గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jan 12, 2020 , 01:49:27

మన మరో భద్రాద్రి సిర్సనగండ్ల

మన మరో భద్రాద్రి   సిర్సనగండ్ల

రావణుడు అపహరించిన సీతమ్మను అన్వేషిస్తూ రామలక్ష్మణులు అనేక ప్రాంతాల్లో సంచరించారు. అలా దశరథనందనుడు శ్రీరామ చంద్రుడు నడయాడిన నేల సిర్సనగండ్ల. సీతాదేవిని అన్వేషిస్తూ.. సౌమిత్రతో కలిసి ఈ ప్రాంతంలో రామచంద్రుడు సేద తీరిన ప్రాంగణం. రఘరాముని కాలి అడుగులతో మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతూ.. భక్తుల పాలిట కొంగు బంగారంగా దేదీప్యమానంగా వెలుగుతూ అపర భద్రాద్రిగా శిరుసనగండ్ల దేవాలయం పేరుగాంచింది.

నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతున్న శిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దండకారణ్యంలో శిరుసనగండ్ల గ్రామం ఉండేది. గ్రామానికి సమీపంలో దాదాపు 900 అడుగుల ఎత్తున 70 ఎకరాల సువిశాలమైన బండపై దత్తాత్రేయ ఆశ్రమం ఉంది. దండకారణ్యంలో సీతాదేవిని అన్వేషిస్తూ బయలుదేరిన రామలక్ష్మణులు దత్తాత్రేయ ఆశ్రమాన్ని సందర్శించి సేదతీరారు. దత్తాత్రేయ ముని కోరిక మేరకు రామలక్ష్మణులు సీతాసమేతంగా ఆర్చావతార మూర్తులుగా ఇక్కడ వెలిశారని క్షేత్ర మహత్య కథనం. త్రేతా యుగంలో రాక్షసుల తలలు తెగనరికి వాటితో ఆంజనేయుడు బంతి ఆట ఆడుకున్న ఆనవాళ్లు ఉన్నాయని అందుకే శిరుసనగండ్లగా పేరు వచ్చిందని పురాణకథ ఉంది. శిరస్సు అంటే తలలు, గండ్లు అంటే రాళ్లమధ్య నీళ్లు ఉండే ప్రదేశం. భూమికి ఎత్తయిన ప్రదేశంలో రాళ్లమధ్య నీళ్లు ఉన్నందున శిరుసనగండ్ల పేరు వచ్చిందని కథనం. 900 ఏండ్ల కిందట చరికొండ సీమలో భాగంగా పద్మ నాయకులు దీన్ని అభివృద్ధి పరిచారని చరికొండ ధర్మన్న తన చిత్ర భారతంలో పేర్కొన్నారని చరిత్రకారులు చెబుతున్నారు.


పురాణ కథనంఈ ఆలయం14వ శతాబ్దిలో నిర్మితమైనట్లు అక్కడ ఉన్న శిలాశాసనాల వల్ల తెలుస్తున్నది. అప్పుడు ఈ ప్రాంతం భీకర అరణ్యంగా ఉండేదని, గుట్టపై దత్తాత్రేయ ఆశ్రమం, ముత్యాలమ్మ గుడి ఉండేవని స్థానికుల కథనం. సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి శ్రీరాముడు కలలో కనిపించి భద్రాచలంలో ప్రతిష్ఠించాల్సిన సీతారామ విగ్రహాలు ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడ్ గ్రామంలో ఒక పురోహితుడి ఇంటి పెరటిలో ఉన్నట్లు చెప్పినట్లు, ఆ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరనందున వేరే విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించినట్లు, వాటిని సిర్సనగండ్లలో ప్రతిష్ఠించమని చెప్పినట్లు కథనం ప్రచారంలో ఉంది. కలలో శ్రీరాముడు చెప్పిన విధంగా పాల్వంచ సమీపంలోని విగ్రహాలు తీసుకొని వచ్చి కోడికూత, రోకలిమోత వినిపించని సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్ఠించినట్లు, గుట్టపై కోనేరు కూడా నిర్మించినట్లు తెలుస్తున్నది. ఏటా ఇక్కడ చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 


