బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Jan 12, 2020 , 02:31:01

స్వతంత్రురాలు

స్వతంత్రురాలు

నలభై ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత భర్త మరణించడం మెటిల్డాకి దుఃఖాన్ని కలిగించలేదు. కారణం, పిల్లలు లేని వారి సంసారం గత పదేండ్లుగా కష్టంగా గడిచింది. తమ విశాలమైన పాత ఇంట్లో పేయింగ్ గెస్ట్‌లని తీసుకోవాలని మెటిల్డా అనుకున్నా దానికి ఆయన నిరాకరించాడు. పిల్లలు లేని మెటిల్డా అది తనకి మంచి కాలక్షేపం అనుకుంది.ఆవిడ ఇరుగు పొరుగు వాళ్ళు తమ ఇళ్ళని అధిక ధరకి అపార్ట్‌మెంట్ బిల్డర్స్‌కి అమ్మి ఆ డబ్బుతో ఫ్లోరిడాకో, కరీబియన్‌కో, స్పెయిన్‌కో వెళ్ళి ఆనందంగా గడుపుతున్నారు. మెటిల్డా మాత్రం తను జీవించి ఉన్నంత కాలం ఆ ఇంట్లోనే పేయింగ్ గెస్ట్‌లతో గడపాలని అనుకుంది. భర్త మరణించాక ఇంటికి వచ్చిన ఏకైక బంధువు ఆమె మేనల్లుడు. అతనంటే ఆవిడకి పెద్దగా ఇష్టం లేదు. అతని తండ్రైన తన అన్నతో ఆవిడకి పేచీ. ముప్పయి రెండేండ్ల జేమ్స్ కొద్దిగా కఠినమైన మనిషి, జులాయి. జూదం, ఫోర్జరీ కేసుల్లో అనేకసార్లు పోలీసులు అతన్ని ప్రశ్నించారు. ఓ ఖాళీ స్థలంలో దొరికిన ఓ శవం విషయంలో కూడా అతన్ని ప్రశ్నించారు. కానీ, అతను ఎన్నడూ జైలుకి వెళ్ళలేదు.ఆంటీ! ఒంటరిగా ఉండటం నీకు ఎంత బాధో నాకు తెలుసు. కాబట్టి, ఈ పాత మ్యూజియాన్ని పడగొట్టి ఇక్కడ అపార్ట్‌మెంట్స్ కడితే నువ్వు మాట్లాడటానికి చాలామంది ఉంటారు. డబ్బుకూడా బాగా వస్తుంది కాబట్టి, విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. ఈ విషయంలో నేను నీకు అన్ని విధాలా సహాయం చేస్తాను. మేనేజర్‌గా అద్దెని వసూలు చేస్తూంటాను జేమ్స్ మేనత్తతో చెప్పాడు.థాంక్ యు జేమ్స్ ఆవిడ క్లుప్తంగా చెప్పింది.

