సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Jun 13, 2020 , 23:50:18

పలుకుబడులు

పలుకుబడులు

‘కడుపుల లేనిది కావలిచ్చుకుంటే వస్తదా?’

ఈ సామెత పైపై ప్రేమను నటించే వారిని ఉద్దేశించి చెప్పినది. కడుపులో 

(మనసులో) లేనప్పుడు ఎదుటి వ్యక్తిని ఎంత కౌగిలించుకొని ఏడ్చినా దుఃఖం కట్టలు తెంచుకుంటుందా? కన్నీళ్లు జాలువారుతాయా? మనసులో గూడుకట్టుకొన్న విషాదం కరిగితేనేకదా అశ్రువులు జారేది! ‘మనసులోపల దుఃఖం లేకుంటే కౌగిలించుకున్నా ఫలితం శూన్యం’ అని చెప్పడం పెద్దల ఉద్దేశం. అందుకే ‘కడుపుల లేనిది కావలిచ్చుకుంటే వస్తదా?’ అన్నారు. ధనమే పరమావధిగా బతికేవాళ్లు బాంధవ్యాలను దూరం చేసుకుంటూ, పైపైకి ప్రేమను నటిస్తుంటారు. 

‘గడపలోపలున్న సుకం.. 
కాశికి పోయినా దొరుకది’ 

ఊరు విడిచి పోతున్నప్పుడో.. వలసపోతున్నప్పుడో వద్దని వారించే సామెత ఇది. ఎంత ముక్తి స్థానం అయినప్పటికీ.. మన  గడపలో ఉన్న సుఖం కాశీలోనూ దొరకదు. ఇది జానపదుల నిండు జీవితానుభవంలోంచి వచ్చిన మాట. ఒక్క కాశీపట్టణం అనే కాదు, ఏ దూర ప్రాంతానికి వెళ్ళినా, రెండు రోజులకే మన ఇంటి విలువ తెలుస్తుంది. కొత్త వాతావరణానికి అలవాటు పడాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తలనొప్పులన్నీ ఎందుకనే ఉద్దేశంతోనే ‘గడపలోపల ఉన్న సుకం.. కాశికి పోయినా దొరుకది’ అన్నారు పెద్దలు. తెలంగాణలో కాశీపై ఉన్న ప్రేమతో పిల్లలకు కాశయ్య, కాశవ్వ అనే పేర్లు పెట్టుకుంటారు.  అది వేరే సంగతి.

మీరు చిత్రపడ్డరా?

‘ఆ పొల్ల తండ్రితోని, నేను ఆ పిల్లగాన్నే చేసుకుంట అని మొకమ్మీదనే చెప్పింది. విన్నోల్లందరు చిత్రపడ్డరు, ఆ పిల్ల దైర్నానికి’ అనే వాక్యంలో ‘చిత్రపడ్డరు’ అంటే.. ఆశ్చర్యపోవడం, నివ్వెరపోవడం. చిత్రపడ్డరు అనేది అచ్చంగా తెలంగాణ పలుకుబడి. ఆ మాటలోని చిత్ర.. చిత్రం నుంచి వచ్చింది. ‘ఆయినె మన మాట యిననే యినడు. ఆయినె అన్నదే సాగల్నని అంటడు. ఏదైనా చిత్రం చేస్తడు’ అంటారు. ఈ వాక్యంలో ‘చిత్రం చేసుడు’ అంటే విడ్డూరం, వింతగొలిపే ప్రవర్తన అని అర్థం. అలాంటి వ్యక్తులు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని వాదించే రకం. ఎవరిమాటా వినరు. సినిమా భాషలో చెప్పాలంటే సీతయ్య టైపు!

పుల్లంగొయ్య ఊదారా? 

ఈ కాలం వాళ్లకి ‘పుల్లంగొయ్య’ అంటే తెలుసా?..  పిల్లంగ్రోవి’. మళ్లీ 

సందేహమా?  పిల్లంగ్రోవే.. పిల్లనగ్రోవి.  తెలంగాణలో వినిపించే పదం మాత్రం ‘పుల్లంగొయ్య’. ‘క్రోవి’ అంటే గొట్టం. పిల్లనగ్రోవిలో రంధ్రాలతో కూడిన గొట్టమే కదా ఉండేది. మరి ‘పుల్లంగొయ్య’ మాట ఏంటి? కొయ్యతోనే తయారైంది కాబట్టి సంధిగతంగా గొయ్య. క్రోవి సైతం కొయ్యగా మారొచ్చు. వాస్తవానికి పిల్లనగ్రోవి, పుల్లంగొయ్య అనే పిల్ల పదాలకు తల్లిపదం తమిళంలో ఉంది. అది ‘పుల్లాంగుళల్‌'. కుళల్‌ అంటే గొట్టమే! 

పుల్లాంగుళల్‌ లాగే  పుల్లంగొయ్య వినిపిస్తుంది కాదా!

పదబంధం

1. ఏసిడి : చెడుకాలం

2. మిడుకుడు : ఈర్శ

3. అగడు : అత్యాశ

4. ఉల్లెక్కాలు : పరిహాసం

5. గుత్ప : దుడ్డుకర్ర

6. కువారం : చెడ్డబుద్ధి

7. గడెంచే :  నులకమంచం

8. గిర్వి : తాకట్టు

9. గాయిదోడు : ఆవారా

10. ఒల్లె : చీర


logo