గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jun 21, 2020 , 00:09:36

ఎవరూ నా మాట వినరు!.. మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఎవరూ నా మాట వినరు!.. మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఎవరూ నేను చెప్పేది వినరు అన్నది నా అనుభవం.

“నా పేరు ట్రేసీ రోజర్స్‌. నేనో హత్య గురించి ఫిర్యాదు చేయదలచుకున్నాను” ఫోన్‌లో చెప్పాను.

“ఎస్‌ మేడం” వాళ్ళు నమ్మరని భయపడ్డాను కానీ, ఆ పోలీస్‌ కంఠం నా మాట నమ్మినట్లుగా అనిపించింది. 

నా చిరునామా అడిగి తెలుసుకుని ప్రశ్నించాడు.

“ఏం జరిగింది? ఇప్పుడు చెప్పండి”

నేను దీర్ఘశ్వాస తీసుకుని చెప్పాను.

“మా పొరుగింటాయన ఎడ్వర్డ్‌ తన భార్యని చంపి, ఇంటి వెనక గులాబి చెట్ల గుబురు కింద పాతి పెట్టాడు.”

చాలాసేపు నిశ్శబ్దం తర్వాత అడిగాడు.

“మిస్‌ రోజర్స్‌! మీ వయసెంత?” 

“పదకొండున్నర.”

“మిస్టర్‌ ఎడ్వర్డ్‌ తన భార్యని చంపడం నువ్వు చూసావా?”

“లేదు. కానీ వాళ్ళు వాదులాడుకోవడం విన్నాను. ఆమె మాయమైంది. తన సోదరి దగ్గరకి వెళ్ళిందని అతను అబద్ధం చెబుతున్నాడు. అతను దేన్నో పాతి పెట్టడం నేను చూసాను.”

“ఓకే మిస్‌ రోజర్స్‌. నేను నీ ఫిర్యాదుని పరిశీలిస్తాను” అతను చెప్పాడు.

అవతలివైపు రిసీవర్‌ పెట్టబోయే ముందు అతని నవ్వుని విన్నాను. నేను అబద్ధం చెప్పకపోయినా అతను నన్ను నమ్మలేదు అనిపించింది. పదకొండేండ్ల వయసులో ఉండటంలోని నష్టం ఇది. ఎవరూ నేను చెప్పింది నమ్మరు. కాబట్టి, ఎడ్వర్డ్‌ విషయంలో నేనే ఆలోచించి ఏదైనా చేయాలి అనుకున్నాను.

ఎడ్వర్డ్‌ దంపతులు గత రెండేండ్లుగా మా పొరుగువారే ఐనా నాకు వాళ్ళ గురించి పెద్దగా తెలీదు. వాళ్ళింటికి నన్ను రానిచ్చే వాళ్ళు కారు. 

ఎడ్వర్డ్‌ దగ్గరనించి పొగాకు వాసన వేస్తూంటుంది. బట్టతల, పొట్ట, కోపపు చూపులు. షరోన్‌ అతన్ని ఎందుకు పెళ్ళి చేసుకుందా అనుకుంటూంటాను. వాళ్ళిద్దరి మధ్యా అభిప్రాయ భేదం లేనిది ఒక్కటే ఉంది. అది వాళ్ళ ఇంటి అవతలి వైపున్న మిసెస్‌ బెయిలీ పెంపుడు పిల్లిని ద్వేషించడం. ఆవిడ విధవరాలు. చెవుడు. పిల్లి మార్విన్‌తో ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నది. మార్విన్‌ రాత్రుళ్ళు ఎడ్వర్డ్‌ పడకగది బయట అరుస్తూ గొడవ చేస్తుంటుంది. వాళ్ళు దానిమీదకి చెప్పులు, పత్రికలు లాంటివి విసిరి తరిమి కొడుతుంటారు. విసిగిపోయిన ఎడ్వర్డ్‌ ఓ రోజు మిసెస్‌ బెయిలీ ఇంటికి వెళ్ళి గట్టిగా అరవడం అంతా విన్నారు.

“నిన్న రాత్రి మాకు నిద్రే లేదు. ఈసారి మీ మార్విన్‌ మా ఇంటికి వచ్చి గొడవ చేస్తే నేను దాన్ని రివాల్వర్‌తో కాల్చి చంపేస్తాను జాగ్రత్త!”

