శనివారం 08 ఆగస్టు 2020
Sunday - Jul 04, 2020 , 23:22:23

అద్దంలో సంద్రం.. జార్జియా ఎక్వేరియం!

అద్దంలో సంద్రం.. జార్జియా ఎక్వేరియం!

చేపలు.. ఆహార పదార్థాలే కాదు.. అందమైన జీవులు కూడా. కొందరు తినేందుకు ఇష్టపడితే.. మరికొందరు ఇంట్లో పెంచుకునేందుకు ముచ్చటపడుతారు. ఇంట్లో ఓ ఎక్వేరియం పెట్టుకొని సంబురపడుతుంటారు. ఆ చిన్ని ఎక్వేరియమే అంత ఆనందాన్ని ఇస్తే.. సముద్రాన్ని తలపించే ‘జార్జియా ఎక్వేరియం’ ఇంకెంత మధురానుభూతిని కలిగిస్తుందో ఊహించుకోండి. 

అమెరికాలోని అట్లాంటా నగరంలో ఉంది.. జార్జియా ఎక్వేరియం. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎక్వేరియంగా గుర్తింపు పొందింది ఇది. చిటికెన వేలు సైజు చేపలు మొదలుకొని, పెద్దపెద్ద తిమింగలాల వరకూ, లక్షకుపైగా వివిధ జాతులకు చెందిన సముద్ర జీవులకు ఆశ్రయం ఇస్తున్నది. నిత్యం వేలమంది సందర్శకులకు.. ఆహ్లాదాన్ని పంచుతున్నది. చుట్టూ రకరకాల సముద్ర జీవులు ఈదుతుంటే.. వాటి ముఖంలో ముఖం పెట్టి పలుకరించడం ఇక్కడే సాధ్యమవుతుంది. 

ఒక్కడితో మొదలై..

ఈ బృహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది  

బెర్నార్డ్ మార్కస్ అనే వ్యాపారి. స్వతహాగా సముద్ర జీవులంటే మక్కువ చూపే ఈయన, దేశ విదేశాల్లోని భారీ అక్వేరియాలు సందర్శించేవారు. అదే సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియాన్ని అమెరికాలో ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. తన భార్య బిల్లీ మార్కస్ కలిసి 13 దేశాల్లో ప్రాచుర్యం పొందిన 56 అక్వేరియాలను చూసి... ఆ ప్రేరణతో ‘జార్జియా అక్వేరియం’కు రూపకల్పన చేశారు. ఇందుకోసం స్వయంగా 290 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. ఇందులో మార్కస్ వాటా 250 మిలియన్ డాలర్లు కాగా, మరో 40 మిలియన్ డాలర్లను విరాళాలుగా సేకరించారు. అక్వేరియం ఏర్పాటుకు 2001లో అంకురార్పణ చేశారు. 2005 నవంబర్ ఈ మత్స్య ప్రపంచం  ప్రారంభమైంది. 

ఎన్నో విచిత్రాలు..

సముద్రాన్ని తలపించేలా జార్జియా ఎక్వేరియాన్ని 5,50,000 చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 10 మిలియన్ గ్యాలన్ల సముద్రపు నీటిని నింపారు. మొత్తం ఆరు విభాగాలుగా.. సొరంగ ఆకృతిలో ఉండే ఈ భారీ ఎక్వేరియంలో లక్షకుపైగా సముద్ర జీవులు సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. రంగురంగుల చేపలు, చిత్ర విచిత్రమైన ఆక్టోపస్ భారీ తిమింగలాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ‘సీహార్స్’, ‘గార్డెన్ ఈల్’, ‘జెల్లీ ఫిష్’, ‘క్లౌన్ ఫిష్’, ‘బెలుగా తిమింగలం’, ‘డాల్ఫిన్ మౌంటరేస్’, ‘క్యాలిఫోర్నియా సీలయన్’, ‘బ్లూ స్పాటెడ్ రిబ్బన్ టాయిల్ రే’.. ఇంకా రకరకాల జలచరాలతో పాటు పెంగ్విన్ కూడా కనువిందు చేస్తున్నాయి. ఏటా కోటి మంది సందర్శిస్తారు. 

అలరించే ప్రదర్శనలు..

సందర్శకుల కోసం ఇక్కడ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. అరగంట నుంచి ఒక గంట నిడివితో వినోదాన్ని పంచే ఈ షోలలో ట్రైనర్ల పర్యవేక్షణలో సముద్ర జీవులు చిత్ర విచిత్ర విన్యాసాలతో కనువిందు చేస్తాయి. అందులో ఒక టి ‘డాల్ఫిన్ షో’. పెద్ద పెద్ద డాల్ఫిన్లు వాటంతట అవే ఒక గదినుంచి మరోగదిలోకి పరుగులు పెడుతూ, స్విమ్మింగ్ పూల్ తటాకంలోకి ఎగిరి దూకుతూ విన్యాసాలు ప్రదర్శిస్తాయి. మరొకటి.. ‘సీ లయన్ షో’. భారీకాయంతో ఉండే సీ లయన్లు ట్రైనర్ సూచనలకు అనుగుణంగా నీటిలో అనేక విన్యాసాలు చేస్తాయి. ఆ సందడిని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆ కొద్దిసేపు మనమూ ఆ చేపలలో ఒక చేపలా మారిపోతాం.

తనివి తీరదు..

ఉదయం ఎక్వేరియంలోకి వెళ్తే.. బయటికి వచ్చే సరికి సాయంత్రం అవుతుంది. అడుగడుగునా అద్భుతమైన జలచరాలను చూస్తూ కాలాన్నే మర్చిపోయి, ఆనందంగా గడుపుతాం. ఎన్నో మధురానుభూతులను మూటగట్టుకుంటాం. అట్లాంటాలోని మా కొడుక దగ్గరికి వెళ్లినప్పుడు ఈ ఆక్వేరియాన్ని సందర్శించాం. 

- పంతంగి శ్రీనివాస రావు, హైదరాబాద్


logo