శుక్రవారం 05 జూన్ 2020
Sunday - Jan , ,

సంప్రదాయ కళాతోరణం సంక్రాంతి

సంప్రదాయ కళాతోరణం సంక్రాంతి

ఆత్మీయ అనుబంధాలు ఇంటి లోగిల్లే వేదికగా విలసిల్లాలనే భావమాధుర్యం సంక్రాంతి పర్వం. క్రాంతి అంటే వెలుగు. సంక్రాంతి అంటే కొత్తదైన వెలుగు. మన జీవితాల్లో కొత్త వెలుగును నింపాలనే సమిష్టి ఆరాధనా దీపిక సంక్రాంతి పండుగ.

 అందుకే సంక్రాంతి పండుగల్లో అగ్రతాంబూలం అందుకుంది. ఇది నాలుగు రోజుల పెద్ద పండుగ. పంటల పండుగ, పశువుల పండుగ, ముగ్గుల పండుగ, పెద్దల పండుగ, సిరుల పండుగ... సంక్రాంతి. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పడుతూ అభ్యుదయ భావాలను సైతం సదాచారం వైపు మళ్ళించే సమష్టి పండుగ సంక్రాంతి.


ఇట్టేడు అర్కనందనాదేవి 


భోగి భాగ్యాలు : తొలిమంచు తొలిగిన వెంటనే భోగిమంటల సందడితో మొదలవుతుంది భోగి పండుగ. ప్రత్యక్షదైవమైన అగ్నిని ఆరాధించే పండుగ భోగి. కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో అలరారేలా చేసే పండుగ. పుష్య, మాఘ మాసాల్లోని చలిని తట్టుకునేందుకు భోగి మంటలను వేయడం, పాతబడిన వస్తువులనూ, ధనుర్మాసంలో పెట్టిన గొబ్బెమ్మల పిడకలనూ ఆ మంటల్లో వేస్తారు. ఈ భోగి మంటలకర్థం.. వృథా బరువును తగ్గించుకొని ఎప్పటికప్పుడు తాజాగా, కొత్తగా బతకాలనీ, స్వార్థాన్ని వదిలి త్యాగంతో మెలగాలనీ, లోభమనే గుణానికి స్వస్తిపలకాలని. నాలుగు కూడళ్ల నడుమ సమైక్య భావంతో భోగిమంటలు వేసి అందరితో కలగలిసిన జీవితాల మాధుర్యం అపురూపం. వర్ష కారకుడైన ఇంద్రునికి కృతజ్ఞతలు చెప్పుకునే తత్వం. వర్షం కారణంగా చక్కని పంటలు పండినందుకు కలిగే తృప్తిమత్తం భోగి పండుగ. భోగి పండుగ మరో విశేషం భోగి పండ్ల సంబురం. పదమూడేండ్ల లోపు పిల్లల్లకు భోగి పళ్లను పోయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని భావిస్తారు. రేగు పండ్లు, నాణేలు, పసుపు అక్షింతలు, పూరేకులు కలగలిసిన భోగి పంళ్లను పోసి పిల్లలను ఆశీర్వదిస్తారు. 


సంబరాల సంక్రాంతి: ప్రకృతికీ, మనుషులకీ మధ్య సమతుల్యత పాటించాలనే ధర్మాన్నే సంక్రాంతి తెలియజెప్పుతుంది. సంక్రాంతి పండుగంటేనే సంబురాలు. రంగవల్లులూ, పతంగులూ, పేరంటాలూ, గంగిరెద్దులూ, గొబ్బెమ్మలూ, దానధర్మాలూ, బంధుమిత్రులు... ఇలా ప్రతీది సంబరమే, సంక్రాంతి వైభోగమే. సంక్రాంతి పండుగకు శాస్త్రపరంగా ప్రత్యేకత ఉంది. నక్షత్రాలు 27, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు మొత్తంగా 108 పాదాలు. ఈ 108 పాదాలు తిరిగి 12 రాశులుగా ఏర్పడినాయి. సూర్యుడు ప్రతీ నెలా ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడు. దానినే సంక్రమణం అంటారు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిని సంక్రాంతిగా వ్యవహరిస్తారు. అలా మనకు ఏడాదికి మొత్తం 12 సంక్రాంతి రాశులుంటాయి. అందులో ఆయణి పుణ్యకాలంతో మొదలయ్యే మకర సంక్రాంతి విశేషమైంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది మొదలు దేవతలకు పగలుగా ఉంటుంది. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సూర్యుని గమనంలో ఉత్తరాయణం దేవతలకూ, పితృదేవతలకూ సంతుష్టిని కలిగించి మానవ జన్మ సార్థకతను సూచిస్తుంది. అందుకనే మకర సంక్రాంతి సకల శుభాలనూ కలిగించే శుభ సంక్రాంతి. సంక్రాంతి అంటే పంటల సంవత్సరాది. ఏడాదంతా రైతులు పడ్డ కష్టానికి ఫలితం దక్కే శుభతరుణం. సంక్రాంతిలో సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. 


కనుమ కృతజ్ఞత: మనుషుల జీవన మనుగడకు సహకరించే పశుపక్ష్యాదులకు కృతజ్ఞతలు చెప్పుకొనే సదవకాశం కనుమ పర్వం. కృషి వ్యవస్థకు మూలాధారమైన పశువుల గొప్పదనాన్ని గుర్తించి, వాటి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచడం కనుమ పండుగ విధి. ఈ రోజున ఎటువంటి ఆర్భాటాలూ లేక పూజను ముగించుకొని బంతి మాలలతో వాటిని అలంకరిస్తారు. అవి క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. వరికంకుల తోరణాలను గుమ్మంలో కట్టి పంటలను రక్షించే జంతుజాతికీ కృతజ్ఞతను వ్యక్తపరిచే పర్వం కనుమ. 


ముక్కనుమ సరదాలు: సంక్రాంతి పండుగలో చివరి రోజు కనుమ. దాని తర్వాతి రోజునే ముక్కనుమ అంటారు. ఈ రోజున ప్రత్యేకమైన విధులేమీ చేయకపోయినా  పండుగ వాతావరణం కొనసాగుతుంది. రథం ముగ్గును కొందరు కనుమ రోజున వేస్తే మరికొందరు ముక్కనుమ నాడు వేస్తారు. ముక్కనుమ నాడు వేసే ముగ్గును ఇంటివైపు రథాలు వచ్చేట్టుగా వేసి, రథంలాగే తాడును బయటకు వేస్తూ పక్కింటికి కలుపుతారు. అలా ఒక్కో ఇంటినీ కలుపుతూ ఊరంతా వర్థిల్లాలనే సంఘీభావం ప్రకటిస్తారు. సంక్రాంతి సంబరాల వైభవం ఆధ్యాత్మిక, ఆరోగ్య, నైతిక, సామాజిక, సాంస్కృతిక, సంప్రదాయ కళా తోరణమై విశ్వమానవ సౌభ్రాతృత్వానికి చిహ్నంగా విరాజిల్లుతుంది. 


logo