క్రితం బుధవారం రాత్రి నేను ఐస్‌క్రీం కోన్‌ కొనడానికి ఎడ్వర్డ్‌ ఇంటిపక్కనించి వెళ్తుండగా, వాళ్ళ పడకగది కిటికీలోంచి ఎడ్వర్డ్‌ కోపంగా మాట్లాడేది వినిపించింది. 

“... నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నేనింక ఊర్కోను.”

“నీకు అర్థమైనా కాకపోయినా నేను చేసేది చేస్తాను ఎడ్డీ!” షరోన్‌ కంఠం వినిపించింది.

“నువ్వు మరోసారి నాకు తెలీకుండా బయటకి వెళ్తే...”

“... వెళ్తాను... నన్ను ముట్టుకోకు ఎడ్డీ. వదులు. దూరంగా వెళ్ళు... ఎడ్డీ...”

షరోన్‌ కంఠం ఆగిపోయింది. తర్వాత అంతా నిశ్శబ్దం. ఆగి విన్నాను కాని, మళ్ళీ ఏం వినిపించలేదు.

వాళ్ళింట్లో ఏం జరుగుతున్నదో ఊహించే ప్రయత్నం చేసాను. మా  అమ్మానాన్నలు అప్పుడప్పుడూ పోట్లాడుకుంటుంటారు. వాళ్ళ కంఠాలు పైగదిలోని నాకు వినిపిస్తుంటాయి. అరగంటదాకా వారిమధ్య పోట్లాట సాగుతుంది. కాని, నాన్న ఎన్నడూ అమ్మ ఒంటిమీద చెయ్యి వెయ్యలేదు. చివరికి వారి పోట్లాట అంతమై అమ్మ నవ్వులు పెద్దగా, నాన్న నవ్వులు చిన్నగా వినిపిస్తాయి.

ఎడ్వర్డ్‌ ఇంట్లోని నిశ్శబ్దం నన్ను భయపెట్టడంతో, నేను ఐస్‌క్రీం గురించి మర్చిపోయి ఇంటికి పరిగెత్తాను.

నేను వాళ్ళ పోట్లాట గురించి అర్ధరాత్రి దాకా మర్చిపోయాను. చప్పుడికి మెళకువ వచ్చింది. కిటికీలోంచి బయటకి చూసాను. నా పడక గదిలోంచి వారి ఇంటి వెనకభాగం కనిపిస్తుంది. వెన్నెల్లో ఎడ్వర్డ్‌ భారీ శరీరాన్ని గుర్తించాను. అతను తన గులాబీ గుబురుని తవ్వి తీయడం చూసాను. నాకు ఆశ్చర్యం వేసింది. అంత రాత్రి ఎందుకు తవ్వుతున్నాడు? బయట పోర్చ్‌లో ఎందుకు లైట్‌ వేసుకోలేదు? కనీసం టార్చ్‌ లైటైనా ఎందుకు దగ్గర లేదు? ఆ ఆలోచనలు నాలో కలిగాయి. అతనా గోతిని బాగా లోతుగా తవ్వడం చూసాను. 

అతను గోతిలోంచి బయటకి వచ్చి, లోపలకి వెళ్ళి నీలం రంగు దుప్పట్లో చుట్టిన దేన్నో తెచ్చాడు. దాన్ని అతికష్టం మీద మోసుకువచ్చాడు. దాన్ని ఆ గోతిలో వేసి మళ్ళీ మట్టిని నింపసాగాడు. అతనేం చేస్తున్నాడో ఊహించగలిగాను. నేను చాలా డిటెక్టివ్‌ కథలు చదివాను. అతను ‘తన భార్య శవాన్ని పాతిపెడుతున్నాడు’ అనుకున్నాను. అంత రహస్యంగా ఇంకేం పాతిపెడతాడు? అతను ఆఖరి గులాబీ మొక్కనికూడా పాతి కాలితో మట్టిని తొక్కి సరిచేసి, ఇంట్లోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు.

నేను వెంటనే మా అమ్మానాన్నల గది ముందుకి వెళ్ళి చెప్పాను.

“అమ్మా! లే.”

తలుపు తెరచిన అమ్మ నిద్రమత్తుగా చూస్తూ అడిగింది.

“ఏమిటి ట్రేసీ? ఏమైంది?” 

“పోలీసులకి ఫోన్‌ చేయాలి. ఎడ్వర్డ్‌ తన భార్యని చంపి ఇంటి వెనక పాతిపెట్టాడు” ఆదుర్దాగా చెప్పాను.

