సోమవారం 25 మే 2020
Sunday - Jan , ,

అసాధారణ నాయకుడిఅంతిమ ఘడియలు

అసాధారణ నాయకుడిఅంతిమ ఘడియలు

జనవరి 17, 2010 ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి, బిదన్నగర్, కోల్‌కతా మధ్యాహ్నం 11 దాటింది. ఆస్పత్రి ఎదుట వేల మంది జనాలు. క్షణ క్షణం పెరుగుతున్న సమూహం. ఏదో వార్త అక్కడ జనాన్ని కదిలించింది.

1996, భారత రాజకీయాలు..దేశ రాజకీయాలు సంక్షోభంలో ఉన్నసమయంలో. పార్టీలకు స్పష్టమైన మెజారిటీ రాలేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి పార్టీలు. యునైటెడ్ ఫ్రంట్‌గా ముందుకు వచ్చాయి. ప్రధాని అభ్యర్థిగా ఉండాలని ఫ్రంట్ పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతి బసును కోరింది. సుదీర్ఘ అనుభవం, నిబద్ధత కలిగిన నాయకునిగా జ్యోతిబసు ఓ కిరణం లాగా కనిపించారు ఫ్రంట్ సభ్యులకు. ఇదే విషయం జ్యోతిబసుకు ప్రతిపాధించారు. కానీ ఆ నిర్ణయం సీపీఐ(ఎం) ( కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు)) పొలిట్ బ్యూరో మీద ఆధారపడి ఉంటుంది. పార్టీ అంగీకరిస్తే తను ప్రధాని పదవిని చేపడతానని ఒప్పుకొన్నారు. జ్యోతిబసు ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉండాలన్న ప్రతిపాదనను ఆశ్చర్యకరంగా ఆ పార్టీ కార్యవర్గం తోసిపుచ్చింది. దీంతో జనతాదల్ నుంచి దేవేగౌడ పీఎం సీటును అధిష్టించారు. లేకుంటే 1996లోనే కమ్యూనిస్టు పార్టీ నుంచి మొదటి ప్రధాని అయ్యేవారు. ఇదొక పెద్ద చారిత్రాత్మక తప్పిదం అని అనేక రాజకీయవేత్తలు అభివర్ణించారు. చివరికి ఆ పార్టీ కూడా నేటికీ ఆ తప్పిదాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంది.


1996 రాజకీయ పరిస్థితుల తర్వాత జ్యోతిబసు ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. రోజు రోజుకూ ఆరోగ్య సమస్యలు పెరగడంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగాలని చాలాసార్లు భావించారు. కానీ జ్యోతిబసు లాంటి నాయకులను పదవి నుంచి దూరం చేయడం ఆ పార్టీ సరికాదని భావించింది. సీఎంగా తొలగాలన్న అభ్యర్థనను ఆ పార్టీ నిరంతరం తిరస్కరిస్తూను ఉంది. కానీ చివరికి 2000 ఏట జ్యోతిబసు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటే పార్టీలోని పదవులనుంచి కూడా తప్పుకోవాలని ఆయన కోరుకున్నారు. కానీ పార్టీ దాన్ని అంగీకరించలేదు.    


ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్నప్పటికీ జ్యోతిబసు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎంతో కృషి చేశారు. జాతీయ రాజకీయాల్లో పార్టీ విధానాలను అమలు చేయడంలో ఆయన కృషి ఉంది. 

2008 నాటికి జ్యోతిబసు ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. మంచానికే పరిమితయ్యేలా చేశాయి. కొద్దిరోజుల తర్వాత మెదడులోని రక్తనాళాలు గడ్డకట్టుకొని పోయాయి. ఆస్పత్రిలో చేరారు. మెరుగైన చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. పెరుగుతున్న వయసు కారణంగా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఏడాది తిరక్కుండానే శ్వాసకోశ వ్యాధితో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఈ పరిస్థితిని కూడా ఆయన జయించారు. చికిత్స తీసుకొని ఉపశమనం పొందారే తప్ప పూర్తిగా నయం కాలేదు. 


