మంగళవారం 02 జూన్ 2020
Sunday - Jan , ,

పద్దులు లెక్క చెప్పడం కోసం.. పెన్సిల్ తయారుచేశాడు!

పద్దులు లెక్క చెప్పడం కోసం..  పెన్సిల్ తయారుచేశాడు!

పెన్సిల్‌తో అనుబంధం ఉండనిది ఎవరికి? అదొక బాల్య నేస్తం. ఇప్పటికీ మనం పెన్సిల్‌ను వాడుతూనే ఉన్నాం. అంటే.. పెన్సిల్ ఒక సేఫ్ ఆప్షన్. పెన్సిల్ చరిత్ర పెద్దదే. నేటి ఆధునిక మానవుడికి పెన్సిల్‌తో ఏదో ఒక అనుబంధం ఉంది.

 మనిషి మారినట్టు పెన్సిల్ రూపాంతరం చెందింది. ఇప్పుడు మనం చూస్తున్న నటరాజ్.. అప్సర.. హెచ్‌బీ వంటి పెన్సిళ్లు కాకుండా మొట్ట మొదటగా పెన్సిల్‌ను ఎవరు తయారుచేశారు? పెన్సిల్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అసలు పెన్సిల్ చరిత్ర ఏంటి? తెలుసుకొందాం. 


మానవ వికాసంలో పెన్సిల్ పాత్ర చిన్నదేమీ కాదు. నేటి ఆధునిక మానవుడికి పెన్సిల్‌తో పెనవేసుకున్న బంధమే ఉంది. మనిషి పుట్టుకతో కళాభిమాని కాబట్టి ఆదిమకాలంలోనూ బొమ్మలు వేసేవాడు. సీసం.. రంగురాళ్లను ఉపయోగించి ఆ రోజుల్లో బొమ్మలు గీసేవారు. తర్వాత నాగరికత నేర్చుకున్నాక సీసంనే ఉపయోగించారు. ఇక ఆధునిక మానవుడు.. అంటే మనం గ్రాఫైట్‌ను వాడుతున్నాం. గ్రాఫైట్‌తో చేసిన పెన్సిల్‌ను ఉపయోగిస్తూ అద్భుతాలెన్నో చేస్తున్నాం. ఒకరకంగా పెన్సిల్ అనేది లేకపోతే ఆధునిక విద్యా వికాసమే లేదంటే అతిశయోక్తి కాదు. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారు. గ్రాఫైట్ అనేది ఒక కర్బన సమ్మేళనం. వజ్రం కూడా కర్బన పదార్థమే. కానీ వజ్రానికి ఉన్న కాఠిన్యం గ్రాఫైట్‌కు లేదు. పెన్సిల్ చెక్క గుండ్రంగా ఉండవచ్చు. కానీ సాధారణంగా పంచభుజి.. అష్టభుజి రూపాల్లోనే ఉంటే ఆ చెక్కతో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు. 