అమ్మ నా వంక కొన్ని క్షణాలు ముందు అర్థం కానట్లుగా, తర్వాత ఆందోళనగా చూసి వెళ్ళి మా నాన్నని కుదుపుతూ చెప్పింది.

“జార్జ్‌!”

నాన్న తమ గదిలోంచి నా గదిలోకి వచ్చి కిటికీలోంచి గులాబీ చెట్లవంక చూసాడు. 

“అంతా సరిగ్గానే ఉంది ట్రేసీ. నీకేదో పీడకల వచ్చినట్లుంది” ఆవులించి చెప్పాడు.

“నేను కల గనలేదు.”

“ఒక్కోసారి మెళకువ వచ్చాక కలలు నిజంగా జరిగినట్లుగా అనిపిస్తాయి. నువ్వు పడుకో” నాన్న చెప్పాడు.

“కాని నేను నిజంగా చూసాను నాన్నా.”

“ఏమిటి?” తన పడకగది గుమ్మంలో నిలబడ్డ నా అక్క ఏన్‌ అడిగింది.

దాని మొహం నిండా నైట్‌ క్రీం ఉంది.

“ఏం లేదు. ట్రేసీకి పీడకల వచ్చింది” నాన్న చెప్పారు.

“కాని నాన్నా...” నేను చెప్పబోతుంటే నాన్న నా జుట్టు నిమిరి చెప్పాడు.

“రేపు పొద్దున్న ఇది మనం చెప్పుకుని నవ్వుకోవడానికి ఉపయోగపడుతుంది. పడుకో.”

మర్నాడు ఉదయం ఎనిమిదిన్నరకి నాకు మెలకువ వచ్చాక కిటికీలోంచి చూస్తే నాలుగు గులాబీ చెట్లు పూర్వం ఉన్న చోటే ఉన్నాయి. వాటికింద మట్టి తాజాగా కనిపించినా నాకే తేడా కనిపించలేదు. నేను చూసింది వివరించే సాక్ష్యాలేమీ నాకు కనిపించక పోవడంతో నిరాశ చెందాను. అది కల కాదని నాకు తెలుసు.

నేను డైనింగ్‌ హాల్లోకి వెళ్ళేసరికి మా నాన్న డ్రెస్‌ చేసుకుని ఆఫీస్‌కి వెళ్ళబోతూ కాఫీ తాగుతున్నాడు. మా అమ్మ నైట్‌గౌన్‌, స్లిప్పర్స్‌లో ఉంది. నాకు గ్లాస్‌లో ఆరెంజ్‌ పోసిచ్చింది. ఏన్‌ గుడ్లని తింటున్నది. నన్ను చూసి ఏన్‌ నవ్వుతూ చెప్పింది. 

“చూడండి. ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ట్రేసీ వచ్చింది.”  

దాని జుట్టు చెదిరినా మొహం మీద మస్కారా, ఐ లైనర్‌ని కళ్ళకి రాసుకుంది. నేను దాని వంక కోపంగా చూసాను. 

“నీ ఇష్టం. ఎగతాళి చెయ్యి. కాని, నిన్న రాత్రి ఎడ్వర్డ్‌ తన ఇంటి వెనక ఏదో పాతాడు. మనం పోలీసులకి చెప్పాలని నేను ఇంకా అనుకుంటున్నాను” జూస్‌ ఓ గుక్క తాగి చెప్పాను.

“అందులో నిజం లేకపోతే ఎడ్వర్డ్‌ మనమీద పరువునష్టం దావా వేస్తాడు. నేను ఆఫీస్‌కి బయలుదేరాలి” నాన్న చెప్పాడు.

పదకొండేండ్ల పిల్ల చెప్పేది ఎవరూ నమ్మరు! ఎప్పుడూ ఇంతే! నేనేం చెప్పినా నమ్మరు. లేక నేను నిజంగా పొరబడ్డానా? అమ్మ చెప్పినట్లు నిజం అనిపించే కల కన్నానా? కాదు. బహుశా వెనకాల ఇంకేదో పాతిపెట్టి ఉంటాడు. షరోన్‌ జీవించే ఉందేమో. ముందు అది తెలుసుకోవాలి. నాకో ఆలోచన వచ్చింది.

“నువ్వు ఖాళీ చేసిన నా నెయిల్‌ పాలిష్‌ సీసా కొత్తది కొనిస్తానన్నావు. ఇవాళ కొనివ్వు” ఏన్‌ నాకు చెప్పింది.

