గురువారం 13 ఆగస్టు 2020
Sunday - Jul 26, 2020 , 03:58:52

ఈ అరవిందుడు.. చరిత్ర అన్వేషకుడు!

ఈ అరవిందుడు.. చరిత్ర అన్వేషకుడు!

తెలంగాణలో వెలుగులోకి రాని చరిత్ర చాలా ఉంది. అధ్యయనాలు.. అన్వేషణలూ జరుగుతున్నాయి. కానీ.. ఒక యువకుడు ఎవరూ చెప్పని తెలంగాణ వైభవాన్ని చెప్తున్నాడు. నూనూగు మీసాల వయసులో, చరిత్ర కోసం గుట్టలూ, గుడులూ, మెట్ల బావుల వెంట తిరుగుతున్నాడు. దేశ..విదేశీ పరిశోధకులకు మన వైభవాన్ని వివరిస్తున్న ఆ యువకుడే అరవింద్‌ ఆర్య.  ఏ సంస్థల సాయం లేకుండా, కెరీర్‌ను పణంగా పెట్టి చరిత్ర అధ్యయనమే కెరీర్‌గా సాగుతున్న అరవింద్‌ ‘లైఫ్‌జర్నీ’ ఈవారం.

మాది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. కంచనపల్లిలోని జేసుతిరు హృదయ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి దాకా చదివాను. నాకు సాంఘిక శాస్త్రం అంటే అప్పటి నుంచే ఇష్టం ఏర్పడింది. 

వారసత్వంగా 

మా నాన్న రైతే అయినా పుస్తకాలు బాగా చదివే అలవాటుంది. దినపత్రికలు తప్పనిసరిగా చదువుతారు. ఆ ప్రభావం నాపై పడిందేమో చిన్నప్పటి నుంచే దినపత్రికలు చదివేవాడిని. సామాజిక అంశాలు తెలుసుకునేవాడిని. అందరూ పాఠశాల నుంచి ఇంటికి వెళ్తే, నేను దారిలోని గ్రంథాలయానికి వెళ్లేవాడిని. అక్కడ అనేక పుస్తకాలు కనిపించేవి. అన్నీ వెతికేవాడిని. అలా పురాతన కట్టడాలు,  చారిత్రక ప్రదేశాలపై ఆసక్తి ఏర్పడింది. ఇంటర్‌ చదువుతున్నప్పుడు వరంగల్‌లోని చారిత్రక ప్రాంతాలకు తరచూ వెళ్తుండేవాడిని. అంతవరకు పుస్తకాల్లో చదువుకున్న వాటిని ప్రత్యక్షంగా చూడటంతో ఆ కట్టడాలు.. వాటి వెనక దాగివున్న చరిత్రమీద ఆసక్తి రెట్టింపయింది. అదే క్రమంగా పరిశోధనగా మారింది. అందులో భాగంగానే తెలంగాణలోని పురాతన కట్టడాలు.. చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను. ఆసక్తి రేపిన అనుమానం: ఇంటర్‌ తర్వాత హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఏ జర్నలిజం చేశాను. దీని వల్ల నేను చేసిన పరిశోధనలను ప్రింట్‌.. ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా జనాల్లోకి వెళ్లేలా చేస్తుండేవాడిని. అప్పటికే చరిత్ర పుస్తకాలు చదివిన ఆసక్తితో ఒకసారి వరంగల్లు కోటకు వెళ్లాను. దాన్ని చూడగానే మనసులో అనేక సందేహాలు తొలిచాయి. కాకతీయులది మహా సామ్రాజ్యం కదా.. మరి వారి కోటల ఆనవాళ్లు అసలు కనిపించట్లేదనిపించింది. గోల్కొండ కోట.. భువనగిరి ఖిల్లాలా ఇదెందుకు కనిపించడం లేదని అనుమానం వచ్చింది. తర్వాత చరిత్ర ఆచార్యులను అడిగాను. పలు పుస్తకాలనూ చదివాను. అసలు విషయం తెలుసుకున్నాను. కాకతీయులు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే కట్టడాలను మాత్రమే రాతితో కట్టారట. తమ నివాస భవనాలన్నింటినీ కలపతోనే నిర్మించారట. అందుకే కాకతీయుల నాటి చెరువులు,ఆలయాలు, మెట్ల బావులు, శిలాతోరణాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. కానీ వారు కలపతో నిర్మించుకున్న ఇళ్లు కొన్ని శిథిలమై పోగా మరికొన్ని దండయాత్రల కారణంగా నేలమట్టం అయ్యాయని తెలుసుకోగలిగాను. అంతేకాదు వరంగల్‌ చుట్టుపక్కల ప్రాంతాలలో పలు ప్రాచీన దేవాలయాలు.. కట్టడాలు.. చెరువులను సందర్శించి అక్కడి శాసనాలను గమనించాను. వాటి చారిత్రక సమాచారాన్ని కూడా సేకరించాను. సమాచారం.. ఛాయా చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుండేవాడిని. 

