మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Mar 29, 2020 , T00:10

ఇన్‌స్టంట్‌ ఇడ్లీ...

ఇన్‌స్టంట్‌ ఇడ్లీ...

ఇన్‌స్టంట్‌ కాఫీల గురించి విన్నాం.. కానీ ఓ హైదరాబాద్‌ ఇంజినీర్‌ పుణ్యమా అని మెషీన్‌ సాయంతో ఇన్‌స్టంట్‌ ఇడ్లీలూ రుచిచూడవచ్చు.  బటన్‌ నొక్కి  ఒకనిమిషం వేచి చూస్తే చాలు ... నాలుగు ఇడ్లీలు, చట్నీ, సాంబర్‌ ప్లేట్‌తో సహా బయటకు వస్తాయి. ఎన్ని ప్లేట్ల ఇడ్లీ కావాలో ఎంచుకొని  మెషీన్‌ బార్‌ కోడ్‌ దగ్గర డబ్బులు చెల్లించాలి. ఈ మెషీన్‌ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పని చేస్తుంది. ఇందులో గరిష్టంగా 160 ఇడ్లీలు నిల్వ ఉంచుతారు. సరిపడా ఉష్ణోగ్రతతో వేడిగా ఉండేలా చూసుకుంటారు. మెషీన్‌లో ఇడ్లీలు అయిపోగానే సెన్సర్లు సెంట్రల్‌ కిచెన్‌కు సమాచారం అందిస్తాయి. దీంతో నిర్వాహకులు మళ్లీ ఇడ్లీలను నింపుతారు. దేశంలో మొట్ట మొదటి ఇడ్లీ వెండింగ్‌ మెషీన్‌ ఇదే కావడం విశేషం. హైదరాబాద్‌లోని రసూల్‌పురాలో దీన్ని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు www.idlimachine.comలో చూడొచ్చు. 

హైదరాబాద్‌కు చెందిన మహాలక్ష్మి నాగుబండి దీన్ని నిర్వహిస్తున్నారు. ఆమె ఇంజినీర్‌.  త్వరలోనే మిగతా ప్రాంతాల్లో కూడా ఇడ్లీ యంత్రాల్ని ఏర్పాటు చేస్తామని చెపుతున్నారు.  దీని తయారీ  కోసం సాఫ్ట్‌వేర్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజినీర్లు సమష్టిగా పని చేశారని చెబుతున్నదామె. ఇప్పటికే అనేక కార్పొరేట్‌ సంస్థలు ఇడ్లీ వెండింగ్‌ మెషీన్‌పై ఆసక్తి చూపిస్తున్నాయి.  దీన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేస్తామంటారు మహాలక్ష్మి. మీరూ ఎప్పుడైనా రసూల్‌పుర వెళ్తే..ఈ ఇన్‌స్టంట్‌ ఇడ్లీ టేస్ట్‌ చేసి రండి. ఇడ్లీ డే సందర్భంగా ... ఇడ్డెన్ల అభిమానులకు ఇదో కానుక. 


logo