పెన్సిల్ అంటే చిన్న కుంచె అని అర్థం. ఇది పిన్సిల్ అనే ఫ్రెంచ్ పదం, పిన్సిలస్ అనే లాటిన్ పదాల నుంచి వచ్చింది. పెన్సిల్‌ను జోసెఫ్ డిక్సన్ అనే సాధారణ బ్రిటీష్ వ్యక్తి కనుగొన్నాడు. అయితే దీనిని ఆధునిక పెన్సిల్‌గా నికోలస్ జాక్వస్ అనే ఆర్మీ అధికారి తీర్చిదిద్దారని కూడా చెప్తుంటారు. ఎవరు కనిపెట్టినా విద్యా వికాసానికి దోహదం చేసే ఒక మంచి వస్తువును తీర్చిదిద్దారు కాబట్టి వారికి మనం రుణపడే ఉంటాం. సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెంది.. ఒకరకంగా పెన్నులకే పనిలేకుండా పోయిన ఈ రోజుల్లో కూడా పెన్సిల్ తన మనుగడను కొనసాగిస్తూ ఉంది. తరాలుగా మనకు సోపతిగా నిలుస్తూ వస్తున్నది. పూర్వం రోజుల్లో నీళ్లు, బంకమట్టి, గ్రాఫైట్ ఖనిజాన్ని ఉపయోగించి బట్టీలో 1900 డిగ్రీల ఫారిన్‌హీట్ వద్ద వేడిచేసి పెన్సిల్‌ను తయారుచేసేవారు. ఇరువైపులా బంకమట్టి ముద్దల మధ్య గ్రాఫైట్ బద్దను ఘనీభవింపజేసి వీటిని చేసేవారు. అవసరాలను బట్టి నాలుగు మూలలు, గుండ్రని పెన్సిళ్లను కూడా తయారుచేశారు. కాలక్రమంలో కర్ర పెన్సిళ్లు వచ్చాయి. పెన్సిల్‌లో ఉపయోగించే గ్రాఫైట్ ఖనిజ నిల్వలను మొదట యూరప్‌లో కనుగొన్నారు. 


పెన్సిల్‌ను కనిపెట్టింది జోసెఫ్ డిక్సన్. ఆయన ఇంగ్లండ్‌లో పుట్టాడు. డిక్సన్‌ది చాలా పేద కుటుంబం. పేద అనేకంటే నిరుపేద అనాలేమో. అవును కనీసం పూట కూడా గడవలేనంత పేదరికంలో పుట్టాడతను. అందరిలా చదువుకోవాలనే ఆశ అయితే ఉంది. ఏదో ఒకటి చేసి తల్లిదండ్రులు స్కూల్‌కి పంపిస్తారనే ఆశాభావం ఉండేది. కానీ అతడి ఆశలు అడియాశలయ్యాయి. స్కూల్ గేట్ దాటి లోపలికి వెళ్లలేని పరిస్థితి. అయినా చదువుకోవాలనే ఆశ మాత్రం చంపుకోలేదు. ఏదో ఒక రకంగా మొత్తానికి చదువు అయితే అబ్బింది. కాకపోతే అకాడమిక్ అంశాల కన్నా ప్రాపంచిక అంశాలపైన ఎక్కువ అవగాహన ఉండేది. చిన్నప్పటి నుంచే ఇంట్లో.. బయటా సమాజం గురించి చర్చిస్తుండేవాడు. ఈ చర్చల వల్లే అతడిలో కొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించే ధోరణి పెరిగింది. ఏదైనా జీవి కనిపిస్తే ఇది ఎలా నడుస్తుంది? ఎందుకు ఎగరడం లేదు? ఏం తింటుంది? దీనికెన్ని కాళ్లున్నాయి? వంటి రకరకాల ప్రశ్నలు అతడి నుంచి వస్తుండేవి. 


