గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jun 27, 2020 , 23:13:39

నువ్వుల పిండి.. సత్తువదండి!

నువ్వుల పిండి.. సత్తువదండి!

అప్పట్లో, ఉన్నపళంగా ఏదైనా తినాలనిపిస్తే  నువ్వులు, చక్కెర కలుపుకొని తినేవాళ్లు. ఇప్పటికీ ఆ అలవాటు చాలా మందికి ఉంది. ఇది  పెద్దగా ప్రత్యేకతలేని  పదార్థమే అయినా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఆ అలవాటు నుంచి వచ్చిందే ‘నువ్వుల పిండి’.  తక్కువ శ్రమ, ఎక్కువ నిల్వ! ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచీ! 

 • నువ్వుల పిండి ‘బతుకమ్మ’ పండుగకు ప్రత్యేక పలారం.  పండగ పూట వివిధ రకాల సద్దుల పిండ్లలో  సత్తు పిండి అనబడే నువ్వులపిండి ఉండాల్సిందే అంటారు పెద్దలు.
 • మెగ్నీషియం, కాపర్‌, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌, విటమిన్‌ బి36.. వంటివి నువ్వుల్లో సమృద్ధిగా ఉంటాయి.
 • నువ్వుల ఉండలు, నువ్వుల మిశ్రమాలు ఎన్ని ఉన్నా ‘నువ్వుల పిండి’పై చాలామందికి ప్రత్యేకమైన ప్రేమ.
 • మామూలుగానే నువ్వులు బలవర్ధక ఆహారం. పిండిరూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి మరింత శక్తి అందుతుంది.
 • నువ్వులు, చక్కెర మిశ్రమాన్ని రోట్లో వేసి దంచితేనే రుచి బావుంటుంది. అలా కుదరనప్పుడే మిక్సీలో వేయాలి.
 • నువ్వుల పిండి తయారీ చాలా సులభం. మొదట నువ్వులను వేయించాలి.  దాంట్లో చక్కెర కలపాలి. మిశ్రమాన్ని కచ్చాపక్కాగా దంచుకోవాలి. 
 • నువ్వులలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాల వల్ల బీపీ సమస్థితిలో ఉంటుంది. అంతేకాదు, వయసు పైబడ్డవారు నువ్వుల పిండి తీసుకుంటే చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రానేరావని అంటారు.
 • చర్మాన్ని సంరక్షించడంలో నువ్వుల పాత్ర ఎక్కువే. ఇందులోని విటమిన్‌- ఇ, బి చర్మ సమస్యలను దూరం చేస్తాయి.
 • చక్కెరకు బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. కానీ చక్కెర అయితే పొడి పిండిలా ఉంటుందని చాలామంది, ఇటువైపే మొగ్గు చూపుతారు.
 • అరకిలో నువ్వుల్లో, పావుకిలో కన్నా కొంచెం ఎక్కువ చక్కెర కలిపితే సరిపోతుంది. అప్పుడే తీపి కుదురుతుంది. 
 • ఈ పలారం రక్తహీనతను నివారిస్తుంది. ఇందులో విటమిన్‌- ఎ, డి, ఇ, కె  లభిస్తాయి. హార్మోన్ల సమతౌల్యానికి సాయపడుతుంది.
 • శీతాకాలంలో శరీరం పొడిబారి పోకుండా ఉండటానికి నువ్వులను  ఈ రూపంలోతింటారు.


logo