దేవునిగుట్ట ఒక మలుపు 

అలా చాలామంది నా ఆసక్తికి మెచ్చుకునేవారు. రెట్టించిన ఉత్సాహంతో ఎవ్వరూ ఇప్పటివరకు చూడని చారిత్రక ప్రాధాన్యం కలిగిన విగ్రహాలను.. వస్తు విశేషాలను హైదరాబాద్‌, వరంగల్‌ మ్యూజియాలకు తరలించగలిగాను. ఇప్పటివరకూ పరిష్కరితంకాని రెడ్లవాడ, శాయంపేట హవేలి, గుడి తండా, నరసింహస్వామి దేవాలయం శాసనాల గురించి కథనాల ద్వారా అందరికీ తెలియజేయగలిగాను. ములుగు జిల్లాలోని ‘దేవునిగుట్ట’ గురించి ఫేస్‌బుక్‌లో కథనాలు రాస్తే విదేశీ పురావస్తు పరిశోధకులు తెలంగాణకు వచ్చి దేవునిగుట్టను సందర్శించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎంతోమంది విదేశీ పురాతత్వ శాస్త్రవేత్తలతో దేవునిగుట్టను పదులసార్లు సందర్శించారు. అలా  దానినొక చరిత్ర ప్రేమికుల దర్శనీయ ప్రదేశం చేయగలిగాను.  

అధ్యయనమే  కెరీర్‌ 

ఇక చదువూ, కెరీర్‌ గుర్తొచ్చేది అప్పుడప్పుడూ. కానీ చరిత్ర అధ్యయనమే నా కెరీర్‌ అనుకున్నాను. చాలామంది. ‘అరే!  ఈ పోరనికి ఇదేం పిచ్చో ఏమో. మంచిగా చదువుకొని ఏదైనా ఉద్యోగం చేసుకోక.. ఎప్పుడు చూసినా ఒక భుజానికి సంచి.. ఇంకో భుజానికి కెమెరా తగిలించుకొని తిరుగుతడు’ అంటుండేవాళ్లు. ఎవరు ఏమన్నా నేను మాత్రం చరిత్ర అధ్యయనమే లక్ష్యంగా తిరుగుతుండేవాడిని. తెలంగాణ పురావస్తు శాఖ.. పర్యాటక శాఖలు నిర్వహించిన ‘రాక్‌ ఆర్ట్‌ సొసైటీ’ ఆధ్వర్యంలో పుణె,  భోపాల్‌ నగరాల్లో సెమినార్లలో పాల్గొన్నాను. అక్కడ నేను పరిశోధించిన చరిత్రకు సంబంధించిన పరిశోధనా పత్రాలు సమర్పించాను. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన రక్తదాన శిబిరాలు, వన సంరక్షణ,  మొదలైన  సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాను.  

ది అన్‌టోల్డ్‌ తెలంగాణ 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 500లకు పైగా ప్రదేశాల్లో అనేక పర్యాయాలు పర్యటించాను. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్‌,  కరీంనగర్‌, నల్లగొండ, యాదాద్రి, ఖమ్మం మొదలైన జిల్లాల్లో నా పరిశోధనలు విరివిగా సాగాయి. వరంగల్‌ ప్రాంత వాసిని కావడం.. కాకతీయులకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేసిన వ్యక్తిని కావడం వల్ల ఎక్కువగా కాకతీయులు ఏలిన ప్రాంతాల్లో పర్యటించి  కట్టడాలను,  చారిత్రక విశేషాలను వెలుగులోకి తెచ్చాను.  నేను ఏ ప్రదేశాన్ని సందర్శించినా ఫొటోల రూపంలో బంధించాను.  ఇప్పటివరకు 30 వేల ఫొటోలను తీశాను. రవీంద్రభారతిలో ‘ది అన్‌టోల్డ్‌ తెలంగాణ’ పేరుతో ఐదు రోజులపాటు ఫోటో ఎగ్జిబిషన్‌ పెట్టాను. దీని గురించి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేసి నా ప్రయత్నాన్ని మెచ్చుకోవడం సంతోషాన్ని కలిగించింది. 