సంవత్సరం పొడవునా ఉత్సవాలు..అపర భద్రాద్రిగా పేరున్న శిరుసనగండ్ల శ్రీరామ క్షేత్రంలో సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రోత్సవాలు, అష్టమి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహన, ఎదురుకోళ్లు, కళ్యాణోత్సవం, గరుడ సేవ, హనుమాన్ సేవ, పెద్ద రథం, చక్ర తీర్థం వంటి కార్యక్రమాలు కన్నుల పండువగా సాగుతాయి.  ఈశ్వరుడు క్షేత్ర పాలకుడిగా విరాజిల్లుతున్న శిరుసనండ్ల శ్రీరామ క్షేత్రంలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి. ఆంజనేయ మందిరం, నాగసన్నిది, ముక్కిడి పోచమ్మ ఆలయం, మైసమ్మ మందిరం, నవగ్రహా మండపాలు ఉన్నాయి. ఒక్కప్పుడు ఆశ్రమంగా విరాజిల్లిన శ్రీరామక్షేత్రంలో దత్తాత్రేయ మందిరానికి ఎదురుగా రామకోటి స్థూపం ఉంది. రామ భక్తులు నియమ, నిష్ఠలతో శ్రీరామ నామాన్ని పుస్తకాల్లో రాసి స్వామి వారికి సమర్పిస్తారు. ఈ పుస్తకాలను స్తూప అంతర్భాగంలో నిక్షిప్తం చేస్తారు. దత్తాతేయ మందిరానికి కుడి వైపున సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహించే కళ్యాణ మండపం ఉంది. రామాలయానికి చేరువలో రామలింగశ్వర స్వామి సన్నిధి ఉంది. పక్కనే ఏకశిలతో మలిచిన సింధూర లేపిత ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. శ్రీరామ నవమి నుంచి 15 రోజుల పాటు స్వామివారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో విశేష పూజలు జరుగుతాయి. ఆంజనేయ స్వామి  భక్తులు గండ దీపాలతో ప్రదక్షిణలు చేయడం ప్రత్యేకత, ముక్కిడి పోచమ్మ ఆలయం మరో ప్రత్యేకత. ప్రతి ఏడాది శ్రీరామనవమి నుంచి వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలనుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు లక్షలాదిగా తరలివస్తారు.శిరుసనగండ్ల శ్రీసీతారామ శిరస్సు వంచి మొక్కుతా సరసనే నిలుచొని వరములివ్వుఅంటూ భక్తులు కొండ ఎక్కుతూ వుంటారు. భద్రచలం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన దేవాలయం కనుక దీన్ని తెలంగాణలో రెండవ భద్రాచలంగా పిలుస్తారు.

మీసాల రామలక్ష్మణులు:స్వయం వ్యక్త క్షేత్రంగా రామాయణంతో సంబం ధం ఉన్న శిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి దేవాలయ వైభవం గురించి శ్రీమరి సింగకవి శిరుసనగండ్ల రామచరిత్ర అనే పద్య కావ్యంలో సవివరంగా పేర్కొన్నారు. మూడున్నర శతాబ్దాల కిందట శిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరిగినట్లు పద్యకావ్యం  వెల్లడించింది. ప్రకృతి సిగలో ఎటు చూసిన ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలమైన బండపై పుణ్యక్షేత్రంగా విస్తరించింది. ఏకప్రాకారంతో  నిర్మితమైన శ్రీ సీతారామాలయం షోడశ స్తంభాలతో ఆలరారుతుంది. గర్బాలయంలో శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఉండగా జానకీ రాములు ఏకమకరతోరణ యుక్తంగా విరాజిల్లడం ఈ దేవాలయ ప్రత్యేకత. రామలక్ష్మణుల నేత్రాలు కిరీటం, కవచాలు, తిరునామాలతో ఉంటాయి. రామలక్ష్మణులకు మీస కట్టు ఉండటం ఈ విగ్రహాల మరో విశేషం. ఇక జానకీ మాత సకల సౌభాగ్యవతిగా దర్శనమిస్తుంది. ముఖారవిందానికి పసుపు పూయబడి పట్టువస్ర్తాలు ధరించి జగదేక మాతగా గోచరిస్తుంది.  ఇక్కడ రాచకొండ పద్మనాయకులు వేయించిన శిలాశాసనాలు, 4 పర్షియన్ భాషలో శాసనాలు ఉన్నాయి. ఇక్కడ ఆదిమానవుల శిలా యుగం నాటి ఆనవాళ్ళున్నాయి. ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే భక్తుల కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


-మధుకర్ వైద్యుల


logo