గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Mar 29, 2020 , 13:07:02

రైడ్‌ విత్‌ రాపిడో!

రైడ్‌ విత్‌ రాపిడో!

ఈ గజిబిజీ గందరగోళ జీవన ప్రయాణంలో ఒక్కొక్కరిది ఒక్కో అనుభవం. సంపాదన కోసం సాగే ఈ నిత్య పోటీ పరీక్షల్లో ఒక్కొక్కరికి ఒక్కో ఫలితం. ఆర్జనలో అప్‌డేట్‌ అయి.. సాంకేతికతను సహకారిగా మార్చుకుంటూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్న అలాంటివారిలో ముంగి బాలకృష్ణ ఒకరు. ఆన్‌లైన్‌ బైక్‌ బుకింగ్‌ యాప్‌ రాపిడో రైడరతను. తన ప్రొఫెషన్‌ గురించి బాలకృష్ణ మనసులో ఉన్నదేంటి?

‘ఏం పేరు?’.. ‘బాలకృష్ణ. 

‘ఎక్కడ మీది?’.. ‘మౌలాలీ’  

‘ఎన్ని రోజుల్నుంచి ఈ పని చేస్తున్నవ్‌?’  

‘ఇంచుమించు ఆర్నెల్లు ఐతుంది’ 

‘సంపాదన ఎలా ఉంది?’

‘ఇప్పటికైతే పర్వాలేదు’... 

ఒక బైక్‌ట్యాక్సీ రైడర్‌తో సాగిన పొడి ముచ్చట ఇది.


మాది.. మౌలాలీలోని నవోదయనగర్‌ బస్తీ. నాకు మ్యారేజై.. ఒక పాప ఉంది. మ్యారేజ్‌ కాకుముందుకు లైఫ్‌ వేరు. మ్యారేజ్‌ అయిన తర్వాత లైఫ్‌ వేరు. 

రాపిడోలో చేరి ఇప్పటికి ఆర్నెల్లు అవుతుంది. ఇంతకుముందు మీట్‌ సప్లయ్‌లో జాబ్‌ చేసేవాణ్ని. నెలకు 12 వేల రూపాయల జీతం. అది పెద్ద సంపాదన కాదు. మైండ్‌లో ఎప్పుడూ ఇదే ఉండేది. వేరే ఏదైనా చేయాలె.. మనది మనకు ఉండాలె అనిపించి మానేసిన. 

కొద్దికాలం బాగా ఆలోచించిన. ఏం చెయ్యాలె? సంపాదన ఎట్లా? ఫ్యామిలీ ఉండె? అని ఆందోళన కలిగేది. రాపిడో బాగుందని తెల్సింది. ఎట్ల చేరాలె? సంపాదన ఎట్లుంటది? అన్నీ తెల్సుకున్నా. కానీ ఎక్కడో ఒక అనుమానం. సిటీలో మనుషుల్ని డ్రాప్‌ చేయడానికి ఇన్ని ఆటోలు ఉన్నాయి. ఇన్నిన్ని టాక్సీలు ఉన్నాయి. బస్సులు ఉన్నాయి. అవన్నీ కాదని.. బైక్‌ టాక్సీని ఎంచుకుంటరా? అనిపించేది. 


ఫస్ట్‌ రైడ్‌.. చాలా గమ్మత్తుగా సాగింది. తార్నాకలో పికప్‌.. సికింద్రాబాద్‌లో డ్రాప్‌. సరిగా గుర్తులేదు గానీ ఆ రైడ్‌తో నలభై రూయాలేమో వొచ్చినయనుకుంటా. చాలాసేపు ఆ నాలుగు నోట్లను అలాగే చూసుకున్నా. ఇట్లా పది పది రూపాయలు వస్తే పూట గడుస్తుందా అనిపించింది. కానీ వెంటనే ఓ ధైర్యం.. పది పది కూడబెడితేనే కదా వంద అయ్యేది అనిపించింది. కొద్దిసేపటికే వేరే రైడ్‌ వచ్చింది. అట్లా ఆరోజు పెద్దగా చెప్పుకోదగ్గ రైడింగ్సేమీ లేకున్నా ఎక్కడి ఖర్చులక్కడ పోంగా ఐదు వందల రూపాయలైతే మిగిలినయి. టైంకు ఇంటికాడ ఉన్నా. టైంకు భోజనం చేసిన. ఏ టెన్షనూ లేదు. ఇదేదో బాగుందే అనిపించింది.  


