శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Jul 04, 2020 , 23:35:52

కంప్యూటర్లో చీకటి ప్రపంచం

కంప్యూటర్లో చీకటి ప్రపంచం

సముద్రం మీద తేలుతూ కనిపించే ఓ చిన్న మంచుముక్క, దూరం నుంచి ఎంత అమాయకంగా కనిపిస్తుందో! చటుక్కున తీసి గ్లాసులో వేసుకోవాలనిపిస్తుంది. దగ్గరకు వెళ్లాక కానీ అర్థం కాదు... దాని కింద ఏకంగా ఓ మంచు పర్వతమే దాగున్నదని. టైటానిక్‌ను సైతం తలకిందులు చేసే శక్తి దానికి ఉందని.ఇంటర్నెట్‌ కూడా అంతే! ఇలా సెర్చ్‌ కొట్టగానే అలా కోరుకున్నది దక్కుతున్నది కదా అని మురిసిపోవడానికి లేదు. అమాయకంగా కనిపించే... ఆ తెల్లటి చిన్న తెర వెనుక ఓ చీకటి ప్రపంచం దాగుంది.  అక్కడి చిక్కుముడుల ముందు వేల పద్మవ్యూహాలు సైతం చిన్నబోతాయి. వేసే ప్రతి అడుగూ ఓ లాండ్‌మైన్‌ని తలపిస్తుంది. అదే డార్క్‌నెట్‌! చీకటి కంటే చిక్కటి సామ్రాజ్యం. కంగారుపడకండి. ఈ ఒక్కసారికీ మేం దగ్గరుండి మీకు ఆ లోకాన్ని చూపించి తీసుకువస్తాం...

సర్ఫేస్‌ వెబ్‌, డీప్‌ వెబ్‌, డార్క్‌వెబ్‌... వీటి గురించి ఎప్పుడన్నా విన్నారా? తక్కువే కదా. మన దృష్టిలో వెబ్‌ అంటే ఇంటర్నెట్‌ మాత్రమే. అందులో వేర్వేరు దశలు ఉంటాయన్న ఆలోచనే రాకపోవచ్చు. ఉంటాయి. మనకు పైకి కనిపించేది అంతా సర్ఫేస్‌ వెబ్‌. అంటే సెర్చ్‌ చేసిన వెంటనే పలకరించే సమాచారం అన్నమాట. కానీ అది ఇంటర్నెట్లో మహా అయితే ఓ నాలుగు శాతం మాత్రమే. ఆ సర్ఫేస్‌ వెబ్‌ను దాటుకొని వెళ్తే కనిపించే ప్రపంచాన్ని డీప్‌ వెబ్‌ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే... మీ మెయిల్‌ ఐడీ కూడా ఇంటర్నెట్లో భాగమే! కానీ ఆ మెయిల్‌ ఐడీని గూగుల్‌ చేసినంత మాత్రాన, అందులో ఉన్న మెయిల్స్‌ అన్నీ బయటకు వచ్చేయవు కదా! అలా బయటకు కనిపించని సమాచారం అంతా డీప్‌ వెబ్‌ అన్నమాట. వ్యక్తిగత భద్రత, వ్యాపారం లాంటి రకరకాల కారణాలతో గోప్యంగా ఉండేదే డీప్‌వెబ్‌. లాగిన్‌ అవ్వడం ద్వారానో (ఉదా॥ స్కైప్‌), డబ్బులు కడితేనో (అమెజాన్‌ ప్రైమ్‌) ఆ డీప్‌వెబ్‌లోకి ప్రవేశం దక్కుతుంది. అయితే కథ ఇక్కడితో పూర్తవదు. ఇక్కడే మొదలవుతుంది! ఆ డీప్‌వెబ్‌ను కూడా దాటుకొని వెళ్తే డార్క్‌వెబ్‌ లేదా డార్క్‌నెట్‌ పలకరిస్తుంది. మీరెవరో, ఏం చేస్తున్నారో, ఎక్కడి నుంచి బ్రౌజ్‌ చేస్తున్నారో... అక్కడ అంతా రహస్యం. ఆ లోకంలోకి ప్రవేశించగానే అనూహ్యమైన పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ఐపీ నుంచి ఐపీ వరకు...


