావాభివ్యక్తి ఆయన సొంతం. స్ఫూర్తిదాయకమైన పాటల రచనలో తనది ప్రత్యేక శైలి. ‘నా ఆటోగ్రాఫ్‌' (2004)లోని ‘మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెబుతుంది’.. గొప్ప సందేశాత్మక గీతంగా ఇప్పటికీ అందరి మన్ననలందుకుంటూనే ఉంది. ఎందరి జీవితాలనో ప్రభావితం చేసిన ఈ గేయం హైదరాబాద్‌లోని ఓ అంధుల పాఠశాలలో ఇప్పటికీ ప్రార్థనా గీతంగా పాడుకుంటారు. ఇదే కాదు... ‘నేనున్నాను’ (2004)లో ‘చీకటితో వెలుగే చెప్పెను’, ‘ఠాగూర్‌' (2003)లో ‘కొడితే కొట్టాలిరా’ లాంటి ఎన్నో సందేశాత్మక పాటలకు చంద్రబోస్‌ పెట్టింది పేరు. తెలుగు భాష గొప్పతనాన్ని చాటుతూ ‘తెలుగు భాష తీయదనం’ (నీకు నేను నాకు నవ్వు) అని ఎలుగెత్తినా, స్నేహంలోని ఔన్నత్యాన్ని గుర్తుచేస్తూ ‘ట్రెండ్‌ మారినా ఫ్రెండ్‌ మారడే’ (ఉన్నది ఒకటే జిందగీ) అని రాసినా, మాతృమూర్తి మమకారాన్ని చాటే ‘పెదవే పలికే మాటల్లోని’ (నాని) లాంటి గీతాలైనా.. అటు మాస్‌నీ ఇటు క్లాస్‌నీ అలరిస్తూనే ఉన్నాయి. 


కావ్యం కాదు పాటే!

కావ్యాలు, ప్రబంధాల్లో మాత్రమే కనిపించే అభివ్యక్తి చంద్రబోస్‌ పాటల్లో పలకరిస్తుంది. ‘నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది’ లాంటి గీతాలే అందుకు సాక్ష్యం. ‘కలలోనైన కలగనలేదే’ (నువ్వు వస్తావని), ‘నువ్వు చూడు చూడకపో’ (ఒకటో నెంబర్‌ కుర్రాడు), ‘సమయానికి తగుసేవలు చేయనీ’ (సీతయ్య)... ఇలా చంద్రబోస్‌ రాసిన ఎన్నో పాటలు సినిమాపాట గౌరవాన్ని పెంచాయి. భక్తి గీతాల రచనలో కూడా చంద్రబోస్‌ తన శైలిని కనబరిచాడు. ‘జై చిరంజీవ’ (2005)లోని ‘జైజై గణేశా’, ‘శిరిడీసాయి’ (2012)లోని ‘సాయి అంటే తల్లి’ మొదలైన పాటలన్నీ పండుగల్లో మారుమోగుతునే ఉంటాయి. ఇక గత ఏడాది వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం చంద్రబోస్‌ ప్రతిభను మరోసారి గుర్తుచేసింది. అందులోని ‘రంగమ్మా మంగమ్మా’ పాటలో ‘మరకమ్మ’, 

‘ఉఫమ్మా’ లాంటి ప్రాసలతో పలకరించినా... ‘ఎంత సక్కగున్నావే లచ్చిమి’ పాటలో మాండలిక పదాలతో అలరించినా... ఆ సినిమా విజయంలో తన సాహిత్యం కూడా ముఖ్య పాత్ర వహించింది.  ‘30 రోజుల్లో’ చిత్రంలో ‘నీలీ నీలీ ఆకాశం ఇద్దామనుకున్నా...’ పాటను కూడా ఎవరు మర్చిపోగలరు? ప్రేమవయసులోని సందళ్లను తెలియచేసే ఈ పాట రికార్డు స్థాయి వ్యూస్‌ కొల్లగొట్టింది. పాటకున్న సత్తా చాటింది. నంది అవార్డుతో పాటు ఆత్రేయ మనస్విని, మద్రాసు కళాసాగర్‌, ఫిలింపేర్‌ లాంటి అనేక పురస్కారాలు అందుకున్నారు చంద్రబోస్‌. అవార్డులు తూచలేని అభిమానాన్నీ పొందారు. అలుపెరగని పాటల ప్రవాహమై మరిన్ని వేల పాటల దిశగా సాగిపోతున్నారు.

తిరునగరి శరత్‌ చంద్ర ,6309873682


logo