చరిత్ర  చెప్పే స్థాయికి 

తెలంగాణలో ఇప్పటి వరకు వెలుగుచూడని శాసనాలు, వేల ఏండ్లనాటి సాంప్రదాయాలను ‘మనకు తెలియని తెలంగాణ’ పేరుతో పుస్తకంలోనమోదు చేశా.  మామిడి హరికృష్ణ గారి సహకారాలతో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ఈ పుస్తకం 2019  మే 20న అప్పటి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషి చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. ‘వరంగల్‌ సందర్శిని’ అనే శీర్షికతో వరంగల్‌ ఆకాశవాణి కేంద్రం నుండి 15కి పైగా రేడియో ప్రసంగాలు చేశాను. 93.5 రెడ్‌ ఎఫ్‌ఎంలో పలుసార్లు వరంగల్‌ చారిత్రక కట్టడాల గురించి కార్యక్రమాలు నిర్వహించాను. 2017లో టీ-సాట్‌ టీవీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాను. 

తెలంగాణ రాష్ట్రం అంతటా అపారమైన చారిత్రక వారసత్వ సంపద.. వేలాది కట్టడాలు ఉన్నాయి. వేల ఏండ్ల నాటి ఆదిమానవ సమాధులు.. ఆనాటి మానవులు రాతి పడగ రాళ్లపై చిత్రించిన చిత్రాలు.. ఇలా ఎన్నింటిపైనో జరగాల్సినంత పరిశోధన జరగడం లేదు. ఈ అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ అరవింద్‌ తపనతో ఆ దిశగా అడుగులు వేస్తూ తన శక్తిమేరకు పరిశోధనలు జరుపుతున్నాడు. అతను ,ఇలాగే చరిత్ర అధ్యయనాన్ని కొనసాగిస్తూ.. అపూర్వమైన మన పురావస్తు సంపదను సంరక్షించాలని  కోరుకుందాం. ఆ ప్రయత్నంలో మనం కూడా సహకరిద్దాం. చరిత్రను బతికించుకోవడం అంటే, మన ఉనికిని నిలబెట్టుకోవడమే.

కాకతీయ వారసుడితో ...

ప్రస్తుత కాకతీయ వంశస్థుడు కమల్‌ చంద్ర భంజ్‌దేవ్‌ కాకతీయతో పలుమార్లు కలిసి కాకతీయుల చరిత్ర గురించి గంటల తరబడి మాట్లాడటం మరచిపోలేని అనుభూతి. ముఖ్యమైన పనిమీద ఆయన హైదరాబాద్‌ వచ్చినప్పుడు వేరే  ఎవ్వరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. కానీ నాకు కొద్దిసేపు సమయం కేటాయించడం గర్వంగా అనిపిస్తుంది. కాకతీయుల వారసుడిగా ఆయనకు చరిత్రపై ఉన్న ఆసక్తి..  తమ పూర్వీకుల గురించిన అవగాహన చాలా ఉంది. ఆయనతో మాట్లాడితే ఆ విషయం తెలుస్తుంది. కాకతీయుల వంశానికి చెందిన వ్యక్తితో మాట్లాడుతుండటం..  మరోవైపు వాళ్ల పూర్వీకులపై పరిశోధన చేయడం రెండూ పోల్చుకుంటే నిజంగా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. 

విదేశీయులతో కలిసి ...

నా కథనాల ద్వారా విదేశీ పరిశోధకుల తాకిడికూడా ఎక్కువైంది. అమెరికాలోని వెస్లియన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ఫిలిప్‌ బీ వాగొనెర్‌తో కలిసి వారం రోజులపాటు వరంగల్‌ చారిత్రక విశేషాలపై పరిశోధన చేశాను.  ఇండియన్‌ హిస్టరీ ప్రముఖులు కోరినా వెసెల్స్‌ మెవిసెన్‌తో కలిసి పలుమార్లు దేవుడిగుట్ట,  ఫణిగిరి, వరంగల్‌ కోట, నైన గుళ్ళు, సర్వతోభద్ర దేవాలయం లాంటి చారిత్రక కట్టడాలపై పరిశోధన చేశాను. ప్రముఖ ఆర్కిటెక్చురల్‌ హిస్టారియన్‌ ప్రొఫెసర్‌ ఆడం హార్డీతో కలిసి దేవుని గుట్ట ఆలయంపై,  వరంగల్‌ కోటపై పరిశోధనలు చేశాను. కార్డిఫ్‌ యూనివర్సిటీ పరిశోధకురాలు లక్ష్మీ ఆండ్రేడ్‌తో కలిసి వరంగల్‌ కట్టడాలపై అధ్యయనం చేశాను. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా ప్రొఫెసర్‌, ఆర్కియాలజిస్ట్‌ థామస్‌ ఈ లెవీతో కలిసి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని బృహత్‌ శిలాయుగ నాటి సమాధులపై పరిశీలన జరిపాను. logo