శుక్రవారం 07 ఆగస్టు 2020
Sunday - Jul 12, 2020 , 00:55:02

సూపర్‌ సోయగాలు!

సూపర్‌ సోయగాలు!

ఎన్ని ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ ఉన్నా.. ఏదో ఓ కొతదనం కోసం వెతుకుతుంది మగువ మనసు. అందుకేనేమో ఫ్యాషనిస్టులు.. రోజుకో కొత్తట్రెండ్‌ని ప్రవేశపెడుతూ.. అమ్మాయిల మనసు దోచేస్తుంటారు. ఆ లేటెస్ట్‌ ట్రెండ్స్‌ మీకోసం..

పాలపుంత చేతిమీదకి.. 

దివిలో ఉండాల్సిన పాలపుంత భువికి దిగివస్తే.. ఆ సొగసు చూడతరమా? కాబట్టే, గ్రహాలనూ, నక్షత్రాలనూ అందమైన చేతివేళ్ల మీదా మెరిపిస్తున్నారు. ఇంట్రా గెలాక్టిక్‌ స్పేస్‌ ధీమ్‌తో.. నెయిల్‌ ఆర్ట్‌ చాలా ఫేమస్‌ అయిపోయింది. నెయిల్‌ పాలిష్‌ అవసరం లేకుండా కూడా ఈ నెయిల్‌ ఆర్ట్‌ని అలంకరించుకునే సౌకర్యం ఉంది.  ఓ డాటింగ్‌ టూల్‌తో ఒక రకమైన నెయిల్‌ ఆర్ట్‌ని వేసుకోవచ్చు. కేవలం గోర్లకే కాకుండా.. పూర్తి వేళ్ల మీద కూడా అక్కడక్కడ చిన్న స్టడ్స్‌ని అతికిస్తే చెయ్యి మరింత అందంగా మెరిసిపోతుంది. ఇందులో మరొక రకం ఉంది.  దీంట్లో ఒక్కో వేలికి ఒక్కోలా డిజైన్‌ చేస్తూ  నెయిల్‌ ఆర్ట్‌ వేయాల్సి ఉంటుంది. ఈ మెరుపు పార్టీలూ వేడుకల సందర్భంగా మరింత అట్రాక్టివ్‌గా ఉంటుంది. మీరూ ట్రై చేయండి. 

పాకెట్‌ లెహంగాలు.. 

జీన్స్‌, ప్యాంట్‌లకు జేబులు ఉండటం మామూలే! ఆడ, మగ తేడా లేకుండా అందరికీ పాకెట్‌ అవసరమే కాబట్టి, వీటికీ పెడుతుంటారు. కానీ సంప్రదాయమైన లెహంగాలకు కూడా పాకెట్లు పెడితే ఎలా ఉంటుంది? అలా అనుకొనే ఫ్యాషన్‌ డిజైనర్లు వీటికి కూడా పాకెట్‌లను కుట్టడం, పెట్టడం ప్రారంభించారు. హెవీ, నార్మల్‌.. ఇలా ఒకటేమిటీ.. ఏ రకమైనా లెహంగాలకైనా పాకెట్‌లను జోడిస్తున్నారు. బయటికి కనపడకుండా లెహంగాల్లో కలిసిపోయేలా డిజైన్‌ చేస్తున్నారు.  పాకెట్‌ల్లో చేతులు పెట్టి ర్యాంప్‌ వాక్‌ చేయడం ఫ్యాషన్‌ అయిపోయింది.

 నల్లపూసలు బ్రాస్‌లెట్‌గా.. 

అమ్మాయికి పెండ్లి అయిందనడానికి గుర్తుగా మెడలో తాళిబొట్టు, కాలికి మెట్టెలు ఉండాల్సిందే. మన దగ్గరే కాదు.. మంగళసూత్రం అనేది ఇతర రాష్ర్టాల్లో కూడా ఉందనుకోండి. అయితే.. మన దగ్గర  మంగళసూత్రంతో పాటు.. నల్లపూసలు వేసుకొంటున్నారు. ఇప్పటివరకు మెడలో మెరిసిన ఆ నల్లపూసలు  చేతికి బ్రాస్‌లెట్‌లానూ మారిపోయాయి. బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి.. ఇతర నటీమణులు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. దీంట్లో కూడా రకరకాల ట్రెండ్స్‌. రెండు లైన్లు, పెండెంట్‌, హార్ట్‌ షేప్‌.. మెడలో ఎంత అందంగా మెరిసిందో.. చేతికీ అంతలా మెరిసేలా రకరకాల డిజైన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం నల్లపూసలు లేకుండా.. మధ్యలో చైన్‌ వచ్చేలా ఉన్న బ్రాస్‌లెట్స్‌ నవతరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. 

మ్యాచింగ్‌.. మ్యాచింగ్‌.. 

పర్సులు, డ్రెస్‌, బొట్టుబిళ్లలు.. ఇలా అన్నీ మ్యాచింగ్‌ కావాలనుకునేవాళ్లు అక్కడక్కడా ఉంటారు. ప్రత్యేకంగా డ్రెస్‌కి తగ్గ చెప్పులు డిజైన్‌ చేయించుకునే వాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్టు  ఆన్‌లైన్‌ అమ్మకాలు చెబుతున్నాయి. చెప్పులే కాదు బ్యాగులు కూడా.. అచ్చు గుద్దినట్టు ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. సేమ్‌ ప్యాటర్న్‌, కలర్‌ కాంబినేషన్లు ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎక్కువగా గ్లిటరింగ్‌ వచ్చేవాటికి మగువలు ఓటేస్తున్నారు. కాంబో ఆఫర్‌లా కూడా ఇవి దొరుకుతుండటంతో.. సేల్స్‌ అమాంతంగా పెరిగినట్టు విక్రేతలు చెబుతున్నారు. కొంతమంది స్టోన్స్‌, ఇతర వర్క్స్‌తో తమకు నచ్చిన డిజైన్లతో కస్టమైజ్‌ చేయించుకుంటున్నారు కూడా. 


logo