జనవరి 1, 2010

ప్రపంచం అంతా కొత్త సంవత్సరపు వేడుకల్లో ఉంది. జ్యోతిబసు ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. వెంటనే ఆయనను కోల్‌కతాలోని ఏఎంఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు న్యూమోనియా అని గుర్తించారు.  ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన తర్వాత ఆరోగ్యం కుదుటపడినట్టు ప్రకటించారు. మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంచి వైద్యం అందించాల్సి ఉంటుందని తెలిపారు. ఆస్పత్రిలో చేరిన రెండో రోజు నాటికి ఆయనకు శ్వాసపరికరాల ద్వారా కృత్రిమశ్వాసను అందించడం ప్రారంభించారు. మరో రెండు రోజుల పాటు ఐసీయూలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఆహారం అందిస్తామని సూపరింటెండెంట్ దెబాశిష్ శర్మ మీడియాకు తెలిపారు. 


జనవరి 5, 2010 ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి..

ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జ్యోతిబసు చికిత్సకు సహకరిస్తున్నప్పటికీ ఊపరితిత్తుల పనితీరు క్షీణించిందని వైద్యులు ప్రకటించారు. మిగతా అవయవాలు బాగానే ఉన్నట్టు చెప్పారు. ఆస్పత్రిలో గంటలు, రోజులు గడుస్తున్నాయి. జనవరి 7 నాటికి ఆస్పత్రి వర్గాలు జ్యోతిబసు ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్‌ను విడుదల చేశాయి. ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదని ఆ బులెటిన్‌లో పేర్కొన్నాయి. జనవరి 12 రాత్రి నాడు విడుదలైన మరో బులెటిన్ పార్టీ నాయకత్వాన్ని, కార్యక్తలను, ప్రజలను తీవ్రంగా కలచివేసింది. జ్యోతిబసు ఆరోగ్యం పూర్తిగా విషమించింది.  గుండె, కాలేయం, మెదడు పనితీరు మందగించాయి. ఆయన ప్రాణాలను రక్షించడానికి వైద్యులు శక్తిమేరా కృషి చేస్తున్నారు.  ఆయన వయస్సు  95 ఏండ్లు కావడంతో వైద్యం చేసేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇంకా ఆయన వెంటిలేషన్ మీదనే ఉన్నారు. అప్పుడప్పుడూ జ్వరం రావడంతో యాంటిబయోటిక్ మందులు ఇస్తున్నాం. నిరంతరం ఆక్సీజన్ శాతాన్ని పెంచుతున్నాం అని ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీఎన్ అగర్వాల్ తెలిపారు. జనవరి 15 నాటికి జ్యోతి బసు ఆరోగ్య పరిస్థితి అటు పార్టీలో, ఇటు రాష్ట్రంలో తీవ్ర కలవరం రేపింది. విషయం తెలుసుకున్న రాజకీయ ప్రముఖులు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌తో కలిసి జ్యోతిబసును పరామర్శించారు. 


జనవరి 17,  ఆదివారం ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి ప్రాంగణం ఉదయం 11 గంటల తర్వాత ...ఆ రోజు ఆదివారం. తమ అభిమాన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వాళ్లంతా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిమాన్ బోస్ ఆ వార్తను వెల్లడించారు. నాయకుడు జ్యోతిబసు చివరి శ్వాస విడిచినట్టు తెలిపారు. ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో ఆయన 11.17 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ప్రకటించారు. ఈ వార్త దేశాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. 17 రోజుల  చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ఆయన మృతి చెందారు. 


జ్యోతిబసు.. సీపీఎం తొలి తరం కమ్యూనిస్టు నేత. దేశంలో సుదీర్ఘ కాలం ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా సేవలందిచిన నాయకుడు. 23 ఏండ్ల 4నెలల 17 రోజులు ముఖ్యమంత్రిగా ఆయన నిర్విరామ పదవీ కాలం. నమ్మిన సిద్ధాంతాలపట్ల దృఢమైన నిబద్ధత, క్రమశిక్షణ ఆయన విధానాలు. కమ్యూనిస్టుగా పార్టీ నియమాలను నిక్కచ్చిగా పాటించిన సభ్యుడు. పార్టీ వ్యాప్తికి, సిద్ధాంతాల విస్తరణకు కృషి చేసిన నాయకుడు. ప్రజల ఆశాజ్యోతిగా సేవలందించిన ఆదర్శప్రాయుడు. పేదలకు భూ పంపిణీ చేసిన పక్షపాతి.  పార్టీ నియమాలను ఏనాడూ దాటింది లేదు. అందుకే ఆయన 1996లో ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు.


