మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jun 27, 2020 , 23:19:28

ఆకలి తీర్చే బ్యాంక్‌

ఆకలి తీర్చే బ్యాంక్‌

తెల్లారి లేచింది మొదలు ఉరుకులు, పరుగులు.. నా అన్న వారి గురించి కూడా ఆలోచించలేని రోజులు. పక్కవాడి ప్రాణం పోయినా పట్టించుకోలేని పరిస్థితులు. ఇట్లాంటి సమయంలో తమకంటూ ఎవరూ లేని అభాగ్యుల ఆకలి, దప్పికలను తీరుస్తున్నది ఓ బ్యాంక్‌. డబ్బుల లావాదేవీలు నడిపే బ్యాంక్‌.. ఆకలి, దప్పికలను తీర్చడమేంటని ఆలోచిస్తున్నారా..?  అన్నార్థులకు అండగా నిలిచేందుకు ‘ఫుడ్‌బ్యాంక్‌ నిజామాబాద్‌' పేరిట వెలిసిన ఓ సేవా సంస్థ ఇది. 

ఒక్కడితో మొదలై.. 

నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌కు చెందిన నవీన్‌చంటి టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌లో గ్రేడ్‌-2 ఉద్యోగి. జిల్లా కేంద్రంలో నివాసం ఉంటాడు. యాచకులు, అనాథలు ఆకలితో అలమటించడాన్ని గమనించారు. వారి కోసం ఏదైనా చేయాలని, కనీసం కడుపు నిండా భోజనమైనా పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2016 ఫిబ్రవరి 14న ‘ఫుడ్‌బ్యాంక్‌ నిజామాబాద్‌' పేరిట ఓ సేవా సంస్థను ప్రారంభించాడు. నవీన్‌ సంకల్పానికి పలువురు యువకులు చేయూతనిచ్చారు. అంతా కలిసి  ప్రతి ఆదివారం అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు వలంటీర్లంతా కలిసి అన్నం వండేవారు. 9 గంటల నుంచి  సొంత వాహనాల్లో భోజన ప్యాకెట్లను తీసుకెళ్లి వివిధ ప్రాంతాల్లోని  యాచకులు, అనాథలకు అందజేసేవారు. సుమారు మూడేండ్ల పాటు ఇలా ఆకలితీర్చారు. ఒకపూట భోజనం భోజనమే కాదని మెల్లగా అర్థమైపోయింది. దీంతో 2020 ఫిబ్రవరి 14న ఫౌండేషన్‌ వార్షికోత్సవం సందర్భంగా మరో మహాయజ్ఞానికి ప్రతినబూనారు. అదే 365 డేస్‌ ఫుడ్‌ ఫీడ్‌!  రోజూ కూరగాయలతో భోజనం పెడతారు. ఆదివారం అదనంగా కోడిగుడ్డు అందజేస్తున్నారు. అభాగ్యులకు అదే అమృతంతో సమానం. 

కరోనా నేపథ్యంలోనూ కమ్మగా..

ఇటీవల కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలకు కూడా ఆహారపొట్లాలు, పండ్లు, బిస్కెట్లు పంచారు. కాలినడకన వెళ్తున్న సుమారు లక్ష మంది ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన వలస కార్మికులకు ఫుడ్‌బ్యాంక్‌ వాహనం ద్వారా.. మేడ్చల్‌ నుంచి నిర్మల్‌ వరకు 250 కిలోమీటర్ల మేర తాగునీటితో పాటు భోజనం అందజేశారు. నాలుగేండ్లలో సంస్థ 220 మంది వలంటీర్లతో.. కామారెడ్డి, ఆర్మూర్‌, నిర్మల్‌, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, నల్గొండ, సిద్దిపేట, కరీంనగర్‌, హైదరాబాద్‌లకూ విస్తరించింది.

వితరణతోనే..

సంస్థకు సహకరించాలనుకునే వారి వద్ద ఫుడ్‌ బ్యాంక్‌ ప్రతినిధులు నగదు విరాళాలు తీసుకోరు. సరుకులు, సామగ్రిని మాత్రమే స్వీకరిస్తారు. వలంటీర్లంతా తలాకొంత డబ్బు పోగు చేసి, తాజా భోజనం సరఫరా చేసేందుకు ఓ వాహనాన్ని కొనుగోలు చేశారు.  వారికి బాసటగా నిలిచేందుకు ఓ దాత ముందుకు వచ్చారు. ఆయనే కొంత డబ్బును నేరుగా వాహన కంపెనీ డీలర్‌కు పంపించారు. ఇలా ప్రత్యక్షంగా నగదు తీసుకోకూడదనే నియమాన్ని సంస్థ ఎప్పుడూ ఉల్లంఘించలేదు. ఫుడ్‌బ్యాంక్‌ వలంటీర్లు ఏ పండుగ వచ్చినా  అనాథలకు అన్నీ తామై కొత్త బట్టలు, తీపి వంటలు అందిస్తూ పండుగ సంతోషాన్ని కూడా పంచుతున్నారు. చలికాలంలో దుప్పట్లను అందజేస్తున్నారు. 

ప్రధాని నోట ఫుడ్‌ బ్యాంక్‌ మాట

నిజామాబాద్‌ ఫుడ్‌ బ్యాంక్‌ సేవలు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికీ చేరాయి. సంస్థ సేవలను తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ అకౌంట్ల ద్వారా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఫుడ్‌ బ్యాంకుకు సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేయడం విశేషం. యువత మంచి ఆలోచనలతో సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్లాలంటూ ఓ సందేశం కూడా పంపారు. సంస్థ సేవల గురించి తెలుసుకున్న నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఓ రోజు వారితోపాటు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఫుడ్‌ బ్యాంక్‌ రోజు వారీ సేవలను తెలంగాణ రాష్ట్ర సీఎంవో కార్యాలయానికి పంపారు. ‘ఇది ప్రారంభం మాత్రమే. మా పరిధుల్ని మరింత విస్తరించుకుంటాం. మరింత మందికి సేవలు అందించడానికి సిద్ధం అవుతున్నాం’ అంటున్నారు సంస్థ నిర్వాహకులు. ప్రపంచంలో ఆకలి ఉన్నంతకాలం ఫుడ్‌బ్యాంకుల అవసరమూ ఉంటుంది. 

ఆకలి కేకలు లేకుండా..

తెలంగాణలో ఎక్కడా ఆకలి కేకలు లేకుండా చూడటమే లక్ష్యంగా ఫుడ్‌బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఫుడ్‌బ్యాంకును విస్తరిస్తాం. నా ఒక్కడి మదిలో మెదిలిన ఆలోచనకు ఇంతమంది వలంటీర్లు అండగా నిలువడం ఆనందంగా ఉన్నది. - నవీన్‌చంటి, ఫుడ్‌బ్యాంక్‌ తెలంగాణ ఫౌండర్‌
logo