ఇంటర్నెట్లో ప్రతి కంప్యూటర్‌కీ ఓ ఐపి అడ్రస్‌ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రతి వెబ్‌సైట్‌కి కూడా ఒక ఐపి ఉంటుంది. మనకి ఏదన్నా వెబ్‌సైట్‌ కావాలంటే దాని ఐపిని కంప్యూటర్‌కి అందించాలి. హూ... అదేమంత తేలిక కాదు. నాకు 656.789.324.9 అడ్రస్‌ ఉన్న వెబ్‌సైట్‌ కావాలి అని అడగాలంటే కష్టం కదా! అందుకే DNS (Domain Naming System) ద్వారా సదరు వెబ్‌సైట్‌కి ఉండే ఐపీ అడ్రస్‌ను పేరులోకి మార్చుకునే అవకాశం కల్పించారు. మనం ఒక పేరును టైప్‌ చేయగానే సెర్చ్‌ ఇంజిన్లో ‘వెబ్‌ క్రాలర్స్‌' అనే డిజిటల్‌ సైన్యం మేల్కొంటుంది. అది ఇంటర్నెట్‌ నలుమూలలా పాకుతూ, మన శోధనకు తగిన ఫలితాన్ని రాబడుతుంది. జనం ఎక్కువగా ఎలాంటి పదాలు లేదా వెబ్‌సైట్‌ను సెర్చ్‌ చేస్తున్నారు అన్న లెక్కల ఆధారంగానే అలెక్సా ర్యాంకింగులు, గూగుల్‌ ప్రకటనలు వరిస్తాయి. మీ వెబ్‌సైట్‌ ఇలా సెర్చ్‌ ద్వారా బయటపడకూడదు అనుకుంటే ఈ వెబ్‌ క్రాలర్స్‌ను అడ్డుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్లో ఉండే సెట్టింగులను మార్చుకుంటే సరిపోతుంది. ఇది డీప్‌వెబ్‌కు తొలిమెట్టు.

టన్నెలింగ్‌

నెట్లో ఓసారి ‘లేటెస్ట్‌ మొబైల్‌' అని సెర్చ్‌ చేసి చూడండి. ఈ తర్వాత నుంచి మీకు ఇంటర్నెట్‌ కనిపించే తీరు మారిపోతుంది. ఫేస్‌బుక్‌, గూగుల్‌... ఇలా ఏ సైట్‌ ఓపెన్‌ చేసినా మీకు మొబైల్‌ ఫోన్ల ప్రకటనలే కనిపిస్తూ ఉంటాయి. కారణం! మన బ్రౌజింగ్‌ను అనుక్షణం సదరు కంపెనీలు గమనిస్తూనే ఉంటాయి. మన అభిరుచులను క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఎక్కడికి వెళ్లినా... మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ప్రైవసీ లాంటి సెట్టింగులు మార్చేసుకొని, భద్రంగా ఉన్నామనుకుంటాం. అయినా కూడా... ఇంటర్నెట్లో మన ప్రతి కదలికనీ పసిగట్టి, వ్యాపారం కిందకి మార్చేసుకుంటున్నాయి దిగ్గజ సంస్థలు. డార్క్‌వెబ్‌లో ఇది సాధ్యం కాదు.