నేను బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత ఖాళీ నెయిల్‌ పాలిష్‌ సీసా తీసుకుని కార్నర్‌ స్టోర్‌కి బయలుదేరాను. అది కొని వెనక్కి వస్తుంటే నాకో ఆలోచన రావడంతో ఎడ్వర్డ్‌ ఇంటికి వెళ్ళి డోర్‌ బెల్‌ నొక్కాను. అతను తలుపు తెరిచాడు. ఎప్పటిలా పొగాకు వాసన. గత రాత్రి నిద్ర లేనట్లుగా అతని కళ్ళు ఉబ్బి ఉన్నాయి.

“ఏమిటి?” హూంకరించాడు.

నేను నెయిల్‌ పాలిష్‌ సీసాని చూపించి చెప్పాను.

“దీన్ని షరోన్‌కోసం తెచ్చాను. రెండు రోజుల క్రితం మా అక్క ఆమెనించి తీసుకుంది.”

“సరే. నేనిస్తాను” చెప్పి అతనా సీసాని లాక్కుని అరిచాడు.

“అక్క తీసుకుంది ఈ రంగుది కాదు. ఇది ఆమెకి ఓకేనా? అడుగుతారా? అది పగిలిపోతే ఇది కొని తెచ్చాను. ఆమెకీ రంగు నచ్చకపోతే ఎక్సేంజ్‌ చేసి అదే రంగుది తెస్తాను” కోరాను.

“షరోన్‌ ఇప్పుడు ఇంట్లో లేదు.” 

“సరే. తర్వాత అడుగుతాను. ఎప్పుడు వస్తుంది?”

“ఆమె ఊళ్ళో లేదు. డెస్‌ మైనర్స్‌లోని తన చెల్లెలికి ఒంట్లో బాలేకపోతే వెళ్ళింది. ఎప్పుడు వస్తుందో చెప్పలేను” కఠినంగా చూస్తూ చెప్పాడు.

“సారీ. ఆమెకి బాగవ్వాలని ఆశిస్తాను.”

నేను మెట్లు దిగి వచ్చాక నా నెయిల్‌ పాలిష్‌ సీసా ఎడ్వర్డ్‌ దగ్గరే ఉందని గుర్తించాను. ఎనభై ఐదు సెంట్లు నాకు నష్టం. ఇంటికి తిరిగి వచ్చాక ఏన్‌ అడిగింది. 

“ఏదీ నా నెయిల్‌ పాలిష్‌ సీసా?”

“దారిలో పోయింది. ఇంకోటి కొనిస్తాను.”

“నీకు తల్లో తెలివన్నదే లేదు ట్రేసీ. అబద్ధం ఆడటం కూడా రాదు. వెళ్ళి ఇంకోటి కొనుక్కురా.”

“నేను మూర్ఖురాలిని అనుకోకు. షరోన్‌ ఇంట్లో లేదు” అమ్మ దగ్గరకి వెళ్ళి చెప్పాను.

“నీకెలా తెలుసది?” అమ్మ అడిగింది.

జరిగింది వివరించాను.

“నువ్వు డిటెక్టివ్‌ కథలు ఎక్కువ చదవక. ఆమె డెస్‌ మైనర్‌కి వెళ్ళలేదని నీకెలా తెలుసు?” అమ్మ నవ్వుతూ అడిగింది.

అది నిజమే. మంచి డిటెక్టివ్‌ అది నిజమా, కాదా అని తెలుసుకుంటాడు. షరోన్‌ ఆమె చెల్లెలు ఇంట్లో డెస్‌ మైనర్లో లేదని ఋజువు చేయగలిగితేనా? అప్పుడు అంతా నేను చెప్పింది వింటారు. కాని ఎలా?

నాకు షరోన్‌ చెల్లెలి పేరు తెలుసు. అమ్మ బయట పోర్చ్‌లో కూర్చున్నప్పుడు ఆపరేటర్‌కి ఫోన్‌ చేసి ఆమె పేరు చెప్పి, డెస్‌ మైనర్లోని ఆమె ఇంటి నంబర్‌ అడిగి తెలుసుకున్నాను. ఆ నంబర్‌కి ఫోన్‌ చేసాను. మూడుసార్లు మోగాక ఓ కంఠం వినిపించింది.

“హలో. వెరా ఇల్లేనా?” అడిగాను.

“అవును. మీరెవరు?”