డిక్సన్ పెద్దవాడయ్యాడు. సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఇది ఒక్క డిక్సన్‌కే కాదు.. ఇంటిల్లిపాదికీ సమస్యగా మారింది. ఇక ఎంతకాలం ఇలా అవస్థలు పడతాం ఏదైనా పని చూసుకో అంటూ తల్లిదండ్రులు డిక్సన్‌కు చెప్పేశారు. వాళ్లతో అతడేమీ చర్చించలేదు. మీ ఇష్టం అన్నట్టుగా తలూపాడు. తెలిసినవాళ్ల దుకాణాల్లో పని ఉంది చేస్తావా? కుటుంబసభ్యులు అడిగారు. చేస్తా అన్నాడు. సమీప పట్టణంలో ఒక దుకాణం. ఎట్టకేలకు డిక్సన్ పనిలో చేరాడు. పెద్దగా పనేమీ ఉండదు. సేఠ్ అడిగిందల్లా ఇవ్వడం.. చెప్పిన ప్రతీ విషయాన్ని గుర్తుంచుకోవడం అతని పని. అయితే చాలాసార్లు ఒకటి చెప్తే మరొకటి చేసేవాడు. సరిగ్గానే వినిపించినా వాటిని వెంటనే మర్చిపోయేవాడు. చివాట్లు కూడా తప్పలేదు. చూడు డిక్స్.. నువ్విలాగే చేస్తే నీకివ్వాల్సిన జీతం డబ్బుల్లో కోత పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్తగా పనిచేయాలని ఎన్నిసార్లు చెప్పాలి? అని గద్దిస్తాడు. ఎంతో బాధపడిన డిక్సన్.. ఇలా అయితే ఇక కష్టం అనుకున్నాడు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి.. లేకపోతే నా భవిష్యత్ అంధకారమే అని మదనపడ్డాడు. దుకాణంలోకి రాగానే ఏం చెప్తాడో.. అదెంత గుర్తుంటుందో అని వణికిపోయేవాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవడానికి ఏం చెయ్యాలో తెలియక బాధపడేవాడు కూడా. 


ఒకరోజు దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే రోడ్డుపక్కన పడి ఉన్న ఒక నల్లరాయిని చూశాడు. ముందు దానిపై ఏదైనా రాసుకోవచ్చేమో అనుకుని దగ్గరకు వెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లాడు దానిని. కానీ అది వర్కవుట్ కాలేదు. 

ఆ రాయిని కింద పడేశాడు. అది ఫలకలుగా పగిలిపోయింది. దాంట్లో ఒక చిన్న ముక్కను తీసుకున్నాడు. చిరాకు.. కోపంతో గోడపై గట్టిగా గీకాడు. అక్కడ పడిన గీతలను చూసి అవాక్కయ్యాడు. వెంటనే తుడిచేసే ప్రయత్నం చేశాడు. కొద్దికొద్దిగా తొలిగిపోతున్నట్లు అర్థమైంది. ఇదేదో బాగుందే అనుకున్నాడు. 


ఆరోజు ఎప్పట్లాగే దుకాణానికి వెళ్లాడు డిక్సన్. సేఠు టకాటకా చిట్టా పద్దులేవో లెక్క చెప్పాడు. ఏమయ్యా మొన్ననే లెక్క మొత్తం కిందా మీద చేశావు. ఈ రోజైనా సక్కంగా గుర్తుపెట్టుకో. లేకపోతే నిన్ను భరించడం నా వల్ల కాదు. ఏదో తెలిసిన మనిషివనీ భరిస్తున్నా కానీ పని రానిది ఎవడు పెట్టుకుంటాడు చెప్పు అంటూ ఏవేవో మాటలు అనేశాడు. డిక్సన్ మనసు నొచ్చుకుంది. కానీ పేదరికం కదా.. ఏం చేస్తాడు. సరేనయ్యా అని తలకిందికేసుకొని చెప్పాడు. తన వెంట తీసుకెళ్లిన నల్లరాయితో గోడమీద గీత గీసి చూశాడు. అంతే.. ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. 