వారం రోజులు.. నెల రోజులు.. ఇలా ఈ ఆర్నెల్లలో ఒక విషయమైతే అర్థమైంది.. అదేంటంటే.. కష్టపడితే మంచిగనే సంపాదించొచ్చు. ఇక రైడింగ్‌లో సమస్యలుంటాయి.. సంతోషాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఎంత సేపటికీ ఆర్డర్స్‌ రావు. కొన్నిసార్లేమో ఎడాపెడా వస్తుంటాయి. ఒకసారి ఇట్లనే ఒకతను ఖైరతాబాద్‌ నుంచి బైక్‌ బుక్‌చేసుకున్నాడు. ఆయన వెళ్లాల్సింది బంజారాహిల్స్‌. డ్రాప్‌ చేశాను. ఐదొందల రూపాయలు ఇచ్చాడు. నా దగ్గర చిల్లర లేవు. అది ఆ రోజు సెకెండ్‌ రైడ్‌. చిల్లర తీసుకొస్తా అని ఆఫీసులోకి వెళ్లాడు. ఎంతకూ రాలేదు. అర్ధగంటపైనే అయింది. నాకు వేరే పికప్స్‌ వస్తున్నాయి. వచ్చినప్పుడు నాలుగు ట్రిప్స్‌ చేసుకుంటేనే కదా మాకు అంతో ఇంతో మిగిలేది? కానీ అతను అర్థం చేసుకోలేదు. ‘ఏం సార్‌.. ఇంత సేపా’ అని అడిగినందుకు కోప్పడ్డాడు కూడా. అప్పుడు ఏంట్రా బాబూ.. ఈ డ్యూటీ అనిపించింది. కానీ, అన్నిసార్లూ అలా ఉండదు కదా అని నన్ను నేను  సెల్ఫ్‌ మోటివేషన్‌ చేసుకునేవాడిని. ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. 


ఇంకోసారైతే.. బుకింగ్‌ చేసుకున్న వ్యక్తి పికప్‌ అడ్రస్‌ రాంగ్‌ కొట్టాడు. ఎల్బీ నగర్‌ నుంచి అయితే దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి పెట్టుకొని.. ‘ఇంకా రావేంటి? ఎక్కడున్నావ్‌.. ఎంత టైం పడుతుంది’ అని సతాయించాడు. పైగా అతడికి రైడ్‌ క్యాన్సిల్‌ చేసుకోవడం కూడా రాదు. అది క్యాన్సిల్‌ అయితేనే మాకు వేరొక ట్రిప్‌ వస్తుంది కదా? క్యాన్సిల్‌ చేసుకునే ఆప్షన్‌ మాకు ఉండదు. నలభై నిమిషాల తర్వాత చేసుకున్నాడు. కొందరైతే.. నంబర్‌ డయల్‌కాల్‌ లిస్ట్‌లో ఉంది.. నిన్న మార్నింగ్‌ మాట్లాడారు.. ఎవరు మీరు? అని మతిమరుపుతో నస పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. 

మాకు చిన్న చిన్న సంతోషాలు కూడా ఉంటాయి. ఒకసారి.. ఒక సార్‌ ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి బుక్‌ చేసుకున్నారు. ఆయన వెళ్లాల్సింది జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌. జీవీకే దగ్గరికి రాగానే ఆపమన్నారు. వాటర్‌ట్యాంక్‌ పక్కన ఉన్న చాయ్‌బండీ దగ్గరికి తీసుకెళ్లి ‘చాయ్‌ తాగుదాం దా’ అన్నారు. నేను.. ‘వద్దుసార్‌' అన్నా వినిపించుకోకుండా చాయ్‌ తాగించారు. నాకేమో టైం ఇంపార్టెంట్‌. సార్‌ ఇంకా లేట్‌ చేస్తున్నారు. ‘సార్‌.. వెళ్దామా’ అన్నాను. ‘హే.. వెళ్దాం ఆగు’ అన్నారాయన. కామ్‌గా ఉండిపోయాను. ఐదు నిమిషాల తర్వాత ఎవరికో ఫోన్‌ చేశారు. మరో ఐదు నిమిషాల తర్వాత ఒకతను వచ్చాడు. 

‘చూడబ్బా.. నేను వెళ్తున్నాను.. నీ పేమెంట్‌ తీసుకో’ అని మొత్తం డబ్బులిచ్చేశాడు. యాక్చువల్లీ మినిమం చార్జ్‌ కింద 11 రూపాయలు ఇస్తే సరిపోతుంది. కానీ ఆయన 45 రూపాయలు ఇచ్చి.. చాయ్‌ తాగించి.. మంచిగా ముచ్చట పెట్టి మరీ పంపించారు. ఆయనిచ్చింది 45 రూపాయలే అయుండొచ్చు.. కానీ నాకు చాలా సంతోషం కలిగించింది. 


రాపిడో వాళ్లు మాకు ఓ టార్గెట్‌ పెడతారు. ఆ టార్గెట్‌ రీచ్‌ అయితే కొంత అలవెన్స్‌ వస్తుంది. అది పెట్రోల్‌ మటుకు సరిపోతుంది. మిగిలిన చిన్న చిన్న ఖర్చులు పోంగా రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. 

ఒకరోజు ఎక్కువ.. ఒకరోజు తక్కువ.. ఆలా పనిని బట్టి పైసలు వస్తుంటాయి. 


ఇలా బాలకృష్ణ తన మనసులోని మాటను మనతో పంచుకున్నారు. అతడన్నట్లు.. మన కోసం.. మన పిల్లల భవిష్యత్‌ కోసం సంపాదించడానికి ఈ టెక్నాలజీ యుగంలో రాపిడో వంటి ఎన్నో వనరులు ఉన్నాయి. సద్వినియోగం చేసుకుంటే ఒక సక్సెస్‌ స్టోరీ అవుతుంది.. దుర్వినియోగం చేసుకుంటే ఓ ఫెయిల్యూర్‌ స్టోరీ అవుతుంది. 

 దాయి శ్రీశైలం