“నా పేరు ట్రేసీ రోజర్స్‌. షరోన్‌తో మాట్లాడాలి” చెప్పాను.

“ఆమె ఇక్కడ లేదు.” 

అది ఎడ్వర్డ్‌ కంఠమని ఆలస్యంగా గుర్తు పట్టగానే రిసీవర్‌ పెట్టేసాను. 

“ఎవరికి ఫోన్‌ చేసావు?” అమ్మ నన్ను బయటకి పిలిచి అడిగింది.

“జూలోని పులికి” చెప్పాను.

తర్వాత పోలీసులకి ఫోన్‌ చేసాను కాని, నేను చిన్న పిల్లని అవడం వల్ల అనుకుంటాను, వాళ్ళు ఎలాంటి చర్యా తీసుకోలేదు. త్వరలోనే ఎవరో ఒకరు షరోన్‌ మాయమైందని గ్రహిస్తారు. వాళ్ళకా ఫిర్యాదు అందాక నా ఫిర్యాదు గుర్తొచ్చి, దాన్ని నమ్ముతారు. వాళ్ళు గులాబీ చెట్లకింద తవ్వుతారు. అప్పుడు నేను నిజం చెప్పానని అంతా నమ్ముతారు. కానీ, అది ఎప్పటికి జరిగేను? ఎడ్వర్డ్‌ అంతా నమ్మే ఏదైనా అబద్ధాన్ని చెప్తే?

అమ్మ, అక్క సూపర్‌ బజార్‌కి వెళ్తే నేను తలుపు మూసుకున్నాను. నేను నా పడకగది కిటికీలోంచి ఆ గులాబీ గుబురు వంక చూస్తూ ఆలోచిస్తుంటే ఆ ఇంటి వెనక తలుపు తెరచుకుంది. అతను బయటకి వచ్చి బూటుకాళ్ళతో గులాబీ చెట్లకింద నేలని తడుముతూ చూసాడు. అకస్మాత్తుగా అతని చూపులు నా కిటికీ వైపు తిరిగాయి. మేం ఇద్దరం ఒకరి వంక మరొకరం కొన్ని క్షణాలు చూసుకున్నాం. అతని రహస్యం నాకు తెలుసని అతనికి తెలిసిందని అతని చూపులనిబట్టి గ్రహించాను. నేను చటుక్కున పక్కకి తప్పుకున్నాను.

డోర్‌ బెల్‌ మోగింది. నేను కిందకి వెళ్ళి వ్యూ ఫైండర్లోంచి చూస్తే బయట ఎడ్వర్డ్‌. నాకు భయం వేసి నేను తలుపు తీయలేదు. బయట అమ్మ కారు లేకపోవడంతో నేను ఒంటరిగా ఉన్నానని గ్రహించాడా? రెండు, మూడుసార్లు నొక్కాడు. 

“ట్రేసీ! నువ్వు ఇంట్లో ఉన్నావని తెలుసు. తలుపు తీయ్‌. నీతో మాట్లాడాలి” అతని కంఠం గట్టిగా వినిపించింది.

నేను బదులు మాట్లాడలేదు. ‘నన్నూ చంపేస్తాడా? అందుకే వచ్చాడా?’ అతను చేసిన హత్య గురించి నాకు తెలుసు కాబట్టి, నేను సాక్షిని. వెంటనే పోలీసులకి ఫోన్‌ చేసి చెప్పాను.

“నిన్న మా పక్కింటి ఎడ్వర్డ్‌ తన భార్య షరోన్‌ని చంపాడని ఫిర్యాదు చేసాను. ఇంట్లో ఎవరూ లేరు. అతను నన్ను చంపడానికి వచ్చాడు” చెప్పాను.

“తప్పుడు ఫిర్యాదులు చేయడం కూడా నేరం. చిన్న పిల్లవి. ఇలాంటివి చేయక” అవతల నించి మందలించారు.

వంటగదిలోకి పరిగెత్తాను. కిటికీలోంచి మెర్విన్‌ కనిపించింది. నేను వెనక తలుపు తెరచుకుని బయటకి వెళ్ళి దాన్ని ఎత్తుకుని తీసుకుని, మేడమీదకి పరిగెత్తుకు వెళ్ళి నా పడకగదిలో ఉంచి తలుపు మూసాను. ఇప్పుడు ఎడ్వర్డ్‌ వెనక తలుపు మీద గట్టిగా దేంతోనో కొట్టడం వినిపిస్తున్నది. నాకు వణుకు పుట్టుకు వచ్చింది.