ఇందులోకి ప్రవేశించాలంటే సాధారణ బ్రౌజర్లు ఉపయోగపడవు. ‘TOR’ (the onion router) అనే బ్రౌజర్‌తోనే ఇది సాధ్యం. ఈ TOR, టన్నెలింగ్‌ అనే వింత ఆయుధాన్ని ఉపయోగిస్తుంది. ‘నాకు ఫలానా వెబ్‌సైట్‌ కావాలి’ అని మీరు TOR ని అడిగిన వెంటనే అది మీ అభ్యర్థనను నేరుగా పంపదు. ఆ రిక్వెస్ట్‌ను సంకేత భాషలోకి (encryption) మార్చి మరో ఐపీ అడ్రస్‌కు పంపుతుంది. అక్కడి నుంచి ఇంకో ఐపీ అడ్రస్‌... అలా అలా వందల చేతులు మారి చివరికి సదరు వెబ్‌సైట్‌కు చేరుకుంటుంది. అంటే చివరి దశకు వచ్చేసరికి రిక్వెస్ట్‌ నిజంగా ఎక్కడి నుంచి వచ్చిందో పసిగట్టడం అసాధ్యం అన్నమాట. ఇలా ఎన్నో పొరల కింద దాక్కొని ఉంటుంది కాబట్టి దీన్ని ‘ఆనియన్‌ రూటర్‌' అంటారు. డార్క్‌నెట్‌లో కనిపించే వెబ్‌సైట్లకి .onion అని తగిలించి ఉంటుంది. (ఉదా॥ facebook.onion). కాకపోతే ఇలా గింగిరాలు తిరుగుతూ వెళ్లడం వల్ల... డార్క్‌వెబ్‌ చాలా చాలా నిదానంగా పనిచేస్తుంది. చాలా సందర్భాలలో సైట్‌ అసలు తెరుచుకోకపోవచ్చు కూడా! డార్క్‌వెబ్‌లో ఉండే సమాచారాన్ని వెతికేందుకు కూడా ‘DUCK DUCKGO’ లాంటి ప్రత్యేకమైన సెర్చ్‌ ఇంజన్లు కావాల్సి ఉంటుంది.

బీ కేర్‌ఫుల్‌

డార్క్‌నెట్‌ చట్టవ్యతిరేకం కాదు... అందుకని అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే జర్నలిస్టులు, వ్యక్తిగత గోప్యత కావాలనుకునే వాళ్లు, సరదాగా అక్కడ ఏముంటుందో చూడాలనుకునే టెకీలూ... డార్క్‌నెట్‌ని ఉపయోగిస్తూ ఉంటారు. ‘సెక్యూర్‌ డ్రాప్‌' లాంటి అప్లికేషన్లు... డార్క్‌నెట్‌ ద్వారా సమాచారాన్ని భద్రపరుచుకునేందుకు సాయపడతాయి. కానీ డార్క్‌నెట్‌ ఓ చోర్‌బజార్‌ లాంటిది. అక్కడ మన భద్రతకు గ్యారెంటీ లేదని గుండెదిటవు చేసుకున్నాకే అడుగుపెట్టాలి. ఏదో ఒక వల విసిరి, మన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే ప్రయత్నాలు అడుగడుగునా కాచుకొని ఉంటాయి. మీరు ప్రెస్‌ చేసే ఒకే ఒక్క లింక్‌... జీవితాన్ని బజారుకి ఈడ్చేయవచ్చు. చవకగా వస్తున్నది కదా అని ఏదో ఒక లావాదేవీలోకి అడుగుపెడితే, కటకటాల పాలవ్వచ్చు. ఉదాహరణకు ‘మీ క్రెడిట్‌ కార్డు ద్వారా వంద రూపాయలు చెల్లించండి చాలు, జీవితాంతం నెట్‌ఫ్లిక్స్‌ చూసే మెంబర్‌షిప్‌ వివరాలు ఇచ్చేస్తాం’ అని ఓ ప్రకటనకి ఆశపడ్డారనుకోండి. అటు మీ క్రెడిట్‌ కార్డూ గోవింద... ఇటు నెట్‌ఫ్లిక్స్‌ దృష్టికి వస్తే మీ పరువూ గోవింద’.డార్క్‌నెట్‌ ఓ పద్మవ్యూహం... అందులోంచి సురక్షితంగా బయటకి వస్తామనే గ్యారెంటీ లేదు.

