మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 23:09:21

సినిమా మాట.. చక్కెర పూత!

సినిమా మాట.. చక్కెర పూత!

ఒక ‘మాట’ పుట్టాలంటే రచయిత మస్తిష్కంలో మథనం జరగాలి. తనది కాని లోకాన్ని ఆశ్రయించి అక్కడి మనుషులు, భావోద్వేగాలతో సహానుభూతి చెందాలి. పాత్రలతో కలిసి ప్రయాణించాలి. అప్పుడే గొప్ప మాట జనిస్తుంది. వీటన్నిటికంటే జీవితాన్ని తరచిచూసిన అనుభవం రచయితకు చాలా ముఖ్యమని అంటున్నారు లక్ష్మీ భూపాల. నాటకీయత ఎక్కువగా కాకుండా సహజత్వాన్ని స్ఫురించే సినిమా మాటలకే విలువ ఉంటుందని చెబుతున్నారు. ‘చందమామ’, ‘మహాత్మ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబీ’ వంటి విజయవంతమైన చిత్రాల్లో తన కలం పదును చూపించారాయన. ‘బతుకమ్మ’తో లక్ష్మీ భూపాల పంచుకున్న ముచ్చట్లు ఇవి..

సినిమా దృశ్యమాధ్యమం. అయితే వెండితెరపై ఓ దృశ్యం చెప్పలేని భావాన్ని మాట అభివ్యక్తీకరిస్తుంది. చూస్తున్న సన్నివేశం అర్థం కానప్పుడు మాట అవసరం ఏర్పడుతుంది. మామూలుగా సినిమా మాటను ఓ పరిధి వరకే రాయాలి. కానీ, ప్రస్తుతం ప్రతి రచయితా విస్తారంగా మాటల్ని రాస్తున్నారు. వారిలో నేనూ ఉన్నా. సన్నివేశంలోని ఉద్వేగాన్ని, భావావేశాన్ని విస్తృతంగా ఆవిష్కరించడానికి మాట అవసరం ఎక్కువైంది. మొత్తంగా సినిమా మాట ఓ చక్కెరపూతలా మారింది. నా దృష్టిలో భావాన్ని క్లుప్తంగా చెప్పడమే మంచిదనుకుంటాను.

మాట ఒక్కటే గుర్తుకు రావద్దు

ప్రస్తుతం సినిమా ధోరణిలో మార్పులొస్తున్నాయి. ప్రేక్షకులు సహజత్వాన్ని కలబోసిన కథలకు పెద్దపీట వేస్తున్నారు. ఒకప్పటి రోజుల్లో హీరోలు డైలాగ్స్‌ చెబితే థియేటర్లు చప్పట్లతో మార్మోగిపోయేవి. అప్పటి సినిమాలన్నీ హీరో కేంద్రంగా, కథానాయకుడి ఇమేజ్‌ ప్రధానంగా ఉండేవి. నేటి ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. వాస్తవాన్ని ప్రతిబింబించే కథలు ప్రజాదరణ పొందుతున్నాయి. ఇలాంటి తరుణంలో ‘మాట’ కథలో కలిసిపోవాలి. కానీ, కథ బయటకు వచ్చి విన్యాసాలు చేయకూడదు. సినిమాలో ఫలానా డైలాగ్‌ బాగుందనే ప్రశంస వస్తే రచయిత ఫెయిల్‌ అయినట్లే. ఎందుకంటే ప్రేక్షకులకు మాట ఒక్కటే గుర్తుండిపోకూడదు. దానితోపాటు కథలోని సన్నివేశం గుర్తుకు రావాలి. మాట కథలో కలిసిపోయి ఓ ఉద్వేగాన్ని కలిగించాలి. అప్పుడే రచయిత సక్సెస్‌ అయినట్లు భావించాలి.

ఇద్దరికీ సమాన విలువ

ప్రస్తుతం చాలామంది రచయితలు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. ఆర్థిక భరోసాతోపాటు తమ అభిరుచుల్ని ప్రతిఫలించే కథల్ని చెప్పాలనే తాపత్రయంతో దర్శకులుగా మారుతున్నారు. తమ రచనకు దర్శకుడు సరైన విలువ ఇవ్వడం లేదనే ఆక్రోషంతోనూ కొందరు మెగాఫోన్‌పై మక్కువ పెంచుకుంటున్నారు. ముఖ్యంగా రచన కంటే దర్శకత్వం పైస్థాయి విభాగం కాబటి,్ట డైరెక్టర్స్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నేను రెండింటికీ సమాన విలువనిస్తాను. రచయిత భావాన్ని దృశ్యమానం చేసే కళ తెలిసిన నిపుణుడే దర్శకుడు. కాబట్టి, సినిమాలో ఇద్దరి ప్రాముఖ్యం ఒకేలా ఉంటుందన్నది నా అభిప్రాయం.