తను జీవించి ఉండగానే తన ఆస్తిమీద అతని కన్ను పడిందని, తను మరణించే దాకా ఆగలేడని ఆవిడ భావించింది. నీ రోగం కుదురుస్తా అని మనసులో అనుకుంది. అతను ఆ రాత్రి పనిమీద వెళ్ళిపోయాడు.ఆవిడ పేయింగ్ గెస్ట్‌లని తీసుకోసాగింది. బోర్డ్ పెట్టిన వారంలో ముగ్గురు పేయింగ్ గెస్ట్‌లు కుదిరారు. ఇద్దరు సెక్రటరీలు, భార్య లేని ఓ వృద్ధుడు. మొదటి అంతస్థులోని ఐదు ఖాళీ పడకగదులు క్రమంగా కళకళలాడసాగాయి. భర్త ఆమె వంటలకి వంకలు పెట్టేవాడు. రిటైర్ అయ్యాక అది ఎక్కువైంది. కానీ, పేయింగ్ గెస్ట్‌లు ఆమె వంటని మెచ్చుకునే వారు. ముఖ్యంగా చికెన్, టూనా సలాడ్స్, బాయిల్డ్ ఎగ్స్‌ని.మెటిల్డా సాయంత్రాలు స్వెటర్ అల్లుతూ, వాళ్ళతో మాట్లాడుతూ చాలా కొత్త విషయాలను నేర్చుకునేది. ఇప్పుడు వంటల పుస్తకాలు, డిటెక్టివ్ కథలని స్వేచ్ఛగా చదవగలుగుతున్నది. ఆవిడ భర్తకి డిటెక్టివ్ పుస్తకాలు చదవడం ఇష్టం ఉండేది కాదు.ఆ రాత్రి ఆవిడ ఆరెంజ్ సాస్‌లో బాతు వేపుడును వేయిస్తుంటే ఆ వాసనకే అందరి నోళ్ళల్లో నీళ్ళు ఊరాయి. కిడ్నీ పై బీఫ్ట్‌సేక్... పుస్తకాలు చూసి మెటిల్డా వందలకొద్దీ వంటలు చేయసాగింది.మళ్ళీ వచ్చిన జేమ్స్ వీళ్ళని చూసి నిర్ఘాంతపోయాడు.ఆంటీ! ఏమిటి నువ్వు చేసేది. ఈ కొత్త వాళ్ళకోసం నువ్వింత కష్టపడటం నాకు నచ్చలేదు. మామయ్య దీన్ని చూసే ఏమనే వాడు?గత ఇరవై ఏండ్లుగా నేను చేయాలనుకుంది చేస్తున్నాను కోపంగా చెప్పింది.వెంటనే అతను మామూలు గొంతుతో ప్రేమగా చెప్పాడు.

కానీ, నువ్వు ప్రయాణాలు చేస్తూ నీ జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. క్రితం వారం నేనో బిల్డర్‌తో మాట్లాడితే ఈ ఇంటికి పది లక్షల డాలర్లు ఇస్తానని అన్నాడు. పది లక్షల డాలర్లు. ఆలోచించు.జేమ్స్. నువ్వు నా అరవయ్యవ పుట్టిన రోజు లోపలే నన్ను శ్మశానానికి నెట్టేట్లున్నావు. బోర్డింగ్ హౌస్‌ని నడుపుతూ వంట చేయడం నా చిరకాల వాంఛ. నేను పోయాక ఈ ఇంటికి ఏమవుతుందో తెలీదు కానీ, జీవించి ఉన్నప్పుడు ఇలాగే సాగాలి.సరే. నువ్వంత నిశ్చయంతో ఉన్నప్పుడు అలాగే కాని. నన్ను కనీసం నీతో ఇక్కడ ఉండనీ. పేయింగ్ గెస్ట్‌గానే సుమా. చిన్న చిన్న మరమ్మత్తులు, తోటపని చేస్తాను జేమ్స్ చిన్నగా నిట్టూర్చి చెప్పాడు.చేయడానికి అతనికి పెద్దగా పనేం లేకపోయినా ఇంకా రెండు ఖాళీ గదులు ఉండటంతో ఆవిడ అంగీకరించింది.ఐదవ పేయింగ్ గెస్ట్ యువకుడు. వృత్తిరీత్యా గ్రాఫాలజిస్ట్.నేను ప్రస్తుతం ఫ్రీలాన్స్‌గా అనేక పెద్ద కంపెనీలకి గ్రాఫాలజిస్ట్‌గా పని చేస్తున్నాను. అభ్యర్థుల అప్లికేషన్స్‌లోని చేతిరాతని పరిశీలించి వారి లక్షణాలని చెప్పడం నా పని. అది మనిషి గురించి ఎంత చెప్పగలుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓ మనిషి వ్యక్తిత్వమే కాక అతని మానసిక, శారీరక స్థితి, అతనిలోని నైతికతల గురించి చెప్పవచ్చు అతను చెప్పాడు.మెటిల్డాకి అతని పని నచ్చింది. అతనూ నచ్చాడు. అతని మొదటి డిన్నర్ కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని అనుకుంది. ఆ శుక్రవారం కొవ్వొత్తి వెలుగులో బాగా ఉతికి తెల్లగా ఇస్త్రీ  చేసిన టేబిల్ క్లాత్‌మీది పింగాణి ప్లేట్లలో ఆవిడ చేపతో చేసిన రైస్ కేక్స్ తిని అంతా మెచ్చుకున్నారు. ఆవిడకి రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. ఓ గురువారం రాత్రి ఇద్దరు సెక్రటరీలు భోజనం అయ్యాక కూడా ఆవిడతో మాట్లాడుతూ కూర్చున్నారు. వాళ్ళిద్దరూ గ్రాఫాలజిస్ట్ గ్రాంట్‌ని ప్రశ్నించారు.