ఇలా పట్టుకుంటారు


డార్క్‌నెట్‌లో ఎలాంటి అక్రమ లావాదేవీలైనా జరిగే అవకాశం ఉంది. అలాగని చూస్తూ ఊరుకుంటే ప్రపంచమే తలకిందులైపోతుంది. అందుకనే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు డార్క్‌నెట్‌ అక్రమాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంటాయి. చాలా దేశాలు ప్రత్యేకమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి మరీ... డార్క్‌నెట్‌ను పర్యవేక్షిస్తున్నాయి. అమెరికా MEMEX, యూరోపియన్‌ యూనియన్‌ TITANIUM, కెనడా Dark Space... ఇలా ఒక్కో దేశం ఒక్కో ప్రాజెక్టు సాయంతో డార్క్‌ నెట్‌ను పర్యవేక్షిస్తున్నది. మన దేశంలోనూ వేర్వరు మంత్రిత్వ శాఖల కింద పనిచేసే సాంకేతిక సంస్థలు ఈ దిశగా కృషి చేస్తున్నాయి. కానీ ముందే చెప్పుకున్నట్టు ఇదేమంత తేలిక యవ్వారం కాదు. డేటా ఎక్కడికక్కడ సంకేత భాషలోకి మారిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు డిలీట్‌ అవుతూ ఉంటుంది, లావాదేవీలకి సంబంధించిన ఐడీలు మాయమైపోతాయి. ఆన్‌లైన్‌ చెల్లింపులను పసిగట్టడం ద్వారా, తామే క్లయింట్లలా ముసుగు వేసుకోవడం ద్వారా కొంత సమాచారం రాబట్టవచ్చు. కానీ బిట్‌కాయిన్లు వచ్చిన తర్వాత... ఈ చెల్లింపుల మూలాలు కూడా అంతుచిక్కడం లేదు. సాధారణంగా సైబర్‌ నేరస్తులు చేసే చిన్న పొరపాటు వల్ల వాళ్లే పట్టుబడిపోతుంటారు. ఉదాహరణకు ఏదన్నా ఐడీ క్రియేట్‌ చేసుకునేందుకు ఒక్కోసారి తమ పేరుకు దగ్గరగా ఉన్న పేరును ఎంచుకుంటారు. అందుకే అక్రమార్కులు ఎక్కడ పట్టుబడతారో అని వేయి కండ్లతో కాచుకొని ఉంటాయి నిఘా సంస్థలు.

ఎవరో తెలియదు


ప్రతి వెబ్‌సైట్‌ ‘బ్రౌజర్‌ ఏజంట్‌' అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంటుంది. దాని ద్వారా మనకు తెలియకుండానే... మనం వాడుతున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, బ్రౌజర్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌ లాంటి వివరాలన్నీ సదరు సైట్‌కి చేరిపోతాయి. కానీ డార్క్‌నెట్‌లో అది కూడా గోప్యమే. మనం ఏ కీస్‌ వాడాము, మన బ్రౌజింగ్‌ హిస్టరీ... అంతా ఎప్పటికప్పుడు మాయం అయిపోతుంటాయి.

లాన్‌ - వాన్‌


పెద్ద సంస్థలు సమాచారాన్ని సురక్షితంగా ఉంచేందుకు ‘లోకల్‌ ఏరియా నెట్‌వర్క్‌' (LAN) వ్యవస్థని ఉపయోగించుకుంటాయి. దానివల్ల డేటా అంతా ఆ LANలోనే భద్రంగా ఉంటుంది. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డుల ద్వారానే అందులోకి ప్రవేశించగలుగుతున్నాం. సమాచారాన్ని ఎవరు ఎంతమేరకు వినియోగించుకుంటున్నారో ఎప్పటికప్పుడు వివరంగా తెలుస్తూ ఉంటుంది. ఇక బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు వంటి భారీ సంస్థలు ‘వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌' (WAN) ని వినియోగించుకుంటాయి. టెలిఫోన్‌ లైన్లు లేదా శాటిలైట్ల ద్వారా వేర్వేరు శాఖల మధ్య సమాచార మార్పిడి జరుగుతుంది. వ్యవస్థ అనుమతి లేనిదే వ్యక్తి చొరబడే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కూడా సమాచారం కాస్త సురక్షితమే!

జోలికి ఎందుకు పోవడం?


