బుధవారం 24 ఫిబ్రవరి 2021
Sunday - Feb 21, 2021 , 00:39:27

పోరు పాటకు కేరాఫ్‌

పోరు పాటకు కేరాఫ్‌

స్వస్థలమైన ‘వరంగల్‌' ఆయన ఇంటిపేరైంది. ఉద్యమగీతాలు,  జానపద గేయాలకు ఆయన ‘కలం’ కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది.  దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘అడవి చుక్క’తో  సినీరంగంలో తన తొలి అడుగు పడింది. ఇందులో ఆయన రాసిన ‘తయ్యుం దత్తయ్యుం’ అనే పాట ఎంతోమంది గుండెల్లో డప్పై మోగింది. ఆయనే వరంగల్‌ శ్రీనివాస్‌. కవిగా, సినీ గేయ రచయితగా, నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా బహుముఖ కళాప్రతిభను చాటుతున్న యువ కెరటం శ్రీనివాస్‌.

జానపద కళాకారునిగా, సినీ పాటల రచయితగా సుపరిచితులైన వరంగల్‌ శ్రీనివాస్‌ అసలుపేరు బొడ్డు శ్రీనివాస్‌. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం తక్కెళ్ళపాడులో బొడ్డు నర్సయ్య, లింగమ్మ దంపతులకు జన్మించారు. పుట్టిన గడ్డనే ఇంటిపేరుగా మార్చుకొని, సినీ గేయ రచయితగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో  అత్యధిక పాటలు రాసిన ఘనత తనదే. తెలుగుతోపాటు లంబాడీ, అస్సామీ, ఒరియా, గోండు భాషల్లోనూ అనేక పాటలు రాశారు. ఆయన కలం నుంచి 1600కు పైగా ఉద్యమ గీతాలు, జానపద గేయాలు జాలువారాయి. 170 ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేశారు. శ్రీనివాస్‌ సమాచారశాఖలో ఉద్యోగం చేస్తున్నారు.

సంస్కృతిని స్పృశిస్తూ.. 

2000లో దాసరి నారాయణరావు నిర్మించిన ‘అడవి చుక్క’ సినిమాతో సినీరంగానికి పరిచయమయ్యారు శ్రీనివాస్‌. ఆ సినిమాలో బంజారాల సంస్కృతిని తెలిపేలా ‘తయ్యుం దత్తయ్యుం తయ్యుం దత్తయ్యుం... నంగారే మోగిస్తాం’ అనే పాటను రాశారు.  రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించినా, వేదికపై ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఇదే సినిమాలోని మరోపాట ‘ఎవరు అన్నారమ్మా మిమ్ము గరిబోళ్లని.. ఎవరు చెప్పారమ్మా మీకు గతిలేనోళ్లని’.. సంఘంలో చులకనగా చూడబడుతున్న జనానికి  ధైర్యాన్నిచ్చింది.

సందర్భం ఏదైనా..

 ఏ సందర్భానికైనా ఆయన కలం గళమెత్తుతుంది. ‘ఛలో అసెంబ్లీ’(2000)లో రాసిన ‘ఓ విద్యార్థి.. వీధిని పడిపోతివన్నా ఓ.. నిరుద్యోగి నవ్వుల పాలైతివన్నా’ అనే పాట అవినీతి మయమైన ప్రభుత్వాల పాలనలో చదువుకున్న విద్యార్థులంతా నిరుద్యోగులై వీధినపడ్డ తీరును వివరిస్తుంది. ‘చిన్నా’ (2000)లో రాసిన ‘గువ్వా.. గువ్వా ఎగిరేటి గువ్వా యాడికి సిరిసిరిమువ్వా’ పాట ఇంపైన సొంపైన జానపదాల సవ్వడితో సాగుతుంది. శ్రామిక జీవన సరళిని పాటల్లో పొందుపరచడంలో శ్రీనివాస్‌ది అందె వేసిన చేయి. ‘వేగుచుక్కలు’(2004)లో ‘మానుకోట కొండల్లో మా పల్లె గుండెల్లో తొలకరి జల్లే కురిసిందే అమ్మా’ అనే పాట హృద్యంగా రాశారు. వర్షాలు పడి రైతుల గుండెల్లో పొంగిన హర్షానికి సూచిక ఈ గీతం.