సరదాకి మా చేతి రాతని చూసి మా గురించి చెప్తారా?అలాగే. ఏదైనా రాసి సంతకం చేయకుండా ఇవ్వండి అతను అంగీకరించాడు.మెటిల్డా తెచ్చిన కాగితాలమీద పెన్సిల్‌తో ఇద్దరూ రాసిచ్చారు. అతను వారు రాసిన టి అక్షరం అడ్డగీతలు, ఐకి పైన చుక్కలు, బి, డి అక్షరాలని ఎంత లావుగా రాసారు, ఎఫ్, జి, వై అక్షరాలని ఎంత కిందిదాకా రాసారు మొదలైనవి పరిశీలించి వారి గురించి చెప్పాడు. వృద్ధుడైన బాల్సన్ తన గురించి చెప్పిందంతా నిజమని ఒప్పుకున్నాడు.మెటిల్డా చేతిరాతని చూసి ఆవిడ సమర్థత, స్వేచ్ఛ, స్నేహపూర్వక స్వభావం, తెలివితేటలు, వంట బాగా చేయడం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, పరిష్కారాలని కనుగొనడం లాంటి లక్షణాలని వివరించాడు. తర్వాత జేమ్స్ చేతిరాతని చూసి అతను జూదగాడు, స్వార్థపరుడని, ఎదుటివాళ్ళని లక్ష్యపెట్టడని చెప్పాడు.

ఆవిడ బల్లమీది పాత్రలని, పళ్ళాలని తీసి మర్నాటి బ్రేక్‌ఫాస్ట్ కోసం టేబిల్‌ని సిద్ధం చేసేసరికి పది దాటింది. తర్వాత టీ కలుపుకుని డైనింగ్ టేబిల్ ముందు కూర్చుని ఓ డిటెక్టివ్ కథల పుస్తకం చదువుతుంటే గ్రాంట్ ఆవిడ దగ్గరకి వచ్చాడు.నిద్ర పోలేదా? ఆవిడ అడిగింది.మీరు అనుమతిస్తే మీతో మాట్లాడుతాను. ఇది ముఖ్యమైంది అతను కొద్దిగా సందేహిస్తూ చెప్పాడు.అలాగే. కొద్దిగా టీ తాగుతావా? అడిగింది.ఇద్దరూ టీ తాగుతుండగా అతను చెప్పాడు.నేను మీ వ్యక్తిగత విషయాల్లో తల దూరుస్తున్నానని అనుకోకండి. మీ మేనల్లుడి చేతిరాత నాకు ఆందోళనని కలిగిస్తున్నది.ఆవిడ ఆశ్చర్యపోలేదు.

అంటే.. అతను స్వార్థపరుడు, బద్దకస్థుడు, నేరస్వభావం గలవాడు. ఇంకా చాలా. దేవుడికే తెలియాలి చెప్పాడు.గ్రాంట్! ఇది నాకు కొత్త సమాచారం కాదు. అతని గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు.తనకి కావాల్సింది పొందడానికి అతను ఏమైనా చేయగల సమర్థుడు. అతనొక్కడే మీ బంధువా? మీ మరణానంతరం మీ ఆస్తి అతనికే వెళ్తుందా?లేదు. అతనికి వెళ్ళదు. నా భర్త పోయాక నేను విల్లు రాసాను. ఈ ఇల్లు తప్ప నాకేమీ పెద్దగా లేదు. ఇది అతనికి వెళ్ళదు.ఇది అతనికి తెలియాలి. అప్పుడు అతనికి ఎలాంటి దురుద్దేశం ఉండదు.