ఓ అంచనా ప్రకారం డార్క్‌నెట్‌ రోజురోజుకీ అత్యంత వేగంగా విస్తరిస్తున్నది. కారణం... అక్రమాలు చేసేవాళ్లు పెరిగిపోవడం కాదు. సర్ఫేస్‌ వెబ్‌లో తాము సురక్షితంగా లేమని మాటిమాటికీ తేలిపోవడం. ఓ చిన్న యాప్‌ని డౌన్లోడ్‌ చేసుకున్నా... మీ కాంటాక్టులు, మెసేజులు, చిత్రాలు, వీడియోలు, లొకేషన్‌ అన్నింటిలోకీ చొరబడేందుకు అవకాశం ఇచ్చి తీరాల్సిందే అనే నిబంధనలు తప్పనిసరి. ఇలా ఇబ్బడిముబ్బడిగా వ్యక్తిగత వివరాలను సేకరించడాన్ని ‘డేటా మైనింగ్‌' అంటారు. వీటిని శత్రు దేశాలకీ, వ్యాపార సంస్థలకీ నిర్భయంగా అమ్మేసుకుంటూ ఉంటాయి దిగ్గజ సంస్థలు. ఒకవేళ తమ స్కామ్‌ బయటపడినా ఇక్కడ ఎవరూ బెదిరిపోరు. ‘అరెరే చూసుకోలేదే... దీన్ని వెంటనే సరిచేసేస్తాం’ అని నాలుక కరుచుకొని మరో దొడ్డి దారిని ఎంచుకుంటారు. ఇంటర్నెట్‌ వాడకందారులేమో... పని జరిగిపోవాలి కదా అనే తొందరలో తెలిసి తెలిసీ తమ భద్రతను గాలికి వదిలేస్తుంటారు. అందుకని వీరి తరఫున పోరాడే సంస్థలు మరింత బలపడాలి. డేటా చౌర్యం పట్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాలి. అప్పుడిక డార్క్‌నెట్‌ అవసరమే ఉండదు. 

 • - నల్లమోతు శ్రీధర్‌ ప్రముఖ కంప్యూటర్‌ నిపుణులు,
 • - సిహెచ్‌.ఎ.ఎస్‌. మూర్తి (అసోసియేట్‌ డైరక్టర్‌ CDAC) సౌజన్యంతో

ఫేస్‌బుక్‌.ఆనియన్‌


డార్క్‌నెట్‌లోకి ప్రవేశించడం చట్టవ్యతిరేకం కాదని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా! అందుకే అమెజాన్‌, ఫేస్‌బుక్‌ లాంటి వెబ్‌సైట్లన్నీ డార్క్‌నెట్‌లో కూడా పనిచేస్తూ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండాలన్నదే వాటి ఉద్దేశం కావచ్చు. ఉదాహరణకు చైనాలో ఫేస్‌బుక్‌ నిషిద్ధం, మన దేశంలోనేమో బిట్‌ కాయిన్స్‌ మీద అనేక నిబంధనలు ఉన్నాయి. అందుకే స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయా సంస్థలు .ఆనియన్‌ రూపంలోనూ ప్రత్యక్షమవుతుంటాయి. కాకపోతే ఆ సైట్లకి సంబంధించి చాలా ప్లగిన్స్‌ .ఆనియన్‌లో పనిచేయవు. పైగా విపరీతమైన నిదానం!

