గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

వాస్తు : ఆట స్థలం పక్కన ఇల్లు ఉండొచ్చా?

వాస్తు : ఆట స్థలం పక్కన ఇల్లు ఉండొచ్చా?

ఆట స్థలం పక్కన ఇల్లు ఉండొచ్చా?-కె.స్వప్న, కరీంనగర్

ఆటస్థలం అంటే ఖాళీ స్థలం కింద లెక్క వేసుకోవాలి. మీ ఇంటికి ఆ స్థలం ఎటువైపు ఉందో చెప్పలేదు. ప్రభుత్వ పరంగా అది ఆట స్థలం లేదా స్టేడియం లాంటిది అయితే దానిచుట్టూ ఎత్తయిన గ్యాలరీ వస్తుంది కాబట్టి అది ఖాళీ స్థలం కింద గుర్తించవద్దు. బడిపిల్లల ఆటస్థలం అయితే అది ఎప్పటికీ నిర్మాణం రానిది అయితే తప్పక దానిని ఖాళీ స్థలంగానే గుర్తించాలి. అలాంటి ఆటస్థలం దక్షిణం పడమరలో మన ఇంటిని ఆనుకుని ఉంటే మంచిదికాదు. తూర్పు ఉత్తరాలు అయితే ఆలోచించాల్సిన పనిలేదు. కానీ అక్కడ కట్టే ఇంటికి తప్పక ప్రహరీలు ఉండాల్సిందే. ఒంటరి ఇల్లు ఉండవద్దు. ఒకవేళ అది స్టేడియం అయితే దానిచుట్టూ రౌండుగా రోడ్డు ఉంటే ఆ రోడ్డు పోటు రాకుండా చూసుకొని అక్కడ ఇల్లు

కట్టుకోవచ్చు.


ఆగ్నేయంలో నీరు ఉండొద్దు అని ఎర్రరంగు వేయమంటున్నారు. నిజమా? -బి.నీరజ్‌కుమార్, వరంగల్

వెర్రి వేయి రకాలు అని సామెత. మనిషి జీవన గమనంలో శాస్త్రం ఓక తోడ్పాటుకావాలి కాని గ్రహపాటు కాకూడదు. నిజానికి నీరు వాడని గది ఏది నైరుతి గదిలో బాత్‌రూం, వాయవ్యం గదిలో టాయిలెట్, కిచెన్‌లో నీరే ప్రధానం. ఆగ్నేయం వాష్‌రూమ్ (యుటిలిటి) తప్పనిసరి. ఆచోట నీరు ఉండవద్దు అంటే ముక్కు ఉండాలి కాని గాలి పీల్చవద్దు అన్నట్టు ఉంటుంది. నీరు నిప్పు ఒక దానికి ఒకటి పడవు కాని వాటి కలయిక లేక ఏదీ జరుగదు. అగ్ని లేక అన్నం తయారు కాదు. నీరులేని పదార్థమే లేదు పంచభూతాలు వ్యక్తిగతంగా విడిపడి ఉంటాయి. వ్యావహారికంగా కలిసి నడుస్తాయి. పైన గిన్నెలో నీరు, గిన్నె కింద నిప్పు అప్పుడే ఆహారం తయారు అవుతుంది. శాస్త్రం ఈ రెంటి మధ్య పలుచని గిన్నె లాంటిది. కాబట్టి కిచెన్ ఆగ్నేయంలో వాష్ ఉంటుంది దానిని రంగుతో వేరు చేస్తానంటే ఆ రంగులో మాత్రం నీరు లేదా అన్నది అర్థం చేసుకోవాలి. మిడిమిడి సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేస్తాయి కానీ రాజ్యాలు ఏలవు.


గోడలు మరో గదికి పోటీ అవుతాయా? -కె.సిరికన్య, నెల్లుట్ల, జనగాం

ఇంటి నిర్మాణంలో నక్ష (ప్లాన్) చాలా ప్రధానం. దానిని అద్భుతంగా చేయడం అనేది వ్యక్తి వైభవాన్ని శాసిస్తుంది. గోడలు.. వాటి ప్రయాణంలో ఎక్కడా ఆగిపోవడం అంటూ ఉండదు, ఉండకూడదు. అలాంటి పరిస్థితి దాదాపు రాదు. ఒకవేళ ఆర్చి వద్ద ఆగినట్టుగా అనిపించినా రెండు వైపులా పిల్లర్స్‌తో (మొత్తలతో) అది పూర్ణ ప్రయాణం చేస్తుంది. ఇక గోడ పోటీ అనేది ఎప్పుడూ రాదు. వచ్చింది అంటే ఇంటి ప్లాన్ సరిగ్గా లేనట్టే. పోతే టాయిలెట్లు వాష్ ఏరియాతో వచ్చే ఉపగోడలు వాటి మందాలు చాలా సన్నగా తక్కువ దూరం కలిగి ఉంటాయి కాబట్టే అవి మరో గదికి పోటీకావు. ప్రధాన గదులు అంటే పడక గదుల నాభికి ఏ విధంగా చూసినా ఎదురుగా గోడలు రాకూడదు. అలా వస్తే గోడల ప్రయాణంలోనే పెద్దలోపం ఉన్నట్టు. అలా వక్రంగా వాటి నడకలు ఉంటే తప్పక ఇంటిని సరిగ్గా విభజించి సరిచేసుకోవాలి. హాలు మధ్యలో గోడలు రాకుండా కూడా చూసుకోవాలి.


కిచెన్ ప్లాట్ ఫామ్ స్టోర్ రూములో పడుతున్నది. అలా పడొచ్చా? -పడకంటి వెంకటరెడ్డి, ఆత్మకూర్, నల్లగొండ

కిచెన్ గదిలో చాలా అవసరమైన నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన విధంగా ఆ గది అమర్చుకోవాలి. మీ కిచెన్ ప్లాట్‌ఫామ్ స్టోర్‌రూములో పడుతుంది అంటే కిచెన్ గది చిన్నదిగా అనిపిస్తుంది. దానిని మీరు పడమరలో పెట్టారని అర్థం అవుతున్నది. కిచెన్ దక్షిణం ప్లాట్‌ఫామ్ ఎంత వెడల్పు ఉందో అంతమందంతోపాటు స్టోర్‌డోర్ వెడల్పు లెక్కించి సరుకు గది (స్టోర్) విస్తీర్ణం పెంచాలి. అప్పుడు పోటు పోతుంది. లేదా స్టోర్ గది తలుపును అవకాశం ఉంటే మార్చండి. దానిని ఏ దిశకైనా పెట్టుకోవచ్చు. అలాగే ప్లాట్‌ఫామ్ కిచెన్ ద్వారానికి కానీ ఇతర ద్వారాలకు గానీ పోటు రాకుండా కూడ అమర్చుకోవాలి. ఓపెన్ కిచెన్ పెట్టినప్పుడు పడుతుందా చూసుకొని సెల్ఫులు ఎదురుగా కట్టి ఆ పోటును నిరోధించవచ్చు.


logo