డిక్సన్‌కు మరో ఐడియా వెలిగింది. అదిరించినా.. బెదిరించినా ఇంకెంత కాలం ఈ దుకాణంలో పనిచేస్తాం? స్వతహాగా ఏదైనా ఆలోచించలేమా? అనుకున్నాడు. లెక్కలు మరిచిపోతున్నామని సేఠు చివాట్లు పెడితే దాని నుంచి వచ్చిన ఆలోచనల్లోంచి గ్రాఫైట్ ముక్కతో రాయాలనే ఐడియా రాలేదా? అని తీవ్రంగా ఆలోచించాడు. యజమానేమైనా ఎక్కువగా మాట్లాడితే తాడోపేడో తేల్చుకుందామని ముందుగానే ప్రిపేరై వెళ్లాడు. వెళ్లిన దగ్గర్నుంచి పని చేయడంపై ఏ మాత్రం ధ్యాస పెట్టలేదు. నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగూ సేఠు తిడతాడు.. అప్పుడు మెల్లగా రంగంలోకి దిగేసి అసలు విషయం చెప్పొచ్చనేది డిక్సన్ ఉపాయం. కానీ ఎంత సేపటికీ సేఠు నోరు మెదపలేదు. అనూహ్యంగా డిక్సన్‌పై ప్రేమ కురిపించడం మొదలుపెట్టాడు. ఏమైంది బాబూ.. సైలెంట్‌గా ఉంటున్నావ్? నీకో విషయం చెప్తున్నా విను. నువ్వు ఇక్కడ ఏదైనా పని నేర్చుకుంటా అనుకుంటే ఉండు. లేదు ఇక్కడ ఏమీ పని నేర్వలేను ఎన్ని రోజులు చేసినా దీనితో ప్రయోజనం లేదు అనుకుంటే వదిలెయ్. నువ్వు బాగుంటే మాకు అదే చాలు అన్నాడు. ఉన్నట్టుండి యజమాని తనపై ప్రేమ కురిపించడం చూసి డిక్సన్ సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి. యజమానికి తన విషయం చెప్పేశాడు. తన దగ్గరే పనిచేసుకుంటూ వివిధ రకాల ప్రయోగాలు చేయొచ్చు.. ఇక్కడ అన్ని వనరులు ఉంటాయి అని యజమాని చెప్పాడు. ఒకవైపు పనిచేస్తూనే మరోవైపు ప్రయోగాలు మొదలుపెట్టాడు డిక్సన్. గ్రాఫైట్ రాయిని పొడిచేసి గొట్టంగా మారిస్తే ఎలా ఉంటుంది? అనుకున్నాడు. రాయిని పొడిచేసి ఆముదం లాంటి ద్రవపదార్థంతో దాన్ని ముద్దగా చేసి ఒక గొట్టంలోకి ఎక్కించాడు. తర్వాత చాలాసేపు ఎండపెట్టాడు. తర్వాత దానితో కొన్ని అక్షరాలు రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండటం వల్ల రాయడానికి అంతగా వీలుకాలేదు.  చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది. ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకొని దానికి ఒక చిన్న రంధ్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం. పెన్సిల్ తయారైంది. సన్నగా రాయడం.. చేతులకు నలుపు అంటుకుపోవడం.. వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతుంది. తర్వాతి కాలంలో డిక్సన్ పెన్సిల్ తయారీ కంపెనీని ఏర్పాటుచేశాడు. దాని ద్వారానే పేరు.. డబ్బు సంపాదించాడు. 


ఆరోజు ఎప్పట్లాగే దుకాణానికి వెళ్లాడు డిక్సన్. సేఠు టకాటకా చిట్టా పద్దులేవో లెక్క చెప్పాడు. ఏమయ్యా మొన్ననే లెక్క మొత్తం కిందా మీద చేశావు. ఈ రోజైనా సక్కంగా గుర్తుపెట్టుకో. లేకపోతే నిన్ను భరించడం నా వల్ల కాదు. ఏదో తెలిసిన మనిషివనీ భరిస్తున్నా కానీ పని రానిది ఎవడు పెట్టుకుంటాడు చెప్పు అంటూ ఏవేవో మాటలు అనేశాడు. డిక్సన్ మనసు నొచ్చుకుంది. కానీ పేదరికం కదా.. ఏం చేస్తాడు. సరేనయ్యా అని తలకిందికేసుకొని చెప్పాడు.  తన వెంట తీసుకెళ్లిన నల్లరాయితో గోడమీద గీత గీసి చూశాడు. అంతే.. ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద రాసేవాడు. ఆ రాయే గ్రాఫైట్. 


దాయి శ్రీశైలం,సెల్: 8096677035


logo