ఆపరేషన్‌ ఆనిమస్‌

డార్క్‌వెబ్‌ కోసం ఉపయోగించే ఆనియన్‌ రూటర్‌ని అమెరికన్‌ మిలటరీ రూపొందించింది. మొదట్లో అమెరికన్‌ ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహించింది. దాని వల్ల గోప్యత సాధ్యం అవుతుంది అనుకున్నారే కానీ... అదే ఆయుధంతో చట్టానికి చెమటలు పడతాయని ఊహించలేకపోయారు. అమెరికాలో డ్రగ్స్‌ వాడకం పెరిగిపోయేందుకు, తుపాకుల సంస్కృతి విస్తరించేందుకు డార్క్‌నెట్‌ది ముఖ్య పాత్రగా మారింది. ఒకానొక సమయంలో అమెరికా మరో 16 దేశాలతో కలిసి... డార్క్‌నెట్‌లో ఉన్న 400 అక్రమ వెబ్‌సైట్ల గుట్టు పట్టగలిగింది. దీనికి ‘Operation Onymous’ అని పేరు. ఈ ఆపరేషన్‌ ద్వారానే డార్క్‌నెట్‌లో తొలి ఆన్‌లైన్‌ మార్కెట్‌ ‘సిల్క్‌రోడ్‌' మూలాలను ఛేదించగలిగారు. దాన్ని ఓ 26 ఏళ్ల కుర్రవాడు నడుపుతున్నాడని తెలిసి నోళ్లు వెళ్లబెట్టారు. ఈ ఆపరేషన్‌లో సాయపడేందుకు ఎఫ్‌బీఐ ఓ సాంకేతిక నిపుణుడికి 80 కోట్ల రూపాయలు చెల్లించిందని చెబుతారు. అతను టోర్‌ బ్రౌజర్‌లో ఉన్న ఓ చిన్న లొసుగును కనిపెట్టడంతో ఎఫ్‌బీఐ విజయం సాధించిందట.

రెండు మార్గాలు


డార్క్‌నెట్‌ అని కాదు కానీ... ఇంటర్నెట్‌లో బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు మనం ఎవరమో తెలియకుండా ఉండేందుకు ప్రాక్సీ, వీపీఎన్‌ అనే రెండు సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించినప్పుడు మన ఐపీ అడ్రస్‌ మారిపోతుంది. వీపీఎన్‌లో (virtual private network) అయితే మనం వినియోగిస్తున్న డేటా కూడా సంకేతభాషలోకి మారిపోతుంది.

ఏదైనా సాధ్యమే!

 • ఆయుధాల అమ్మకం, ఉగ్రవాదం, మనుషుల అక్రమ రవాణా,వ్యభిచారం, నకిలీ వస్తువులు... ఇవన్నీ చట్టవ్యతిరేకం. కానీ చట్టం కళ్లుగప్పి డార్క్‌నెట్‌ ద్వారా ఇలాంటి లావాదేవీలు
 • నిర్వహించే అవకాశం ఉంది. 
 • మాదకద్రవ్యాలు, చైల్డ్‌ పోర్నోగ్రఫీ కోసమే చాలామంది డార్క్‌నెట్‌ని వినియోగిస్తున్నారని అంచనా.
 • హత్యల కోసం కాంట్రాక్టులు, అవయవాల వ్యాపారం లాంటి గగుర్పొడిచే లావాదేవీలు  ఇక్కడ జరుగుతాయి.
 • మ్యాచ్‌ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ లావాదేవీలు సర్వసాధారణం.
 • మరణించినవారితో మాట్లాడిస్తాం, 
 • ఆత్మలను మీ స్వాధీనం చేస్తాం ..తరహా వ్యవహారాలకీ కొదువ ఉండదు. 
 •  పాస్‌వర్డ్‌లను దొంగిలించే సాఫ్ట్‌వేర్లు, కొట్టేసిన క్రెడిట్‌ కార్డుల వివరాలు... ఇలాంటి ఊరించే డేటా అక్కడ అగ్గువకి దొరుకుతుంది.
 • బయట అమెజాన్‌, ఫ్లిప్‌కార్టు ఎలా ఉంటాయో.. ప్రత్యేకించి డార్క్‌నెట్‌లో అమ్మకాల కోసం డ్రీమ్‌ మార్కెట్‌, సిల్క్‌రోడ్‌ లాంటి వెబ్‌సైట్లు పనిచేస్తాయి. కానీ వీటి పేర్లు అంత తేలికగా ఉండవు. అక్షరాలు, అంకెలూ కలగలిసిన సుదీర్ఘమైన లింక్స్‌ మాత్రమే ఉంటాయి. వాటిని ఎక్కడన్నా రాసి ఉంచుకోవాల్సిందే.