నేను స్వర్గానికి వెళ్ళడానికి సహాయం చేయడం లోనా? నీ సలహాకి థాంక్స్. తప్పక తెలియచేస్తాను.మీరు మంచి వ్యక్తి. వంట రుచిగా చేస్తారు చెప్పి అతను వెళ్ళిపోయాడు.ఆవిడ తన టీని, పుస్తకంలోని కొన్ని కథల్ని పూర్తి చేసింది. అలసట లేకపోవడంతో తన ఆస్తుల వివరాలు రాసుకుంది. తన భర్త ఇన్సూరెన్స్ సొమ్ము, పెన్షన్, తన సోషల్ సెక్యూరిటీ మొత్తం, పేయింగ్ గెస్ట్‌లు ఇచ్చే డబ్బు ఆవిడ నెలసరి ఖర్చులు పోను చాలా మిగులుతుంది. ఫర్నీచర్, పెయింటింగ్స్, వాల్ పేపర్‌ను మార్చాలని అనుకుంది. కొత్త స్టవ్, డిష్ వాషర్, ఫ్రీజర్... అన్నింటికన్నా ముఖ్యంగా ఇంటి హీటింగ్ సిస్టం ఆవిడ జాబితాలో ఉన్నాయి. బేస్‌మెంట్‌లోని పాత కుంపటి ఇంధనం బొగ్గునుంచి చమురుకి మార్చాలని అనుకుంది. దాని వెంట్స్ అన్ని గదుల్లోనూ ఉన్నాయి.బేస్‌మెంట్‌కి వెళ్ళి దాన్ని పరిశీలిస్తే హీటింగ్ కంపెనీనుంచి మనిషి వచ్చినప్పుడు అతనితో తెలివిగా మాట్లాడవచ్చు అనుకుంది. కొంతకాలంగా ఆవిడ బేస్‌మెంట్లోకి వెళ్ళలేదు.  ఆ నల్ల ఫర్నేస్‌ని, దాన్నించి అన్నివైపులకి వెళ్ళే పైపులని చూసింది. దానికి థర్మోస్టాట్ కంట్రోల్ లేదు. దాంతో కొన్ని గదుల్లో వేడి ఎక్కువ. కొన్ని గదుల్లో తక్కువ. కిందకి వెళ్ళి ఆవిడ ఫర్నేస్ తలుపుని తెరచి లోపలకి చూసింది. జేమ్స్ గ్రాంట్‌తో చెప్పే మాటలు వినిపించాయి.