వేడుకైనా, విషాదమైనా.. 

పండుగల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ పాటలు రాయడంలో వరంగల్‌ శ్రీనివాస్‌ దిట్ట. ‘అమ్మ మీద ఒట్టు’(2000)లో ‘వీర వీర వీర  ధర్మపురిల్లోయ్‌.. వీర వీర అపర వీరభద్రుని పోరు డేరాల్లోయ్‌ వీర’ అంటూ వీరభద్రుడి ఆవేశాన్ని జోడించి పాట రాశారు. ఇదే సినిమాకు ‘నేను పోతున్నా పెండ్లికి నా మొగుడు పెండ్లికి’ అనే జానపదగీతాన్ని కూడా అందించారు. ‘రెండేండ్ల తర్వాత..’(2005)లో ఆయన రాసిన ‘హోళీ హోళీ రంగ హోళీ చెమ్మ కేళీ రంగేళి’ అనే పాట హోలీ రంగుల సందళ్ళను, యువ హృదయాల్లో చెలరేగే ఆనందపు క్షణాలను కండ్ల ముందుంచుతుంది. సంతోషాల్ని సింగారించుకుని అంగరంగ వైభవంగా జరుపుకొనే రంగుల పండుగను ఎంతో గొప్పగా ఆవిష్కరిస్తుందీ పాట. ఇక ‘నిర్భయ భారతం’(2013)లో ‘ఓ సూరమ్మ.. నా బిడ్డ సూరమ్మ.. ఎల్లిపోయినవా’ అంటూ ప్రతి ఒక్కరి హృదయాన్నీ కదిలించే విషాదగీతం రాశారు. బంధాలనూ అనుబంధాలనూ ఎంతో హృద్యంగా ఆవిష్కరించారు. ‘ఈ వయసులో..’(2009) సినిమాలో ‘కురు కురు కురు క్యారే’ అంటూ యువత మెచ్చే పాటా రాశారు. దీంతోపాటు దళం, కూలన్న, వీర తెలంగాణ, ఇంకెన్నాళ్ళు.. సినిమాల కోసమూ ఉద్యమ గీతాలు రచించారు. శ్రీనివాస్‌ కొన్ని సినిమాల్లో నటించారు కూడా.  తాను రాసిన సినిమా పాటలకు తానే బాణీలు కట్టి, తన సంగీత ప్రతిభనూ చాటుకున్నారు. ఉద్యమ పాటలు, జానపద గీతాలతో జీవన సంస్కృతిని ప్రతిబింబింపజేస్తున్న వరంగల్‌ శ్రీనివాస్‌, నిజంగానే పోరుపాటల మందారం.

కర్షక సాహిత్యం..

శ్రీనివాస్‌ పాటల్లో కర్షక సాహిత్యం విస్తృతంగా కనిపిస్తుంది. ‘ఆయుధం’(2003) సినిమాలోని ‘మేఘాల ఈ వేళ చినుకల్లే రావాలా.. నా మేను తడవాలా.. పులకింతలవ్వాలా..’ అనే గీతం అందరితో ‘సై సై’ అంటూ పరవళ్ళు తొక్కించింది. ఈ పాటలోని ‘భూదేవి నా ఇంట శ్రీదేవి కావాలా..’ అన్న పంక్తి పంటలు పండి ధాన్యపుసిరులు ఇంటికి చేరాలనే భావనను స్ఫురింపజేస్తుంది.

-తిరునగరి శరత్‌ చంద్ర , 6309873682

VIDEOS

logo