బుధవారం 12 ఆగస్టు 2020
Sunday - Jul 12, 2020 , 01:06:08

హైదరాబాద్‌.. గార్డెనర్స్‌

హైదరాబాద్‌.. గార్డెనర్స్‌

ఇంటి ఆవరణలోని ఓ పూలమొక్క.. గాలికి హొయలు పోతూ, అలా పలుకరిస్తే చాలు.. ఆ ఆనందమే వేరు. పచ్చని పరిసరాలు కంటికి ఇంపుగా కనిపించడమే కాదు.. ఆరోగ్యాన్ని.. ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. మానసిక, శారీరక సమస్యలతో బాధపడేవారు ప్రకృతి ఒడిలో గడిపితే.. ఆరోగ్యవంతులవుతారని వైద్య పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అందుకోసమే నగరవాసులంతా ‘గార్డెనింగ్‌' వైపు అడుగులేస్తున్నారు. తోటల పెంపకం గురించి చర్చించుకోడానికి ఆన్‌లైన్‌ వేదికలనూ ఏర్పాటు చేసుకుంటున్నారు.

దయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా క్షణం తీరిక లేని జీవితాలు. ట్రాఫిక్‌ కష్టాలు, కాలుష్యంతో ఇబ్బందులు. ఫలితంగానే మానసిక, శారీరక సమస్యలు. ప్రకృతి ఒడిలో సేదతీరడం ద్వారా వీటన్నింటినుంచీ ఉపశమనం పొందవచ్చని ఆధునిక వైద్య పరిశోధకులు చెబుతున్నారు. పెరట్లో పెంచే పూల మొక్కలు, ఆ ఇంటికి అందంతో పాటు అందులో నివసించేవారికి  ఎంతో హాయినిస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇంటి పెరడుతోపాటు మిద్దె తోటలను పెంచేవారి సంఖ్య పెరుగుతున్నది. ‘గార్డెనింగ్‌' హైదరాబాద్‌లోనూ విస్తరిస్తున్నది. సంపన్నుల సౌధాల నుంచి మధ్యతరగతి నివాసాలకూ ప్రవేశిస్తున్నది.  లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన అనేక మందికి తోటల పెంపకం ఓ వ్యాపకంగా మారింది. ఈ నేపథ్యంలో మొక్కలు పెంచేవారితోపాటు పెంచాలనుకునే వారితో కలిపి ఓ కమ్యూనిటీ కూడా ఏర్పడింది. అదే ‘హైదరాబాద్‌ గార్డెనర్స్‌'.

 ఎంతో మార్పు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల జీవనశైలిలో చాలా మార్పు వచ్చింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే గార్డెనింగ్‌ అలవాటుగా మారింది. కొంత మంది అభిరుచిగా గార్డెనింగ్‌ను స్వీకరిస్తే, మరికొంత మంది కాలక్షేపం కోసం ముందుకువస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ‘గార్డెనర్స్‌ కమ్యూనిటీ’లన్నింటినీ కలుపుతూ ‘హైదరాబాద్‌ గార్డెనర్స్‌' పేరుతో ఓ ఫేస్‌బుక్‌ పేజీని రూపొందించారు. పచ్చదనం కోసం పరితపించే 10వేల మందికి పైగా ఈ కమ్యూనిటీలో ఉన్నారు. 

వీళ్లంతా తోటలకు సంబంధించిన విషయాలు, సమస్యలు చర్చించుకుంటారు. పరిష్కారాల కోసం ఒకరికొకరు సహకరించుకుంటారు. కొత్తగా గార్డెనింగ్‌ చేసేందుకు ముందుకు వచ్చేవారికి సాయం చేయడంతోపాటు తోటల కోసం మంచి మంచి లాండ్‌స్కేప్‌ డిజైన్లను సూచిస్తూ ఉంటారు. తోట పని ప్రయోజనాల గురించి,   సేంద్రియ ఎరువుల గురించి సమాచారం ఇచ్చిపుచ్చుకుంటారు. తామంతా గార్డెనింగ్‌ను  ప్రేమిస్తామని, ఒకేరకమైన ఆసక్తి కలిగినవాళ్లంతా  ‘హైదరాబాద్‌ గార్డెనర్స్‌' ద్వారా కనెక్ట్‌ కావడం ఆనందంగా ఉన్నదనీ ఈ కమ్యూనిటీలో సభ్యుడైన వంశీకృష్ణ చెబుతున్నారు. వంశీకృష్ణ ‘ఎక్సోటిక్‌ స్పైనెస్‌' కంపెనీ యజమాని. వృత్తి, ప్రవృత్తిలో భాగంగా.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లభించే అరుదైన మొక్కలను సేకరిస్తున్నారు. తోటల కోసం ప్రత్యేకమైన హోల్డర్లు, ఆకర్షణీయమైన మొక్కల కుండీలను అందిస్తున్నారు. ఆన్‌లైన్‌, కార్పొరేట్‌ ఆర్డర్‌లను తీసుకుంటారు. అన్ని రకాల తోటలకు, ల్యాండ్‌ స్కేపింగ్‌, ఇండ్లు, కార్యాలయాలు, ఇంటి లోపలి పరిసరాలను కూడా పచ్చదనంతో నింపేస్తారు. తక్కువ నీటితో పెరిగే మొక్కలను ప్రాచుర్యంలోకి తేవడంతోపాటు వాటి పెంపకాన్ని ప్రోత్సహిస్తామని వంశీ చెబుతున్నారు. బెంగళూరులాంటి అనేక నగరాలు పచ్చని తోటలతో ఆకుపచ్చ దృశ్యాలతో సుందరంగా మారుతున్నాయి.  హైదరాబాద్‌లోనూ అలాంటి సంస్కృతి రావాలని వంశీకృష్ణ ఆశిస్తున్నారు. 

ఇష్టంతో గార్డెనింగ్‌..

మనదగ్గర కూడా చాలా మందికి తోట పని చేయడం, సమీపంలోని నర్సరీని సందర్శించడం ఇష్టమే. కానీ, చివరికి ఒక గులాబీ మొక్కతోనే ఇంటికి వస్తారు. లాక్‌డౌన్‌ వల్ల గార్డెనింగ్‌ చేసేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు. కొందరు దీనిని ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. నేను ఎలాంటి మొక్కలు పెంచగలనంటూ ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు. కొందరైతే తమ పెరట్లో తామర కొలనును ఏర్పాటు చేసుకుంటామని, తమ తోటను సందర్శించాలని కూడా కోరుతున్నారు. హైదరాబాద్‌లో ఇల్లు లేదా కార్యాలయ స్థలాలు ఎంత చిన్నవైనా పచ్చగా తీర్చిదిద్దేలా అవగాహన కల్పిస్తున్నాం.  నిజానికి గార్డెనింగ్‌ అనేది.. ఆసక్తితో ముడిపడిన విషయం. - వంశీ కృష్ణ


logo