గ్రాంట్. నువ్వు చేయాల్సిన పని చక్కగా చేసావు. ఇప్పుడు మన బాకీ తీరింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు. నీకు ఇంకో ఊరికి బదిలీ అయిందని చెప్పు.జేమ్స్! ఆవిడ చాలా మంచిది. ఆవిడని ఏమీ చేయకు.చేయను. నేను ఆవిడని ప్రేమించే కష్టపడి పనిచేసే మేనల్లుడిలా ప్రవర్తిస్తాను. ఇలాంటి ఒంటరి వృద్ధులు మరణానికి దగ్గరయ్యాక తమ ఏకైక బంధువులని ఎక్కువ ప్రేమిస్తారు.నాకు ఆవిడంటే ఇష్టం ఏర్పడింది. జాగ్రత్త జేమ్స్. నువ్వు ఫోర్జరీకి మించిన పెద్ద నేరాలేం చేయకు.సలహాలు ఆపి ఇక నడు.మెటిల్డాకి ఇంకేం వినాలనిపించక ఫర్నేస్ తలుపు మూయడంతో వారి గదిలోని గొట్టం నుంచి మాటలు వినపడటం ఆగిపోయింది. గ్రాంట్ మంచివాడు అనుకుంది.మర్నాడు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సెక్రటరీలు ఆఫీస్‌కి వెళ్ళారు. గ్రాంట్ చెప్పాడు.ఐ యాం సారీ. నన్ను మరో ఊరికి, అక్కడి కొత్త అభ్యర్థుల చేతి రాతని పరిశీలించమని బదిలీ చేసారు.నువ్వు వెళ్ళడం బాధగా ఉంది చెప్పింది.నేను రేస్ కోర్స్‌కి వెళ్తున్నాను ఆంటీ. నాకు మంచి టిప్స్ దొరికాయి జేమ్స్ చెప్పాడు.సరే. వెళ్ళు.ఆ ఇద్దరూ బయటికి వెళ్ళాక ఆ ఇంటి మొత్తానికి ఆవిడ ఒక్కత్తే ఉంది. ఆవిడ వెంటనే జేమ్స్ గదిలోకి తన చేతిరాత గల పేపర్లని తీసుకోవడానికి వెళ్ళింది. లేదా అతను దాన్ని ఫోర్జరీకి వాడవచ్చు. ఎక్కడ వెదికినా కనపడలేదు. చివరకి అతని బల్లమీద ఓ పుస్తకంలో తన చేతిరాతలో ఓ ఉత్తరం కనిపించింది. తారీకు లేని ఆ ఉత్తరాన్ని ఆవిడ చదివి ఆశ్చర్యపోయింది.నా భర్త పోయాక నా మనసు మనసులో లేదు. అందుకే, బోర్డింగ్ హౌస్‌ని నడుపుతున్నాను. నా భర్త జ్ఞాపకాలున్న ఈ ఇంటిని వదిలి వెళ్ళలేను. ఇందులో ఉండలేను కూడా. అందుకని, నేనాయన్ని కలవడానికి వెళ్తున్నాను. నా ఏకైక బంధువు జేమ్స్ విషయంలో నేను కఠినంగా ప్రవర్తించాను. అతను వచ్చినప్పటి నుంచి కష్టపడి పని చేసి నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. గతంలో నేను రాసిన విల్లులు అన్నింటినీ రద్దు చేస్తూ నా మొత్తం ఆస్తిని అతనికి రాస్తున్నాను.

దాని కింద ఆవిడ సంతకం ఉంది.మెటిల్డాకి తనే అది రాసిందా అనిపించింది. మరో కాగితంలో నా ప్రాణాలు నేనే తీసుకుంటున్నందుకు దేవుడు నన్ను క్షమించుగాక! అనే వాక్యం, ఆవిడ సంతకం ఉన్నాయి.మెటిల్డాలో అనేక భావాలు చెలరేగాయి. జేమ్స్ హత్య చేసేంత నీచుడని ఆవిడ ఎన్నడూ అనుకోలేదు. కొద్దిసేపు ఆలోచించి ఆ కాగితాలని యథాస్థానాల్లో ఉంచేసింది. యాంత్రికంగా తన పనులను చేస్తూ ఆలోచించింది.పోలీసులకి ఫోన్ చేసి, ఆ ఉత్తరాలు చూపించి, జేమ్స్ తనని హత్య చేయబోతున్నాడని ఫిర్యాదు చేస్తే? అసలు తనా ఉత్తరాలు ఎన్నడూ చూడలేదనే బుకాయించచ్చు. తనకి ప్రపంచంలో అత్యంత ఇష్టమైన చోటైన వంటగదిలోకి వెళ్ళి ఓ వంటల పుస్తకం తీసి చదివింది. తర్వాత షెల్ఫ్‌లోంచి పెద్ద ఎముకలున్న ఓ చికెన్ కేన్‌ని తీసి దాన్ని ముక్కలుగా కోసింది. ఆ గిన్నెని వెలిగించని స్టవ్‌మీద ఉంచి రాత్రి డిన్నర్‌ని తయారు చేయసాగింది. రెండు రోజులపాటు మెటిల్డా జాగ్రత్తగా జేమ్స్‌ని గమనిస్తూ రాత్రిళ్ళు తన గది లోపల గడియ పెట్టుకోసాగింది. సోమవారం ఉదయం పదికి జేమ్స్ వంటగదిలోకి వచ్చి అడిగాడు.ఏమైనా పనుందా ఆంటీ.సోమవారాలు రేస్ కేర్స్‌ని మూసేస్తారు.ఫైర్ ప్లేస్‌ని శుభ్రం చేయాలి. లాన్‌ని మోవ్ చేయాలి చెప్పింది.సాయంత్రం నాలుగుకి జేమ్స్ చెప్పాడు.నాకో బిజినెస్ మీటింగ్ ఉంది. వెళ్తాను.బిజినెస్ మీటింగంటే పేకాటని మెటిల్డాకి తెలుసు. అరగంట తర్వాత ఆవిడ ఓ ట్రేని అతని గదిలోకి తీసుకెళ్ళి చెప్పింది.జేమ్స్. ఇవాళ నువ్వు చాలా కష్టపడి పని చేసావు. ఏదైనా తిని వెళ్ళకపోతే నా మనసు బాధపడుతుంది.వేడి గార్లిక్ బ్రెడ్, దాల్చిన చెక్కతో బేక్ చేసిన ఏపిల్, స్పెషల్ చికెన్ సలాడ్లని జేమ్స్ మెచ్చుకుంటూ తిన్నాడు.