నేను మిసెస్‌ బెయిలీకి ఫోన్‌ చేసాను.

“మిసెస్‌ బెయిలీ. నేను ట్రేసీ రోజర్స్‌ని. మీకోటి చెప్పాలని ఫోన్‌ చేసాను...”

అతను వెనక తలుపు దాదాపు పగులకొట్టగానే పోలీస్‌ కారు వచ్చి మా ఇంటి ముందాగింది. వాళ్ళకోసం ఇంటి బయట నిలబడి ఎదురు చూసే మిసెస్‌ బెయిలీ వాళ్ళతో చెప్పింది.

“ఎడ్వర్డ్‌! వాడు నా పిల్లిని చంపేసాడు. ఆ ఇంట్లోని అమ్మాయి చూసి చెప్పింది. గులాబీ చెట్లకింద పాతిపెట్టడం ఆ పిల్ల చూసిందిట” కోపంగా చెప్పింది.

పోలీస్‌ సైరన్‌ విన్న ఎడ్వర్డ్‌ వాళ్ళ దగ్గరకి పరిగెత్తాడు. ఆవిడ కోపంగా చెప్పింది.

“ఆగు. నీ పని చెప్తాను.”

“ఈవిడ పిల్లిని మీరు చంపారా?” యూనిఫాంలోని పోలీస్‌ ఆఫీసర్‌ అతన్ని ప్రశ్నించాడు.

ఎడ్వర్డ్‌ పాలిపోయిన మొహంతో ఒణుకుతూ చెప్పాడు.

“అది అబద్ధం. నేను అసలు మెర్విన్‌ని ముట్టుకోనే లేదు.”

“కాని నువ్వు దాన్ని చంపుతానని బెదిరించలేదా? చుట్టుపక్కల ఇళ్ళల్లోని వాళ్ళంతా అది విన్నారు లెఫ్టినెంట్‌” మిసెస్‌ బెయిలీ అరిచింది.

“అది నిజమే. కోపంలో అలా బెదిరించాను. కాని, నేను ఈవిడ పిల్లిని చంపలేదు.”

నేను ధైర్యంగా వాళ్ళ దగ్గరకి వెళ్ళాను. 

“నువ్వు చెప్పు ట్రేసీ. వీడు మార్విన్‌ని చంపి పాతాడు కదా?” ఆవిడ నన్ను అడిగింది.

“అది నిజం. దాన్ని చంపి గులాబీ చెట్లకింద పాతడం చూసాను” చెప్పాను.

“అది అబద్ధం” ఎడ్వర్డ్‌ అరిచాడు.

“మీ పిల్లిని ఆఖరిసారి ఎప్పుడు చూసారు?” ఓ ఆఫీసర్‌ ఆవిడని అడిగాడు.

“రెండు, మూడు గంటలైంది.”

“నువ్వు ఎప్పుడు చూసావు?”

“గంట క్రితం.”

“నిజం తెలుసుకోవాలంటే అక్కడ తవ్వడం ఒక్కటే దారి” ఓ ఆఫీసర్‌ చెప్పాడు.

ఎడ్వర్డ్‌ తల వాలిపోయింది. కుంచించుకుపోయాడు.

“అతను బాగా లోతుగా తవ్వి పాతిపెట్టాడు” చెప్పాను.

నా అదృష్టం కొద్దీ నా పడక గది కిటికీలోంచి మా వంక చూసే మార్విన్‌మీద ఎవరి దృష్టీ పడలేదు.

రాత్రి భోజనాల సమయానికల్లా షరోన్‌ హత్య గురించి మా చిన్న ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది.

శోకంలో మునిగిన మిసెస్‌ బెయిలీకి మెర్విన్‌ని ఇచ్చేసాను. అమ్మకి డాక్టర్‌ నిద్ర మాత్ర ఇచ్చాడు.

ఓ బంగారు జుట్టు అమ్మాయి నా ముందు మైక్రోఫోన్‌ని ఉంచి ఓ ప్రశ్న వేసింది.

“ఎవరూ నా మాట వినరు” చెప్పాను.

“ఇప్పుడు లక్షల మంది వింటారు. నమ్ముతారు” ఆమె చెప్పింది.

నేను మొదటి నించి జరిగింది వివరించసాగాను.

(స్టెఫానీ కే బెండెల్‌ కథకి స్వేచ్ఛానువాదం)

తాజావార్తలు


logo