ప్రమాణాలు తగ్గిపోతున్నాయి

గతంలో సంభాషణల రచయితలకు గొప్ప విలువ ఉండేది. ప్రస్తుత జనబాహుళ్యంలో సినిమానే లోకువగా మారింది. చాలా కిందిస్థాయికి చేరుకొని అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అదే సమయంలో పోటీ వాతావరణం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిభతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ రచయితలై పోతున్నారు.  ఫేస్‌బుక్‌లో నాలుగు కొటేషన్స్‌, మాటలు రాసిన వాళ్లు కూడా మేమూ రైటర్స్‌మే అని ప్రకటించుకుంటున్నారు. సినిమాకు మాటలు రాయడం వేరు అనే విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ధోరణివల్ల దర్శక నిర్మాతలు ప్రతిభతో నిమిత్తం లేకుండా అందుబాటులో ఉన్నవారితో మాటల్ని రాయించుకుంటున్నారు. ఈ ట్రెండ్‌వల్ల సినిమా మాట తాలూకు ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. భాష, వాక్య నిర్మాణం, అక్షరాల మీద ఎలాంటి ప్రాథమిక అవగాహనా లేనివారు కూడా కలం పడుతున్నారు.

అనుభవాలే ప్రేరణ

నేను దాటి వచ్చిన అనుభవాలు, జీవన ప్రయాణంలో తారసపడిన మనుషులు, వీక్షించిన ప్రపంచం నా మాటలకు ప్రేరణనిచ్చాయి. సినిమాలో ఒక పాత్రను తీసుకుంటే అలాంటి వ్యక్తి మన జీవితంలో ఎక్కడో ఒకచోట తారసపడి ఉంటాడు. జీవితానుభవాల్లోంచి మాట రాస్తే అది చాలా సహజంగా కనిపిస్తుంది. ఇక సాహిత్యాభిలాష ఉండటం అన్నది మాటకు కొత్త సొబగులు అద్దడంలో, భావాన్ని ఉన్నతీకరించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. సినిమా రచనలో ముళ్లపూడి వెంకటరమణ, జంధ్యాల, డీవీ నరసరాజు, ఆత్రేయలను బాగా ఇష్టపడతాను. ఆత్రేయగారు గీత రచయితగా కంటే సంభాషణల రచయితగానే నాకు ఎక్కువగా ఇష్టం. అలతి అలతి పదాలతోనే అద్భుతమైన భావాన్ని పలికించడంలో ఆత్రేయ నేర్పరి. సినిమా రచన విషయంలో ఆ మహానుభావులంతా మనకు ఉన్నతమైన ప్రమాణాల్ని నిర్దేశించారు. ఇక సాహిత్యపరంగా చలం, శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కొడవటిగంటి కుటుంబరావు, యండమూరి వీరేంద్రనాథ్‌ వంటి చాలా మంది ప్రసిద్ధ రచయితలు నన్ను ప్రభావితం చేశారు.

జీవితాన్ని యథాతథంగా 

నేను పరిశ్రమలోకి వచ్చి పదహారేళ్లు పూర్తయ్యాయి. అదృష్టం కొద్దీ ఏ రోజూ ఖాళీగా లేను. వరుసగా సినిమాలకు రాస్తూ చేతినిండా పనితో ఉన్నా. ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని నేను పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. ‘పెద్ద హీరోలతో పనిచేయాలి. స్టార్‌రైటర్‌గా ఎదగాలి’ అనే ఆశయాలు ఏమీ పెట్టుకోలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలకు పరిపూర్ణంగా న్యాయం చేయడం గురించే ఎక్కువగా ఆలోచిస్తా. ఎలాంటి అంచనాలు లేకుండా జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలన్నదే నా ఫిలాసఫీ. భవిష్యత్తులో దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉంది. ఆరు స్క్రిప్టులు సిద్ధంగా ఉన్నాయి. సరైన సమయంలో దర్శకత్వ బాధ్యత తీసుకుంటాను. త్వరలో ప్రొడక్షన్‌ సంస్థ ఆరంభించే ఆలోచన కూడా ఉంది. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతోపాటు రాజశేఖర్‌ కథానాయకుడిగా నీలకంఠ దర్శకత్వం వహించే సినిమాకు సంభాషణల్ని అందిస్తున్నా. నందినిరెడ్డి డైరెక్ట్‌ చేసే సినిమాకు కూడా డైలాగ్స్‌ సమకూరుస్తున్నా.

