శుక్రవారం 07 ఆగస్టు 2020
Sunday - Jul 12, 2020 , 00:33:11

చిన్న పక్షి.. ఎంతో శక్తి..

చిన్న పక్షి.. ఎంతో శక్తి..

హాయ్‌ పిల్లలూ! మనం రోజూ రకరకాల పక్షులను చూస్తాం కదా! అట్లాగే, ఈ భూగోళం మీద అనేక జాతుల పక్షులు ఉన్నాయని తెలుసు కదా! మరి వాటిలో అతిచిన్న పక్షి ఏదో తెలుసా? ‘హమ్మింగ్‌ బర్డ్‌'. ఈ బుజ్జిపిట్ట గురించి తెలుసుకుందామా?

ప్రపంచంలోనే అతి చిన్న పక్షి..హమ్మింగ్‌ బర్డ్‌. ఈ పక్షి తన రెక్కలను ఆడించేప్పుడు వచ్చే శబ్దం శ్రావ్యంగా ఉండటం వల్ల దీనికి ‘హమ్మింగ్‌ బర్డ్‌' అనే పేరొచ్చింది.  వీటి కాళ్ళు సన్నగా బక్క పలచగా ఉంటాయి. కాబట్టే, ఇవి నడవలేవు, నిలబడలేవు. గాలిలో రెక్కలు అల్లల్లాడిస్తూ ఎగురుతూనే  పూలలోని మకరందాన్ని సేకరిస్తాయి.  ఇవి వెనక్కీ ముందుకూ, పైకీ కిందికీ ఎగురగలవు. ఈ పక్షులు గంటకు 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి.   సెకనుకు 200 సార్లు తమ రెక్కలను ఆడించగలవు! అలా ఆడిస్తూ ఉంటేనే అవి తమ పనులు చేసుకోగలవు.  శత్రువుల నుంచి  రక్షణ కోసం పొడవైన ముక్కును ఆయుధంలా వాడుకుంటాయి.  ఈ పక్షులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శత్రువుల నుంచి కాపాడటానికి మిగతా పక్షులు తరలి వస్తాయి.   అలాగే కోస్టారికా ప్రాంతంలో శాస్త్రవేత్తలు...  అక్కడున్న వివిధ వయసుల పక్షుల ముక్కుల పొడవును,  చురుకుదనాన్ని తెలుసుకొనే  ప్రయత్నం చేశారు.  వీటికి వాసన చూసే శక్తి ఉండదు. నాలుక ఇంగ్లిష్‌ అక్షరం ‘డబ్ల్యూ’ ఆకారంలో ఉంటుంది! వాతావరణాన్ని బట్టి  ఒంటి రంగు కూడా మారుతుంది.  వీటి గుండె నిమిషానికి 1,260 సార్లు కొట్టు కుంటుంది.  మగ హమ్మింగ్‌ పక్షులు అసలు ఏ పనీ చేయవు. ప్రతిదానికీ ఆడపక్షి మీదే ఆధారపడతాయి. గూడు కట్టడం దగ్గర్నుంచి, గుడ్లు పొదగడం, పిల్లలకు ఆహారం తీసుకురావడం వరకూ ఆడ పక్షులే అన్ని బాధ్యతలూ తీసుకుంటాయి. 


logo