అర్ధరాత్రి తర్వాత డోర్ బెల్ మోగుతుండటంతో మెటిల్డా మంచం దిగి, చెప్పులు తొడుక్కుని వెళ్ళి తలుపు తెరచింది. ఇద్దరు కొత్త వ్యక్తులు జేమ్స్‌కి సాయంగా వచ్చారు.ఆట మధ్యలో జేమ్స్‌కి జబ్బు చేసింది. అతను విశ్రాంతి తీసుకోవాలి ఒకరు చెప్పారు.వాళ్ళు జేమ్స్‌ని అతని గదిలోకి మోసుకెళ్ళారు. అతను తనకి నీరసంగా, తలనొప్పిగా ఉందని చెప్పాడు.ఫ్లూ. నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఆవిడ చెప్పింది.మర్నాడు ఉదయం సెక్రటరీలు అతన్ని పరామర్శించారు.శనివారం ఉదయానికల్లా జేమ్స్ శ్వాస తీసుకోవడం కష్టమవడంతో అతన్ని హాస్పిటల్‌కి పంపించింది. ఆరు గంటల తర్వాత జేమ్స్ మరణించాడు. అతని శవానికి పోస్ట్‌మార్టం చేయడానికి మెటిల్డా అనుమతి పత్రం మీద సంతకం చేసింది.ఆదివారం మధ్యాహ్నం హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇద్దరు ఉద్యోగస్థులు తనని చూడటానికి వస్తే ఆవిడ ఆశ్చర్యపోలేదు.జేమ్స్ మంగళవారం తెల్లవారు ఝామున ఇంటికి అనారోగ్యంతో వచ్చాడు. సోమవారం అతను ఇంట్లో ఏం తినలేదు. అంతా అతనికి ఫ్లూ వచ్చిందని నమ్మడంతో గృహవైద్యం చేసిన మెటిల్డా డాక్టర్‌ని పిలవలేదు. పోస్ట్‌మార్టంలో బోటులినస్ (చెడిపోయిన ఆహారంలో పుట్టే బ్యాక్టీరియా) విషం కనిపించింది. అదే చోట తిన్న ఇంకా ఎంతమంది జబ్బు పడ్డారో అనే భయంతో అతను సోమవారం రాత్రి ఎక్కడ భోజనం చేసాడో విచారించడానికి వచ్చారు.తర్వాత మెటిల్డా వంటగదిలో నవ్వుకుంది. తన జీవితం ఇక తను కోరుకున్నట్లుగానే సాగుతుంది. జేమ్స్‌కి ఆవిడ డ్బ్భై రెండు గంటలపాటు బయటే ఉంచిన చికెన్‌తో చేసిన సలాడ్‌ని పెట్టింది. చెడు వాసన తెలీకుండా దాల్చిన చెక్కలాంటి గాఢమైన వాసన వేసే సుగంధద్రవ్యాలతో దాన్ని చేసింది.ఆవిడ చిన్నగా కూనిరాగం తీస్తూ తన పేయింగ్ గెస్ట్‌లకోసం ఫ్రిజ్‌లోంచి తాజా కోడిమాంసాన్ని తీసి చికెన్ సలాడ్‌ని చేయడం ఆరంభించింది.

(సొనారా మేరో కథకి స్వేచ్ఛానువాదం)


-మల్లాది వెంకట కృష్ణమూర్తి


logo