కృష్ణవంశీ ప్రభావం నా మాటల ప్రయాణంలో 

‘చందమామ’ సినిమాను గొప్ప మజిలీగా చెప్పొచ్చు. దర్శకుడు కృష్ణవంశీగారితో కలిసి చేసిన జర్నీలో ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా. సెట్‌లో ఎక్కువగా ఉండటం వల్ల సినిమా మేకింగ్‌, నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల పనితీరు గురించి చక్కటి అవగాహన కలిగింది. ఇక వ్యక్తిగతంగా కృష్ణవంశీగారు నాకు పెద్దన్నయ్యలాంటి వారు. నా ఆరోగ్యం మొదలుకొని కెరీర్‌ వరకు ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. పెద్దవాళ్లను ఎలా గౌరవించాలి, రాబోయే  తరంలో మనం ఎలాంటి పాత్ర పోషించాలి? ఎటువంటి బాధ్యత తీసుకోవాలి? వంటి ఉపయుక్తమయ్యే అంశాలపై మా మధ్య చర్చలు జరుగుతుంటాయి. నా జీవితం మీద కృష్ణవంశీగారి ప్రభావం 

చాలా ఉంది.

సినిమా విలువ గొప్పది

ప్రస్తుతం నేను ఓ వెబ్‌సిరీస్‌కు రచన చేస్తున్నా. సినిమా రచనకు, సిరీస్‌ రచనకు చాలా తేడాలుంటాయి. రెండున్నర గంటల నిడివి సినిమాలో ఎనభైనుంచి వంద నిమిషాలవరకే సంభాషణలు వినిపిస్తాయి. మిగతా భాగమంతా పాటలు, పోరాటాలు, ఉపోద్ఘాత దృశ్యాలకే వెళ్లిపోతుంది. అదే వెబ్‌సిరీస్‌ విషయానికొస్తే మూడు నాలుగు గంటలపాటు మాటలు రాయాల్సి ఉంటుంది. విస్తృతంగా రాయడం వల్ల రిపీట్‌ చేస్తున్నామనే భావన కలుగుతుంది. వెబ్‌సిరీస్‌లు, ఓటీటీల వంటి వేదికలను ఎప్పటికీ సినిమాతో పోల్చలేం. సినిమాకున్న విలువ చాలా గొప్పది.

టైమింగ్‌ తెలుసుకోవాలి

దక్షిణాది స్క్రిప్ట్‌ శైలి ప్రకారం ఎడమవైపు యాక్షన్‌, కుడివైపు సంభాషణలు రాస్తారు. అయితే కొంతమంది దర్శకులు యాక్షన్‌ భాగాన్ని చూడకుండా, కేవలం సంభాషణల్ని మాత్రమే చదువుతారు. దీనివల్ల సంభాషణ నేపథ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతారు. ఇలాంటి సందర్భాల్లోనే సృజనాత్మక విభేదాలొస్తాయి. ఓ సంభాషణ వెనక రచయిత ఉద్దేశ్యం, చేసిన కసరత్తు ఏమిటో తెలుసుకుంటే ఎలాంటి సమస్యలూ రావు. ప్రతి రచయితకు ఓ టైమింగ్‌ ఉంటుంది. దానితో దర్శకుడికి సమన్వయం కుదరాలి. అప్పుడే మంచి స్క్రిప్ట్‌ సిద్ధమవుతుంది.

అన్ని జోనర్స్‌ రాయాలి

నీరు పాత్ర ఆకారాన్ని సంతరించుకున్నట్లుగానే రచయిత కూడా అన్ని జోనర్స్‌లో ఇమిడిపోగలగాలి. నవరసాల్ని వ్యక్తీకరించేలా సంభాషణలు రాసే చాతుర్యం ఉండాలి. నేను ఇప్పటివరకు ఫ్యామిలీ, పొలిటికల్‌, లవ్‌స్టోరీస్‌..ఇలా అన్ని జోనర్స్‌ సినిమాలకు మాటలు రాశాను. ఏదో ఒక తరహా సినిమాలకే పరిమితమైపోతే రచయితలోని ప్రతిభ రాణించలేదని నా అభిప్రాయం.

-కళాధర్‌ రావు


logo