జ్యోతిబసు మృతి తీరని లోటు మిగ్చిలిందని రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఆయన మృతదేహాన్ని  సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలకు పంపలేదు. ఆయన కోరిక మేరకు వైద్య విద్యార్థుల పాఠాల కోసం మెడికల్ కళాశాలకు   అందించారు. మరణానంతరం తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అందించాలని 2003 ఏప్రిల్ 4న ఆయన గణదర్పన్ అనే స్వచ్ఛంద సంస్థ పత్రంపై సంతకం చేశారు. శరీరాన్ని శ్మశాన వాటికలో కాల్చవద్దని కోరుకున్నారు. ఆయన కండ్లను సుస్రుత్ ఐ ఫౌండేషన్‌కు దానం చేశారు. 

కోల్‌కతా వీధుల్లో ఆయన అంతిమయాత్ర అపూర్వ స్థాయిలో జరిగింది. గతంలో ఎన్నడూ ఏ  కమ్యూనిస్టు నాయకునికి గానీ, ఏ ముఖ్యమంత్రికి ఇలాంటి అంతిమ యాత్ర జరగలేదు. త్రివర్ణ పతాకం కప్పిన ఆయన డెడ్‌బాడీ గన్ కరేజ్ మీద కోల్‌కతా వీధుల్లో ఊరేగించారు. ఆరుగురు సైనికాధికారులు దానికి ఇరువైపుల మార్చ్ కొనసాగించారు. 21 గన్ సెల్యూట్‌లు నిర్వహించినట్టు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇలాంటి గౌరవ వందనం చివరి సారిగా మదర్ థెరిస్సాకు ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. జ్యోతిబసు అంతిమ యాత్రలో లక్షలాది మంది ఆయనకు వీడ్కొలు పలికేందుకు వీధుల్లోకి వచ్చారు. వీధులన్నీ ఎర్రజెండాలతో, తెల్లని పూలతో నిండిపోయాయి. లాల్ సలామ్, కామ్రేడ్ జ్యోతిబసు అమర్ రహే అనే నినాదాలు వీధుల్లో మార్మోగాయి.  సెక్రటేరియట్‌లో జ్యోతిబసు ఎక్కువగా గడిపిన రైటర్స్ బిల్డింగ్‌లో, పార్టీ ఆఫీస్‌లో పార్థివదేహాన్ని  ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం మొహర్ కుంజా పార్కులో సందర్శన కోసం ఉంచారు.  జనవరి 19 సాయంత్రం 4గంటల ప్రాంతంలో జ్యోతిబసు పార్ధ్థివ దేహాన్ని వైద్యకళాశాలకు అప్పగించారు.  


కలెక్టర్ అవుతాడనుకుంటే..

కోల్‌కతాలోని లొరేటో, సెయింట్ జేవియర్స్‌లో జ్యోతిబసు పాఠశాల విద్య చదివారు. అనంతరం కోల్‌కతా యూనివర్సిటీ ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ చదివారు. పై చదువుల కోసం 1935లో ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్ వెళ్లిన జ్యోతిబసు అక్కడి రాజకీయాలకు పరిచయం అయ్యారు.  గ్రేట్ బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీతో ప్రభావితం అయ్యారు. కమ్యూనిస్టు పార్టీ  సభలకు, సమావేశాలకు హాజరయ్యేవారు. అనంతరం ఇండియాకు వచ్చిన ఆయన సీపీఎం స్థాపనకు కృషి చేశారు. బాగా చదివి కలెక్టర్ అవుతాడని తండ్రి నిషికాంత బసు అనుకొనేవారు. కానీ కమ్యూనిస్టు భావాజాలం, గొప్పతనం విధానాలతో ప్రేరణ పొందిన ఆయన కమ్యూనిస్టు అయ్యారు. 


logo